• facebook
  • whatsapp
  • telegram

 భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - సహకార బ్యాంకులు

రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ (State Financial Corporation  - SFC)


* కేంద్ర ప్రభుత్వం 1951లో స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) చట్టాన్ని ఆమోదించింది.


* ఈ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌ఎఫ్‌సీలను ఏర్పాటు చేస్తాయి. 


* రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థల అధీకృత మూలధనం రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. మూలధనాన్ని వాటాలుగా నిర్ణయిస్తారు. 


* ఈ సంస్థల వాటాలను రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), షెడ్యూల్‌ బ్యాంకులు, ఇతర విత్తసహాయ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు కొనుగోలు చేస్తాయి.


* రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థల వాటాలకు హామీ ఇస్తాయి. 


* బాండ్లు, రుణపత్రాలు అమ్మడం ద్వారా కూడా ఎస్‌ఎఫ్‌సీలు తమ నిధులను పెంచుకోవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణ అవసరాలను తీర్చడం, పెట్టుబడి సాయం అందించడం వీటి లక్ష్యాలు.


రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు (State Industrial Development  Corporations - SIDCs)


* వీటిని మొదటిసారి 1960లో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు.


* రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నెలకొల్పాయి. 


* ఈ సంస్థ లక్ష్యాలు: పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయడం; మార్కెటింగ్‌ వసతులు, నూతన అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు మొదలైనవి.


పెట్టుబడి సంస్థలు


ఇవి 3 రకాలు. అవి:


1) యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఐ)


2) భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)


3) సాధారణ బీమా సంస్థ (జీఐసీ)


యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా


* దీన్ని 1964,  ఫిబ్రవరిలో యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్, 1963 ప్రకారం నెలకొల్పారు. 


* 1954లో షరాఫ్‌ కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. 


* 2003, ఫిబ్రవరి 1 నుంచి దీని పేరు యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌గా మారింది.


* ప్రధాన కార్యాలయం ముంబయి.


* దీని లక్ష్యాలు: మధ్యతరగతి కుటుంబాల నుంచి పొదుపు సేకరించడం, పారిశ్రామికీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి కల్పించడం.


* ఇది యూనిట్ల (ప్రజల) ద్వారా సేకరించిన మొత్తాన్ని పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల్లో పెట్టుబడిగా పెడుతుంది. వాటి ద్వారా వచ్చిన లాభాలను యూనిట్‌ కొనుగోలుదారులకు పంచుతుంది.


భారత జీవిత బీమా సంస్థ(Life Insurance Corporation of India - LIC)


మన దేశంలో జీవిత బీమా వ్యాపారంలో కొన్ని ముఖ్య ఘట్టాలు:


* 1818లో బ్రిటిష్‌ వారు ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని కలకత్తాలో నెలకొల్పారు.


* బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ కంపెనీ 1870లో మొదటి స్వదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీని ముంబయిలో ఏర్పాటు చేసింది.


* దేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని నియంత్రించేందుకు 1912లో భారతీయ జీవిత బీమా కంపెనీల చట్టాన్ని చేశారు. ఇది బీమా రంగంలో చేసిన మొదటి చట్టం.


* లైఫ్, నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారాల గణాంక సమాచారాన్ని ప్రభుత్వం సేకరించేందుకు వీలుగా 1928లో ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల చట్టం రూపొందింది.


* బీమా చేసే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో 1938లో బీమా చట్టం చేశారు.


* భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని 1956, సెప్టెంబరు 1న రూ. 5 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు.


* ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ఎల్‌ఐసీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ - సిద్ధార్థ్‌ మొహంతి.


* దీని నినాదం - ‘యోగక్షేమం వహామ్యహం’ (మీ సంక్షేమం మా బాధ్యత)


* దీని యజమాని - భారత ప్రభుత్వం. దీని పరిపాలన నియంత్రణను కేంద్ర ఆర్థికశాఖ చూస్తుంది. ఇందులో ప్రభుత్వం వాటా 96.5%


సాధారణ బీమా సంస్థ (General Insurance Coroporation - GIC)


* జీఐసీని 1956 కంపెనీ చట్టం ద్వారా నెలకొల్పారు. దీన్ని 1972, నవంబరు 22న స్థాపించారు. 


* ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ప్రస్తుత ఛైర్మన్‌ ఆండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ): దేవేశ్‌ శ్రీవాస్తవ.


* దీని యాజమాని: భారత ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ వాటా 85.78%.


ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ)


ఆర్‌ఎన్‌. మల్హోత్రా కమిటీ: బీమా రంగంలో పెట్టుబడులపై అధ్యయనం కోసం ప్రభుత్వం 1993లో ఒక కమిటీని నియమించింది. దీనికి రామ్‌నారాయణ్‌ మల్హోత్రా అధ్యక్షత వహించారు. 


* ఈ కమిటీ 1994లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 


* బీమా రంగంలోకి భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలను అనుమతించాలని, అవి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోవచ్చని ఈ కమిటీ తెలిపింది. 


* అయితే విదేశీ సంస్థల వాటాను 26 శాతానికి పరిమితం చేయాలని నివేదికలో పేర్కొంది. 


* ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు.


* 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఐఆర్‌డీఏ) భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


* దీని ప్రకారం 2000, ఏప్రిల్‌లో ఐఆర్‌డీఐ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.


ప్రత్యేక విత్త బ్యాంకులు


ఎగ్జిమ్‌ బ్యాంక్‌ (EXIM Bank)


* దీన్ని 1982, జనవరి 1న భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యాలయం ముంబయి. 


* ఇది ఎగుమతి, దిగుమతిదారులకు విత్తసహాయం అందిస్తుంది. 


* అంతర్జాతీయ వ్యాపారానికి విత్తసహాయం అందించే సంధానకర్తగా పనిచేస్తుంది.


జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (National Housing Bank - NHB)


* ఇది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ. దీన్ని 1988, జులై 9న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ. దీని యాజమాన్యం కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం.


* ప్రభుత్వం 2019లో నేషనల్‌ హౌసింగ్‌ యాక్ట్‌ 1987ను ఫైనాన్స్‌ యాక్ట్‌గా మార్చింది. 


* ఇది దేశంలోని గృహ నిర్మాణానికి విత్త సహాయం అందిస్తుంది. గృహనిర్మాణ విత్తాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, క్రమబద్ధీకరించడం, దేశంలో ఆరోగ్యకరమైన గృహనిర్మాణ విత్త వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని లక్ష్యాలు.


* ఇది బాండ్లు, డిబెంచర్ల ద్వారా తనకు అవసరమైన నిధులు సమీకరిస్తుంది. అంతేకాకుండా, ఆర్‌బీఐ నుంచి 18 నెలల కాల పరిమితికి స్వల్పకాలిక రుణాలు స్వీకరిస్తుంది. 


* ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నేషనల్‌ హౌసింగ్‌ క్రెడిట్‌ ఫండ్‌ నుంచి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటుంది. ఇది విదేశీ కరెన్సీలోనూ రుణాలను గ్రహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర విత్త సంస్థల నుంచి దీర్ఘకాలిక డిపాజిట్లు పొందుతుంది.


నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌


* దీని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 2021, మార్చి 22న లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. 2021, మార్చి 23న లోక్‌సభ, మార్చి 25న రాజ్యసభ దీన్ని ఆమోదించాయి. 


* ఇది ఒక కార్పొరేట్‌ సంస్థ. దీని అధీకృత మూలధనం రూ.లక్ష కోట్లు.


* వాటాదార్లు: కేంద్రప్రభుత్వం, బహుళార్థక సంస్థలు, సావరిన్‌ సంపద నిధులు, పింఛన్‌ నిధులు, బీమా సంస్థలు, విత్త సంస్థలు, బ్యాంకులు, కేంద్రప్రభుత్వం అనుమతించే ఇతర సంస్థలు.


* ఇందులో కేంద్రానికి 100% వాటా ఉంటుంది. క్రమంగా దీన్ని 26 శాతానికి తగ్గిస్తారు. 


* ఇది అవస్థాపన రంగంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది.


* దీని లక్ష్యాలు: కొత్తగా ప్రారంభించిన అవస్థాపన ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం, పాతవాటికి రీఫైనాన్స్‌ చేయడం; ప్రైవేట్‌ రంగం నుంచి అవస్థాపన రంగానికి పెట్టుబడులు ఆకర్షించడం.


భారతీయ అవస్థాపన విత్త సంస్థ (ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ - ఐఐఎఫ్‌సీఎల్‌) 


* దీన్ని 2006, జనవరి 6న ప్రారంభించారు. ఇది దీర్ఘకాలిక అవస్థాపన సౌకర్యాలకు విత్త సహాయం చేస్తుంది. రహదారులు, విద్యుత్, విమానాశ్రయాలు, ఓడరేవులు, పట్టణ అవస్థాపన ప్రాజెక్టులకు ఈ సంస్థ నిధులు ఇస్తుంది.


ముద్రా బ్యాంక్‌ (మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ బ్యాంక్‌) 


దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్‌ 8న ప్రవేశ పెట్టారు. ప్రధాన కార్యాలయం ముంబయి. 


భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI) కి ఇది అనుబంధ సంస్థ. ఇది సూక్ష్మ, చిన్న, మధ్య  తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. సూక్ష్మ, విత్త సంస్థలకు; బ్యాంకేతర విత్త సంస్థలకు తక్కువ వడ్డీకి రుణ సహాయం అందిస్తుంది.


* ఈ సంస్థ రుణ గ్రహీతలను ‘3’ రకాలుగా వర్గీకరించి రుణాలు అందిస్తుంది. అవి:


1) శిశు - వీరికి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తుంది.


2) కిశోర్‌ - వీరికి రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.


3) తరుణ్‌ - వీరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.


* మొత్తం రుణాల్లో శిశుకు 40 శాతం, కిశోర్‌కు 35 శాతం, తరుణ్‌కు 25 శాతం కేటాయించారు.


* రుణగ్రహీతలకు ముద్ర కార్డ్, ఒక రూపే డెబిట్‌ కార్డు ఇస్తారు. 


* చిన్నతయారీ సంస్థలు, దుకాణదార్లు, పండ్లు - కూరగాయల విక్రేతలు, చేతి వృత్తులవారికి ఈ సంస్థ రుణాలు ఇస్తుంది.


జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ - నాబార్డ్‌): 


* దీన్ని బి. శివరామన్‌ కమిటీ సూచనల మేరకు 1982, జులై 12న నెలకొల్పారు. ఇది నాబార్డ్‌ యాక్ట్‌-1981 ద్వారా ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి.


* దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలు అందించే విత్త సంస్థలకు పునర్విత్త (పరోక్ష) సహాయం అందించడం. 


* నాబార్డ్‌ ప్రస్తుత ఛైర్మన్‌ - వి. షాజీ కృష్ణన్‌ (2022, డిసెంబరు 7 నుంచి పదవిలో ఉన్నారు.) 


* ఇది కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలో ఉంటుంది. 
 

Posted Date : 20-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌