• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘం (2015 - 20)
డా.వై.వి.రెడ్డి అధ్యక్షులుగా, అజయ్‌ నారాయణ్‌ ఝా కార్యదర్శిగా 14వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని సిఫార్సులు 2015 - 20 కాలానికి వర్తిస్తాయి.


i) కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా: 14వ ఆర్థిక సంఘం పన్ను రాబడుల్లో (డివిజిబుల్‌ పూల్‌) 42% వాటాను రాష్ట్రాలకు కేటాయించింది. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన 32%తో పోలిస్తే ఇది 10% అధికం. దీనివల్ల రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్లు పథకాలు రూపొందించుకొని, నిధులు కేటాయించుకునే స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడింది.


ii) పన్నుల రాబడి పంపిణీలో వివిధ రాష్ట్రాల వాటాలు: 14వ విత్త సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి  అధిక పన్నుల వాటా పొందే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్‌ (17.959%), బిహార్ (9.665%), మధ్యప్రదేశ్ (7.548%). కేంద్రం నుంచి తక్కువ పన్నువాటా పొందే రాష్ట్రాలు: సిక్కిం  (0.37%), గోవా  (0.38%) 
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6.74% పన్ను వాటాతో 5వ స్థానంలో ఉండేది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ 9, తెలంగాణ 15వ స్థానాల్లో ఉన్నాయి.


iii) రెవెన్యూ లోటు: దేశంలోని మొత్తం 11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉంది. అవి: ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అసోం, కేరళ, మేఘాలయ, పశ్చిమ్‌బెంగాల్‌. 
* అయిదేళ్ల కాలంలో  (2015-20)  ఈ రాష్ట్రాలకు రూ.1,94,182 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 
* రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందుకుంది జమ్మూ కశ్మీర్‌. 


iv) ప్రకృతి విపత్తుల నిర్వహణ: ప్రకృతి విపత్తుల సమయంలో పునరావాసం, భద్రతా చర్యల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అయినప్పటికీ కేంద్రం తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాలపై సెస్‌లు విధించడం ద్వారా జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కి నిధులు లభిస్తాయి. దీనికి మరిన్ని నిధులు సమకూర్చేందుకు  National Calamity Contingency Duty ని కూడా విధిస్తున్నారు. 
* రాష్ట్రవిపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)కి రాష్ట్రాలు 10%, కేంద్రం 90% నిధులు అందించాలని 14వ ఆర్థిక సంఘం  సూచించింది. ప్రకృతి విపత్తుల కోసం రూ. 55,097 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. 


v) స్థానిక సంస్థలు: 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర జనాభాకు 90%, ప్రాంతానికి 10% భారితం ఇచ్చి, స్థానిక సంస్థలకు నిధులు అందించాలని సిఫార్సు చేసింది. 2015 - 20 కాలానికి స్థానిక సంస్థలకు రూ. 2,87,436 కోట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తంలో పంచాయతీలకు రూ.2,00,292 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 87,144 కోట్లు సిఫార్సు చేసింది. 


గ్రాంట్లు రెండు రకాలు అవి: బేసిక్‌ గ్రాంట్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్‌. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో బేసిక్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్లను గ్రామ పంచాయతీలకు 90 : 10, పురపాలక సంఘాలకు 80 : 20 నిష్పత్తిలో అందించాలి. కేంద్రం నుంచి నిధులు విడుదలైన 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయాలి. అలా జరగకపోతే వడ్డీతో సహా మొత్తం జమ చేయాలి. గనులు తవ్వడం ద్వారా రాష్ట్రాలకు వచ్చిన రాయల్టీలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకు కేటాయించాలి. ఇవి ప్రజల ప్రాథమిక సౌకర్యాల కల్పనకు (తాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక ఆస్తులు, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ) నిధులు ఖర్చు చేయాలి. స్థానిక సంస్థలు ప్రోత్సాహక నిధులను పొందాలంటే తప్పనిసరిగా ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిటింగ్‌ చేయాలి.


vi) కోశ క్రమశిక్షణ: 2019 - 20 నాటికి దేశ కోశ లోటును 3 శాతానికి తెచ్చి, రెవెన్యూ లోటును పూర్తిగా లేకుండా చేయాలనేది 14వ ఆర్థిక సంఘం లక్ష్యం. రాష్ట్రాల్లోనూ కోశ లోటు 3% (0.25% అటూఇటూగా) ఉంచాలని పేర్కొంది. రాష్ట్రాల అప్పులు వాటి  GSDP లో  25% మించకూడదు. ఈ అంశాలకు అనుగుణంగా  FRBM చట్టాన్ని సవరించి దాని స్థానంలో Debt Ceiling & Fiscal Responsibility Legislation ను తేవాలి. వాస్తవ రెవెన్యూ లోటును  (Effective Revenue Deficit) విడిచిపెట్టాలని సూచించింది.


vii) వస్తు సేవల పన్ను (జీఎస్టీ): జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి మూడేళ్లు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100%, నాలుగో ఏడాది 75%, అయిదో సంవత్సరం 50% కేంద్రమే భరించాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది.


viii) కేంద్ర ప్రాయోజిత పథకాలు  (Central Sponsored Schemes): కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 స్కీంలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. పథకాల ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిదింటిని మాత్రమే ప్రభుత్వం బదిలీ చేసింది.


ix) విద్యుత్‌ రంగంపై సిఫార్సులు: రాష్ట్రాలు కొన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీలను ముందుగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాలి. అలా చేయని రాష్ట్రాలకు జరిమానా విధించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు లాభాలు రావాలంటే వాటికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని, దానికోసం రాష్ట్ర స్థాయి విద్యుత్‌ నియంత్రణ మండలి నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవసాయ పంపు సెట్లకు, ఇతర వర్గాలవారికి నీటిని అందించే మోటార్లకు తప్పనిసరిగా మీటర్లు పెట్టాలి. తద్వారా ప్రభుత్వం ఇచ్చే రాయితీల ధ్రువీకరణ, విద్యుత్‌ సాంకేతిక నష్టాలు, విద్యుత్‌ చౌర్యం లాంటి సమాచారం తెలుస్తుందని పేర్కొంది.


x) ప్రభుత్వ రంగ సంస్థలు: ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వ రంగ సంస్థలను నాలుగు వర్గాలుగా విభజించారు. అవి:
1) అత్యంత ముఖ్యమైనవి 
2) ముఖ్యమైనవి 
3) సాధారణమైనవి  
4) అవసరం లేనివి 
వీటిలో పెట్టుబడి పెట్టాలన్నా, ఉపసంహరించాలన్నా ఈ వర్గీకరణ ఆధారంగానే జరగాలి. అవసరం లేని సంస్థలను పారదర్శకంగా వేలం వేసి, విక్రయించాలని ఆర్థిక సంఘం సూచించింది.


xi) ఇతర అంశాలు: రైల్వే టికెట్‌ ధరలను నిర్ణయించడానికి స్వయంప్రతిపత్తి హోదా ఉన్న ధరల నిర్ణయాధికార సంస్థను వేగంగా ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి జీతభత్యాలు నిర్ణయించాలి.  Pay Revision Commission (PRC) పేరును  Pay and Productivity Commission (PPC) గా మార్చాలి. స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్ఠి కోసం వృత్తిపన్నును భారీగా పెంచి, నిధులు సమకూర్చాలని ఆర్థిక సంఘం సూచించింది.


xii) కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ   వాటాలు: 2015 - 20 మధ్య కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాలకు రూ. 39,48,187 కోట్లు కేటాయించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ.1,69,970 కోట్లు (4.305%)  కేటాయించారు. సేవాపన్ను వాటా 4.398%. తెలంగాణకు రూ. 96,217 కోట్లు (2.437%) ఇచ్చారు. సేవాపన్ను వాటా 2.499%.


13వ విత్త సంఘం (2010-15)
* 13వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు (పన్నులు, గ్రాంట్లు) 39.5 శాతంగా, పన్ను రాబడుల వాటాను 32 శాతంగా నిర్ణయించింది. అయితే సర్‌ఛార్జి, సెస్‌లపై రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను ఆమోదించలేదు. 
* 11వ ఆర్థిక సంఘం మొదటిసారి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు 37.5% వరకు ఉండొచ్చని, వాటిలో పన్ను రాబడుల వాటా 29.5 శాతంగా ఉండాలని సూచించింది. 
* 12వ ఆర్థిక సంఘం గరిష్ఠ వనరులను 38 శాతంగా, పన్ను రాబడుల వాటాను 30.5 శాతంగా నిర్ణయించింది. 


15వ ఆర్థిక సంఘం
రాష్ట్రపతి 2017, నవంబరు 27న ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్‌ అధ్యక్షులుగా, అరవింద్‌ మెహతా కార్యదర్శిగా 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. 2020, అక్టోబరు 30 నాటికి ఇది తన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.


ఆర్థిక సంఘం సభ్యులు: అజయ్‌ నారాయణ్‌ ఝా (కేంద్ర మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి), అశోక్‌ లహరి (కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), రమేష్‌ చంద్‌ (నీతి ఆయోగ్‌ సభ్యులు), అనూప్‌ సింగ్‌ (జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌)
* ఈ సంఘం 2 నివేదికలు సమర్పించింది. మొదటి దానిలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో దానిలో 2021 - 2026 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 


టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌: కింద పేర్కొన్న   అంశాలను పరిశీలించి నివేదికను తయారుచేయాలని 15వ ఆర్థిక సంఘానికి సూచించారు.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, వాటిలో రాష్ట్రాలకు వచ్చే వాటాలను నిర్ణయించడం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్ల పరిమాణాన్ని నిర్ణయించి, వీటిని పొందడానికి రాష్ట్రాలకు ఉండాల్సిన అర్హతలను ప్రకటించడం.
* మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధులు అందించేందుకు రాష్ట్ర సంఘటిత నిధిని బలోపేతం చేసే చర్యలు సూచించడం. 
* 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్ర కోశ స్థితిగతులపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో సమీక్షించడం. 
* కేంద్రం, రాష్ట్రాల రుణాల స్థితిగతులు, మంచి విత్త నిర్వహణకు తీసుకోవాల్సిన కోశపరమైన చర్యలు సూచించడం.
* ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావాన్ని అధ్యయనం చేయడం. 
* జనాభావృద్ధి రేటును తగ్గించేందుకు చేపట్టిన చర్యలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కృషి, మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రగతి, విద్యుత్‌ రంగంలో నష్టాలు తగ్గించడం, పన్ను-పన్నేతర రాబడిని పెంచడంలో ప్రగతి, ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్‌ ఎకానమీని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యం  (Ease of Doing Business)లో ప్రగతి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో సాధించిన ప్రగతి మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలను సిఫార్సు చేయడం. 
* రక్షణ, అంతర్గత భద్రతలకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక యంత్రాంగం అవసరమా? ఒకవేళ అవసరమైతే దాన్ని ఎలా నిర్వహించాలి? అనే అంశంపై సలహా ఇవ్వడం. 
* 2011 జనాభా లెక్కల ఆధారంగానే సిఫార్సులు ఉండాలి.  

 

15వ ఆర్థిక సంఘం - నివేదికలు
* 15వ ఆర్థిక సంఘం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి రెండు నివేదికలను సమర్పించింది. మొదటి నివేదికలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో నివేదికలో 2021 - 26 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.

 

ఆదాయ వ్యత్యాసం: అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రంతో పోలిస్తే ఒక రాష్ట్రం ఎంత దూరంలో ఉందో ఈ ప్రమాణం తెలుపుతుంది. 2016 - 17 నుంచి 2018 - 19 వరకు ఉన్న మూడేళ్ల సగటు తలసరి జీఎస్‌డీపీ లెక్కించడం ద్వారా ఒక రాష్ట్ర  తలసరి ఆదాయం వస్తుంది. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు అధిక సాయం అందించే ఉద్దేశంతో ఆదాయ వ్యత్యాస ప్రమాణాన్ని చేర్చారు. రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని సాధించడం దీని లక్ష్యం. మొదటి నివేదిక తయారీకి సూచన కాలం (రిఫరెన్స్‌ పీరియడ్‌)గా  2015 - 18ని తీసుకున్నారు.


జనాభా సంబంధ ప్రగతి Demographic Performance): జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. దీని ప్రకారం ఫలదీకరణ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు అధికంగా లబ్ది పొందుతాయి. 

అడవులు, ఆవరణ వ్యవస్థ: అన్ని రాష్ట్రాల్లోని మొత్తం దట్టమైన అడవుల్లో ఒక రాష్ట్రంలోని దట్టమైన అడవుల వాటా ఎంత ఉందో లెక్కించి ఈ ప్రమాణాన్ని పరిగణిస్తారు.

పన్నుల వసూల్లో కృషి (Tax Effort):  అధిక పన్ను వసూలు సామర్థ్యం ఉన్న రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. 2016 - 17 నుంచి 2018 - 19 కాలానికి ఒక రాష్ట్రంలో సగటు తలసరి సొంత పన్ను రాబడికి, సగటు తలసరి జీఎస్‌డీపీకి మధ్య ఉన్న నిష్పత్తి ఆధారంగా దీన్ని లెక్కిస్తారు.
* 13వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను మాత్రమే ఆధారంగా తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి 2011 జనాభా లెక్కలను ప్రమాణంగా  తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు స్వాగతించగా, మరికొన్ని వ్యతిరేకించాయి. 

 

2011 జనాభా లెక్కలు - అనుకూల వాదనలు:
* 1971 జనాభా లెక్కలు 50 ఏళ్ల నాటి పాత సమాచారాన్ని పేర్కొంటాన్నాయి. ఇవి ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించవు. 
* 1971 జనాభా లెక్కలు వలసలను పరిగణనలోకి తీసుకోలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరానికి 33 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.  ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. 
* పాత గణాంకాలతో సరైన కేటాయింపులు జరగకపోవచ్చు. వలసలు కూడా పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేస్తే జనాభా సంబంధ మార్పుల ద్వారా వచ్చే జనాభా సంబంధ లబ్ది (demographic dividend) చేకూరుతుంది.


ప్రతికూల వాదనలు:
* 1971 నుంచి 2011 నాటికి మొత్తం జనాభాలో దక్షిణ భారత రాష్ట్రాల వాటా 4% తగ్గగా, ఉత్తర భారత రాష్ట్రాల వాటా సాపేక్షంగా పెరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతున్నాయి. 
* అధిక జనాభా వల్ల ఉత్తర భారత రాష్ట్రాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కేటాయింపులు పెరగడానికి ఈ అంశం కూడా ఒక కారణం. 
* ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రాలకు సహాయం చేయాలి. అనేక సంవత్సరాల నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు సాయం అందిస్తున్నప్పటికీ అవి వెనుకబడే ఉన్నాయి. వెనుకబాటుతనం ఆధారంగా నిధుల కేటాయింపు జరగడం వల్ల ఆర్థిక సంఘం వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించినట్లు అనిపిస్తోందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఉదా: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన దాని కంటే తక్కువమొత్తం పొందుతున్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రానికి రూ.100 చెల్లిస్తే, తిరిగి రూ. 30 మాత్రమే దక్కుతుంది. ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలు రూ.100 చెల్లిస్తే, రూ.200 పైనే పొందుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుంచి అధికంగా నిధులు లభిస్తున్నాయి.
* 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల 4 దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలూ నష్టపోతున్నాయి.

 

మొదటి నివేదిక
* 2020 - 21కి రూ.8,55,176 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది.  ఈ మొత్తం డివిజబుల్‌ పూల్‌లో 41 శాతంగా ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 42 శాతం కంటే ఇది 1 శాతం తక్కువ. 2020 ఫిబ్రవరిలో ఈ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 
* 2020 - 21కి ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యధికంగా రూ.1,53,342 కోట్లు పొందింది. డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఈ రాష్ట్రం వాటా 17.93 శాతం. బిహార్‌ రూ.86,039 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 
* 2020 - 21కి ఆంధ్రప్రదేశ్‌కు రూ.35,156 కోట్లు లభించాయి. 14వ ఆర్థిక సంఘం డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం 4.111 శాతం కేటాయించింది. 
* పన్నుల విభజన తర్వాత కూడా 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. దీన్ని భర్తీ చేసేందకు ఆయా రాష్ట్రాలకు రూ.74,341 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు కింద సిఫార్సు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. 
* 2019 - 20తో పోలిస్తే 2020 - 21లో కర్ణాటక, మిజోరం, తెలంగాణలకు పన్నుల విభజన, రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. దీనికోసం ఆ మూడు రాష్ట్రాలకు రూ.6,674 కోట్లు కేటాయించింది. 
* 2020 - 21లో స్థానిక సంస్థలకు రూ.90,000 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. డివిజబుల్‌ పూల్‌లో ఇది 4.31%. ఈ మొత్తంలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.60,750 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.29,250 కోట్లు కేటాయించింది. 
* జాతీయ, రాష్ట్ర డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌ ఫండ్‌లను ఏర్పాటుచేయాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (State Disaster Risk Management Fund-SDRMF) కు రూ.28,983 కోట్లు, జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి  (National Disaster Risk Management Fund NDRMF) కు రూ.12,390 కోట్లు సిఫార్సు చేసింది. 
* 2020 - 21 లో పోషణ (Nutrition) రంగానికి రూ.7,375 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. 
* ప్రదర్శనాధారిత, రంగాల వారీ గ్రాంట్లను పూర్తిగా తొలగించారు.


రెండో నివేదిక
* 15వ ఆర్థిక సంఘం 2020 నవంబరులో తన నివేదికను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించింది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో పాటు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 202126 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాలకు కీలక సిఫార్సులు చేసింది.


కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా: 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సిఫార్సు చేసినట్లే 2021 - 26 కాలానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41 శాతంగా ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన దానికంటే ఇది 1 శాతం తక్కువ. ఈ ఒక్క శాతాన్ని కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ కోసం కేటాయించాలన్న కేంద్రప్రభుత్వ సూచనకు ఆర్థిక సంఘం అంగీకరించింది. 2021 - 22 నుంచి 2025 - 26 వరకు మొత్తం పన్ను వసూళ్లు రూ.135.2 లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా. సెస్సులు, సర్‌ఛార్జీలు లాంటివి మినహాయిస్తే ఈ మొత్తం రూ.103 లక్షల కోట్లకు తగ్గుతుంది. అందులో 42% అంటే రూ.42.2 లక్షల కోట్లు రాష్ట్రాలకు దక్కాలి.
 రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు: దీనికోసం 15వ ఆర్థిక సంఘం 2020 - 21కి ఉపయోగించిన ప్రమాణాలనే 2021 - 26 కాలానికీ తీసుకుంది. వాటికి కేటాయించిన భారితాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ‘పన్ను వసూల్లో కృషి’కి (Tax Effort) బదులు ‘పన్ను-కోశ కృషి’ (Tax and Fiscal Effort) అనే పేరును ఉపయోగించారు. అయితే ఆదాయ వ్యత్యాసం, పన్నుల వసూల్లో కృషి అనే రెండు ప్రమాణాల లెక్కింపునకు 2020 - 21కి రిఫరెన్స్‌ పీరియడ్‌గా 2015 - 18; 2021 - 26 కాలానికి 2016 - 19ను తీసుకున్నారు. 2020 - 21తో పోలిస్తే రాష్ట్రాల వాటాల్లో స్వల్పంగా మార్పులు జరిగాయి.
* ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకల మొత్తం వాటా 13.955% నుంచి 11.721 శాతానికి తగ్గింది. ఈ రాష్ట్రాలు మొత్తంగా 2.234% వాటాను అంటే రూ.94,381.13 కోట్లను కోల్పోయాయి. ఒడిశా, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌లు కూడా వెయిటేజీని కోల్పోయాయి. ఈ ఏడు రాష్ట్రాలు అయిదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నష్టపోనున్నాయి. తమిళనాడు వెయిటేజీ 4.023% నుంచి 4.079%కి పెరిగింది.


రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించేందుకు 15వ ఆర్థిక సంఘం కింది ప్రమాణాలను అనుసరించి, భారితాలు ఇచ్చింది.

 

గ్రాంట్లు
* 2021 - 26 కాలానికి కేంద్ర వనరుల నుంచి  రాష్ట్రాలకు కింద పేర్కొన్న గ్రాంట్లు అందుతాయి.
 రెవెన్యూ లోటు గ్రాంట్లు: రెవెన్యూ లోటును అధిగమించేందుకు 17 రాష్ట్రాలకు రూ.2.9 లక్షల కోట్లు కేటాయించారు.


8 రంగాలకు ప్రత్యేక గ్రాంట్లు: కింది రంగాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా రూ.1.3 లక్షల కోట్లు ఇస్తారు. అవి:
1. ఆరోగ్యం      2. పాఠశాల విద్య        3. ఉన్నత విద్య 
4. వ్యవసాయ సంస్కరణల అమలు 
5. పీఎంజీఎస్‌వై రహదారుల నిర్వహణ 
6. న్యాయ వ్యవస్థ         7. గణాంకాలు 
8. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులు. 
* ఈ గ్రాంట్లలో కొంత భాగం పనితీరు  ఆధారంగా ఉంటాయి.


రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు: ఆర్థిక సంఘం రాష్ట్రాలకు రూ.49,599 కోట్ల ప్రత్యేక గ్రాంట్లను సిఫార్సు చేసింది. వీటిని కింది అవసరాలకు ఇస్తారు. 
* సాంఘిక అవసరాలు 
* పాలనా గవర్నెన్స్, మౌలిక వసతులు 
* తాగునీరు, పారిశుద్ధ్యం 
* సంస్కృతి, చారిత్రక కట్టడాల సంరక్షణ 
* అధిక వ్యయం ఉన్న భౌతిక అవస్థాపన 
* పర్యటకం 
రాష్ట్రాలు, రంగాల వారీగా ప్రత్యేక గ్రాంట్ల వినియోగాన్ని సమీక్షించి, పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. స్థానిక సంస్థలకు గ్రాంట్లు: స్థానిక సంస్థలకు మొత్తం రూ.4.36 లక్షల కోట్లు ఇస్తారు. ఈ గ్రాంట్లలో కొంత మొత్తం పనితీరు ఆధారంగా ఇస్తారు. వీటిలో గ్రామీణ స్థానిక సంస్థలకు  రూ.2.4 లక్షల కోట్లు; పట్టణ స్థానిక సంస్థలకు రూ.1.2 లక్షల కోట్లు; స్థానిక ప్రభుత్వాల ద్వారా ఆరోగ్య గ్రాంట్లు రూ.70,051 కోట్లు కేటాయించారు. స్థానిక సంస్థలకు అందించే గ్రాంట్లు 3 అంచెల (గ్రామం, బ్లాక్, జిల్లా) పంచాయతీరాజ్‌ సంస్థలకు అందుబాటులో ఉంటాయి.


ఆరోగ్య గ్రాంట్లు: ఈ నిధులను కింది విధంగా వెచ్చిస్తారు.
* గ్రామీణ ఆరోగ్య సబ్‌ సెంబర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీలు) ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలుగా మార్చడం.  
* ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలకు మద్దతుగా డయాగ్నోస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం.
* పట్టణ ఆరోగ్య-వెల్‌నెస్‌ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలకు, బ్లాక్‌స్థాయిలో ఉన్న ప్రజా ఆరోగ్య యూనిట్లకు మద్దతు అందించడం.
* ఆరోగ్య గ్రాంట్లు మినహా స్థానిక సంస్థలకు అందించే మిగిలిన గ్రాంట్లను జనాభా, విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. జనాభాకు 90%, విస్తీర్ణానికి 10% భారితం ఇస్తారు. ఈ గ్రాంట్లను (ఆరోగ్య గ్రాంట్లు మినహా) పొందడానికి ఆర్థిక సంఘం కొన్ని షరతులను విధించింది. అవి:
* ఆడిట్‌ చేసిన అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రచురించాలి. 
* ఆస్తి పన్నులకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ఫ్లోర్‌ రేట్లను నిర్ణయించాలి. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రగతిని చూపాలి. 
* ఒక రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోతే 2024, మార్చి తర్వాత స్థానిక సంస్థలకు ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయకూడదు.

 

ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు: ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధులకు అయ్యే వ్యయాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర, రాష్ట్రాలు వాటాల రూపంలో నిధులను సమకూరుస్తాయి. 


కేంద్రం - రాష్ట్రాల మధ్య వ్యయాల పంపిణీ:
* ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90 : 10
* ఇతర రాష్ట్రాలకు 75 : 25.
రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధులకు రూ.1.6 లక్షల కోట్లు ఉండాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం వాటా రూ.1.2 లక్షల కోట్లుగా పేర్కొంది.


ఆర్థిక రోడ్‌ మ్యాప్‌ (Fiscal roadmap) 
కోశ లోటు, రుణ స్థాయి: కేంద్రప్రభుత్వం కోశలోటును 2021 - 22లో 6%, 2022 - 23లో 5.5%, 2023 - 24లో 5%, 2024 - 25లో 4.5%, 2025 - 26 నాటికి జీడీపీలో 4 శాతానికి తగ్గించాలి. 
* అన్ని రాష్ట్రాలు తమ కోశ లోటు పరిమితిని (జీఎస్‌డీపీ శాతాల్లో) 2021 - 22లో 4%, 2022 - 23లో 3.5%, 2023 - 26 మధ్య కాలంలో 3 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. 
* ఒక రాష్ట్రానికి మొదటి 4 సంవత్సరాలకు (2021 - 25) మంజూరైన రుణ పరిమితిని పూర్తిగా వినియోగించలేకపోతే, ఆ  రుణాన్ని తర్వాతి ఏడాదిలో ఉపయోగించుకోవచ్చు. 
* విద్యుత్తు రంగంలో సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలకు మొదటి నాలుగేళ్లు (2021 - 25) అదనంగా జీఎస్‌డీపీలో 0.5% రుణాన్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సంస్కరణలు ప్రధానంగా 

1. నిర్వహణ వ్యయాలు తగ్గించడం.
2. రెవెన్యూ వ్యత్యాసాన్ని తగ్గించడం. 
3. సబ్సిడీ చెల్లింపుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టడం. 
4. రెవెన్యూలో టారిఫ్‌ సబ్సిడీ వాటా తగ్గించడం.
* తాము సిఫార్సు చేసిన కోశ లోటు మార్గసూచీ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణాలు తగ్గుతాయని ఆర్థిక సంఘం భావిస్తోంది. 2020 - 21లో జీడీపీలో 62.9%గా ఉన్న అప్పులు 2025 - 26 నాటికి 56.6%కి తగ్గుతాయని ఆర్థిక సంఘం పేర్కొంది. అన్ని రాష్ట్రాల మొత్తం రుణాలు జీడీపీలో 33.1% నుంచి 32.5 శాతానికి చేరతాయని తెలిపింది. 
* ఉన్నతస్థాయి అంతర మంత్రిత్వ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ద్రవ్య బాధ్యతా-బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని (Fiscal Responsibility and Budget Management Act -FRBM) సమీక్షించాలని సిఫార్సు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నూతన FRBM ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించింది.


ఆదాయ సమీకరణ: ఆదాయం, ఆస్తి ఆధారిత పన్నులను బలోపేతం చేయాలి. వేతన ఉద్యోగుల ఆదాయపు పన్నుపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలి. దీనికోసం టీడీఎస్‌/టీసీఎస్‌ పన్ను మినహాయింపు, సేకరణకు చెందిన నిబంధనల కవరేజీని విస్తరించాలి. రాష్ట్ర స్థాయిలో పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడానికి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయొచ్చు. ఇందుకోసం కంప్యూటరీకరించిన ఆస్తుల రికార్డులను, లావాదేవీల రిజిస్ట్రేషన్‌తో ఇంటిగ్రేట్‌ చేయాలి. ఆస్తుల మార్కెట్‌ విలువను కచ్చితంగా లెక్కించాలి. 


జీఎస్టీ: జీఎస్టీలో ఉన్న మధ్యంతర ఇన్‌పుట్, తుది అవుట్‌పుట్‌ల మధ్య విలోమ డ్యూటీ స్ట్రక్చర్‌ను పరిష్కరించాలి. జీఎస్టీ రేటు రెవెన్యూ తటస్థతను పునరుద్ధరించాలి. 12%, 18% రేట్లను విలీనం చేయడం ద్వారా రేటు నిర్మాణాన్ని హేతుబద్దీకరించాలి. జీఎస్టీ బేస్‌ను విస్తరించడానికి, సమ్మతిని ధ్రువీకరించడానికి రాష్ట్రాలు క్షేత్రస్థాయి ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. 


ఆర్థిక నిర్వహణ విధానాలు: 
* ప్రజల ఆర్థిక నిర్వహణ కోసం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలి. 
* కేంద్రం, రాష్ట్రాల నుంచి రికార్డులను మదింపు చేసే అధికారాలతో ఒక స్వతంత్ర ఆర్థికమండలిని ఏర్పాటు చేయాలి. కౌన్సిల్‌కు కేవలం సలహా పాత్ర మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఖర్చుకు సంబంధించి ఆఫ్‌ బడ్జెట్‌ ఫైనాన్సింగ్‌ లేదా పారదర్శకం కాని ఫైనాన్సింగ్‌ మార్గాలను ఆశ్రయించకూడదు. 
* స్థూల ఆర్థిక, ఆర్థిక అంచనా కచ్చితత్వం, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేయాలి. 
* కేంద్రం తన చట్టంలో తెచ్చిన రుణ నిర్వచనానికి అనుగుణంగా రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత చట్టాన్ని సవరించాలి. రాష్ట్రాలు స్వల్పకాలిక అప్పు కోసం రుణాలు, అడ్వాన్సులు, భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం కాకుండా ఇతర మార్గాల నుంచి ఎక్కువగా తీసుకోవాలి.  రాష్ట్రాలు తమ రుణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఒక స్వతంత్ర రుణ నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయొచ్చు.


ఇతర సిఫార్సులు
ఆరోగ్యం: 2022 నాటికి ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో 8% కంటే ఎక్కువగా కేటాయించాలి. అదే ఏడాది నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 2/3 వంతు ఉండాలి. ఆరోగ్య రంగంలో ఉన్న కేంద్ర ప్రాయోజిక పథకాలు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉండాలి. అఖిల భారత వైద్య, ఆరోగ్య సేవలు ప్రారంభించాలని సిఫార్సు చేసింది.


రక్షణ, అంతర్గత భద్రత కోసం నిధులు:
రక్షణ, అంతర్గత భద్రతల బడ్జెట్‌ అవసరాలకు, వాస్తవ కేటాయింపులకు మధ్య  వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని పేర్కొంది. దీనికోసం రక్షణ, అంతర్గత భద్రతా  ఆధునికీకరణ నిధిని (Modernisation Fund for Defence and Internal Security MFDIS) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* 2021 - 26 మధ్య ఉన్న 5 సంవత్సరాల కాలానికి రూ.2.4 లక్షల కోట్ల కార్పస్‌ను ఈ నిధి కలిగిఉంటుంది. ఇందులో రూ.1.5 లక్షల కోట్లు భారత సంఘటిత నిధి నుంచి బదిలీ అవుతాయి. మిగిలిన మొత్తం రక్షణ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని సిఫార్సు చేసింది. 


కేంద్రప్రాయోజిత పథకాలు (CSS):
వీటికి కనీస వార్షిక కేటాయింపులను నిర్ణయించాలి. అంతకంటే తక్కువగా కేటాయించడాన్ని నిలిపివేయాలి. ఒక నిర్దిష్ట కాల పరిమితిలోపు CSSల థర్డ్‌పార్టీ మూల్యాంకనం పూర్తి చేయాలి. వీటికి కేంద్ర - రాష్ట్రాల నిధుల కేటాయింపు వాటాలను పారదర్శకంగా నిర్ణయించాలి. అవి స్థిరంగా ఉండాలి.


ఆంధ్రప్రదేశ్‌
14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 4.305 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 4.047 (-0.258%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 4.111 శాతాన్ని కేటాయించింది. 2021 - 26 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రూ.10,900 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2021 - 26 మధ్య రాష్ట్రానికి రూ. 2,34,013 కోట్లు వస్తాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి. 


తెలంగాణ
* 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 2.43 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 2.102 (-0.328%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 2.133 శాతాన్ని కేటాయించింది. 202126 మధ్య తెలంగాణ రూ.9,621 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 202 1- 26 మధ్య రాష్ట్రానికి రూ. 1,09,786 కోట్లు రానున్నాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి.


15వ ఆర్థిక సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అందనున్న వనరులు (రూ.కోట్లలో)

అంశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
పన్నుల్లో వాటా 1,70,976 88,806
రెవెన్యూ లోటు 30,497 0
స్థానిక సంస్థలు 18,063 13,111
ప్రకృతి వైపరీత్య నిర్వహణ 6,183 2,483
న్యాయ వ్యవస్థ 295 245
వైద్యం 877 624
PMGSY రహదారులు 344 255
గణాంకాలు 19 46
ఉన్నత విద్య 250 189
వ్యవసాయం 4,209 1,665
రాష్ట్రప్రత్యేకం 2,300 2,362
మొత్తం 2,34,013 1,09,786
Posted Date : 19-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌