• facebook
  • whatsapp
  • telegram

వస్తు సేవల పన్ను

జీఎస్టీ చరిత్ర

* 2000లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణల కోసం డా.సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటుచేసింది.
* ఈ కమిటీ జీఎస్టీ విధివిధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ్‌బెంగాల్‌ ఆర్థికమంత్రి అసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో మరో బృందాన్ని నియమించాలని సిఫార్సు చేసింది. 
* దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్ల బాధ్యతనూ దీనికే అప్పగించారు. అందుకే గుప్తాను జీఎస్టీ రూపశిల్పిగా పేర్కొంటారు. 
* పన్ను సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
* 12వ ఆర్థికసంఘం సూచించిన విధంగా జీఎస్టీని తీసుకురావాలని కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సు చేసింది.
* 2011లో డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జీఎస్టీ అమలు కోసం లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

 

వస్తు సేవల పన్ను -  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అన్ని వస్తు, సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్షపన్నును వస్తు-సేవల పన్ను(Goods and Services Tax - GST) అంటారు. దీని అమలుతో మిగిలిన పరోక్ష పన్నులు ఏవీ ఉండవు. పన్నుల సరళీకరణ  జరిగి వ్యాపారం సులభతరం అవుతుంది.


ప్రాధాన్యం
* దేశంలో ఎక్కడికైనా వస్తు రవాణా సులభమవుతుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా ఆవిర్భవిస్తుంది.
* పన్నులపై పన్నులు ఉండవు.
* స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) 1 నుంచి 1.5 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది.
* అధికసంఖ్యలో వస్తువులకు పన్ను మినహాయింపు ఉంటుంది.
* సగటు ఆదాయం ఉన్న వ్యక్తులు గరిష్ఠ ప్రయోజనం పొందుతారు.
* నమోదు, సుంకం చెల్లింపు, రిటర్న్‌దాఖలు, పన్నుల వాపసు కోసం ఉమ్మడి విధానాలు.
* అధిక పన్నుల ప్రవాహాన్ని తొలగించడానికి తయారీదారు/ సరఫరాదారు నుంచి వినియోగదారు/ రిటైలర్‌కు నిరంతరాయంగా పన్ను క్రెడిట్‌ అవుతుంది.
* మన ఎగుమతులు అంతర్జాతీయంగా పోటీపడేలా ఉండేందుకు పన్నుల తటస్థీకరణ  ప్రభావవంతంగా జరుగుతుంది.
* తమ ఉత్పత్తులను చౌకగా తయారు చేయడానికి చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తాయి.
* ఏకీకృత ఉమ్మడి జాతీయ మార్కెట్‌ కల్పన.
* భారతదేశం తయారీ రంగ హబ్‌గా రూపొందుతుంది.
* పెట్టుబడులు, ఎగుమతులు పెరుగుతాయి.
* పెరిగిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రజలకు మరింత ఉపాధి దొరుకుతుంది.
* వస్తు, సేవలపై ప్రస్తుతం విధిస్తున్న అనేక పన్నులు తగ్గుతాయి. దాంతో సరళీకరణ సాధ్యమవుతుంది.
* దేశవ్యాప్తంగా పన్ను చట్టాలు, విధానాలు, ధరల సమన్వయం.
* పన్ను నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంపొందించడానికి వస్తు, సేవల వర్గీకరణకు ఉమ్మడి విధానం.
* పెరిగిన పోటీ వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 
* దేశవ్యాప్తంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులకు అనువైన ప్రదేశం.
* ప్రజల్లో ఐకమత్యం, జాతీయ భావాలు పటిష్ఠం అవుతాయి.


పరిణామక్రమం - అమలు తీరు

* 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ మౌలిక స్వరూపాన్ని ఆ ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొంది.
* 2010లో జీఎస్టీ మౌలికస్వరూపంపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చింది.
* 2011లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించడంతో దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు.
* 2013లో జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం రూ.9000 కోట్ల నిధులను ప్రకటించారు.
* 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు కాలం చెల్లింది.
* 2016, ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని 2015, ఫిబ్రవరి 8న అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.
* 2016, మార్చిలో జీఎస్టీ రేట్లపై పరిమితి విధించాలనే ప్రతిపక్షాల ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం అంగీకరించింది.
* 2016, ఆగస్టు 3న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది.
* 2016, ఆగస్టు 8న జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.
* 2016, సెప్టెంబరులో ఈ బిల్లుకు 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.
* 2016, నవంబరులో నాలుగు అంచెల పన్ను స్వరూపాన్ని జీఎస్టీ మండలి ఖరారు చేసింది.
* 2017, మార్చిలో జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన నాలుగు బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించింది.
* జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు 2017, జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమైంది.
* మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది.
* వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలై విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారులకు చేరే వరకు అన్ని దశల్లోనూ పన్నులు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య ఈ పన్నులు మారుతూ ఉంటాయి. 
* పన్నుపై పన్ను విధించడంతో వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో వాటి ధరలు కొన్ని చోట్ల తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 
* దీనికోసమే భారత్‌ పన్ను వ్యవస్థలో మార్పులు చేసి ‘ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌’  (One Nation - One Tax One Market) భావనను అమలుచేసింది. 
* పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం  భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. 
* 2016, సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జీఎస్టీ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది.
* 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో 2017, జులై 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీని అమలు చేశారు (జమ్మూ కశ్మీర్‌ మినహా).
* మనదేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం - అసోం (2016, ఆగస్టు 12).
* దాదాపు 130 కోట్ల జనాభా, 2.3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో దేశం ఏకీకృత మార్కెట్‌గా రూపొందింది.


పన్ను విధానం

ఒక వస్తువు విలువ పన్నుతో కలిసి రూ.100 అనుకుంటే 10 శాతం జీఎస్టీ ప్రకారం అది చివరకు ఎంత అవుతుందో పరిశీలిద్దాం. 
* పత్తి నూలు విలువ రూ.100 అనుకుందాం. దాన్ని నేతన్న చీరగా తయారు చేశాడు. దాని తయారీ ఖర్చుగా రూ.30 తీసుకున్నాడు. ఆ చీర విలువ రూ.130 అవుతుంది. 
* జీఎస్టీ ప్రకారం ఇక్కడ మొత్తం విలువపై పన్ను ఉండదు. నేతన్న తీసుకున్న రూ.30 కే పన్ను విధిస్తారు. (అంటే రూ.3 మాత్రమే). అప్పుడు చీర విలువ రూ.133 అవుతుంది. 
* నేతన్న నుంచి రూ.133కి కొన్న చీరను టోకు వ్యాపారి రూ.20 లాభంతో రూ.153కి దుకాణదారుడికి  అమ్మాడని అనుకుందాం. ఇక్కడ జీఎస్టీ ప్రకారం వ్యాపారి లాభం రూ.20పై మాత్రమే పన్ను (రూ.2 మాత్రమే) ఉంటుంది. ఇప్పుడు చీర విలువ రూ.155 అవుతుంది. హోల్‌సేలర్‌ నుంచి రూ.155కి కొన్న చీరను దుకాణదారుడు రూ.10 లాభంతో రూ.165కి అమ్మాడు అనుకుందాం. అప్పుడు లాభం రూ.10పై మాత్రమే పన్ను వేస్తారు. 
* అంటే ఇక్కడ పన్ను రూ.1 మాత్రమే. అంటే మొత్తం చీర విలువ రూ.166 అవుతుంది. 
* మొత్తం పన్ను 10 + 3 + 2 + 1 = రూ.16 అవుతుంది.


ప్రపంచ దేశాల్లో జీఎస్టీ 

* 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్‌ జీఎస్టీని అమలు చేసింది. ప్రస్తుతం 160 దేశాల్లో జీఎస్టీ/ వ్యాట్‌ అమల్లో ఉంది. 
* జీఎస్టీ అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా. అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం ఉంది.
* ఆస్ట్రేలియా 2000లో జీఎస్టీని ప్రవేశపెట్టింది.
* న్యూజిలాండ్‌ 1986లో 10% పన్ను రేటుతో జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ రేటును 1989లో 12.5%; 2010లో 15 శాతానికి పెంచింది.
* 1989లో జపాన్‌లో వినియోగ పన్నును (3%) ప్రవేశపెట్టారు. దాన్ని 1997లో 5%; 2012లో 10 శాతానికి పెంచారు. 
* కెనడాలో 1991లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. మన దేశంలో ఉన్నట్లే అక్కడా ద్వంద్వ విధానం (రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ) అమలవుతోంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రావిన్స్‌లకు ఉంది. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై మూడు ప్రావిన్స్‌లు దావా వేశాయి. 
* కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ జీఎస్టీని ప్రవేశపెట్టింది. అమల్లో సవాళ్లు ఏర్పడటంతో రెండేళ్లలోనే తిరిగి పాత పన్ను విధానానికే మారింది.
* 1994లో సింగపూర్‌లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక హక్కుల సంస్థలు జీఎస్టీని వ్యతిరేకించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కార్పొరేట్‌-ఐటీ పన్ను తర్వాత జీఎస్టీ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. 
* 2015లో మలేసియాలో జీఎస్టీని అమలు చేశారు.
* 2016లో చైనా వ్యాట్‌ సంస్కరణలను పూర్తిచేసింది. సంక్లిష్టంగా ఉన్న వ్యాపార పన్ను వ్యవస్థ స్థానంలో వాటిని ప్రవేశపెట్టింది. వ్యాపార, ఇతర పన్నులను తొలగించడంతో అక్కడ స్థిరాస్తి రంగం మెరుగుపడింది. చైనాలో కొన్ని సరకులపై పాక్షిక జీఎస్టీ ఉంది.
* బ్రెజిల్‌లో జీఎస్టీ స్థానంలో వ్యాట్‌ అమల్లో ఉంది. అయితే ప్రాంతాల మధ్య పన్ను రేట్లలో వ్యత్యాసాలు ఎక్కువ. ఈ రేటు సావోపౌలో 17% ఉంటే, రియో డిజెనీరోలో 18% పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరఫరా పన్ను రేట్లు వేర్వేరుగా (4 నుంచి 25 శాతం వరకు) ఉన్నాయి.
* సీషెల్స్, కాంగో, గాంబియా, మలేసియా దేశాల్లో గత అయిదేళ్ల నుంచే జీఎస్టీ అమల్లో ఉంది.


వివిధ దేశాల్లో పన్ను (శాతాల్లో)

దేశం పన్ను శాతం
బ్రెజిల్‌ 4 - 25
బ్రిటన్, ఫ్రాన్స్‌ 20
భారత్, రష్యా 18
చైనా 17
మెక్సికో 16
దక్షిణాఫ్రికా 14
ఆస్ట్రేలియా 10
జపాన్, స్విట్జర్లాండ్‌ 8
థాయ్‌లాండ్‌ 7
మలేసియా 6
కెనడా 5
Posted Date : 30-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌