• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో ప్రజాచైతన్య వ్యాప్తి

నిస్తేజం నుంచి.. ఉత్తేజం వైపు!

  నిజాం రాజ్యంలో ప్రజలు నిరక్షరాస్యులు. అసఫ్‌జాహీల శాసనాల అమలు మినహా అప్పటి పౌరులకు వేరే గత్యంతరం లేదు. ఎలాంటి హక్కులు తెలియవు. బానిసత్వమే బతుకుగా జీవించేవారు.  వెట్టిచాకిరిని విధిగా నిర్వహించేవారు. ఆ దశలో జరిగిన కొన్ని సంఘటనలు వారిలో చైతన్యాన్ని కలిగించాయి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వీలు కల్పించాయి. స్వదేశీ భావన బలపడేందుకు దోహదపడ్డాయి. నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు నడిపించాయి. ఇందుకు కృషి చేసిన కొందరు నాయకులు రాజ్య బహిష్కరణకు గురయ్యారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

  అసఫ్‌జాహీల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. గ్రామాల్లో మక్తేదారులు, పట్టేదారులు అనే భూస్వాములు సర్వాధిపత్యం వహించేవారు.బఘీలా, వెట్టిచాకిరి అనే పేర్లతో బానిసత్వం సర్వసామాన్యంగా అమల్లో ఉండేది. ఆనాటి అక్షరాస్యత 3.3% మాత్రమే.

 

చందా రైల్వే పథకం 

  చందా రైల్వే పథకం సందర్భంగా 1883లో హైదరాబాద్‌ రాజ్య ప్రజల్లో మొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. అప్పటికే హైదరాబాద్‌ నుంచి వాడి వరకు ఉన్న రైలు మార్గాన్ని చందా (మహారాష్ట్ర) వరకు పొడిగించాలని సిద్ధం చేసిన ప్రణాళికే చందా రైల్వే పథకం. దీనివల్ల ఖజానాపై అధిక భారం పడుతుంది. పైగా కొత్త ప్రయోజనాలు ఏమీ లేవు. అందుకే దీన్ని రహస్యంగా ఉంచారు. 1883లో చందా రైల్వే ప్రణాళిక బయటపడింది. దీని గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ముగ్గురు వ్యక్తులు విశేష కృషి చేశారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం, రెవెన్యూ అధికారి దస్తూర్‌జీ జాసాజీ హోసంగ్‌ తదితరులు నిజాం రాజ్యంలో స్వదేశీ భావనకు మొదటిసారిగా బీజం వేశారు. రైల్వే పథకం వివరాలను ప్రజలకు తెలిపి వారి అంగీకారం తీసుకోవాలని కోరారు. చందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ పేరుతో ఒక పౌర సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం అఘోరనాథ ఛటోపాధ్యాయను బలవంతంగా తీసుకెళ్లి షోలాపూర్‌లో విడిచిపెట్టింది. ఆ విధంగా నిజాం రాజ్యం నుంచి బహిష్కరణకు గురైన మొదటి వ్యక్తి అఘోరనాథ ఛటోపాధ్యాయ. 1883, మే 22న దస్తూర్‌జీ జాసాజీ హోసంగ్‌ను రాజ్య బహిష్కారం చేసి పుణెకు పంపారు. చందా రైల్వే స్కీం వ్యవహారంలో 18 మంది నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారని దస్తగిర్‌ ఖాన్‌ తన స్వీయచరిత్రలో తెలిపారు. ఈ ఉద్యమాన్ని హైదరాబాద్‌ రికార్డు, షౌకత్‌ ఉల్‌ ఇస్లాం లాంటి పత్రికలు ప్రచారం చేశాయి.

 

కాంగ్రెస్‌ ప్రభావం

  1885లో ఎ.ఒ.హ్యూమ్‌ అనే బ్రిటిష్‌ రిటైర్డ్‌ ఐసీఎస్‌ అధికారి భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. దీని ప్రథమ సమావేశం అదే ఏడాది బొంబాయిలో ఉమేష్‌ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ముస్లిం అధికారులు కాంగ్రెస్‌ ఏర్పాటును వ్యతిరేకించారు. వీరిపై అలీఘర్‌ ఉద్యమానికి చెందిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రభావం ఉండేది. జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటును ఆహ్వానించిన వారిలో ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం, అఘోరనాథ ఛటోపాధ్యాయ లాంటి ప్రముఖులు ఉన్నారు. నిజాం రాజ్యం నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరిన మొదటి సభ్యుడు ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం. 1888, అక్టోబరు 19న సికింద్రాబాద్‌ హెడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట కాంగ్రెస్‌ బహిరంగ సభ జరిగింది. రెండు వేల మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి బి.కృష్ణ అయ్యంగార్‌ అధ్యక్షత వహించగా రామచంద్ర పిళ్లే, ఇ.షోరాబ్జి, షెనాయ్, హబీ సజ్జన్‌ లాల్, ముత్యాల రామన్న పాల్గొన్నారు. అలహాబాద్‌లో జరిగే జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు హైదరాబాద్‌ నుంచి ప్రతినిధులను పంపించాలని ఈ సభలో తీర్మానించారు. 1889లో చాదర్‌ఘాట్‌ మెథడిస్ట్‌ ఎపిస్కోపర్‌ చర్చికి చెందిన మిస్టర్‌ గిల్డర్‌ ‘క్రైస్తవ మిషనరీలు-రాజకీయాలు’ అనే శీర్షికతో ‘ది పయనీర్‌’ పత్రికలో వ్యాసం రాశారు. క్రైస్తవులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని అందులో కోరారు.

 

ఆర్య సమాజం

  ఆర్యసమాజాన్ని 1875లో దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించాడు. హైదరాబాద్‌ రాజ్యంలోని మొదటి ఆర్యసమాజ శాఖను బీడ్‌ జిల్లా ధారూర్‌లో 1891లో ఏర్పాటు చేశారు. స్వామి దయానంద సరస్వతి హైదరాబాద్‌ వచ్చి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో భావచైతన్యం కలిగించాడు. ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో 1892లో ఆర్యసమాజ శాఖ మొదలైంది. దీని అధ్యక్షుడు కమతా పర్షాద్, కార్యదర్శి లక్ష్మణ దాసు. మొదటి ఆర్యసమాజ సమావేశం కంద స్వామి తోటలో జరిగింది. దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశిక గ్రంథాన్ని ఆదిపూడి సోమనాథరావు తెలుగులోకి అనువదించారు. సత్యార్థ ప్రకాశిక ఆర్యసమాజానికి ప్రామాణిక గ్రంథం. అఘోరనాథ ఛటోపాధ్యాయ, కెప్టెన్‌ సూర్య ప్రతాప్‌జీ, రామకృష్ణ ప్రసాద్‌జీ, పండిత కృష్ణదత్, కేశవరావు కోరాట్కర్, దామోదర్‌ సత్యవలేకర్, వినాయకరావు విద్యాలంకార్, చందులాల్‌ ఆర్య లాంటి ప్రముఖులు ఆర్యసమాజాన్ని ఆదరించారు. పండిత బాలకృష్ణ, నిత్యానంద బ్రహ్మచారి ప్రచార ధాటికి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రభుత్వం ఆర్యసమాజాన్ని అడ్డుకోవడానికి సనాతన ధర్మమండలిని ఏర్పాటు చేసింది. 1894లో పండిత బాలకృష్ణ, నిత్యానంద బ్రహ్మచారిలను రాజ్యం నుంచి బహిష్కరించింది. ఆర్యసమాజం కులాలతో నిమిత్తం లేకుండా ప్రజల్లో నెలకొని ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించి వారిని సంస్కరించి హిందూ సమాజాన్ని ఏకం చేసింది.

 

కార్యకలాపాలు: 1929లో హైదరాబాద్‌ రాజ్యంలోని కర్ణాటక ప్రాంతంలో ‘దీన్‌దార్‌’ ఉద్యమం ప్రారంభమైంది. సిద్ధికి దీన్‌దార్‌ అనే ముస్లిం మ‌త‌స్థుడు తాను లింగాయతుల దేవుడైన చెన్నబసవేశ్వరుడి అవతారమని, ప్రజలంతా ఇస్లాం మతాన్ని అనుసరించాలని బోధించాడు. ‘సర్వరే అలం’ అనే పుస్తకం రాసి, అందులో హిందూదేవతలను అవహేళన చేశాడు. హైదరాబాద్‌ సంస్థానం వెలుపల నుంచి రామచంద్ర దెహ్లాని, చంద్రబాను లాంటివారు రాజ్యంలో తిరిగి దీన్‌దార్‌ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఖండించేవారు. అయితే ప్రభుత్వం ఆర్యసమాజం నిర్వహిస్తున్న వేదిక్‌ ఆదర్శ్‌ పత్రికతో పాటు ఆ నాయకులు ఎలాంటి సమావేశాలు జరపకుండా నిషేధం విధించింది. సత్యార్థ ప్రకాశిక గ్రంథం పత్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నాయకులైన పండిత నరేంద్రజీ, శ్యామ్‌లాల్‌ వంటివారిని 1938-40లో అరెస్టు చేసి మన్ననూరు జైలులో నిర్బంధించింది. దీంతో రాజ్యంలోని గుల్బర్గా, ధూళిపేట, ఉద్గీర్‌లలో అల్లర్లు జరిగాయి.

  అంజుమన్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ అధ్యక్షుడు బహదూర్‌యార్‌జంగ్‌ ఒక రహస్య సర్క్యులర్‌ ద్వారా దళితులను ముస్లిం మతంలోకి మార్చాలని ప్రయత్నించాడు. తపాలా శాఖలో పనిచేసే బి.వెంకటస్వామి ద్వారా విషయం తెలుసుకున్న నరేంద్రజీ, శంకరరెడ్డి, బలదేవ్‌సింగ్‌ లాంటి ఆర్యసమాజ నాయకులు పండిత చంద్రపాల్‌ సహకారంతో ఇస్లాం మతం పుచ్చుకున్న దాదాపు 10 వేల మందిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూమతంలోకి మార్చారు. నిజాంకు గుణపాఠం నేర్పడానికి దేశం మొత్తం నుంచి ఆర్యసమాజ నాయకులు హైదరాబాద్‌కు వచ్చి సత్యాగ్రహోద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు. 1938, అక్టోబరు 24న హైదరాబాద్‌లో సత్యాగ్రహోద్యమానికి నాయకుడిగా మహాత్మ నారాయణస్వామిని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 1939, జనవరి 25న దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ డేను నిర్వహించారు. ఈ సత్యాగ్రహంలో 12 వేల మంది పాల్గొన్నారు. దానికి ఎనిమిదో డిక్టేటరుగా పండిత వినాయకరావు విద్యాలంకార్‌ నియమితులయ్యారు. 1939, జులై 21న ప్రభుత్వం కొన్ని పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఉద్యమం ఆగిపోయింది. 1947లో నిజాంకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్‌ అధ్యక్షుడిగా ఎమ్‌.ఆర్‌.శ్యామ్‌రావు ఉద్యమంలో పాల్గొన్నారు. 1947, డిసెంబరు 4న ఆర్యసమాజ్‌లోని క్రాంతికార్‌దళ్‌కు చెందిన నారాయణరావ్‌ పవార్‌ హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి వద్ద నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడి చేశాడు. ఈ దాడి నుంచి నిజాం తప్పించుకున్నాడు.

 

గణేశ్‌ ఉత్సవాలు

  బాలగంగాధర్‌ తిలక్‌ మహారాష్ట్రలో 1893లో ప్రారంభించిన గణేశ్‌ ఉత్సవాలు 1895లో హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. శాలిబండ గణేశ్‌ ఉత్సవాలను శివరామకృష్ణా గోరే ప్రోత్సహించాడు. చాదర్‌ఘాట్‌ గణేశ్‌ ఉత్సవాలకు విద్యార్థులు నాయకత్వం వహించారు. వివేకవర్ధినిలో గణేశ్‌ మండళ్ల సమ్మేళనం వైభవంగా జరిగేది. గణేశ్‌ ఉత్సవాలు, ఆర్యసమాజ ఉద్యమం ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సాధనాలుగా ఉపయోగపడ్డాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. హైదరాబాద్‌ రాజ్యంలో మొదటిసారిగా ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ ఎప్పుడు జరిగింది?

1) 1880      2) 1881      3) 1882     4) 1883

 

2. నిజాం రాజ్యం నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరిన మొదటి వ్యక్తి?

1) సురేష్‌ చంద్ర       2) అక్బర్‌ అలీ      3) ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం    4) నారాయణ పిళ్లే

 

3. నిజాం సంస్థానం నుంచి బహిష్కరణకు గురైన మొదటి వ్యక్తి ఎవరు?

1) సరోజినీ నాయుడు     2) తారాచంద్ర     3) అఘోరనాథ ఛటోపాధ్యాయ    4) రామచంద్ర పిళ్లే

 

4. ‘క్రైస్తవ మిషనరీలు - రాజకీయాలు’ అనే శీర్షికతో వ్యాసం రాసినవారు?

1) బోట్సన్‌      2) విల్సన్‌     3) మిస్టర్‌ గిల్డర్‌     4) అబ్రహం

 

5. హైదరాబాద్‌లో మొదటి భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించినవారు? 

1) కృష్ణ అయ్యంగార్‌     2) రామచంద్ర పిళ్లే     3) ముత్యాల రామన్న     4) సజ్జ‌న్‌ లాల్‌

 

6. హైదరాబాద్‌ నగరంలో ఆర్యసమాజ శాఖ ఎప్పుడు ఏర్పడింది?

1) 1888      2) 1890      3) 1892     4) 1893

 

7. 'హైదరాబాద్‌ డే'ను ఎప్పుడు నిర్వహించారు?

1) 1937, నవంబరు 14      2) 1939, జనవరి 25     3) 1937, అక్టోబరు 18    4) 1938, నవంబరు 14

 

8. హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1893      2) 1894      3) 1895      4) 1896

 

9. ‘దీన్‌దార్‌’ ఉద్యమం హైదరాబాద్‌ రాజ్యంలో ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1892     2) 1900     3) 1915     4) 1929

 

సమాధానాలు: 1-4, 2-3, 3-3, 4-3, 5-1, 6-3, 7-2, 8-3, 9-4.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌