• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జెట్‌ (2023-24)

ఆఖరి వరకు అభివృద్ధి ఫలాలు!


  దేశ వార్షిక ఆర్థిక నివేదికే బడ్జెట్‌. రాబోయే ఏడాది పాటు ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనాలను అది వెల్లడిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూప, స్వభావాలను వివరిస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏడు ప్రాధాన్యాంశాలను కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. స్వతంత్ర భారతావని వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అవసరమైన ప్రణాళికలను రచించింది. సాధికారత, సార్వజనీనత, సుసంపన్నతలే పరమావధులుగా పటిష్ఠ పునాదులు వేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ, ఆహార భద్రతలకు పెద్ద పీట వేస్తూ, అభివృద్ధి ఫలాలు ఆఖరి వ్యక్తికీ చేరాలనే దృఢ సంకల్పాన్ని వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో. కేంద్రపద్దులోని ముఖ్యాంశాల నుంచి మొత్తం సారాంశం వరకు గణాంకాల సహితంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2023, ఫిబ్రవరి 1న డిజిటల్‌ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు (దేశంలో డిజిటల్‌ బడ్జెట్‌ను మొదటిసారిగా 2021, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు). వందేళ్ల స్వాతంత్య్ర భారతానికి మార్గం వేస్తూ దీర్ఘకాలిక లక్ష్యాలతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రకటించారు. దీన్ని మొదటి అమృత్‌కాల్‌ బడ్జెట్‌గా అభివర్ణించారు.


స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా అయిదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆరో కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. అంతకుముందు వరుసగా అయిదు, అంతకంటే ఎక్కువగా కేంద్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్, మొరార్జీ దేశాయ్‌ల వరుసలో ఆమె చేరారు. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ గుర్తింపు పొందారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన అనంతరం (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌ ఇది.


అమృత్‌కాల్‌-సప్తర్షి: సాధికారత, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలను అమృత్‌కాల్‌ విజన్‌ ప్రతిబింబిస్తుంది. అమృత్‌కాల్‌ లక్ష్య సాధనకు సప్తర్షి మార్గనిర్దేశం చేస్తుంది. ఇందు కోసం సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావాలి. బలమైన ప్రభుత్వ విత్తం, దృఢమైన ఆర్థిక రంగం తోడవ్వాలి. ఇది జన్‌ భాగీదారీ (ప్రజా భాగస్వామ్యం) ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇందుకు సబ్‌ కా సాథ్‌-సబ్‌ కా ప్రయాస్‌ (అందరి తోడు - అందరి ప్రయత్నం) అవస రమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విజన్‌ను సాధించడానికి ఆర్థిక ఎజెండా మూడు ప్రాధాన్యాలపై దృష్టి పెడుతోంది. 


1) యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి విస్తృత అవకాశాలు కల్పించడం. 


2) వృద్ధికి, ఉద్యోగ సృష్టికి బలమైన ప్రేరణ అందించడం. 


3) స్థూల, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం. 


భారతదేశంజీ100 నాటికి ఆ ప్రాధాన్యాలను సాధించే విధంగా కేంద్రం బడ్జెట్‌ నాలుగు పరివర్తన అవకాశాలను గుర్తించింది.


1) స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా ఆర్థిక సాధికారత: దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా గ్రామీణ మహిళలను 81 లక్షల స్వయం సహాయక బృందాలుగా సమీకరించారు. వీటి ద్వారా ఆర్థిక సాధికారత తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది.


2) ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పీఎం వికాస్‌): కేంద్ర ఆర్థికమంత్రి సంప్రదాయ కళాకారుల కోసం విశ్వకర్మ పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో మూడు అంశాలుంటాయి. 


ఎ) MSME ల ద్వారా వారి ఉత్పత్తుల నాణ్యత స్థాయి, మెరుగు అంశాల అభివృద్ధి. 


బి) ఆర్థిక సాయంతోపాటు ఆధునిక నైపుణ్య శిక్షణ, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం, డిజిటల్‌ చెల్లింపులు, సామాజిక భద్రత కల్పించడం. 


సి) షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఓబీసీలు, మహిళలు, బలహీనవర్గాల ప్రజలు మరిన్ని ప్రయోజనాలను పొందే విధంగా చేయడం.


3) మిషన్‌ మోడ్‌లో పర్యాటకానికి ప్రోత్సాహం: ఈ రంగంలో యువతకు ఉద్యోగాలు, వ్యవస్థాపకత కోసం భారీ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలతో పర్యాటకం ప్రచారాన్ని మిషన్‌ మోడ్‌లో చేపడతారు.


4) సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌: కేంద్ర బడ్జెట్‌ 2023-24 ముఖ్య ఉద్దేశం సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించడం. ‘సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌’ నినాదం ద్వారా ప్రభుత్వం అన్ని అంశాల్లో వృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతుంది. 




సప్తర్షి: వారణాసి విశ్వనాథుడి సన్నిధిలో వినిపించే సప్తర్షి పదాన్ని ఆర్థిక మంత్రి తన ప్రసంగానికి ఆలంబనగా చేసుకున్నారు. దీన్ని అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ అని ఆమె ప్రస్తావించారు. ఏడు అంశాలకు సప్తర్షి మార్గంగా నామకరణం చేశారు. అవి

1) సమ్మిళిత వృద్ధి

2) చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి

3) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు

4) సామర్థ్యాలను వెలికితీయడం

5) హరిత వృద్ధి  

6) యువశక్తి

7) ఆర్థిక రంగం బలోపేతం


1) సమ్మిళిత వృద్ధి:

* గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల తాగునీటి కనెక్షన్లను ఏర్పాటు చేస్తారు. 


* స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద 11.7 కోట్ల కుటుంబాలకు శౌచాలయాలు నిర్మిస్తారు.  


* పీఎం కిసాన్‌ పథకం కింద 11.4 కోట్ల రైతులకు రూ.2.2 లక్షల కోట్లు అందిస్తారు. 


* 44.6 కోట్ల మందికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద బీమా కవరేజీ కల్పిస్తారు. 


* 47.8 కోట్ల ప్రధానమంత్రి జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తారు.


* ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తారు. 


* 102 కోట్ల మంది ప్రజలకు 220 కోట్ల కొవిడ్‌ టీకాలు అందించారు. 


2) చివరి వ్యక్తికీ లబ్ధి: అన్నివర్గాల ప్రజలను కలిపి చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూర్చే విధంగా పనులు చేపడుతున్నారు. గిరిజనుల అభ్యున్నతి నుంచి మొదలుపెట్టి పురాతన శాసనాల డిజిటలైజేషన్‌ వరకు అన్నివర్గాలకు అభివృద్ధిని అందిస్తున్నారు. పురాతన శాసనాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు భారత్‌శ్రీ అనే వ్యవస్థను నెలకొల్పుతారు. ‘ప్రధానమంత్రి గరీభ్‌ కల్యాణ్‌ ఆవాస్‌ యోజన’ కింద ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తారు.


3) మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు: మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచే రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహాలను అందిస్తారు. దీంతో వృద్ధి రేటు పెరగడంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. మూలధన పెట్టుబడులను 33.4% పెంచి 10 లక్షల కోట్లకు చేర్చారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కొనసాగిస్తారు. రైల్వే రంగానికి రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. 100 రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయనున్నారు.


4) సామర్థ్యాల వెలికితీత: విద్యాసంస్థల్లో మూడు ప్రత్యేక కృత్రిమ మేధా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగరాల అభివృద్ధిలో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. 


* వివాద్‌ సే విశ్వాస్‌-1 కింద కొవిడ్‌ సమయంలో ప్రభావితమైన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సరళంగా కాంట్రాక్టులు అమలుచేస్తారు. 


* వివాద్‌ సే విశ్వాస్‌-2 కింద సులభమైన, ప్రామాణిక సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా కాంట్రాక్టు వివాదాలను పరిష్కరిస్తారు.


5) హరిత వృద్ధి: భారత ప్రభుత్వ బడ్జెట్‌లో హరిత వృద్ధికి పెద్దపీట వేశారు. 2070కి శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 


* గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,700 కోట్లు కేటాయించారు. ఈ మిషన్‌ కింద 2030 నాటికి ఏడాదికి 500 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. 


* కాలుష్యరహిత ఇంధన రంగం కోసం ఇంధన పరివర్తన శూన్య ఉద్గారాల లక్ష్యాల సాధన, ఇంధన భద్రత కోసం ఈ బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. 


* పీఎం ప్రణామ్‌ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలను అందిస్తారు. 


* తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకానికి మిష్టి పథకం ప్రారంభమైంది. చిత్తడి నేలల సమర్థ వినియోగానికి అమృత్‌ ధరోహర్‌ పథకం అమలు చేస్తారు. 


* రైతుల ద్వారా ప్రకృతి సేద్యం కోసం 10 వేల బయోఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయిస్తారు. 


* తడి, పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ‘గోబర్ధన్‌ పథకం’ కింద కొత్తగా 500 వ్యర్థం నుంచి అర్థం (ధనం) ప్లాంట్‌ల ఏర్పాటు చేస్తారు. 


6) యువశక్తికి ప్రోత్సాహం:

* ‘దేఖో అప్నా దేశ్‌’ లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఆయా రంగాల్లో నైపుణ్యాలు, వ్యాపార మెలకువలను సంయుక్తంగా పెంపొందిస్తారు.


* కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్‌ తదితర అంశాలతో కూడిన కొత్త కోర్సులు ప్రవేశపెడతారు. స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి 50 ప్రాంతాలను ఎంపికచేసి ప్యాకేజీగా అభివృద్ధి చేస్తారు. ఈ అంశంలో మూడు ప్రధాన పథకాలు ఉంటాయి. అవి 


1) ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 


2) డిజిటల్‌ స్కిల్‌ ఇండియా 


3) 47 లక్షల మందికి స్టైపెండ్‌.


7) ఆర్థిక రంగం బలోపేతం:

 * కేంద్రీకృత డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో కంపెనీల చట్టం కింద పాలనా వ్యవహారాలను వేగవంతం చేస్తారు. 


* ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకం ద్వారా తనఖా అవసరం లేకుండా రుణాలు ఇచ్చేందుకు అదనంగా రూ.2 లక్షల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తారు. 


* మహిళల కోసం రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల రూపాయల చొప్పున ఆదా చేసుకోవడానికి ‘మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర్‌’ పేరుతో చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని ప్రారôభిస్తారు. 


* వయోవృద్ధులు పొదుపు పథకాల్లో గరిష్ఠంగా డిపాజిట్‌ చేసే మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.



కేంద్ర రాబడులు - వ్యయాలు రూపాయి రాక

1) ఇతర అప్పులు - 34 పై 


2) జీఎస్టీ - 17 పై 


3) ఆదాయ పన్ను - 15 పై 


4) కార్పొరేట్‌ పన్ను - 15 పై 


5) కేంద్ర ఎక్సైజ్‌ పన్ను - 7 పై 


6) పన్నేతర రాబడి - 6 పై 


7) కస్టమ్స్‌ సుంకాలు - 4 పై 


8) రుణేతర మూలధన రాబడి - 2 పై 


రూపాయి పోక 


1) వడ్డీ చెల్లింపులు - 20 పై


2) పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటా - 18 పై 


3) ఆర్థిక సంఘం, ఇతర బదిలీలు - 9 పై 


4) కేంద్ర ప్రాయోజిత పథకాలు - 9 పై 


5) రక్షణ - 8 పై 


6) కేంద్ర పథకాలు - 17 పై


7) ఇతర వ్యయాలు - 8 పై


8) రాయితీలు - 7 పై


9) పింఛన్లు - 4 పై 


ధరలు తగ్గేవి


1) మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా లెన్స్‌లు 


2) టీవీ ప్యానెల్‌ పార్టులు 


3) లిథియం అయాన్‌ బ్యాటరీలు 


4) ఎలక్ట్రిక్‌ వాహనాలు


5) దేశీయంగా ఉత్పత్తి చేసే ఆహారం


6) వజ్రాల తయారీ వస్తువులు


ధరలు పెరిగేవి 


1) బంగారం, ప్లాటినంతో తయారు చేసే ఆభరణాలు


2) వెండి ఉత్పత్తులు


3) సిగరెట్లు, టైర్లు


4) దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ చిమ్నీలు


5) రాగి, తుక్కు


6) రబ్బరు



ప్రధాన పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు
 


ఎ) మూల పథకాలు 


1) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - రూ.60,000 కోట్లు 


2) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం - రూ.9,636 కోట్లు 


3) మైనారిటీల అభివృద్ధి గొడుగు కార్యక్రమం - రూ.610 కోట్లు 


4) ఇతర బలహీన వర్గాల అభివృద్ధి కార్యక్రమం - రూ.2,194 కోట్లు 


5) షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి - రూ.4,295 కోట్లు 


6) షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి - రూ.9,409 కోట్లు 


బి) కోర్‌ పథకాలు

 

1) ఆయుష్మాన్‌ భారత్‌ - రూ.7,200 కోట్లు 


2) నీలి విప్లవం - రూ.2,025 కోట్లు 


3) సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి - రూ.600 కోట్లు 


4) పర్యావరణం అటవీ, వన్యప్రాణులు - రూ.759 కోట్లు 


5) హరిత విప్లవం - రూ.2,025 కోట్లు


6) జలజీవన్‌ మిషన్‌ - రూ.70,000 కోట్లు 


7) జాతీయ విద్యామిషన్‌ - రూ.38,953 కోట్లు 


8) జాతీయ ఆరోగ్యమిషన్‌ - రూ.36,785 కోట్లు 


9) జాతీయ జీవనోపాధి మిషన్‌ - రూ.14,129 కోట్లు 


10) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - రూ.79,590 కోట్లు 


11) ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన - రూ.19,000 కోట్లు 


12) ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన - రూ.10,787 కోట్లు 


13) శాస్త్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ - రూ.895 కోట్లు 


14) స్వచ్ఛ భారత్‌ మిషన్‌ - రూ.5000 కోట్లు


15) స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) - రూ.7,192 కోట్లు 


16) అమృత్‌ పథకం - రూ.16,000 కోట్లు 


17) ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ - రూ.11,600 కోట్లు 


18) రాష్ట్ర కృషి వికాస్‌ యోజన - రూ.7,150 కోట్లు 


19) నదుల అనుసంధానం - రూ.3500 కోట్లు 


సి) ప్రధాన కేంద్ర రంగ పథకాలు 


1) సంక్షేమ పథకాలకు - రూ.800 కోట్లు 


2) ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి - రూ.60,000 కోట్లు 


3) పంటల బీమా - రూ.13,625 కోట్లు 


4) ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ - రూ.5,943 కోట్లు 


5) ఖేలో ఇండియా - రూ.1,000 కోట్లు 


6) జాతీయ గిరిజన సంక్షేమ కార్యక్రమం - రూ.655 కోట్లు 


7) ఎంపీ లాడ్స్‌  - రూ.3,959 కోట్లు 


8) బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి - రూ.1,345 కోట్లు 


9) ఖాదీ గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజన - రూ.917 కోట్లు 


10) ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం - రూ.2,700 కోట్లు 


11) ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన - రూ.2,273 కోట్లు


12) జాతీయ గంగా ప్రణాళిక - రూ.4,000 కోట్లు 


13) అటల్‌ భుజల్‌ యోజన - రూ.1,000 కోట్లు 


14) జాతీయ ఆహార భద్రత చట్టం - రూ.1,37,207 కోట్లు 


15) పోస్టల్‌ ఆపరేషన్‌ - రూ.1,144 కోట్లు 


16) మిషన్‌ వాత్సల్య - రూ.1,472 కోట్లు 


17) కృషి ఉన్నతి యోజన - రూ.7,066 కోట్లు 



(బడ్జెట్‌ సమగ్ర స్వరూపం అంకెలు, రూపాయలు, కోట్లలో)
 


1) రెవెన్యూ వసూళ్లు - రూ.26,32,281 కోట్లు


పన్ను ఆదాయం - రూ.23,30,631 కోట్లు  


పన్నేతర ఆదాయం - రూ.3,01,650 కోట్లు 



2) మూలధన వసూళ్లు - రూ.18,70,816 కోట్లు 
 


రుణాలు తిరిగి వసూళ్లు - రూ.23,000 కోట్లు


ఇతర వసూళ్లు - రూ.61,000 కోట్లు 


రుణాలు, ఇతరాలు - రూ.17,86,816 కోట్లు 

3. మొత్తం వసూళ్లు (1+2) - రూ.45,03,097 కోట్లు  


4. రెవెన్యూ ఖాతా - రూ.35,02,136 కోట్లు 


5. మూలధన ఖాతా - రూ.10,00,961 కోట్లు 


6. వడ్డీ చెల్లింపులు - రూ.10,79,971 కోట్లు


7. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు - రూ.3,69,988 కోట్లు 


8. మూలధన వ్యయం (5+7) - రూ.13,70,949 కోట్లు 


9. రెవెన్యూలోటు (4-1) - రూ.8,69,855 కోట్లు (2.9%)


10. నికర రెవెన్యూ లోటు (9-7) - రూ.4,99,867 కోట్లు (1.7%)


11. ద్రవ్యలోటు (మొత్తం వ్యయం - (రెవెన్యూ వసూళ్లు + రుణాలు తిరిగి వసూళ్లు + ఇతర వసూళ్లు)


45,03,097 - (26,32,281 + 23,000 + 61,000) = రూ.17,86,816 కోట్లు (5.9%)


12. ప్రాథమిక లోటు = ద్రవ్యలోటు - వడ్డీ చెల్లింపులు 


= 17,86,816 - 1,07,997 = రూ.7,06,845 కోట్లు (2.3%) 


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 30-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌