• facebook
  • whatsapp
  • telegram

విదేశీ వ్యాపారం

ఎల్లలు లేని క్రయవిక్రయాలు!

 

 ప్రపంచంలో వివిధ దేశాల మధ్య వస్తుసేవల మార్పిడి తప్పనిసరి. సహజవనరులు, మానవ నైపుణ్యాల పరంగా ప్రపంచంలో ఏ దేశం కూడా స్వయంసమృద్ధిగా ఉండటం కాదు. అందుకే ఒక దేశం స్థానిక  వనరులను ఇతర దేశాలకు అందించి, ప్రతిగా తనకు కావాల్సిన వస్తుసేవలను పొందుతుంది. ఎల్లలు లేని ఈ పరస్పర వినిమయమే విదేశీ వ్యాపారంగా వృద్ధి చెందింది. స్వాతంత్య్రానంతరం నుంచి నేటివరకు జరిగిన అభివృద్ధి, సంస్కరణలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అంతర్జాతీయ వ్యాపారం ఆవశ్యకత, అందులో భారతదేశ స్థానం, ప్రధాన ఎగుమతి, దిగుమతులు, ముఖ్య వాణిజ్య భాగస్వాముల గురించి అవగాహన పెంచుకోవాలి. 

వస్తుసేవల అమ్మకం, కొనుగోలును వాణిజ్యం లేదా వ్యాపారం అంటారు. ఈ వ్యాపారం ఒక దేశంలో ఉండే పౌరుల మధ్య జరిగితే దాన్ని దేశీయ/ జాతీయ లేదా అంతర్గత వ్యాపారం అంటారు. అదే వ్యాపారం ఒక దేశ పౌరులకు, ఇతర ప్రపంచ దేశాల పౌరులకు మధ్య జరిగితే దాన్ని విదేశీ/ప్రపంచ లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటారు.

 ఒక దేశంలోని ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం విదేశాల్లోని ప్రజలు, సంస్థలు  ప్రభుత్వంతో జరిపే వ్యాపారమే అంతర్జాతీయ వ్యాపారం. అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు అమ్మితే ఎగుమతులని, ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను మన దేశ పౌరులు కొనడాన్ని దిగుమతులని అంటారు.

నిరపేక్ష వ్యయానుకూలత సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఆడంస్మిత్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక దేశంలో ఉత్పత్తి చేయడానికి వీలుకాని లేదా ఉత్పత్తి చేయడానికి ఇతర దేశాల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే వస్తువులను ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అదే విధంగా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేయడానికి వీలుకాని లేదా ఉత్పత్తికి ఎక్కువ ఖర్చయ్యే వస్తువులను ఆ దేశం ఎగుమతి చేస్తుంది.


తులనాత్మక వ్యయానుకూలత సిద్ధాంతం:  డేవిడ్‌ రికార్డో ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక దేశం ఏవైనా వస్తువుల ఉత్పత్తిలో వ్యయానుకూలత కలిగి, రెండో దేశం అవే వస్తువుల ఉత్పత్తిలో వ్యయ ప్రతికూలత కలిగి ఉంటే ఆ రెండు దేశాల మధ్య లాభదాయకమైన వ్యాపారం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాల మధ్య సహజ వనరులు, మూలధన లభ్యత, శీతోష్ణస్థితి, శ్రామిక నైపుణ్యం వంటి అంశాల్లో వ్యత్యాసాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం జరగవచ్చు.


   ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని హెక్సర్‌-ఒహ్లిన్‌ రూపొందించారు. ఈయన ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం ధరల ఆధారంగా తులనాత్మక వ్యయ అనుకూలతను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఒంటరిగా ఉండిపోతే దాన్ని అటార్కి అంటారు. ఇది Closed Economy లో ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచశాంతికి పెట్టని కోట వంటిదని జె.ఎస్‌.మిల్‌ అభిప్రాయం.

భారతదేశానికి అంతర్జాతీయ వ్యాపారం ఆవశ్యకత: భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధి, దిగుమతుల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవసరమైన మూలధన వస్తువులు, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన యాజమాన్య పద్ధతులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని అభివృద్ధి దిగుమతులు అంటారు.

ఉదా: ఉక్కు, సిమెంట్, ఎరువులు, రవాణా, దూరవాణి వంటి పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మూలధన పరికరాలు.

నిర్వహణ దిగుమతులు: అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశాల్లో పెట్టుబడులు అధికమై ప్రజల ఉద్యోగిత, ఆదాయ పరిమాణాలు పెరుగుతాయి. కానీ వాటికి దీటుగా వినియోగ వస్తువుల సరఫరా పెరగదు. ఈ నేపథ్యంలో కొరతగా ఉన్న వినియోగ వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసి స్థిరత్వం సాధించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటానికి ఆహారధాన్యాలు, ఇతర వినియోగ వస్తువుల దిగుమతులు అవసరమవుతాయి. ఇలాంటి దిగుమతులను నిర్వహణ దిగుమతులు అంటారు.

ఎగుమతులు పెంపొందించే ఆవశ్యత: దిగుమతుల కోసం విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని సమీకరించడానికి ఆ దేశ వస్తుసేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ దేశాలు ముడి ఖనిజాలు, ముడిసరకులు, వ్యవసాయ ఉత్పత్తులు లాంటి వాటిని ఎగుమతి చేస్తాయి.


మూడో ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం గతంలో వలసవాద బాధిత దేశాలే. సామ్రాజ్యవాద దేశాలు విదేశీ వ్యాపారం రూపంలో మూడో ప్రపంచ దేశాలను దోపిడీ చేశాయని ప్రెబిష్, సింగర్, మిర్దాల్, నర్క్స్‌ల అభిప్రాయం. 1960వ దశకంలో జపాన్, సింగపూర్, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా దిగుమతులను సరళీకరించి ఎగుమతులను ప్రోత్సహించడంతో మంచి ప్రగతిని చూపాయి. ఈ విజయాలతో అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు దిగుమతుల సరళీకరణ, ఎగుమతుల ప్రోత్సాహాన్ని సమర్థించాయి. మన దేశంలో 1991లో ఈ తరహా విదేశీ వ్యాపారాన్ని అనుమతించారు.


భారత ఎగుమతులు, దిగుమతులు:


ప్రణాళికల కాలంలో భారత ఎగుమతి దిగుమతులు రెండూ పెరుగుతూ వచ్చాయి. మరోవైపు వ్యాపార లోటు కూడా పెరిగింది. మొత్తం ప్రణాళికా కాలంలో రెండేళ్లు మాత్రమే (1972-73, 1976-77) వ్యాపార మిగులు కనిపించింది. 1990-91లో వర్తకపు లోటు 5.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 1991-92లో దిగుమతులపై ఆంక్షలు విధించడంతో లోటు తగ్గినప్పటికీ పారిశ్రామిక వృద్ధి ప్రతికూలంగా మారింది. 1992-93లో దిగుమతుల సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టడంతో మళ్లీ వ్యాపార లోటు పెరిగింది. ఈ లోటు 2019-20లో 161 బిలియన్‌ డాలర్లకు, 2020-21లో 102 బిలియన్‌ డాలర్లకు, 2021-22లో 191 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2022-23లో వ్యాపార లోటు 267 బిలియన్‌ డాలర్లు ఉంది.


భారతదేశ పది ప్రధాన వస్తు దిగుమతులు


* 1960-61లో శివీలి (పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్లు) దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 6.1 శాతంగా ఉండేవి. 1980-81 నాటికి 41.9 శాతానికి పెరిగాయి. 1991-92 నాటికి ఈ వాటా 25 శాతానికి తగ్గగా, ప్రస్తుతం 26.3 శాతానికి చేరాయి.


* ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల దిగుమతులు పెరిగాయి.


* రత్నాలు, ఆభరణాల దిగుమతులు పెరిగాయి.


* దేశీయంగా బొగ్గు కొరత తలెత్తడంతో బొగ్గు దిగుమతులు పెరిగాయి.


1) పెట్రోలియం, క్రూడ్, పెట్రో ఉత్పత్తులు - 26.39%


2) ఎలక్ట్రానిక్‌ వస్తువులు - 12.06%


3) బంగారం - 7.53%


4) మెషినరీ, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ - 6.51%


5) బొగ్గు, కోక్‌ - 5.17%


6) ముత్యాలు, రత్నాభరణాలు - 5.06%


7) ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్‌ కెమికల్స్‌ - 4.94%


8) రవాణా పరికరాలు - 3.40%


9) కృత్రిమ రెసిన్లు, ప్లాస్టిక్‌ పరికరాలు - 3.29%


10) వంట నూనెలు - 3.09%


భారతదేశ పది ప్రధాన వస్తు ఎగుమతులు


* 1960-61లో ఎగుమతుల్లో 21% ఉన్న జనపనార నేడు 0.01%కి తగ్గింది.


* 1960-61లో రెండో ప్రధాన ఎగుమతిగా తేయాకు 19 శాతం మేర ఉండేది. నేడు 0.3 శాతానికి పడిపోయింది.


* ఇంజినీరింగ్‌ వస్తువులు 1960-61లో 3.4 శాతం ఉంటే నేడు 26.58%కి పెరిగాయి.


1) ఇంజినీరింగ్‌ వస్తువులు - 26.58%


2) పెట్రోలియం ఉత్పత్తులు - 15.98%


3) రత్నాలు, ఆభరణాలు - 9.26%


4) ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్‌ కెమికల్స్‌ - 6.95%


5) డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ - 5.83%


6) రెడీమేడ్‌ దుస్తులు - 3.79%


7) ఎలక్ట్రానిక్‌ వస్తువులు - 3.71%


8) కాటన్‌ యార్న్‌ - 3.62%


9) ప్లాస్టిక్, లినోలియం - 2.33%


10) బియ్యం - 2.29%


* భారత ఎగుమతి, దిగుమతుల పరిశీలనతో వ్యాపార భాగస్వాములను 5 ప్రధాన గ్రూపులుగా విభజించవచ్చు.


1) వీనిదిదీ దేశాలు (యూకే, యూఎస్‌ఏ, స్విట్జర్లాండ్, జపాన్‌)


2) వీశినిది దేశాలు (యూఏఈ, ఇరాక్, సౌదీ అరేబియా)


3) తూర్పు ఐరోపా దేశాలు


4) అభివృద్ధి చెందుతున్న దేశాలు (చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా)


5) ఇతర దేశాలు


1960-61 నుంచి 2021-22 మధ్య విదేశీ వ్యాపారంలో వీనిదిదీ ప్రాధాన్యం తగ్గింది. భారత దిగుమతుల్లో ఈ దేశాల వాటా 78% నుంచి 29%కి పడిపోయింది. అదే సమయంలో వీశినిది దేశాల వాటా 4.6% నుంచి 20%కి పెరిగింది. తూర్పు ఐరోపా సామ్యవాద దేశాలతో మొదట వ్యాపారం విస్తరించినప్పటికీ 1990-91 తర్వాతŸ వీటి వాటా తగ్గింది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు 5.7% నుంచి 36%కి పెరిగాయి.


భారతదేశ దిగుమతుల్లో అధిక వాటా కలిగిన దేశాలు (2022-23): 1) చైనా 2) యూఏఈ 3) అమెరికా 4) సౌదీ అరేబియా 5) ఇరాక్‌


భారతదేశ ఎగుమతుల్లో అధిక వాటా కలిగిన దేశాలు (2022-23): 1) అమెరికా 2) యూఏఈ 3) నెదర్లాండ్స్‌  4) చైనా 5) బంగ్లాదేశ్‌


2022-23లో భారత దేశానికి వ్యాపార మిగులు ఉన్న దేశాలు: 1) అమెరికా 2) బంగ్లాదేశ్‌ 3) నేపాల్‌


భారతదేశానికి వ్యాపార లోటు ఉన్న దేశాలు: 1) చైనా 2) స్విట్జర్లాండ్‌ 3) ఇరాక్‌

ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా: బ్రిటిషర్లు మన దేశానికి వచ్చేనాటికి ప్రపంచ వ్యాపారంలో భారత్‌కు 18 శాతం వాటా ఉండేది. 1950-51 నాటికి ఇది 1.78 శాతానికి పడిపోయింది. దిగుమతుల ప్రతిస్థాపన, ఇన్వాడ్‌ లుకింగ్‌ పాలసీని అనుసరించడం వల్ల 1990 నాటికి ఇది 0.59 శాతానికి తగ్గింది. 1991 నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా విదేశీ వ్యాపారంపై ఆంక్షలు తొలగించడంతో ప్రపంచంలో భారత వ్యాపార వాటా కొంచెం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం 2006 నాటికి 1 శాతానికి, 2008 నాటికి 1.64 శాతానికి చేరింది.


2022లో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) గణాంకాల ప్రకారం ప్రపంచ వస్తు వ్యాపారంలో భారత్‌ ఎగుమతుల వాటా 1.8%, దిగుమతుల వాటా 2.5%. అలాగే వ్యాపార సేవల్లో ఎగుమతుల వాటా 4%, దిగుమతుల వాటా 3.5%. స్థూలంగా ప్రపంచ వస్తుసేవల ఎగుమతుల్లో మన వాటా 2.2%, దిగుమతుల వాటా 2.7%. 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 17-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌