• facebook
  • whatsapp
  • telegram

మతం

విశిష్ట జీవన విలువలే అభిమతం!

  మనిషి జీవితం సన్మార్గంలో, సమున్నతంగా సాగేందుకు సరైన జీవన విధానాన్ని అందించేదే మతం. ఇందులో అనేక విశ్వాసాలు, సంస్కారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటి ద్వారా వ్యక్తుల ప్రవర్తనలను అదుపు చేసి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి మార్గదర్శనం చేస్తుంది. మన దేశంలో విశిష్ట జీవన విలువలే అభిమతంగా ఏర్పడిన ఈ మతాలు, మత విభాగాలు, వాటి కార్యకలాపాల గురించి అభ్యర్థులు అవగాహన ఏర్పరుచుకోవాలి. 

  

అలౌకిక శక్తులను విశ్వసించడాన్ని మతం అంటారు. మతం ఒక సామాజిక వ్యవస్థ. ఒక విధమైన మానవ ప్రవర్తన. మతంలో మానవాతీత శక్తులకు సంబంధించిన విశ్వాసాలు, సంస్కారాలు ఉంటాయి. ఇది మానవ సంస్కృతిలో అంతర్భాగం.

 

నిర్వచనాలు

టైలర్‌: మతం నాగరిక సమాజాలకే పరిమితం. ఆదిమ సమాజాల్లోనూ మతం ఉందని, అది నాగరిక సమాజాల్లోని మతం కంటే భిన్నమైంది కాదు (గ్రంథం - ప్రిమిటివ్‌ కల్చర్‌ - 1871). 

ఎమైలీ డర్క్‌హైమ్‌: నమ్మకాలను ఉమ్మడిగా పాటించడం (ది ఎలిమెంటరీ టీమ్స్‌ ఆఫ్‌ ద లైఫ్‌).

మకైకర్, ఫేజ్‌: మనిషికీ - మనిషికీ, మనిషికీ - ఉన్నత శక్తులకు మధ్య సంబంధం.

మిల్లర్, వైట్జ్‌: జీవితాలను శాసించే నమ్మకాలు, క్రియలను కలిగి ఉండే సాంఘిక క్రియ.

* మతం అనేది మత్తు పదార్థం లాంటిదని కారల్‌మార్క్స్‌ పేర్కొన్నారు.

 

మతం - పుట్టుక సిద్ధాంతాలు

సర్వాత్మవాదం: ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఈ.బి.టైలర్‌. 

జీవాత్మవాదం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాయిస్, మాక్స్‌ముల్లర్‌ ప్రతిపాదించారు. దీన్ని అభివృద్ధి చేసినవారు ఆర్‌.ఆర్‌.మారెట్‌.

ప్రకృతి ఆరాధన: ప్రకృతిని ఆరాధించడమే మతం ప్రారంభ దశ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాక్స్‌ ముల్లర్‌.

టోటెమ్‌ వాదం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు దుర్క్‌హైమ్‌.

ప్రకార్యవాదం (నిర్మిత వాదం): మత ఆవిర్భావానికి కారణమయ్యేవి. దీన్ని వివరించినవారు మలినోస్కీ, రాడ్‌క్లిఫ్‌ బ్రౌన్‌. 

 

భారతీయ సమాజంలో మత సంయోజన విలువలు (2011)

మతం మత గ్రంథం స్థాపకుడు/మత గురువు జనాభా శాతం  జనాభా (కోట్లలో)
హిందూమతం భగవద్గీత,ఇతిహాసాలు వేదాలు 79.8% 96.63
ఇస్లాం ఖురాన్‌ మహ్మద్‌ ప్రవక్త 14.2% 17.22
క్రైస్తవం బైబిల్‌ యేసుక్రీస్తు 2.29% 02.78
సిక్కుమతం ఆది గురుగ్రంథ్‌ సాహెబ్‌ గురునానక్‌ 1.70% 02.08
బౌద్ధం  త్రిపీఠకాలు గౌతమ బుద్ధుడు 0.70% 00.84
జైనం అంగాలు స్థాపకుడు వృషభనాథుడు, చరిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు, నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు  0.40% 00.45
పార్సీ జెండా అవెస్తా జరాత్రుస్టా - -
ఇతరులు - - 0.70% 00.84


హిందూమతం

  హిందూమతం కొన్ని తాత్విక సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. జన్మ, పునర్జన్మ, కర్మ, ధర్మం, ముక్తి, మోక్షం తదితర సిద్ధాంతాలను బోధిస్తుంది. విభిన్న విశ్వాసాలు, ఆచరణలు కనిపిస్తాయి. హిందూ మతం కొన్ని ప్రపంచ మతాలకు, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మనిచ్చింది. మనదేశ చరిత్ర గమనం, సంస్కృతిలో మతం ప్రధానపాత్ర పోషిస్తోంది. దేశ ఆచారాలు, చట్టాలు రెండూ మత వైవిధ్యం, సామరస్యాన్ని స్థాపిస్తున్నాయి. భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రసాదించింది.

  హిందూ సమాజం అతిపురాతనమైంది. అనేక మత సంబంధమైన సిద్ధాంతాలు, నమ్మకాలు, విలువలు, లక్ష్యాలపై ఆధారపడి ఏర్పడింది. వ్యక్తులకు ఒక క్రమబద్ధమైన జీవన విధానం, విలువలు, ప్రమాణాలను అందించి అభివృద్ధికి పాటుపడుతోంది. 

 

ఆశ్రమ ధర్మాలు

  హిందూ సామాజిక జీవితంలో ఆశ్రమ ధర్మాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి హిందువు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఆశ్రమ ధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆశ్రమం అనే పదం సంస్కృత భాషలోని శ్రమ అనే పదం నుంచి వచ్చింది. సాహిత్యపరంగా ఆశ్రమం అనే పదానికి అర్థం విశ్రాంతి స్థలం. మోక్ష సాధన అనే మహ్వోన్నత ప్రయాణంలో ఒక చోట ఆగి ప్రయాణానికి సిద్ధం కావడానికి తీసుకునే విశ్రాంతిని ఆశ్రమం అంటారు. ప్రతి హైందవుడు తన జీవితకాలంలో నాలుగు దశల ద్వారా ప్రయాణించి మోక్షం పొందాలని హిందూ మతం బోధిస్తోంది.

* బ్రహ్మచర్య ఆశ్రమం - 25 సంవత్సరాలు

* గృహస్థ ఆశ్రమం - 25 - 50 సంవత్సరాలు

* వానప్రస్థ ఆశ్రమం - 50 - 75 సంవత్సరాలు

* సన్యాస ఆశ్రమం - 75 - 100 సంవత్సరాలు

  బ్రహ్మను చేరుకోవడానికి ఈ నాలుగు ఆశ్రమాలు 4 మెట్లు కలిగిన నిచ్చెన లాంటివని మహాభారతంలో భీష్ముడు పేర్కొన్నాడు. ఆశ్రమ పద్ధతి క్రీ.పూ.100 ప్రాంతంలో అమల్లోకి వచ్చిందని ఆల్టేకర్‌ తెలిపాడు. మొదట మూడు ఆశ్రమాలే ఉండేవని వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలను ఒకే ఆశ్రమంగా భావించేవారని పండరి నాథ్‌ ప్రభు తెలిపాడు. మొదటి మూడు ఆశ్రమాలు దాటిన వ్యక్తిని సన్యాసి అని శ్వేతాస్వతరోపనిషత్తు తెలియజేస్తోంది. 

 

బ్రహ్మచర్య ఆశ్రమం: సర్వసాధారణంగా ఈ ఆశ్రమం ఉపనయనం తర్వాత ప్రారంభమవుతుంది. బాల్యదశ నుంచి ప్రాపంచిక విషయాలు నేర్చుకునే సమయంలో వ్యక్తి ఎలా ఉండాలి, ఏ విధమైన నియమ, నిష్ఠలతో మెలగాలో ఉపనయనం వివరిస్తుంది. ఇలా తెలుసుకుంటే ఆ వ్యక్తి ద్విజుడు (రెండు జన్మలు కలిగినవాడు) అవుతాడు. అంటే ఉపనయన జ్ఞానాన్ని పొందడం ద్వారా మరో జన్మ ఎత్తినట్లు భావిస్తారు. బ్రాహ్మణులు - 8 లేదా 12 సంవత్సరాల వయసులో, క్షత్రియులు - 10 లేదా 14, వైశ్యులు - 12 లేదా 16 సంవత్సరాల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు. శూద్రులకు ఉపనయనం లేదు

ఈ ఆశ్రమంలో వ్యక్తి ఉపాధ్యాయుడి గృహంలో విద్యార్థిగా ప్రవేశిస్తాడు. కానీ గురువు వెంటనే విద్యను మొదలుపెట్టడు. విద్యార్థి ఈ సమయంలో గురువు ఇంటిపనులు చూడటం, పశువులను మేపడం, వంట చెరకు సమకూర్చడం, గురువు కోసం భిక్షను యాచించడం చేస్తాడు. ఇలాంటి సేవల ద్వారా సంతృప్తి చెందితే అప్పుడు గురువు విద్యను మొదలుపెడతాడు. పుట్టిన ప్రతి మనిషి మూడు రుణాలు చెల్లించాలని హిందూ మతం బోధిస్తోంది. వేదాలు చదవడం ద్వారా రుషులకు, యజ్ఞాలు నిర్వహణతో దేవుళ్లకు, కర్మకాండలతో పూర్వీకులకు రుణాలు చెల్లించాలి

 

గృహస్థ ఆశ్రమం: ఇది జీవితంలో అత్యంత కీలక దశ.ఈ సమయంలో వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. వివాహ లక్ష్యాలు ధర్మం, అర్థం, కామం. ధర్మాచరణ, సంతానోత్పత్తి వివాహ ప్రయోజనాలు.

 

వానప్రస్థాశ్రమం: కుటుంబంతో సంపూర్ణంగా, సమగ్రంగా గడిపిన తర్వాత భార్యతో పాటు అడవుల్లో నివాసం ఏర్పరచుకోవడాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. అమావాస్య, పౌర్ణమికి కర్మకాండలు చేస్తారు. హోమాలు నిర్వహిస్తారు, అతిథులను గౌరవిస్తారు. ఈ దశలో వ్యక్తి సాంఘిక జీవనానికి కృషి చేస్తాడు

 

సన్యాసాశ్రమం: మనుసంహిత ప్రకారం ఒక వ్యక్తి గృహస్థ ఆశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని పొందుతాడు. ఈ దశలో వ్యక్తి ఎవరి సహాయం పొందకుండా జీవిస్తాడు. రోజుకు ఒకసారి భిక్షాటన చేస్తాడు. భిక్ష లభ్యమైనా, కాకపోయినా ఒకే మానసిక స్థితిని కలిగి ఉండాలి. ఇది మోక్ష సాధనకు తోడ్పడుతుంది. ఈ దశలో వ్యక్తి ఇంటిపేరు, తనపేరు త్యజిస్తాడు. వానప్రస్థ, సన్యాస ఆశ్రమంలోని వారు తాము జీవిస్తూ, కృషి చేస్తూ నిస్వార్థ సామాజిక వ్యవస్థ/సేవ చేయడానికి ఇష్టపడతారు. సన్యాసి ఒక మహోత్తరమైన సాంఘిక పాత్రను నిర్వహిస్తున్నాడని కపాడియా అనే సామాజిక వేత్త తెలిపాడు.

 

పురుషార్థాలు

ఇవి హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. వ్యక్తి ప్రవర్తనను అదుపు చేయడంలో తోడ్పడతాయి. పురుషార్థాలు నాలుగు. 

 

ధర్మం: ఈ పదాన్ని అనేక సందర్భాల్లో వేర్వేరు అర్థాలతో ఉపయోగించారు. ఉదాహరణకు మహాభారతంలో దేవత అన్నారు. ఐతరేయ బ్రాహ్మణంలో మొత్తం బాధ్యతగా, ఛాందోగ్యోపనిషత్‌లో ఆశ్రమ ధర్మాలను ఆచరించడంగా పేర్కొన్నారు. వేదాలు సూచించే లేదా ఆశించిన ఫలితం లేదా ఆశయం అని జైమిని వివరించారు. పక్షపాతరహితంగా, నీతి నిజాయతీలతో, రాగద్వేషాలను విడిచి మనసావాచా కర్మణా జీవించే పవిత్ర జీవన విధానమే ధర్మమని మనుస్మృతి చెబుతోంది. మనిషి ఆచరించాల్సిన 9 ధర్మగుణాలను యాజ్ఞవల్కుడు వివరించాడు. అవి అహింస, నిర్మలత్వం, నీతి, పరిశుభ్రత, ఇంద్రియ నిగ్రహం, దానం, ఆత్మనిగ్రహం, ప్రేమ, సహనం. ఈ ధర్మ గుణాల్లో మొదటి ఆరు సహజ మనుగడకు, మిగిలినవి వ్యక్తి ప్రవర్తనకు తోడ్పడతాయి. 

 

అర్థం: వ్యక్తి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే సంపద, ఐశ్వర్యం అర్థం. ఇవి మనిషి ఆశలు, ఆశయాల సాధనోపకరణాలు. అవి ధర్మబద్ధంగా ఉండాలని ధర్మశాస్త్రం బోధిస్తోంది.

 

కామం: మనిషి ఇంద్రియ వాంఛలను సంతృప్తి పరుచుకోవడమే కామం లేదా కోరిక.ధర్మాచరణతో కూడిన కామం అంగీకారయోగ్యం, ఉత్తమం. 

అర్థ, కామం విలువలను సాధించడంలో ధర్మం మార్గదర్శిగా, నియంత్రణ సాధనంగా ఉంటుంది. ధర్మ, అర్థ, కామాలను త్రివర్గాలు అంటారు.

 

మోక్షం: మోక్షం అంటే ముక్తి పొందడం. ఇది మనిషి జీవితంలో చిట్టచివరి మెట్టు. ధర్మ, అర్థ, కామాల పరిపూర్ణత ఇందులో ఉంటుంది. భగవద్గీతలో మోక్షాన్ని పరగతిగా వర్ణించారు. కర్మ, జ్ఞానం, భక్తి అనే మూడు మార్గాల ద్వారా ముక్తి సిద్ధిస్తుందని భగవద్గీత పేర్కొంటోంది. 

 

హిందూ వివాహం- పవిత్ర సంస్కారం

హిందూ వివాహం అనేక సంస్కారాలతో కూడిన ఒక పవిత్ర బంధం. హిందూ వివాహ వ్యవస్థలో వివిధ రకాల మతపరమైన సంస్కారాలను ఆచరిస్తారు. దీనిలో ముఖ్యమైనవి హోమం, పాణిగ్రహణం, సప్తపది. వివాహ సమయంలో పురోహితుడు వధూవరులతో అగ్నిహోమం జరిపిస్తారు. ఈ కారణంగానే హిందూ వివాహాన్ని అగ్నిసాక్షి వివాహం అంటారు. పాణిగ్రహణం అంటే వధువు కుడిచేతిని, వరుడు తన కుడిచేతితో గ్రహించడం. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరిగి అతి ముఖ్యమైన సప్తపది జరుగుతుంది. అంటే వధూవరులు కలిసి ఏడడుగులు నడవటం. దీని తర్వాత నక్షత్ర దర్శనంతో హిందూ వివాహ తంతు పూర్తవుతుంది. 

 

హిందూ వివాహ లక్ష్యాలు:

 * లైంగిక వాంఛలను సంతృప్తిపరచడం

 * సంతానోత్పత్తి 

* ధర్మ నిర్వహణ

 

వివాహ వ్యవస్థలో మార్పులు: ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు, భార్యాభర్తల మధ్య సర్దుబాటు లేకపోవడం, వరకట్నం, విడాకులు లాంటివి కూడా వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు.

 

సామాజిక శాసనాలు: బ్రిటిషర్లు మన దేశంలోని వివాహ వ్యవస్థకు సంబంధించిన విషయాలపై కొన్ని శాసనాలు/చట్టాలు చేశారు. స్వాతంత్య్రానంతరం కొన్ని చట్టాలను రూపొందించారు. 

* సతీసహగమన నిరోధ చట్టం - 1829

* హిందూ వితంతు పునర్‌ వివాహ చట్టం - 1856

* బాల్య వివాహ నిరోధ చట్టం - 1929

* హిందూ వివాహ చట్టం - 1955

* ప్రత్యేక వివాహ చట్టం - 1956

* వారసత్వ చట్టం - 1956

* వరకట్న నిషేధ చట్టం - 1961

* ప్రత్యేక వివాహ చట్టం - 1872

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భారతీయ సమాజ నిర్మాణం

‣  కుటుంబం

 భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 03-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌