• facebook
  • whatsapp
  • telegram

వస్తు సేవల పన్ను - 2

 ఎగవేతలు తగ్గి.. పారదర్శకత పెరిగి!

ఒక వస్తువు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు ఇంతకు ముందు అనేక రకాల పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కేంద్రం కొన్ని, రాష్ట్రం ఇంకొన్ని వసూలు చేసేవి. ఏది, ఎంత, ఏ ప్రాతిపదికన విధిస్తున్నారో అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. రాష్ట్రాల మధ్య కూడా తేడాలు ఉండేవి. కానీ కొత్తగా వచ్చిన వస్తు సేవల పన్నుతో ఆ గందరగోళం తొలగిపోయింది. పరోక్ష పన్నుల వ్యవస్థను సరళీకరించి దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం వల్ల పాదర్శకత పెరిగింది. పన్ను ఎగవేతలు తగ్గిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను సంస్కరణగా నిలిచిన జీఎస్టీ పుట్టు పూర్వోత్తరాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి ఒకే దేశం-ఒకే పన్ను భావనతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చారు. పరోక్ష పన్నుల సరళీకృత విధానంగా 2017, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 7 రకాల పన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు. దేశీయంగా వినియోగమయ్యే వస్తుసేవల అంతిమ విలువపై జీఎస్టీ లెక్కగడతారు. దీనిని వినియోగదారుడే భరించాలి. కానీ వ్యాపారులు వసూలుచేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ పద్ధతిలో వస్తువుల రవాణా వ్యయం తగ్గి దేశంలో వ్యాపార లావాదేవీలు విస్తరిస్తాయి.

జీఎస్టీ లక్ష్యాలు: 1) పన్నుపై పన్ను (డబుల్‌ ట్యాక్సేషన్‌)ను నిరోధించి ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలపై దుష్ప్రభావాలను తొలగించడం. 2) నాణ్యమైన వస్తువుల తయారీ, మార్కెట్‌లో పోటీతత్వం పెంచడం. 3) బహుళ పన్నుల విధానానికి ముగింపు. 4) ఆర్థికాభివృద్ధికి సహకరించడం.

జీఎస్టీ లాభాలు: 1) పన్నుపై పన్ను తొలగిపోతుంది. 2) ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. 3) పన్ను వసూలును సరిచూసుకోవచ్చు (క్రాస్‌ చెకింగ్‌) 4) పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 5) పన్ను భారాన్ని తగ్గించవచ్చు. 6) అంతర్జాతీయ పోటీకి దోహదపడుతుంది.


జీఎస్టీలో విలీనమైన పన్నులు


ఎ) కేంద్ర స్థాయిలో విలీనమైనవి: 1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు 2) అదనపు ఎక్సైజ్‌ సుంకాలు 3) అదనపు కస్టమ్స్‌ సుంకాలు 4) ప్రత్యేక అదనపు కస్టమ్స్‌ సుంకాలు 5) సేవా పన్ను 6) సెస్‌లు, సర్‌ఛార్జ్‌లు


బి) రాష్ట్ర స్థాయిలో విలీనమైనవి:  1) రాష్ట్ర అమ్మకం పన్ను 2) కేంద్ర అమ్మకం పన్ను (కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసుకునేవి) 3) వినోదపు పన్ను 4) ప్రవేశ పన్ను 5) లగ్జరీ పన్ను 6) కొనుగోలు పన్ను 7) లాటరీ, పందెం, జూదంపై పన్నులు 8) వ్యాపార ప్రకటనలపై పన్నులు 9) రాష్ట్ర సెస్, సర్‌ఛార్జీలు


జీఎస్టీలో విలీనం కాని పన్నులు

ఎ) కేంద్ర స్థాయిలో: 1) ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాలు 2) కస్టమ్స్‌పై ఉన్న సర్‌ఛార్జీలు 3) కస్టమ్‌ సెస్‌లు 4) పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలు 5) గ్యాస్, పొగాకుపై ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు 

బి) రాష్ట్ర స్థాయిలో: 1) మోటారు వాహనాలపై పన్ను 2) మద్యంపై ఉన్న రాష్ట్ర ఎక్సైజ్‌  3) పెట్రోల్‌ ఉత్పత్తులపై ఉన్న వ్యాట్‌


జీఎస్టీ రకాలు

1) కేంద్ర జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వ వాటాను తెలియజేస్తుంది.

2) రాష్ట్ర జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై రాష్ట్ర వాటాను తెలియజేస్తుంది.

3) కేంద్రపాలిత ప్రాంత (యూటీ) జీఎస్టీ: ప్రతి వ్యాపార లావాదేవీలపై కేంద్రపాలిత ప్రాంతాల వాటాను తెలియజేస్తుంది.

4) సమగ్ర (ఇంటిగ్రేటెడ్‌) జీఎస్టీ: రెండు రాష్ట్రాల మధ్య, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య, విదేశీ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీల మధ్య విభజనతో నిమిత్తం లేకుండా సమగ్ర జీఎస్టీ వసూలవుతుంది.

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గితే 2015 - 16 సంవత్సరాన్ని ఆధారం చేసుకుని పన్ను రాబడిలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటుని 14 శాతంగా అంచనా వేసి అంతకంటే తక్కువ ఆదాయం లభిస్తే ఆ నష్టాన్ని అయిదేళ్లు కేంద్రం భరిస్తుంది. (మొదటి మూడేళ్లు 100 శాతం, నాలుగో సంవత్సరం 75 శాతం, అయిదో ఏడాది 50 శాతం భరిస్తుంది)

* జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి డీ-మెరిట్‌ వస్తువులపై ప్రత్యేక సెస్‌ వేసి ఆ మొత్తంతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భారతదేశంలో మొదటిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. దానికో రూపం ఇవ్వడానికి 2002-03లో విజయ్‌ కేల్కర్‌ కమిటీని నియమించింది. చివరికి 2014లో వస్తుసేవల పన్ను విషయంలో ముందడుగు పడింది. ఈ అంశాన్ని 2014, డిసెంబరులో లోక్‌సభలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. 2015లో లోక్‌సభ, 2016లో రాజ్యసభ ఆమోదించాయి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2016, సెప్టెంబరు 8న ఆమోదముద్ర వేశారు. దీంతో 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2017, జులై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

జీఎస్టీ బిల్లు ప్రకారం ఈ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు రాష్ట్రపతి జీఎస్టీ మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి ఛైర్మన్‌. సభ్యులుగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు గానీ, పన్నుల వ్యవహారాలు చూసే మంత్రులు గానీ, ఆ రాష్ట్రం నామినేట్‌ చేసే ఇతర మంత్రులు గానీ ఉంటారు.

జీఎస్టీ మండలి నిర్ణయాలు: జీఎస్టీ కౌన్సిల్‌ కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తుంది. జీఎస్టీ చట్టంలోని 279(ఎ) సెక్షన్‌ కింద ఈ మండలి ఏర్పాటైంది. దీని సచివాలయం దిల్లీలో ఉంటుంది. ఈ మండలి నిర్ణయాలు 3/4వ వంతు మెజారిటీతో అమల్లోకి వస్తాయి. 1/3వ వంతు ఓట్లు కేంద్రానికి, 2/3వ వంతు ఓట్లు రాష్ట్రాలకు ఉంటాయి. కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ బోర్డు అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. అయితే వీరికి ఓటింగ్‌ హక్కు ఉండదు.

సిఫార్సు చేసే అంశాలు:

1) జీఎస్టీలో విలీనం కానున్న పన్నులు, సెస్‌లు, సర్‌ఛార్జీలు

2) జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే వస్తుసేవలు

3) జీఎస్టీ పరిధిలోకి వచ్చేందుకు టర్నోవర్‌ పరిమితి 

4) జీఎస్టీ రేట్లు


పన్ను రేట్లు:  2016, నవంబరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 4వ సమావేశంలో పన్ను రేట్లను 0, 5, 12, 18, 28 శాతాలుగా స్లాబ్‌లను నిర్ణయించారు.

సున్నా శాతం పన్ను (జీరో ట్యాక్స్‌):  ఉదా: రాష్ట్రాలు వ్యాట్‌లో మినహాయించిన అవసర వస్తువులను ఉంచారు. తాజాపండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, ప్యాకింగ్‌ చేయని పాలు, మజ్జిగ, పెరుగు; సహజనూనె, ఉప్పు, బెల్లం, కాయధాన్యాలు, జనపనార, గాజులు, స్టాంపులు, జ్యుడీషియల్‌ పత్రాలు, వార్తాపత్రికలు, పోస్టాఫీసు సేవలు, ఆర్‌బీఐ సేవలు, జన్‌ధన్‌ యోజన పొదుపు ఖాతాపై బ్యాంకు సేవలు.

5 శాతం పన్ను: ఉదా: రూ.వెయ్యి కంటే తక్కువ విలువైన వస్త్రాలు, ప్యాకింగ్‌ చేసిన ఆహార వస్తువులు, పెరుగు, శీతలీకరించిన కూరగాయలు, రూ.500 కంటే తక్కువ విలువైన పాదరక్షలు, అగర్‌బత్తీలు, బ్రాండెడ్‌ పన్నీరు, బ్రాండెడ్‌ కాని ఆయుర్వేద మందులు, జీడిపప్పు, పంచదార, కాఫీ, తేయాకు, వృద్ధుల చేతికర్రలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌స్టేషన్లు, దివ్యాంగులు వాడే వస్తువుల విడి పరికరాలు, వార్షిక టర్నోవర్‌ రూ.50 లక్షల కంటే తక్కువున్న రెస్టారెంట్లు, టైలరింగ్‌ సేవలు, ఎకానమీ క్లాస్‌లో విమాన ప్రయాణం, ప్రింట్‌ మీడియాలో ప్రకటనలు.

12 శాతం పన్ను:  ఉదా: రూ.వెయ్యి కంటే ఎక్కువ విలువైన వస్త్రాలు, బ్రాండెడ్‌ ఆయుర్వేద మందులు, పండ్ల రసాలు, టూత్‌ పౌడర్లు, కుట్టుమిషన్లు, ప్లేయింగ్‌ కార్డ్స్, చెస్‌బోర్డులు, క్యారం బోర్డులు, శీతలీకరించిన మాంసం, ప్యాక్‌ చేసిన డ్రైఫ్రూట్స్, రెడీమేడ్‌ దుస్తులు, సెల్‌ఫోన్లు, రూ.100 లోపు సినిమా టిక్కెట్లు, బిజినెస్‌ క్లాస్‌ విమాన ప్రయాణం, రూ.1001 నుంచి రూ.7500 వరకు హోటల్‌ టారిఫ్‌ సేవలు.

18 శాతం పన్ను: ఉదా: 32 అంగుళాల్లోపు టీవీలు, మానిటర్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్‌లు, డిజిటల్‌ కెమెరాలు, మార్బుల్స్, గ్రానైట్‌; రూ.100 కంటే ఎక్కువున్న సినిమా టికెట్లు, రూమ్‌ టారిఫ్‌ రూ.7501 పైన ఉన్న హోటల్స్, ఐటీ, టెలికాం సేవలు.

28 శాతం పన్ను: ఈ జాబితాలో ప్రారంభంలో 226 రకాల  వస్తువులు ఉండేవి. ప్రస్తుతం 28 వస్తువులకు తగ్గించారు. 

ఉదా: ఏసీలు, ఆటోమొబైల్స్, ఆటోమొబైల్‌ విడి పరికరాలు, సిమెంటు, డీ-మెరిట్‌ వస్తువులైన పాన్‌మసాలా, పొగాకు, సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీలు, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగులు మొదలైనవి.

* బంగారం, బంగారు ఆభరణాలపై జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ, ప్లాటినమ్‌ అనుకరణ ఆభరణాలపై 3% జీఎస్టీ విధిస్తారు. ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు, రియల్‌ ఎస్టేట్‌పై స్టాంప్‌ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీలను జీఎస్టీ నుంచి మినహాయించారు. రూ.40 లక్షల్లోపు టర్నోవర్‌ ఉన్న సంస్థలు జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాయి.

నెలవారీ రాబడి:  కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా జీఎస్టీ వసూలు చేస్తుంది. ఈ గణాంకాల ఆధారంగా జీఎస్టీ వార్షిక సగటు వసూళ్లను నిర్ణయిస్తారు. దేశంలో 2017 - 18లో జీఎస్టీ నెలవారీ వసూళ్లు రూ.82,294 కోట్లు కాగా, 2018 - 19 నాటికి రూ.96,114 కోట్లకు పెరిగాయి. 2019 - 20లో రూ.1,01,844 కోట్లు, 2021లో రూ.1.15 లక్షల కోట్లకు చేరాయి. 2022 - 23 ఆర్థిక సర్వే ప్రకారం జీఎస్టీ నెలవారీ సగటు వసూళ్లు రూ.1.24 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.

పన్నులపై నియమించిన వివిధ కమిటీలు: 1) జాన్‌ మత్తాయ్‌ కమిటీ (1953) - కార్పొరేట్‌ పన్ను 2) కాల్డర్‌ కమిటీ (1956) - బహుమతి, సంపద, వ్యయం, మూలధన ఆదాయాలపై పన్నులు 3) మహావీర్‌ త్యాగీ కమిటీ (1959) - ప్రత్యక్ష పన్నుల పరిశీలన 4) చందా కమిటీ (1964) - పన్ను ఎగవేత నిరోధానికి సూచనలు 5) భూతలింగం కమిటీ (1967) - పన్ను విధానాల ఆధునికీకరణ 6) ఎన్‌.డి.తివారీ కమిటీ (1967) - కస్టమ్స్‌ సుంకాలపై 7) వాంఛూ కమిటీ (1970) - ప్రత్యక్ష పన్నులు, పన్ను ఎగవేత, నల్లధనంపై 8) కె.ఎన్‌.రాజ్‌ కమిటీ (1972) - వ్యవసాయ ఆదాయంపై పన్ను 9) ఎల్‌.కె.ఝా కమిటీ (1976 - 78) - పరోక్ష పన్నులు (వ్యాట్‌) 10) చోక్సీ కమిటీ (1977) - ప్రత్యక్ష పన్నుల సులభతరం 11) రాజా చెల్లయ్య కమిటీ (1991) - ప్రత్యక్ష, పరోక్ష పన్నులు (సేవా పన్నును సూచించింది) 12) రేఖీ కమిటీ (1992) - పరోక్ష పన్నులు 13) పార్థసారథి షోమ్‌ (2001, 2012) - 10వ ప్రణాళికలో పన్నుల మీద నిర్ణయాలు  14) విజయ్‌ కేల్కర్‌ (2002) - ప్రత్యక్ష, పరోక్ష పన్నులు  (జీఎస్టీ). 


రచయిత: ధరణి శ్రీనివాస్

Posted Date : 12-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌