• facebook
  • whatsapp
  • telegram

1956 నాటి తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితులు

ఉన్నతస్థితిలో హైదరాబాద్
ఆంధ్ర రాష్ట్రంలో విలీనానికి ముందే తెలంగాణ ఆర్థిక పరిపుష్టిని పొందిన ప్రాంతం. 1956 నాటికే అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది. హైదరాబాద్ అప్పటికే ఉన్నతస్థితిలో ఉండేది. తెలంగాణ కీర్తిని చాటిచెప్పే రీతిలో పారిశ్రామిక ప్రగతి ఉంది. మెరుగైనరీతిలో రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థలు, ఆసుపత్రులు, విద్యాలయాలతో విలసిల్లిన ప్రాంతమిది.. అభివృద్ధిలో 1956 నాటికి తెలంగాణ సాధించిన ఖ్యాతిని తెలుసుకుందాం..

మొగలుల కాలంలో దక్కన్ సుబాకు 1713లో గవర్నర్‌గా వచ్చిన మీర్ కమురుద్దీన్ (అసఫ్‌జా - నిజాం ఉల్‌ముల్క్) 1724లో స్వతంత్రంగా హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. 1948, సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమయ్యేంత వరకూ నిజాం రాజుల పరిపాలనలో హైదరాబాద్ రాజ్యం ఉండేది. బ్రిటిష్‌వారికి అంగీకరించిన మొత్తంతోపాటు రుణాలను కూడా ఇవ్వగలిగే ఆర్థికపుష్టి హైదరాబాద్ రాజ్యానిది. 1948-49లో జె.ఎన్.చౌదరీ ఆధ్వర్యంలో మిలటరీ ప్రభుత్వం.. 1949 నుంచి 1952 వరకు ఎమ్.కె.వెల్లోడి గవర్నర్‌గా పౌర ప్రభుత్వం.. 1952 నుంచి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం (1956 నవంబరు 1) వరకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ప్రభుత్వాలు తెలంగాణను పరిపాలించాయి. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే నాటికే ఆర్థిక మిగులు ఉన్న సంపన్న ప్రాంతం తెలంగాణ. 1956కు పూర్వం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ద్రవ్యపరమైన విషయాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతం. అయితే భూస్వామ్య వ్యవస్థలోని లోపాలవల్ల గ్రామీణ ప్రజల స్థితిగతులు ఇందుకు మినహాయింపు.

హైదరాబాద్ రాష్ట్ర వైశాల్యం 82,698 చదరపు మైళ్లు. ఇందులో తెలంగాణ భూభాగం 50 శాతం.. మరట్వాడా ప్రాంతం 28 శాతం, కన్నడ ప్రాంతం 22 శాతం. మొత్తం ప్రాంతాన్ని 4 డివిజన్‌లు (ఔరంగాబాద్, మెదక్, వరంగల్, గుల్బర్గా)గా విభజించారు. ఈ డివిజన్లను తిరిగి 16 జిల్లాలు (ఆదిలాబాద్, ఔరంగాబాద్, భీర్, బీదర్, గుల్బర్గా, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాందేడ్, నిజామాబాద్, ఉస్మానాబాద్, పర్బనీ, రాయచూర్, వరంగల్, మెదక్, నల్గొండ)గా విభజించి పరిపాలించారు. ఒక్కో జిల్లాను 2 లేదా 3 తాలూకాలుగా; తాలుకాలను గ్రామాలుగా విభజించారు. అప్పట్లో సుమారు 23,360 గ్రామాలుండేవి. డివిజన్ అధిపతిగా సుబేదార్, జిల్లా అధిపతిగా తాలుక్దార్ వ్యవహరించేవారు. తాలుకాకు తహసీల్దార్ అధికారి కాగా ప్రతి గ్రామంలో కరణం, పటేల్ లాంటి అధికారులతో పరిపాలన కొనసాగింది.

హైదరాబాద్ రాజ్యంలో 1951 లెక్కల ప్రకారం తెలుగుభాషను 90 లక్షలు (50%), మరాఠీని 45 లక్షలు (25%), కన్నడను 20 లక్షలు (11%), ఉర్దూను 21 లక్షల (12%) మంది ప్రజలు మాట్లాడేవారు. అతి తక్కువగా అరబ్బీ, పార్సీ, గిరిజన భాషలు కూడా మాట్లాడేవారు. మొత్తం జనాభాలో 82 శాతం హిందువులు కాగా 12 శాతం ముస్లింలు, 6 శాతం ఇతరులు ఉండేవారు.

వ్యవసాయ రంగం
హైదరాబాద్ రాజ్యంలో ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. 85 శాతం మంది వర్షాధారిత వ్యవసాయంపై జీవించేవారు. వర్షాల నుంచి వచ్చిన నీటిని ఒడిసి పట్టి సాగుకు ఉపకరించే చెరువుల చుట్టూ అల్లుకున్న స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ నాటిది. (వివరాలు పట్టిక-1లో)

నీటిపారుదల ప్రగతి
తెలంగాణ వ్యాప్తంగా 5,119 పెద్ద చెరువులు, 15,000 చిన్న చెరువులు ఉండేవి. పాకాల, రామప్ప, లక్నవరం, హుస్సేన్‌సాగర్, మీర్ఆలం లాంటి పెద్ద సరస్సులు సాగునీటిని అందించే జీవధారలుగా ఉండేవి. జీవనదులున్నప్పటికీ కాలువల ద్వారా సాగు తక్కువ పరిమాణంలో ఉండేది. మూసీనదిపై ఆనకట్టలను నిర్మించి, కాలువల ద్వారా నీటి పారుదలను అభివృద్ధి చేసి కరవు బారిన పడే జిల్లాలకు నీరిచ్చారు. పోచారం(1939); మహబూబ్‌నహర్(1924); ఫతేనహర్(1927); మెదక్‌లో హల్దివాగు, డిండి(1943); పెండ్లిపాకాల-నల్గొండ (1939); పాలేరు, వైరా(ఖమ్మం), కోయల్ సాగర్ (1955); సరళాసాగర్ - (మహబూబ్‌నగర్-1956)లను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలను పెంచారు.


ప్రాజెక్టులు
హైదరాబాద్ భారత యూనియన్‌లో కలిసిన తర్వాత గోదావరిపై 'కడెం ప్రాజెక్ట్‌'ను నెహ్రూ ప్రారంభించారు. 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 55,000 కిలోవాట్ల విద్యుదుత్పాదన లక్ష్యాలుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. తుంగభద్ర ప్రాజెక్టును మైసూరు-హైదరాబాద్ రాష్ట్రాల సంయుక్త వ్యయంతో నిర్మించారు. దీనిద్వారా 6.25 లక్షల ఎకరాల భూమి సాగులోకి రాగా, 37,000 కిలోవాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు నిజాంసాగర్ ద్వారా 2.75 లక్షల ఎకరాల భూమి సాగులోకి, 1,45,000 కి.వా. విద్యుదుత్పత్తి లక్ష్యాలు.


అటవీ ప్రాంతం
మొత్తం 68.99 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం ఉండేది. అత్యంత విలువైన కలప, వంట చెరకు, వెదురు, గడ్డి, ఆకులులాంటి వాటి ద్వారా ఆ కాలంలోనే రూ.15 లక్షల ఆదాయం సమకూరేది.


పంటలకు ప్రోత్సాహం
1929లో ప్రభుత్వ వ్యవసాయ శాఖను స్థాపించడం ద్వారా చెరకు, పత్తి పంటలకు ప్రోత్సాహాన్ని అందించారు. మంచి విత్తనాలను సరఫరా చేశారు. అంతేకాకుండా 'అంజుమన్' పేరుతో సహకార సంఘాల స్థాపన 1913లోనే ప్రారంభమైంది. 1946 నాటికి 23,360 గ్రామాల్లో 10,620 సంఘాలు స్థాపించగా వాటిలో 4 లక్షల మంది సభ్యులుండేవారు. 1946 నాటికి రాష్ట్ర కేంద్ర బ్యాంకు వద్ద రూ.93 లక్షల నిల్వ ఉంది.

 

భూ వర్గీకరణ
భూ సంబంధాలకు సంబంధించి మధ్యయుగపు ఫ్యూడల్ విధానం దాదాపుగా కొనసాగిందని చెప్పవచ్చు. నిజాం ప్రభువు మొత్తం భూమికి సర్వాధికారి. భూమిని 2 రకాలుగా వర్గీకరించారు.
1. ఖల్సాభూమి(దివానీ): నిజాం ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూమి. ఇది 3 కోట్ల ఎకరాలు. మొత్తం భూమిలో సుమారు 60 శాతం.
2. గైర్ ఖల్సాభూమి: దీనిలో సర్ఫేఖాస్ (నిజాం సొంత భూమి) మొత్తం భూమిలో 10 శాతం ఉండేది. పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, బంజరుదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారీకులు అనే పేర్లతో ఫ్యూడల్ భూస్వాముల చేతిలో 1.5 కోట్ల ఎకరాలు ఉండేది (ఇది మొత్తం భూమిలో 30 శాతం).


ఖల్సా భూమి(దివానీ)లో ప్రభుత్వ భూమిశిస్తు విధానం అమల్లో ఉండేది. శిస్తు ప్రభుత్వానికి జమయ్యేది. భూమిశిస్తుగా ఎకరాకు 150 రూపాయలు లేదా 8-11 ధాన్యపు బస్తాలు వసూలు చేసేవారు. గైర్ ఖల్సా భూమిలో భూమిశిస్తు ఖల్సాభూమిలో కంటే 25 నుంచి 50 శాతం అధికంగా ఉండేది. గైర్ ఖల్సా భూమిలో యజమానులుగా ఉన్న భూస్వాములకు పన్నులు వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. కొందరు భూస్వాములు పన్నుల వల్ల వచ్చిన ఆదాయంలో స్వల్పభాగం ప్రభుత్వానికి చెల్లించేవారు. మరికొందరు చెల్లించనవసరమే లేనివారు ఉండేవారు. ఈ ప్రాంతాల్లో వివిధ రకాల అక్రమ వసూళ్లు, వెట్టిచాకిరీ సర్వసాధారణం.

పోలీసు చర్య(1948) అనంతరం, మిలటరీ ప్రభుత్వ కాలంలో సర్ఫేఖాస్ భూమి (8000 చదరపు మైళ్లు, రూ.3 కోట్ల ఆదాయం ఉన్నది)ని ప్రభుత్వ భూమిలో విలీనం చేశారు. జాగీర్లను రద్దుచేసి, రైతులకు యాజమాన్య హక్కులు, కౌలుదారీ సంస్కరణలు ప్రవేశపెడుతూ హైదరాబాద్ కౌలు, వ్యవసాయభూమి చట్టం-1950ను తీసుకొచ్చారు. భూమిశిస్తు తగ్గింపు ద్వారా 17 లక్షల రూపాయల భారాన్ని రైతుల నుంచి తప్పించారు. సుమారు 50 లక్షల రూపాయల తక్కావి రుణాలను మంజూరు చేశారు.

పేదలకు యాజమాన్య హక్కులు
తెలంగాణ సాయుధ పోరాటం(1946-51)లో సుమారు 4 వేల మంది ప్రాణాలర్పించారు. ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమిపై పేదలు యాజమాన్య హక్కులను పొందారు. ఆచార్య వినోబాభావే 1948లో పోచంపల్లి (నల్గొండ)లో ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా తెలంగాణాలో దానంగా సేకరించిన 1,95,509.69 ఎకరాల్లో 1,12,600.68 ఎకరాలను 42,199 మంది భూమి లేని పేదలకు పంచారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన రక్షిత కౌలుదారీ చట్టం (38ఈ) ప్రకారం 1951లో భూమిని సాగు చేసుకునే వారంతా తెలంగాణ ప్రాంతంలో యాజమాన్యపు హక్కుదారులుగా గుర్తింపు పొందారు. కొమురం భీం లాంటి గిరిజన నాయకుల ఉద్యమాల ఫలితంగా గిరిజనుల రక్షణ కోసం 1946లో ట్రైబల్ రెగ్యులేషన్ చట్టం చేశారు.


పారిశ్రామిక స్థితిగతులు
పారిశ్రామికీకరణను అడ్డుకునే బ్రిటిష్ పాలన హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల ఈ రాజ్యం పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగింది. పారిశ్రామికవేత్తలకు చేయూతగా 1929లోనే 'ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్‌'ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిద్వారా పెట్టుబడిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసింది. తద్వారా ఆజంజాహి మిల్స్, ఉస్మానియా కెమికల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ప్రాగాటూల్స్, సిర్‌పూర్ పేపర్ మిల్స్, సింగరేణి కాలరీస్, తాజ్‌గ్లాస్ పరిశ్రమ, హైదరాబాద్ ఆస్‌బెస్టాస్ లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి 'సెంట్రల్ ల్యాబోరేటరీస్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్' అనే సంస్థను ఏర్పాటు చేసింది. (పరిశ్రమలు-కార్మికుల వివరాలు పట్టిక-2లో)

పట్టిక-3లోని పరిశ్రమలే కాకుండా సబ్బు పరిశ్రమలు(2), ముద్రణాలయాలు(40), సిగరెట్ పరిశ్రమలు(4), గాజు పరిశ్రమలు(2), మందుల సంస్థలు(9) ఉండేవి. 1921లో 200 పరిశ్రమలుండగా, 1941 నాటికి సుమారు 500కు పైగా పెరిగాయి. అందులో 28,000 మంది కార్మికులు పనిచేసేవారు. వారి వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. 80 శాతం కార్మికుల వేతనం రూ.15 కంటే తక్కువ. 
వ్యవసాయ పనులు లేని సమయం (3-4 నెలల కాలం)లో ఉపాధిని ఇచ్చేవి కుటీర పరిశ్రమలే. దేశంలో చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత రెండో ముఖ్యమైన వృత్తి. అప్పట్లో సుమారు 89,800 చేనేత మగ్గాలు ఉండేవి. రంగుల సిల్కు చీరలు, తివాచీలు, జేబు రుమాళ్లు, తువ్వాళ్లు, శాలువాలు, కంబళ్లు తయారయ్యేవి. చేనేతతోపాటు జంఖానాలు, బొమ్మల తయారీ; వడ్రంగం, రంగులు వేయడం, చేతికుట్టుపని, వంటపాత్రల తయారీ (కమ్మరం, కుమ్మరం), ఇతర కుటీర పరిశ్రమలు (పట్టిక-4 చూడండి) ఉండేవి.

ఉద్యోగులు
పాలకుడు(నిజాం), పాలకవర్గం మొత్తం ముస్లింలే కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ముస్లింలు పనిచేసేవారు. వీరిలో అత్యధిక సంఖ్యాకుల జీతం రూ.12-13 మధ్య ఉండేది. 1948, సెప్టెంబరు 1 నాటికి హైదరాబాద్ సైన్యం 17,870. తర్వాత కాలంలో దీన్ని 10,415కు తగ్గించారు.


వైద్య రంగం
1911-12లో 91 ప్రభుత్వ వైద్యశాలలుండగా, 1953-54 నాటికి మొత్తం సంస్థానంలో 185 వైద్యశాలలున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వీటి సంఖ్య 30. మొత్తం 490 మంది వైద్యులు ఉండగా, 248 మంది వైద్యులు హైదరాబాద్ నగరంలో విధులు నిర్వహించేవారు. ఉస్మానియా, అఫ్జల్‌గంజ్ ఆసుపత్రులు; విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి ప్రముఖ వైద్యశాలలు. ఉస్మానియా వైద్య కళాశాల, యునానీ వైద్య పాఠశాలలు ఉండేవి.


అక్షరాస్యత
హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువమంది నిరక్షరాస్యులే. 1953 నాటికి 10,01,984 మంది మాత్రమే అక్షరాస్యులు. అంటే ప్రతి 1000 మందికి 95 మంది మాత్రమే అక్షరాస్యులు. ఇది 1911లో 1000కి 28 మాత్రమే.


విద్యారంగం
విద్యాలయాల్లో ఉర్దూ మాత్రమే బోధన మాధ్యమంగా ఉండేది. మిలటరీ ప్రభుత్వ హయాం (1948-52)లో 7 సంవత్సరాల ప్రణాళిక కింద 8000 ప్రాథమిక పాఠశాలలను 9 లక్షల రూపాయలతో నిర్మించారు. 10 సంవత్సరాల ప్రణాళిక కింద 8.5 లక్షల రూపాయల వ్యయంతో శిక్షణ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1949 జూన్ నుంచి మాధ్యమిక తరగతుల్లో మాతృభాషలో బోధనకు ఆదేశించారు.


రవాణా సౌకర్యాలు
1953-54 నాటికి హైదరాబాద్ సంస్థానంలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్) ఆధ్వర్యంలో 858 మైళ్ల రైల్వే లైన్లు (వాటిలో 528 మైళ్ల బ్రాడ్‌గేజ్, 330 మైళ్ల మీటర్ గేజ్) ప్రయాణికుల అవసరాలు తీర్చేవి. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట ప్రముఖ రైల్వే కేంద్రాలు.
4,158 మైళ్ల రహదారి మార్గాలు అందుబాటులో ఉండేవి. వివిధ ప్రయాణ సాధనాలుగా బస్సులు (1080), ట్రక్కులు (2,489), టాక్సీలు (6,183), మోటారు సైకిళ్లు (2,269), ఎద్దుల బండ్లు (సుమారు 4,20,000) ప్రజలకు అందుబాటులో ఉండేవి.
నిజాం హయాంలో ఏర్పాటు చేసిన బేగంపేట విమానాశ్రయాన్ని, మిలటరీ ప్రభుత్వ హయాంలో 2.36 కోట్ల రూపాయలతో విస్తరించారు.

 

సమాచార వ్యవస్థ
నిజాం పాలనలో కమ్యూనికేషన్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ తపాలశాఖ ఆధ్వర్యంలో 1382 తపాలా కార్యాలయాలు పనిచేస్తుండేవి. రెండు రేడియో స్టేషన్లు (హైదరాబాద్, ఔరంగాబాద్) వివిధ భాషల్లో ప్రసారాలు చేస్తుండేవి. 1948-50 మధ్య కాలంలో 24 వైర్‌లెస్ కమ్యూనికేషన్లను స్థాపించారు. 1.12 కోట్ల రూపాయల వ్యయంతో 5 వేల టెలిఫోన్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గౌలిగూడ, సైఫాబాద్, సికింద్రాబాద్ వద్ద ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేశారు. గుల్బర్గా, నిజామాబాద్, లాతూర్, నాందేడ్, పర్బనీ, బీదర్ లలో చిన్న టెలిఫోన్ ఎక్స్ఛేంజీలను స్థాపించారు. 1954-55లో తెలంగాణ వార్షిక రెవెన్యూ రూ.14 కోట్లు కాగా రూ.0.51 కోట్ల మిగులుతో ఉంది. అంతేకాకుండా 11 కోట్ల రూపాయల మార్కెటబుల్ సెక్యూరిటీలు ఉన్నాయి. ఈవిధంగా భిన్న రంగాల్లో సమకాలీన ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 1956కు పూర్వం అభివృద్ధి చెందిన స్థితిలో ఉండేది. ఈ స్థితే తెలంగాణను తమతో కలిపేసుకోవాలని ఆంధ్ర నాయకులను పురికొల్పింది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌