• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు - అధికారాలు - విధులు

విధులు విస్తృతం... అధికారాలు సర్వోన్నతం


భారత రాజ్యాంగ అమలును పరిపూర్ణ బాధ్యతతో పర్యవేక్షించడంతోపాటు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నత విధులను సుప్రీంకోర్టు నిర్వహిస్తోంది. అందుకోసం రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికార పరిధిని వినియోగించుకుంటుంది. పౌర హక్కులు మొదలు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య తలెత్తే వివాదాలకు అంతిమ తీర్పును ప్రకటిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన ఈ విశిష్ట అంశాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మన న్యాయవ్యవస్థ నిర్మాణం బ్రిటన్‌ న్యాయవ్యవస్థను, పనితీరు అమెరికా న్యాయవ్యవస్థను పోలి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన సుప్రీంకోర్టు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ దేశపరిపాలనను రాజ్యాంగబద్ధంగా కొనసాగించడంలో తనకున్న అధికారాలను వినియోగిస్తుంది.

ప్రారంభ/ప్రాథమిక/ఒరిజనల్‌ విచారణాధికారాలు:  ఆర్టికల్‌ 131 ప్రకారం మన దేశ సమాఖ్య స్వభావాన్ని కాపాడటం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటినీ సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. అవి: 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలు.

* కేంద్ర ప్రభుత్వం ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వాలు మరో వైపు ఉన్నప్పుడు తలెత్తే వివాదాలు. 

* దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు.

* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు. 

* ఏవైనా రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలు.

ఉదా: * 1957లో భారత ప్రభుత్వం ‘బొగ్గు గనుల ప్రాంతాల అభివృద్ధి చట్టం’ చేసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తొలిసారిగా ప్రారంభ/ఒరిజినల్‌ విచారణాధికార పరిధిని వినియోగించుకుంది.

* 1981లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు భారత ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ప్రాథమిక/ఒరిజినల్‌ విచారణాధికార పరిధి నుంచి మినహాయించిన అంశాలు: 

ఆర్టికల్‌ 81: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చేసిన సిఫార్సులను అనుసరించి లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంటు రూపొందించిన చట్టాలు.

ఆర్టికల్‌ 246: కేంద్ర జాబితాలోని అంశాలపై వివాదాలు.

ఆర్టికల్‌ 253: భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు.

ఆర్టికల్‌ 262: అంతర్రాష్ట్ర నదీజలాల పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పులు/అవార్డులను అనుసరించి పార్లమెంటు చేసిన చట్టాలు.

ఆర్టికల్‌ 275: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.

ఆర్టికల్‌ 280: కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను పంపిణీకి చేసిన సిఫార్సులకు సంబంధించిన అంశాలు.

ఆర్టికల్‌ 290: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు.

ఆర్టికల్‌ 304: అంతర్రాష్ట్ర వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు


అప్పీళ్ల విచారణ


సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత అప్పీళ్ల కోర్టు. హైకోర్టులు ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తి చెందినవారు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలంటే సంబంధిత హైకోర్టు అనుమతి ఉండాలి. దీనినే అప్పీళ్ల విచారణాధికార పరిధి అంటారు. సుప్రీంకోర్టు స్వీకరించే అప్పీల్‌ వివాదాలను వివిధ రకాలుగా పేర్కొనవచ్చు.


రాజ్యాంగపరమైన అప్పీళ్లు (ఆర్టికల్‌ 132): రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగబద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రద్దు చేయగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.


సివిల్‌ అప్పీళ్లు (ఆర్టికల్‌ 133): ఆస్తికి సంబంధించిన సివిల్‌ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం లేదా రాజ్యాంగపరమైన అంశం ఇమిడి ఉందని భావించినప్పుడు హైకోర్టు ఇచ్చే ధ్రువీకరణతో సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.

* 30వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్తి విలువపై పరిమితిని తొలగించారు. కానీ ఆర్టికల్‌ 134(A) ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి.


క్రిమినల్‌ అప్పీళ్లు (ఆర్టికల్‌ 134): వివిధ క్రిమినల్‌ కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. జిల్లా సెషన్స్‌ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించినప్పుడు అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష/యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. అలాగే దిగువ న్యాయస్థానం విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి హైకోర్టు మరణశిక్షను రద్దు చేసిన సందర్భంలోనూ సంబంధిత వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.


* 1970లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం శిక్ష పడిన వ్యక్తులు నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. 

ప్రత్యేక అప్పీళ్లు (ఆర్టికల్‌ 136): వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి హైకోర్టు తిరస్కరించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు. సంబంధిత కేసుల్లో ఏదైనా న్యాయపరమైన ప్రత్యేక అంశం ఇమిడి ఉన్నప్పుడు హైకోర్టు ఏదైనా అంశాన్ని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీళ్లకు వీలు కల్పిస్తారు. సుప్రీంకోర్టు స్క్రీనింగ్‌ కమిటీ వీటిని పరిశీలించి అనుమతిస్తుంది. ఈ అప్పీళ్లను కేవలం హైకోర్టుకే కాకుండా ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్‌కు వ్యతిరేకంగా కూడా అనుమతిస్తారు.

కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ (ఆర్టికల్‌ 129): సుప్రీంకోర్టుకు ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ అధికారం ఉంది. వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌నే ‘అనుపూర్వికాలు’ అని కూడా అంటారు. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ అనేది భవిష్యత్తులో కోర్టులు ఇచ్చే తీర్పులు, పార్లమెంటు చేసే చట్టాలకు మార్గదర్శకంగా ఉంటుంది. వీటిని దిగువస్థాయి న్యాయస్థానాల్లో సాక్ష్యాలు, ఆధారాలుగా పరిగణిస్తారు. దీన్ని ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డును ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తారు. కోర్టు ధిక్కార నేరాల నిరోధక చట్టం, 1971 ప్రకారం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన వారికి రూ.2 వేల జరిమానా లేదా 6 నెలల సాధారణ జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.


మహ్మద్‌ సలీం ఇస్మాయిల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం పరిరక్షణలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్స్‌ కౌన్సిల్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమవడం కారణంగా ఒక రోజు జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

ధిక్కారాలు రెండు రకాలు

కోర్టు ధిక్కారాల నిరోధక చట్టం, 1971 ప్రకారం కోర్టు ధిక్కారం రెండు రకాలు

సివిల్‌ ధిక్కారం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం, విమర్శించడం.


క్రిమినల్‌ ధిక్కారం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా లేదా కోర్టు గౌరవాన్ని భంగపరిచే విధంగా లేదా న్యాయస్థాన పాలనకు ఆటంకపరిచే విధంగా ఏదైనా సమాచారాన్ని ప్రదర్శించడం.

తీర్పుల పునఃసమీక్ష (ఆర్టికల్‌ 137): సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేసుకునే అధికారం కలిగి ఉంది. అంటే సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులు, అభిప్రాయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

ఉదా: 1960లో బెరుబారి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ‘రాజ్యాంగ ప్రవేశిక’ రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో ‘రాజ్యాంగ ప్రవేశిక’ రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కొంది.


* 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకుండా పార్లమెంటు వ్యవహరించాలని తెలిపింది.

 

రాష్ట్రపతికి సలహాలు 

ఆర్టికల్‌ 143 ప్రకారం రాష్ట్రపతి రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు నుంచి న్యాయసలహాను కోరవచ్చు. దీనినే సుప్రీం కోర్టుకు ఉన్న సలహాపూర్వక అధికార పరిధి అంటారు. 
* చట్టానికి సంబంధించిన వివాదం లేదా ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశం. 

ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా నిరాకరించవచ్చు. 

ఉదా: 1993లో రామ జన్మభూమి వివాదం నేపథ్యంలో రాష్ట్రపతి సలహా కోరినప్పుడు సుప్రీంకోర్టు నిరాకరించింది.

* రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు. 

ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తప్పనిసరిగా తన సలహాను వ్యక్తీకరించాలి. 

ఈ రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.

ఆర్టికల్‌ 143 ప్రకారం ఇప్పటివరకు పలు అంశాలపై భారత రాష్ట్రపతులు సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందారు.

* ఢిల్లీ న్యాయ చట్టం, 1951

* కేరళ విద్యా బిల్లు, 1958

* బెరుబారి యూనియన్, 1960

* సీ - కస్టమ్స్‌ చట్టం, 1963

* శాసనసభలు, ప్రత్యేక హక్కులు - కేశవసింగ్‌ వివాదం, 1964

* రాష్ట్రపతి ఎన్నికలు, 1974

* ఇందిరాగాంధీపై విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల చట్టం, 1978

* జమ్మూకశ్మీర్‌ పునరావాస చట్టం, 1992

* కావేరి నదీజలాల ట్రైబ్యునల్‌ వివాదం, 1992

* రామజన్మభూమి వివాదం, 1993

* కొలీజియం వ్యవస్థ, 1998

* సహజవాయువు, ద్రవరూప సహజవాయువు లాంటి అంశాలపై కేంద్ర, రాష్ట్రాల శాసన అర్హతల విషయం, 2001

* గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల సంఘం, 2002

* పంజాబ్‌ నదీజలాల ఒప్పందం, 2004

* 2-జీ స్పెక్ట్రమ్, సహజవనరుల వేలం వివాదాలు, 2012

* నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌), 2016  


రిట్స్‌ జారీ (ఆర్టికల్‌ 32): ప్రాథమిక హక్కుల సంరక్షణకు సుప్రీంకోర్టు అయిదు రకాల రిట్స్‌ను జారీ చేస్తుంది. అవి హెబియస్‌ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారెంటో

న్యాయసమీక్షాధికారం: పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ నియమాలకు లోబడి ఉన్నాయా లేదా అనే అంశాన్ని విచారించి అవి వ్యతిరేకంగా ఉంటే చెల్లవని న్యాయసమీక్షాధికారం ద్వారా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం: రాజ్యాంగానికి సంబంధించి సుప్రీంకోర్టు అత్యున్నత వ్యాఖ్యాత. ఈ క్రమంలో రాజ్యాంగంలోని నిబంధనలకు తుది వివరణ ఇస్తుంది. సుప్రీంకోర్టు వివిధ సిద్ధాంతాల ఆధారంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది.

ఉదా: Doctrine of Pith and Substance
Doctrine of Eclipse
Doctrine of Ancillary Powers
Doctrine of Colourable Legislation


రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

సుప్రీంకోర్టు

జాతీయ మహిళా కమిషన్‌

* కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

Posted Date : 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌