• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ఆంగ్లేయుల ఆక్రమణ క్రమం

ఇద్దరు వీరులు... మూడు దశాబ్దాలు... నాలుగు యుద్ధాలు!

 

  తిరుగులేకుండా సాగుతున్న ఇంగ్లిష్‌ ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ఆ తండ్రీకొడుకులు అడ్డుకున్నారు. అసమాన పరాక్రమాలతో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారు. మూడు దశాబ్దాలపాటు నాలుగు యుద్ధాలు చేసి మైసూర్‌ ఆక్రమణ ప్రయత్నాలను తిప్పికొట్టారు. కానీ బ్రిటిషర్ల కుట్రలు, కుతంత్రాలు, సంధి మోసాలకు స్వదేశీ రాజుల సంకుచితత్వం తోడవటంతో ఆ వీరులు ఓటమిపాలయ్యారు. దాంతో దక్షిణభారతంలోని ఒక ప్రధాన రాజ్యం ఇంగ్లిష్‌వారి దురాగతాలకు బలైంది. కంపెనీ ప్రబల రాజకీయశక్తిగా అవతరించడం మొదలైంది.  

  కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్‌ కంపెనీపై సాధించిన విజయాలు; బెంగాల్‌లో ప్లాసీ, బక్సర్‌ యుద్ధాల్లో సాధించిన ఘన విజయాలతో భారతదేశంలో బ్రిటిషర్ల ఆక్రమణల పర్వం మొదలైంది. క్రీ.శ.1765 అలహాబాద్‌ సంధి ఆంగ్లేయులకు బెంగాల్‌లో సుస్థిర రాజకీయాధికారాన్ని తెచ్చిపెట్టింది. అవధ్‌ రాజ్యం, కర్ణాటక రాజ్యం పరోక్షంగా ఆంగ్లేయుల రాజకీయ ఆధిపత్యంలోకి వచ్చాయి. మైసూర్‌ రాజ్య పాలకుడు హైదర్‌ అలీ, తర్వాత అతడి కుమారుడు టిప్పు సుల్తాన్‌తో ఆంగ్లేయుల కంపెనీ నాలుగు యుద్ధాలు చేసి మైసూర్‌ రాజ్యంలో అగ్రభాగాన్ని ఆక్రమించుకుంది. మరాఠా యుద్ధాల అనంతరం వారి విశాల సామ్రాజ్య భూభాగాలు కంపెనీ వశమయ్యాయి. మరాఠాలు కూడా ఇతర స్వదేశీ రాజుల్లాగే బ్రిటిష్‌ కంపెనీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చింది. రంజిత్‌ సింగ్‌ మరణానంతరం (1839) సిక్కులతో చేసిన రెండు యుద్ధాల వల్ల వాయవ్య దిక్కున సిక్కుల రాజ్యం ఇంగ్లిషవారి అధీనంలోకి వచ్చింది. వీటికితోడు దేశీయ రాజ్యాల విషయాల్లో కంపెనీ అనుసరించిన అనేక కుతంత్రాలు, వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి, డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం భారతదేశంపై ఆంగ్లేయులకు తిరుగులేని రాజ్యాధికారాన్ని అందించాయి. 1857 నాటికి భారత ఉపఖండంలో అత్యధిక భాగం ఆంగ్లేయుల ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాధికారం కిందకు వచ్చింది.

 

ఆంగ్లేయు అధీనంలోకి మైసూర్‌

భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అవలంబించిన రాజ్య విస్తరణ విధానంతో బెంగాల్‌ తర్వాత దక్షిణ భారతదేశంలోని మైసూర్‌ రాజ్యం ఆంగ్లేయుల పరమైంది.

 

మొదటి మైసూర్‌ యుద్ధం (1767 - 69)

  ఈ యుద్ధకాలంలో బెంగాల్‌ గవర్నర్‌ వెర్లెస్ట్‌. 1761లో వడయార్‌ వంశం నుంచి మైసూర్‌ రాజ్య పాలనను అప్పటికి సైనికాధికారిగా ఉన్న హైదర్‌ అలీ హస్తగతం చేసుకున్నాడు. అతడు తన ప్రతిభా సామర్థ్యాలతో మైసూర్‌ రాజ్యాన్ని నిరుపమానంగా తీర్చిదిద్దాడు. హైదర్‌ అలీ రాజ్య విస్తరణ తీరుతో పొరుగునున్న మరాఠాలు, నిజాం విస్తుపోయారు. బ్రిటిషర్లు అసహనానికి గురయ్యారు. దక్షిణాన హైదర్‌ అలీ నేతృత్వంలో మైసూర్‌ అభివృద్ధి జరగడం, సుగంధద్రవ్యాల వ్యాపారానికి అనుకూలమైన కెనరా తీరం, మలబారు తీరం ఆయన ఆధిపత్యంలో ఉండటం బ్రిటిష్‌ వాణిజ్య ప్రయోజనాలకు ఆటంకమని ఆంగ్లేయులు భావించారు. హైదర్‌ అలీని రెచ్చగొట్టడానికి మైసూర్‌ రాజ్యం పరిధిలోని వెల్లూరుకు ఆంగ్లేయులు తమ సైన్యాన్ని పంపించారు. ఈ చర్యను వ్యతిరేకించిన హైదర్‌ అలీ  1767లో ప్రత్యక్ష యుద్ధానికి దిగాడు. యుద్ధ ప్రారంభంలో అలీకి అపజయాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సైన్యాన్ని పునర్‌ వ్యవస్థీకరించి మద్రాస్‌పై దాడి చేశాడు. ఆంగ్లేయులను భయభ్రాంతులకు గురై మద్రాస్‌ సంధికి (1769) అంగీకరించడంతో మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం ముగిసింది. ఈ సంధి ప్రకారం యుద్ధకాలంలో ఇరుపక్షాలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఎవరివి వారికి ఇచ్చేయాలి. మూడో వ్యక్తి దాడి చేయడానికి వస్తే వీరిద్దరు పరస్పరం సహాయం చేసుకోవాలి.

 

రెండో మైసూర్‌ యుద్ధం (1780-84)

  వారన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో ఇది జరిగింది. మద్రాస్‌ సంధి యుద్ధ విరామం మాత్రమే. 1771లో మైసూర్‌ మీద మహారాష్ట్రులు దండయాత్ర చేశారు. ఈ సమయంలో మైసూర్‌కు సహాయం చేయకుండా ఆంగ్లేయులు మద్రాస్‌ సంధిని ఉల్లంఘించారు. మలబారు తీరంలోని ఫ్రెంచ్‌ వారి మహే ఓడరేవు హైదర్‌ అలీ రక్షణలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య వైరం వల్ల 1780లో ఆంగ్లేయులు మహే రేవును అలీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆక్రమించారు. ఇది రెండో ఆంగ్లో-మైసూరు యుద్ధానికి దారితీసింది. మైసూర్‌కు సహాయం చేయకుండా నిజాం, మరాఠాలను ఆంగ్లేయులు తమ వైపు తిప్పేసుకున్నాడు. ప్రారంభంలో మైసూర్‌ సైన్యం విజయాలు సాధించింది. కానీ 1781లో పోర్ట్‌నోవో వద్ద జరిగిన నిర్ణయాత్మక యుద్ధంలో హైదర్‌ అలీ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధ కాలంలోనే అలీ రాచపుండుతో మరణించాడు. తర్వాత యుద్ధాన్ని అతడి కుమారుడు టిప్పు సుల్తాన్‌ వీరోచితంగా కొనసాగించాడు. ఇరుపక్షాలు ఒకరినొకరు ఓడించలేక యుద్ధాన్ని విరమించుకొన్నాయి. 1784లో మంగుళూరు సంధి పేరిట శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంధి ప్రకారం ఎవరు జయించిన ప్రాంతాలను వారికే ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఒకరికొకరు సాయం చేసుకొనేందుకు మళ్లీ అంగీకరించారు.

 

మూడో మైసూరు యుద్ధం (1790-92)

  కారన్‌ వాలీస్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ఈ యుద్ధం జరిగింది. మద్రాస్‌ సంధి తరహాలోనే మంగుళూరు సంధి కూడా విఫలమైంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మైసూర్‌ సైన్యం ఆంగ్లేయులకు దీటుగా ఉండటం వారికి నచ్చలేదు. ఇదేకాకుండా అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో జార్జి వాషింగ్టన్‌ నాయకత్వంలోని అమెరికన్ల చేతిలో ఆంగ్లేయులు ఓడి పరాభవం పాలయ్యారు. వారి ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవాలంటే కనీసం భారత్‌లోనైనా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి. ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ సంపూర్ణ అధికారానికి టిప్పుసుల్తాన్‌ను పెద్ద అడ్డంకిగా భావించారు. అతడితో యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో కొచ్చిన్‌ రాజ్యంలోని జలకొట్టాల్, క్రాంగనొర్‌లను డచ్చి వారి నుంచి ట్రావెన్‌కోర్‌ సంస్థానం కొనుగోలు చేసింది. మైసూర్‌ రాజ్యానికి కొచ్చిన్‌ సామంత రాజ్యం కావడంతో ఆ కొనుగోలును టిప్పుసుల్తాన్‌ తన సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్నట్లు భావించాడు. ట్రావెన్‌కోర్‌ను ముట్టడించడానికి నిర్ణయించుకున్నాడు. ఇంగ్లిష్‌ వారు దీన్నే అదనుగా భావించి టిప్పు సుల్తాన్‌ను అణిచివేసి మైసూర్‌ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. ట్రావెన్‌కోర్‌ బ్రిటిషర్ల రక్షణలో ఉంది అనే సాకుతో టిప్పుసుల్తాన్‌పై యుద్ధం ప్రకటించారు. అదే మూడో ఆంగ్లో-మైసూరు యుద్ధానికి దారితీసింది. మరాఠాలు, నిజాంలు తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇంగ్లిష్‌ వారి తరఫున నిలిచారు. ఈ యుద్ధంలో ఆంగ్లేయులు గెలిచారు. శ్రీరంగపట్నం సంధి (1792)తో పోరు ముగిసింది. ఈ సంధి వల్ల ఇంగ్లిష్‌ కంపెనీ బారామహల్, దిండిగల్, మలబార్‌ ప్రాంతాలను పొందగా, వారికి సహాయం చేసినందుకు మరాఠాలు, నిజాం కూడా మైసూర్‌ రాజ్య భూభాగాలను కొంతవరకు పొందారు. టిప్పుసుల్తాన్‌ యుద్ధ నష్ట పరిహారం కింద ఆంగ్లేయులకు 3 కోట్ల రూపాయలకుపైగా చెల్లించాడు.

 

నాలుగో ఆంగ్లో మైసూర్‌ యుద్ధం (1799)

  బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వెల్లస్లీ ఉన్న కాలంలో నాలుగో మైసూరు యుద్ధం జరిగింది. శ్రీరంగపట్నం సంధి ద్వారా తాను కోల్పోయిన రాజ్య భాగాలను తిరిగి పొందే యోచనలో టిప్పు సుల్తాన్‌ ఉన్నాడు. ఆంగ్లేయుల శత్రు దేశం ఫ్రాన్స్‌తో స్నేహం కుదుర్చుకున్నాడు. ఫ్రెంచ్‌ విప్లవ సంస్థ జాకోబియన్‌ క్లబ్‌లో సభ్యత్వం పొందాడు. ఇది ఫ్రెంచ్‌ విప్లవం సమయంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ క్లబ్‌. ఈ సంస్థ శాఖను శ్రీరంగపట్నంలో ఏర్పాటు చేయించాడు. అలాగే కాబూల్‌ పాలకుడైన జమాన్‌ షా వద్దకు రాయబారం పంపాడు. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, శిక్షణ కోసం ఫ్రెంచ్‌ వారి సహాయం తీసుకున్నాడు. ఇంగ్లిష్‌ వారిని ఎదిరించడానికి నిశ్చయించుకున్నాడు. వెల్లస్లీ హైదరాబాద్‌ నిజాం, మరాఠాలతో కలిసి టిప్పుసుల్తాన్‌పై యుద్ధం ప్రకటించాడు. వెల్లస్లీ సోదరుడు ఆర్థర్‌ వెల్లస్లీ సైన్యాధ్యక్షతన ఆంగ్ల సైన్యం మైసూర్‌ను ముట్టడించింది. బొంబాయి, మద్రాస్‌ నుంచి కూడా సైన్యం వచ్చి చేరింది. యుద్ధంలో టిప్పు సేనలు ఓడిపోయాయి. ఆత్మగౌరవం తాకట్టు పెట్టి విదేశీయుల పింఛను మీద కాలం వెళ్లదీసే రాజులు, నవాబుల జాబితాలో టిప్పు సుల్తాన్‌ చేరదల్చుకోలేదు. శత్రువుతో పోరాడుతూ 1799 మే 4న వీరమరణం పొందాడు. యుద్ధానంతరం కెనరా, కోయంబత్తూరు, శ్రీరంగపట్నం ప్రాంతాలను ఆంగ్లేయులు ఆక్రమించారు. కొన్ని ప్రాంతాలను నిజాం, మరాఠాలకు ఇచ్చారు. మైసూర్‌ రాజ్యంలో అధిక భాగాన్ని ఆంగ్లేయులే స్వాధీనపరుచుకున్నారు. మైసూర్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసి పూర్వ మైసూర్‌ రాజ్య వంశాన్ని పునరుద్ధరించారు. ఈ విధంగా బెంగాల్‌ ఆక్రమణ తర్వాత ఆంగ్లేయుల సామ్రాజ్య వాదానికి మైసూర్‌ రాజ్యం బలైంది. మైసూర్‌ ఆక్రమణ తర్వాత మహారాష్ట్రులు మాత్రమే బ్రిటిషర్లకు ప్రధాన శత్రువులుగా నిలిచారు.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

  ఐరోపావారి రాక

 మహ్మదీయ దండయాత్రలు

 తొలి, మలి వైదిక నాగరికతలు

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌