• facebook
  • whatsapp
  • telegram

స్వాతంత్య్రోద్యమంలో మహిళామణులు

  విముక్తిపోరులో వీర వనితలు!

భారత స్వాతంత్య్ర సమరంలో పురుష పోరాట యోధులకు దీటుగా ఎందరో వీర వనితలు పాల్గొన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ధైర్యంగా ఎదిరించారు. సేవాసంస్థలను, పత్రికలను స్థాపించి సరైన సమయంలో నాయకత్వ బాధ్యతలను అందుకొని పోరాటం కొనసాగించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లారు. దేశ, విదేశాల్లో విప్లకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. ఆంగ్లేయుల అరాచక పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆస్తులు పోగొట్టుకొని అజ్ఞాతంలోనూ ఉద్యమాలు నడిపారు. ప్రాణత్యాగాలు చేశారు. వారి అచంచల సంకల్పం, నిబద్ధత దేశానికి విముక్తిని ప్రసాదించడంలో అత్యంత కీలకంగా దోహదపడ్డాయి. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలైన ఆ మహిళల గురించి పోటీ పరీక్షార్థులు తప్పకుండా తెలుసుకోవాలి.


  భారతీయ మహిళల దేశభక్తి, త్యాగాలు ఆధునిక భారత చరిత్రలో సువర్ణాక్షరాలలతో లిఖించదగిన అధ్యాయాలు. రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్, కిట్టూరు చెన్నమ్మ లాంటి ఎందరో వీరనారీమణులు 1857 తిరుగుబాటుకు ముందే సమరశంఖం పూరించారు. సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్‌ మహల్‌; 1885లో కాంగ్రెస్‌ స్థాపన తర్వాత స్వాతంత్య్రోద్యమంలో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్, సుచేత కృపాలాని, మాతంగిని హర్జ, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్‌ అలీ మొదలైన ఎందరో మహిళామణులు సాగించిన పోరాటాలు ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాలు.


ఝాన్సీ లక్ష్మీబాయి (1828 - 58):
అసలు పేరు మణికర్ణిక. డల్హౌసీ ప్రకటించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రిటిషర్లు, ఈమె దత్తపుత్రుడు దామోదరరావును రాజ్యాధీశుడిగా అంగీకరించకుండా ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. దాంతో ఆమె ఆంగ్లేయులతో యుద్ధానికి సిద్ధమైంది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొని తెల్లదొరలను ఎదిరించింది. ఆ సమయంలో జరిగిన భీకర యుద్ధంలో మొదట విజయం లక్ష్మీబాయి వైపే ఉంది. కానీ ఆంగ్లేయులు ఆధునిక ఆయుధ సంపత్తితో సేనాధిపతి హ్యూరోజ్‌ని రంగంలోకి దింపారు. అనంతరం గ్వాలియర్‌ వద్ద యుద్ధం చేస్తూ వీరమరణం పొందింది. ఆమె ధైర్యం, తెగువ స్త్రీ జాతికి స్ఫూర్తినిచ్చే గుణాలు. అందుకే నేటికీ ఆమె పేరు దేశంలో ప్రతి ఇంటా వినిపిస్తుంటుంది.


సావిత్రి బాయి ఫులే (1831-97):

 


 

ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫులే భార్య. లింగవివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం, సార్వత్రిక విద్య కోసం ఈ దంపతులు అవిశ్రాంత పోరాటం చేశారు. అనాథ స్త్రీలు, వితంతువులను సావిత్రి బాయి అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. భర్తతో కలిసి 1848 పుణెలో బాలికల పాఠశాలను స్థాపించారు. ‘సత్య శోధక్‌ సమాజ్‌’ నిర్వహణ బాధ్యతల్లో చురుకైన పాత్ర పోషించారు.

 

అనీబిసెంట్‌ (1847-1933):

 


 ఐర్లాండ్‌కు చెందిన అనీబిసెంట్‌ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. దివ్యజ్ఞాన సమాజం సేవలో ఆమె భారతదేశానికి వచ్చారు. అప్పటి రాజకీయాల్లో ప్రవేశించి 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆమె బెనారస్‌లో స్థాపించిన ‘సెంట్రల్‌ హిందూ కాలేజీ’నే 1916 నాటికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. దీని వెనుక ప్రముఖ జాతీయవాది మదన్‌ మోహన్‌ మాలవ్య విశేష‌ కృషి ఉంది. 1916 ఏప్రిల్‌లో హోంరూల్ ఉద్య‌మాన్ని మొద‌ట బాల‌గంగాధ‌ర్ తిల‌క్ స్థాపించిన‌ప్ప‌టికీ, అనీబిసెంట్‌ 1916, సెప్టెంబరులో హోమ్‌రూల్‌ లీగ్‌ స్థాపించి, భారతీయులకు స్వపరిపాలనను డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమ ప్రచారానికి ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’ అనే పత్రికలు స్థాపించారు. ఆమె కృషి ఫలితంగానే కాంగ్రెస్‌ అతివాద వర్గం, మితవాద వర్గం 1916లో జరిగిన లఖ్‌నవూ సమావేశంలో తిరిగి ఏకమయ్యాయి. దాంతో కాంగ్రెస్‌ మహోన్నత రాజకీయ శక్తిగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దేశంలో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నప్పుడు అనీబిసెంట్, తిలక్‌లు సాగించిన హోమ్‌ రూల్‌ ఉద్యమ పోరాటం బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మాంటేగ్‌ 1917లో భారతీయులకు స్పష్టమైన హామీలతో ప్రకటన చేయాల్సి వచ్చింది. హోమ్‌రూల్‌ ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం అనీబిసెంటును కారాగారంలో నిర్బంధించింది. ఆమె సేవలను ప్రశంసించిన భారత జాతీయ కాంగ్రెస్‌ 1917 కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ అనీబిసెంటు.

మాతంగిని హజ్రా (1870-1942): గాంధీజీ పిలుపు మేరకు, 1932లో బెంగాల్‌లోని మిడ్నపుర్‌ జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు., తూములూక్‌ (toomluk) కోర్టు భవనంపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని, పోలీస్‌ కాల్పుల్లో ప్రాణత్యాగం చేశారు.


మేడం బికాజీ కామా (1861-1936): బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించారు. దాదాభాయ్‌ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి బారిన పడి, చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శి అయ్యారు. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ ని స్థాపించారు. విదేశాల్లో ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మేడం కామాను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.


కమలాదేవి దేవి చటోపాధ్యాయ (1903-1988): సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. 1923లో మహాత్మాగాంధీ పిలుపు అందుకుని సహాయ నిరాకరణ ఉద్యమ  సేవాదళ్‌ సంస్థలో పనిచేశారు. విదేశాల్లో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితిగతులు, విద్యాసంస్థలు  తదితరాలను పరిశీలించారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్య‌మంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేసిన సాహస నారి కమలాబాయి. ఈమె జయప్రకాశ్‌ నారాయణ్, రాంమనోహర్‌ లోహియాల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేశారు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. పద్మ విభూషణ్‌తో పాటు రామన్‌ మెగసెసే అవార్డు, శాంతినికేతన్‌ నుంచి ‘దేశికోత్తమ’ సత్కారం అందుకున్న ప్రతిభావంతురాలు.


సరోజినీ నాయుడు (1879-1949): 
 

 

భారత కోకిల (నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి. ‘ది గోల్డెన్‌ త్రెషోల్డ్‌’, ‘ది బర్డ్‌ ఆఫ్‌ టైమ్‌’, ‘ది బ్రోకెన్‌ వింగ్స్‌’ లాంటి రచనలు చేశారు. బొంబాయి (1915), లఖ్‌నవూ (1916) కాంగ్రెస్‌ మహాసభల్లో పాల్గొన్నారు. 1925, డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నరుగా చేశారు. దేశంలోని ముఖ్య నగరాలను సందర్శిస్తూ, స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ పిలుపు అందుకుని, శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. దర్శన ఉప్పు డిపోపై దాడిలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమె పుట్టిన రోజును ‘జాతీయ మహిళా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 


రాణి గైడిన్లు (1915-1993): మణిపుర్‌కు చెందిన 14 ఏళ్ల వీరబాలిక. గొప్ప దేశభక్తురాలు. విదేశీయుల పాలనను వ్యతిరేకించింది. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈమెను బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లో జైలులో బంధించింది.  అప్పటి నుంచి అక్కడే ఉండిపోయింది. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ చొరవతో విడుదలైంది. గైడిన్లు జాతి గర్వించదగిన మహిళామణి. ఈమె 100వ జన్మదినాన్ని 2015లో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆమె నిరుపమాన సేవలను కొనియాడింది.


ఉషా మెహతా (1920-1996): క్విట్‌ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. అలాంటి సమయంలో ఉషా మెహతా బొంబాయిలో రహస్య రేడియో స్థాపించి ఉద్యమకారులను చైతన్యపరిచారు. ఉద్యమవ్యాప్తిలో క్రియాశీలక పాత్ర పోషించారు. ‘మహాత్మాగాంధీ అండ్‌ హ్యూమనిజం’ అనే గ్రంథం రాశారు.


అరుణా అసఫ్‌ అలీ (1909-1996): గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో బహిరంగ ఊరేగింపుల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సోషలిస్ట్‌ భావజాలంతో ప్రభావితురాలైన ఆమె కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించింది.  రామ్‌ మనోహర్‌ లోహియాతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ మాసపత్రిక ఇంక్విలాబ్‌కు ఆమె సంపాదకత్వం వహించారు. 1964లో ‘అంతర్జాతీయ లెనిన్‌ శాంతి బహుమతి’, 1991లో ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ అవార్డు’ లభించాయి. 1992లో పద్మవిభూషణ్‌ అందుకున్నారు. 1997లో మరణాంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆమెను వరించింది.భారత ప్రభుత్వం 1998లో ఆమె స్మారకార్థం స్టాంపు విడుదల చేసింది.


దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ (1909-1981):
ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్, మహాత్మాగాంధీ శంఖారావం చెవిన పడగానే జాతీయోద్యమంలో దూకిన సాహసి. ఆమె భర్త ప్రముఖ ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ను ప్రోత్సహించారు. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆమె  పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.

 

కస్తూర్బా గాంధీ (1869-1944): గాంధీజీ సతీమణి. దక్షిణాఫ్రికాలో ఆంగ్లేయుల జాత్యంహంకార విధానాలపై మహాత్ముడు సాగించిన అవిశ్రాంత అహింసా పోరాటంలో ఆయన వెంటే నడిచిన ధీర వనిత. 1913లో దక్షిణాఫ్రికాలో భారతీయ వలసదారుల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించినందుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. దాంతో ఆమెను అరెస్టు చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు గోపాల‌కృష్ణ‌ గోఖలే కోరిక మేరకు గాంధీజీ 1915లో భారతదేశం వచ్చినప్పటి నుంచి 1943 వరకు నిర్వహించిన అన్ని ప్రముఖ రాజకీయ ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాంధీజీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో పాటు కస్తూర్బా అరెస్ట్‌ అయ్యారు. ఆమెను పుణెలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో బంధించారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. పుణెలోని నిర్బంధ శిబిరంలోనే మరణించారు.

 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 10-10-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు