• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం

మిగులు పోయి.. లోటు వచ్చి!
 


ఒక దేశం ఏడాది కాలంలో ఇతర ప్రపంచ దేశాలతో జరిపే అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలను, ఎగుమతి దిగుమతుల విలువలను క్రమపద్ధతిలో రాసే పట్టికే ‘విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం’. స్వాతంత్య్రానికి పూర్వం వలస పాలనలో మిగులుతో లాభదాయకంగా ఉన్న దేశ కరెంటు ఖాతా, అనంతరం లోటుకి చేరింది. మధ్యలో ఒకట్రెండు సందర్భాల్లో మినహా నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ లోటుకు కారణాలు, అందుకు దారితీసిన ప్రభుత్వ నిర్ణయాలు, దిద్దుబాటు చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో విదేశీ వ్యాపారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి.

బ్రిటిష్‌ ఇండియాలో ఆంగ్లేయ అధికారుల జీతభత్యాల చెల్లింపు, బ్రిటిష్‌ స్టెర్లింగ్‌ రుణాలపై వడ్డీ చెల్లింపులు, తెల్లవారి పెట్టుబడులపై డివిడెండ్ల కోసం భారతదేశం అధిక  ఎగుమతులు చేసేది. దాంతో దేశ వ్యాపార శేషం అనుకూలంగా ఉండేది. అరబ్, ఆగ్నేయాసియా దేశాల మార్కెట్‌ కూడా లభించడంతో భారతదేశ ఎగుమతులు బాగా పుంజుకున్నాయి. 1945కు ముందు ఇండియా ముడిసరకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ విదేశీ వ్యాపారంలో మిగులు పొందేది. 

1) ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవసరమైన మూలధన వస్తువులను, యంత్ర పరికరాలను, సాంకేతిక విజ్ఞానాన్ని, మెరుగైన యాజమాన్య పద్ధతులను అభివృద్ధి దిగుమతులు అంటారు. 

ఉదా: ఉక్కు, సిమెంట్, ఎరువులు, రవాణా, దూరవాణి లాంటి పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మూలధన పరికరాల దిగుమతులను అభివృద్ధి దిగుమతులు అంటారు.

2) అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశాలు ప్రగతి ప్రక్రియలను కొనసాగించడానికి, వాటిని వేగవంతం చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ముడిసరకులు, మాధ్యమిక ఉత్పత్తి వస్తువులు అవసరమవుతాయి. వీటిని నిర్వహణ దిగుమతులు అంటారు.

3) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు అధికమై ప్రజల ఉద్యోగిత, ఆదాయ పరిమాణాలు ఎక్కువవుతాయి.. కానీ వాటికి దీటుగా వినియోగ వస్తువుల సరఫరా పెరగదు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఉత్పన్నమవుతుంది. దానిని అదుపు చేసి, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటానికి ఆహార ధాన్యాలు, ఇతర వినియోగ వస్తువుల దిగుమతులు అవసరమవుతాయి. వీటిని ద్రవ్యోల్బణ ప్రతికూల దిగుమతులు అంటారు. అంటే స్వాతంత్య్రం తర్వాత ప్రాజెక్టులకు అవసరమయ్యే మూలధన వస్తువులను, వాటి నిర్వహణకు మధ్యంతర వస్తువులను, ద్రవ్యోల్బణం పెరగకుండా వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల భారత విదేశీ వ్యాపారంలో లోటు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా భారత్‌లో మొదటి ప్రణాళిక నుంచి వర్తకపు ఖాతా(BOT)  లోటులోనే ఉంది. రెండేళ్లు (1972-73, 1976-77) మినహాయించి మిగిలిన అన్ని సంవత్సరాల్లో మన దేశానికి ఈ లోటు ఉంది.


అదృశ్య అంశాలు: భారత్‌లో అదృశ్య అంశాలు (సేవలు) మొదటి నుంచి మిగులు చూపిస్తున్నాయి. 1950 తర్వాత 40 సంవత్సరాల కాలానికి అంటే 1990-91లో తొలిసారిగా అదృశ్య అంశాల్లో రుణాత్మకత కనిపించింది (రూ.4.33 కోట్లు). ఈ మధ్యకాలంలో అదృశ్య అంశాలున్న మిగులు, దృశ్యాంశా (వస్తువులు)ల్లో లోటును కూడా భర్తీ చేయగలిగి కరెంట్‌ ఖాతాలో మిగులు కనపడింది. 2020-21లోనూ మిగులు కనిపించింది.


సంస్కరణలకు ముందు భారత బీఓపీ (Balance of Payment): రెండో ప్రపంచ యుద్ధకాలంలో మన దేశం నుంచి పెద్దమొత్తంలో ఇంగ్లండ్‌ వస్తువులు కొనుగోలు చేయడంతో విదేశీ మారక నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా మారింది. అంటే స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత ‘బీఓపీ’ మిగులులో ఉండేది. మొదటి ప్రణాళిక నుంచి లోటు ప్రారంభమైంది. అయితే అదృశ్య అంశాల్లో మాత్రం మొదటి నుంచి మిగులే కనిపిస్తుంది. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ బీఓపీ సమస్య, స్వభావం ఆధారంగా సంస్కరణల ముందు కాలాన్ని 3 భాగాలుగా విడదీశారు. 

1) మొదటి కాలం 1956-57 నుంచి 1975-76 

2) రెండో కాలం 1976-77 నుంచి 1979-80 

3) మూడో కాలం 1980-81 నుంచి 1990-91


మొదటి కాలం: ఆహార వస్తువుల కొరత ఏర్పడటంతో దిగుమతులు పెరిగాయి. దాంతో మహలనోబిస్‌ భారీ పరిశ్రమల నమూనాకు ప్రాధాన్యం ఇచ్చి మూలధన పరికరాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎగుమతులు స్తబ్దుగా ఉండటంతో బీఓపీలో లోటు పెరిగింది.

రెండో కాలం: అయిదో పంచవర్ష ప్రణాళికలో ఎగుమతులు బాగా పెంచుకోవడంతో, రెండోసారి (1976-77) వ్యాపార శేషంలో మిగులు కనిపించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో విదేశీ మారక ద్రవ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించడాన్ని అరికట్టారు. ఆ కొన్నేళ్లు జీడీపీలో కరెంట్‌ అకౌంట్‌ 0.6 శాతం మిగులు ఉంది.. ఏడు నెలల దిగుమతులకు సరిపోయే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. 


ఈ మిగులుకు కారణాలు

* ఇంధనం/ఆయిల్‌ ఎగుమతి చేసే దేశాలకు భారతీయులు వలస వెళ్లి అక్కడ పనిచేయడంతో ప్రైవేటు రెమిటెన్సెస్‌ పెరిగాయి.

* ఎగుమతుల్లోనూ వృద్ధి కనిపించింది. 

* దేశంలో ఇంధన సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. 

* భారతీయ సంస్థలు ఆయిల్‌/ఇంధనం ఎగుమతి చేసే దేశాలకు రోడ్లు, ఎయిర్‌పోర్టులు, విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు లాంటి సేవలు అందించడం వల్ల విదేశీ మారకద్రవ్యం లభించింది.


మూడో కాలం: 6, 7 ప్రణాళికల్లో బీఓపీ సమస్య తీవ్రమైంది. 1990-91లో లోటు భారీగా పెరగడానికి కారణాలు- 

* 1990-91లో గల్ఫ్‌ సంక్షోభం బీఓపీ లోటును మరింత తీవ్రతరం చేసింది.

* అదృశ్య అంశాల్లో మిగులుకు బదులుగా లోటు కనిపించింది. 

* విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్‌ తగ్గాయి. ఫలితంగా వ్యాపార లోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగాయి.


సంస్కరణల తర్వాత బీఓపీ: 1991లో భారతదేశ విదేశీ చెల్లింపుల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దానిని పరిష్కరించడానికి కొత్త సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి దిగుమతులను సులభతరం చేశారు. ప్రత్యక్ష, పోర్టుఫోలియో పెట్టుబడులను ఆకర్షించడానికి అదృశ్య ఎగుమతులు పెంచి, నికర రాబడులను ధనాత్మకం చేశారు.

1993-94లో దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండటంతో బీఓపీ పరిస్థితి మెరుగుపడింది. విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 9వ ప్రణాళిక చివరి ఏడాది, 10వ ప్రణాళిక మొదటి సంవత్సరంలో కరెంటు ఖాతాలో మిగులు కనిపించింది. 12వ ప్రణాళిక మొదటి సంవత్సరం వ్యాపార లోటు 190 బిలియన్‌ డాలర్లు. నికర అదృశ్య అంశాల మిగులు 107 బిలియన్‌ డాలర్లు. ఫలితంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు 88 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది జీడీపీలో 4.8%. అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గడంతో, ముఖ్యంగా ముడిచమురు ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు ఇంకా తగ్గుతూ వచ్చింది. 12వ ప్రణాళిక రెండో ఏడాది నుంచి కరెంటు ఖాతా లోటు అభిలషణీయ పరిధిలోనే ఉంది. బంగారం దిగుమతులు తగ్గడం, అనుకూల వర్తక నిబంధనలే దీనికి కారణం. 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వర్తక ఖాతా లోటు వరుసగా 157.5, 102.2, 189.4, 265.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇదే కాలంలో కరెంట్‌ అకౌంట్‌ (-)25, (+)24, (-)38.7, (-)67. బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంటే 2020-21లో కరెంట్‌ ఖాతా మిగులులో ఉంది. 

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో అభివృద్ధి దిగుమతులు ఏవి?

1) ఉక్కు  2) సిమెంట్‌   3) ఎరువులు   4) పైవన్నీ

 

2. కిందివాటిలో సరికానిది?

1) మాధ్యమిక వస్తువుల ఉత్పత్తికి నిర్వహణ దిగుమతులు అవసరం.

2 మధ్యంతర వస్తువులను ద్రవ్యోల్బణం పెరగకుండా దిగుమతి చేయాలి.

3) మొదటి ప్రణాళికా కాలం నుంచి వర్తకపు ఖాతా లోటు ఉంది.

4) ద్రవ్యోల్బణం నివారణకు ఆహార ధాన్యాలు ఇతర వినియోగ వస్తువులను దిగుమతి చేయాలి.


3. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏ దేశం నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసింది?

1) అమెరికా     2) ఇంగ్లండ్‌   3) జపాన్‌   4) రష్యా


4. కిందివాటిలో బిమల్‌ జలాన్‌ వివరించని విదేశీ వ్యాపార దశ?

1) 1956-57 నుంచి 1975-76    

2) 1980-81 నుంచి 1990-91 

3) 1976-77 నుంచి 1979-80

4) 1960-61 నుంచి 1980-81


5. విదేశీ మారక ద్రవ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించడం ఎప్పుడు అరికట్టారు?

1) జాతీయ బ్యాంకులు ఏర్పడినప్పుడు     2) జాతీయ రాజకీయాలు మారినప్పుడు

3) జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు     4) జాతీయ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు


6. ఏ సంవత్సరంలో భారతదేశంలో విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది?

1) 1980    2) 1970    3) 1991   4) 1998


7. 1980 దశకం నుంచి ఏ రుణాలను ఎక్కువగా కరెంట్‌ ఖాతా లోటును భర్తీ చేయడానికి ఉపయోగించారు?

1) అంతర్గత వాణిజ్య రుణాలు  2) బహిర్గత వాణిజ్య రుణాలు

3) విదేశీ బ్యాంకు రుణాలు   4) స్వదేశీ బ్యాంకు రుణాలు


8. 2022లో అధికంగా రెమిటెన్సెస్‌ పొందిన దేశం?

1) భారత్‌   2) మెక్సికో   3) చైనా   4) పైవన్నీ


9. కిందివాటిలో విదేశీ పెట్టుబడుల్లో లేనివి?

1) ప్రత్యక్ష పెట్టుబడులు  2) పోర్టుఫోలియో పెట్టుబడులు

3) అంతర్గత పెట్టుబడులు   4) విదేశీ సంస్థాగత పెట్టుబడులు


10. ఎవరి సిఫార్సుపై 1992-93లో రూపాయికి పాక్షిక మార్పిడి కల్పించారు?

1) బిమల్‌ జలాన్‌     2) రంగరాజన్‌  

3) నరసింహన్‌   4) స్వామినాథన్‌

 

సమాధానాలు

14; 22; 32; 44; 53; 63; 72; 84; 93; 103.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 11-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌