• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటు తీర్మానాలు

ప్రభుత్వాలకు ప్రతిపక్షాల పగ్గాలు!


అపరిమిత అధికారం నియంతృత్వానికి దారితీస్తుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్య లక్ష్యాలను పరిరక్షించే అధికారాన్ని అత్యున్నత ప్రజాప్రతినిధుల సభకు అప్పగించారు. ప్రభుత్వాల ఏకపక్ష చర్యలను అడ్డుకోడానికి పార్లమెంటు తీర్మానాలను సంధిస్తుంది. కార్యానిర్వాహక విభాగాన్ని కట్టడి చేస్తుంది. ఆ తీర్మానాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిని ప్రతిపక్షాలు అస్త్రాలుగా చేసుకొని ప్రభుత్వాలకు పగ్గాలు వేసే తీరుపై అవగాహన పెంచుకోవాలి. 

 

పార్లమెంటు తీర్మానాలు

తీర్మానం అంటే పార్లమెంటు చేసే ఒక నిర్ణయం. ఈ తీర్మానాన్ని మంత్రులు లేదా ప్రైవేట్‌ సభ్యులు సభాధ్యక్షుల అనుమతితో సభలో ప్రవేశపెట్టవచ్చు. కొన్ని తీర్మానాల వల్ల ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సందర్భాలున్నాయి.

 

విశ్వాస తీర్మానం 

విశ్వాస తీర్మానం (Confidence Motion) గురించి రాజ్యాంగంలో నేరుగా ఎక్కడా పేర్కొనలేదు. ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్రపతి కోరినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. వీగిపోతే అధికారాన్ని కోల్పోతుంది.

* విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన మొదటి ప్రధాని చరణ్‌ సింగ్‌. కానీ తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ జరగకుండానే చరణ్‌ సింగ్‌ ప్రభుత్వం రాజీనామా చేసింది.

* 9వ లోక్‌సభ కాలంలో 1990లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ రాజీనామా చేశారు.

* 11వ లోక్‌సభ కాలంలో 1997లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోవడంతో హెచ్‌.డి.దేవెగౌడ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

* 15వ లోక్‌సభ కాలంలో 2008లో లోక్‌సభలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రభుత్వం కొనసాగింది.

 

అవిశ్వాస తీర్మానం 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని (No Confidence Motion) ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెడతాయి. కనీసం 50 మంది సభ్యుల సంతకాలతో ఈ తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు అందజేయాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం చూపాల్సిన అవసరం లేదు. దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ లోక్‌సభ నియమావళిలోని రూల్‌ నం.198లో దీని ప్రస్తావన ఉంది. ‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంట్‌- 1950’ చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనిపై లోక్‌సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఇది నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య విరామం 6 నెలలు ఉండాలి. ఈ తీర్మానాన్ని మొత్తం ప్రభుత్వంపై ప్రవేశపెడతారు. వ్యక్తిగతంగా మంత్రులపై ప్రవేశపెట్టకూడదు

* అవిశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో జె.బి.కృపలానీ ప్రవేశపెట్టారు. 62 మంది సభ్యులు తీర్మానాన్ని సమర్థించగా, 347 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో నెహ్రూ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

* ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.

* ఒకే పదవీకాలంలో (5 సంవత్సరాల వ్యవధి) పి.వి.నరసింహారావు ప్రభుత్వంపై 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ విఫలమయ్యాయి.

* 1999లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో నెగ్గడంతో వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది.

* 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది.

 

అభిశంసన తీర్మానం 

ప్రభుత్వంలోని ఒక మంత్రిపై లేదా కొందరు మంత్రులపై లేదా మొత్తం ప్రభుత్వంపైన అభిశంసన తీర్మానం (Censure Motion) ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు తప్పనిసరిగా కారణం చూపాలి, కనీసం 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సభాహక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు, సంబంధిత మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. తీర్మానం నెగ్గితే ప్రభుత్వం/ మంత్రులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. రాజీనామా చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల నైతికతకు వదిలేశారు.

 

వాయిదా తీర్మానం 

ప్రజాప్రాముఖ్యం కలిగిన ఏదైనా అంశంపై చర్చించేందుకు ‘ఎజెండా’లోని కార్యక్రమాలను వాయిదా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం (Adjournment Motion). ఈ తీర్మానం ప్రభుత్వాన్ని అభిశంసించేదిగా ఉంటుంది. అందుకే దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో చర్చకు స్వీకరించరు.  తీర్మానాన్ని 50 మంది సభ్యుల సంతకాలతో అందజేయాలి. దీన్ని అనుమతించాలా? వద్దా? అనేది లోక్‌సభ స్పీకర్‌ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. తీర్మానంలో చర్చించాల్సిన అంశం ప్రజాప్రాధాన్యాన్ని కలిగి ఉండాలి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వం బాధ్యత వహించేదై ఉండాలి. తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తే ఆ రోజు జరగాల్సిన సభాకార్యకలాపాలన్నీ వాయిదా పడతాయి. కనీసం 2 1/2 గంటలకు తగ్గకుండా అంశంపై చర్చించాలి. సాధారణంగా ఈ తీర్మానానికి సంబంధించిన చర్చ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు ఉంటుంది. చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వాన్ని అభిశంసించినట్లుగా భావిస్తారు. కానీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.  తీర్మానంపై చర్చ జరిగే సమయంలో సభను వాయిదా వేసే అధికారం సభాపతికి లేదు.

 

ధన్యవాద తీర్మానం 

ప్రభుత్వ విధానాలు, విజయాలతో కూడిన ఒక నోట్‌ను ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ రూపొందిస్తుంది. దీన్ని రాష్ట్రపతి పార్లమెంటులో పేర్కొంటూ ప్రసంగిస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను దీనిలో వివరిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం లోక్‌సభలో ‘ధన్యవాద’ తీర్మానాన్ని  (Motion of thanks) ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.  తీర్మానంపై చర్చ తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. ఓడిపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది.

 

సావధాన తీర్మానం 

అత్యవసర ప్రజాప్రాధ్యాన్యం కలిగిన అంశంపై ప్రభుత్వం నుంచి అధికారపూర్వకంగా సమాధానం (Authoritative Statement) రాబట్టడానికి సావధాన తీర్మానం  (Calling attention motion) ప్రవేశపెడతారు. 1954 నుంచి అనుసరిస్తున్న ఈ తీర్మానానికి సంబంధించిన నిబంధనల్ని పార్లమెంటరీ నియమాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత దీన్ని అనుమతిస్తారు. దీనిపై చర్చ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేస్తుంది.

 

కోత తీర్మానాలు 

ప్రభుత్వం వివిధ పద్దుల కేటాయింపు కోసం ‘బడ్జెట్‌’ను లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరుతుంది. ఇదే తరుణంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం కోరుతున్న పద్దులపై తగ్గింపులు చేయాలని కోరుతూ ‘కోత తీర్మానాలు (Cut motions)’ సభలో ప్రవేశపెడుతుంటాయి. ఇవి ఆమోదం పొందితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

కోత తీర్మానాలు 3 రకాలు..

ఆర్థిక కోత తీర్మానం (Economy cut motion): ప్రభుత్వం అవసరమైన దానికంటే ఎక్కువగా మితిమీరిన ఖర్చు చేస్తోందని ప్రతిపక్షాలు భావించినప్పుడు ప్రభుత్వ వ్యయంలో పొదుపును పాటింపజేసే ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీని ద్వారా డిమాండ్‌ చేసిన మొత్తం నుంచి కొంత తగ్గించమని ప్రతిపాదిస్తారు. చర్చ అనంతరం ఓటింగ్‌ ఉంటుంది. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

నామమాత్ర కోత తీర్మానం (Token cut motion): ప్రభుత్వం డిమాండ్‌ చేసిన మొత్తం నుంచి రూ.100 తగ్గించాలని ప్రతిపాదిస్తారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

విధాన కోత తీర్మానం (Policy cut motion): ప్రభుత్వం డిమాండ్‌ చేసిన మొత్తం ఒక రూపాయికి తగ్గించాలని ప్రతిపాదిస్తారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

 

ప్రత్యేక తీర్మానం 

ప్రశ్నల రూపంలో అడిగేందుకు వీలుకాని, అత్యవసర ప్రజాప్రాధాన్యం కలిగిన అంశాలు, ఏ ఇతర పద్ధతుల ద్వారా చర్చించలేని అంశాలను ప్రత్యేక తీర్మానం (Special Motion) ద్వారా చర్చిస్తారు. లోక్‌సభలో రూల్‌ 377 నోటీసుతో, రాజ్యసభలో రూల్‌ 180 (B) నోటీసుతో దీన్ని ప్రవేశపెడతారు.

 

ముగింపు తీర్మానం 

సభలో జరుగుతున్న చర్చను ఇక ముగించాలని ఒక సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ముగింపు తీర్మానం (Closure Motion) అంటారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే చర్చ అంతటితో ముగిసిపోతుంది. ఈ విషయాన్ని ఓటింగ్‌లో పెడతారు.

ముగింపు తీర్మానం - 4 రకాలు

సాధారణ ముగింపు (Simple Closure): చర్చించాల్సిన విషయాన్ని పూర్తిగా చర్చించాం. కాబట్టి దీన్ని ఓటింగ్‌లో పెడుతున్నామని ఎవరైనా సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదించడం.

విభాగపరమైన ముగింపు (Closure by Compartments): చర్చ ప్రారంభమయ్యే ముందు బిల్లుని వివిధ క్లాజులుగా చేస్తారు. ప్రతి క్లాజుని చర్చించి, చివరికి అన్నింటినీ కలిపి ఓటింగ్‌లో పెడతారు.

కంగారు ముగింపు: దీనిలో భాగంగా ముఖ్యమైన క్లాజులను చర్చిస్తారు. ప్రాధాన్యం లేని క్లాజులను వదిలివేసి, ఆ తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తారు.

గిలటిన్‌ ముగింపు (Guillotine Closure):  ఈ విధానంలో బిల్లులో చర్చించిన విషయంతోపాటు చర్చించని క్లాజులను కూడా చేర్చి ఆమోదిస్తారు.

 

సభాహక్కుల తీర్మానం 

సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా అలాంటి వారిపై సభాహక్కుల తీర్మానం (Privilege Motion) ప్రవేశపెడతారు.

రచయిత: బంగారు సత్యనారాయణ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

‣ కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌