• facebook
  • whatsapp
  • telegram

    ఆర్థిక సంఘం

విత్త వనరుల విశిష్ట విభజన!


సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం అత్యంత కీలకం. అధికారాలు, విధులతో పాటు ఆర్థిక వనరుల పంపిణీ ఆచరణాత్మకంగా, అభిలషణీయంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ విశిష్ట బాధ్యతల నిర్వహణ కోసం ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్థిక సంఘం. ప్రభుత్వాల ఆర్థిక స్థితిని అంచనా వేయడం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను సిఫార్సు చేయడం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని నిర్ణయించే సూత్రాలను రూపొందించడం దీని విధి. ప్రభుత్వాలు చేసే ఖర్చులో నాణ్యతను పెంచడంతో పాటు ఆర్థిక స్థిరత్వం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు ఆర్థిక సంఘాలు చేసిన సూచనలు, వాటి అమలుతీరు, కాలానుగుణంగా మారుతున్న ప్రాధాన్యాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ బాధ్యతను ఆర్థిక సంఘం నిర్వహిస్తుంది. ఇది ప్రణాళికేతర విత్తవనరుల బదిలీని సూచిస్తుంది.

విధులు:

1) పన్నుల ద్వారా సమకూరిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, అందులో రాష్ట్రాల వాటా నిర్ణయించడం.

2) సంఘటిత నిధి నుంచి గ్రాంట్ల బదిలీకి అనుసరించాల్సిన నియమాలను సూచించడం.

3) రాష్ట్రపతి సూచించిన ఇతర ఆర్థిక అంశాలపై విశ్లేషణ.


మన దేశంలో పన్ను వనరులు కేంద్రానికి ఎక్కువగా, రాష్ట్రాలకు తక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో వనరుల బదిలీ జరగాలని రాజ్యాంగంలోని 275వ అధికరణ నిర్దేశిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కూడా నిర్దిష్ట సహాయం అందుతుంది. ఆర్థిక సంఘం సలహా ప్రకారమే ఈ బదిలీలు జరుగుతాయి. అలాగే 282వ అధికరణ ప్రకారం ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలకు తన విచక్షణపై గ్రాంట్లు ఇవ్వవచ్చు. ఇందులో గ్రాంట్ల పరిమాణాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది.


* రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు తీసుకోవచ్చు. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వనరులు 3 విధాలుగా బదిలీ అవుతాయి. అవి

1) పన్నులు, సుంకాల్లో వాటా

2) గ్రాంట్లు

3) రుణాలు.

ఆర్థిక సంఘం ద్వారా వనరుల బదిలీ (1951-2000): కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధులు బదిలీ చేసేటప్పుడు దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వనరుల బదిలీ ప్రాతిపదికలను కూడా మారుస్తుంటారు.


1) ఆదాయపన్ను, ఎక్సైజ్‌ సుంకం: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఆదాయ పన్నులో 55 శాతం పంచాలని నిర్ణయించగా, పదో ఆర్థిక సంఘం 77.5% ఇవ్వాలని సూచించింది. మొదటి విత్త సంఘం కేంద్ర ఎక్సైజ్‌ సుంకాల్లో రాష్ట్రాలకు 40% సూచిస్తే, పదో విత్త సంఘం 47.5% వాటాను ప్రతిపాదించింది.

2) అదనపు ఎక్సైజ్‌ సుంకం: 1956లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)తో కుదిరిన ఒప్పందం ప్రకారం మిల్లులో తయారైన నూలు, పొగాకు, పంచదారపై అమ్మకం పన్ను స్థానంలో అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం విధిస్తుంది. ఈ ఆదాయం ఆ రాష్ట్రాల్లో వినియోగం మేరకు బదిలీ అవుతుంది.


3) ఎస్టేట్‌ సుంకం: ఈ పన్ను రాబడిని కూడా కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. (1985లో ఈ సుంకం రద్దయ్యింది.)


4) రాష్ట్రాలకు గ్రాంట్లు: మొదటి ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్లు అందించేటప్పుడు బడ్జెట్‌ అవసరాలు, పన్ను ప్రయత్నాలు, రాష్ట్రాల వ్యయం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. తొమ్మిదో విత్త సంఘం బడ్జెట్‌ అంతరాలను భర్తీ చేయడానికి గ్రాంట్లు ఇచ్చే బదులు కోశ అవసరాలను బట్టి గ్రాంట్లు ఇవ్వాలని సూచించింది.


5) రాష్ట్రాలకు రుణాలు: రెండో విత్త సంఘం మార్కెట్‌ వడ్డీ రేటుకే కేంద్రం రాష్ట్రాలకు రుణం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆరో విత్త సంఘం రుణ చెల్లింపు కాలాన్ని 20 నుంచి 30 ఏళ్ల వరకు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. పదమూడో విత్తసంఘం రెవెన్యూ లోటు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల జాతీయోత్పత్తిలో 68 శాతం మించకూడదని సిఫార్సు చేసింది.


6) విపత్తు నిధి: జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఎనిమిదో ఆర్థిక సంఘం వరకు రాష్ట్రానికి కొంత సహాయం చేసేవారు. దీనినే మార్జిన్‌ మనీ స్కీమ్‌ అంటారు. తొమ్మిదో విత్త సంఘం విపత్తు నిధిని ప్రతి రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కేంద్రం, రాష్ట్రాలు 75 : 25 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. పదో విత్త సంఘం దీన్ని కొనసాగించడమే కాకుండా కేంద్రానికి సెంట్రల్‌ ఫండ్‌ని సిఫార్సు చేసింది. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పదకొండో విత్త సంఘం జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సిఫార్సు చేసింది.


7) స్థానిక సంస్థలు: 1993లో తీసుకొచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణలు పంచాయతీలు, మున్సిపాలిటీ, స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి అవకాశం కల్పించాయి. స్థానిక సంస్థలకు నిధులు అందించాలని పదకొండో ఆర్థిక సంఘం మొదటిసారిగా సిఫార్సు చేసింది.

 

8) రుణ ఉపశమనం: రాష్ట్రాలు రుణాల కోసం కేంద్రంపై ఆధారపడటం తగ్గించాలని, నేరుగా మార్కెట్‌ నుంచే సేకరించుకోవాలని పన్నెండో విత్త సంఘం సిఫార్సు చేసింది.


14వ ఆర్థిక సంఘం (2015-20):  డాక్టర్‌ వై.వి.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. పన్నులు, గ్రాంట్లను రాష్ట్రాలకు బదిలీ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కలతోపాటు 1971 తర్వాత వచ్చిన జనాభా మార్పులనూ పరిగణనలోకి తీసుకుంది.


1) కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా: కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాని 32% నుంచి 42%కు పెంచింది.


2) రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి కొత్త సూత్రాన్ని సూచించింది.

గమనిక: 13వ ఆర్థిక సంఘం కోశ నిర్వహణను పరిగణించగా, 14వ ఆర్థిక సంఘం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.


* 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి అధిక పన్నుల వాటా బదిలీ అయిన రాష్ట్రాలు

1) ఉత్తర్‌ప్రదేశ్‌

2) బిహార్‌.

తక్కువ పన్నుల వాటా పొందిన రాష్ట్రాలు

1) సిక్కిం

2) గోవా.


3) గ్రాంట్లు: రెవెన్యూ లోటు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలకు గ్రాంట్లను సిఫార్సు చేసింది.


4) జీఎస్టీ: 14వ విత్త సంఘం జీఎస్టీపై సూచనలు చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100 శాతం, 4వ సంవత్సరం 75 శాతం, 5వ సంవత్సరానికి 50 శాతం కేంద్రం భరించాలి.


5) కేంద్ర ప్రాయోజిత పథకాలు: కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసినప్పటికీ పథకాల ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలనే బదిలీ చేశారు.

15వ ఆర్థిక సంఘం (2020-25):  రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017, నవంబరు 17న ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 2020-25 కాలానికి వర్తించే విధంగా ఈ కమిటీ 2019, అక్టోబరులో సిఫార్సులు అందించాల్సి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పలు కీలక పరిణామాలు సంభవించాయి.. అవి

1) జమ్ము-కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం (2019)

2) ప్రపంచ ఆర్థిక వృద్ధిలో తగ్గుదల (3 శాతం)

3) కార్పొరేట్‌ పన్ను రాబడి 19 శాతం తగ్గుదల

4) నిర్మాణాత్మక సంస్కరణలు.


ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ విత్త సంఘం రెండు నివేదికలను సమర్పించాల్సి వచ్చింది. 2020 -21 సంవత్సరానికి మధ్యంతర సిఫార్సులతో తొలి నివేదికను 2020, ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందు ఉంచింది. తుది నివేదికను 2020, నవంబరులో రాష్ట్రపతికి సమర్పించారు. తర్వాత 2021 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందు ఉంచారు. ఈ సిఫార్సులు 2021-22 నుంచి 2025-26 కాలానికి వర్తిస్తాయి.

2015-16లో కోశ విధానపరంగా పలు మార్పులు జరిగాయి.


1) ప్రణాళికా సంఘం రద్దు.


2) ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు రద్దు.


3) జీఎస్టీని ప్రవేశపెట్టడం.


4) రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా బదిలీ.


5) పన్ను జీడీపీ నిష్పత్తి 10.2 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.


6) జీడీపీ రక్షణ వ్యయం 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.


7) రాష్ట్రాల్లో కోశ లోటు 1.9 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది.


8) స్థూల పన్ను రాబడుల్లో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా 2018-19 నాటికి 19.9% పెరిగింది.

 

రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ప్రాతిపదిక


        


గమనిక: ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని దేశంలో అత్యధిక జీఎస్‌డీపీ ఉన్న రాష్ట్రంతో పోల్చడం ద్వారా ఆదాయ దూరాన్ని నిర్ణయిస్తారు.


* 15వ ఆర్థిక సంఘం ప్రకారం అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (17.939%), బిహార్‌ (10.058%), మధ్యప్రదేశ్‌ (7.850%), పశ్చిమ బెంగాల్‌ (7.523%), మహారాష్ట్ర (6.317%)


* తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు గోవా (0.386%), సిక్కిం (0.388%)


* తెలుగు రాష్ట్రాల వాటా: ఆంధ్రప్రదేశ్‌ (4.047%), తెలంగాణ (2.102%).


*15వ ఆర్థిక సంఘం 1. ఛైర్మన్‌: ఎన్‌.కె. సింగ్‌ - మాజీ ప్రభుత్వ కార్యదర్శి

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌