• facebook
  • whatsapp
  • telegram

  ప్రభుత్వ బడ్జెట్‌

సర్కారు ఆర్థిక నిర్వహణ సాధనం!

   ప్రభుత్వ పాలనలో అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. ప్రజల కోసం రోడ్లు వేయాలి, వంతెనలు కట్టాలి. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలి. జీతాలు, సబ్సిడీలు,పెన్షన్లు ఇవ్వాలి. అందుకోసం ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. అప్పులు చేస్తుంది. వీటన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ ఆర్థికవృద్ధిని సాధించడానికి సాయపడే కీలక సాధనం బడ్జెట్‌. ఇది ప్రభుత్వ ప్రాధాన్యాలను, విధానాలను ప్రతిబింబిస్తుంది.  భవిష్యత్తు లక్ష్యాలతో, వర్తమాన అవసరాలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ అంశాలపై సమగ్ర అవగాహనను పోటీ పరీక్షల అభ్యర్థులు పెంపొందించుకోవాలి. 


Budget అనే ఆంగ్ల పదం Bougate  అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వచ్చింది. దీనికి సంచి (Bag) అని అర్థం. భారత రాజ్యాంగంలో 112 అధికరణలో బడ్జెట్‌ అనే పదానికి బదులు Annual Financial Statement of Central Government  అనే పదాన్ని ఉపయోగించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో దేశానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం, ఏ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాల బడ్జెట్‌ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. భారతదేశ బడ్జెట్‌ ముసాయిదా వివరాలను కేంద్రం పార్లమెంటుకు సమర్పిస్తుంది. 2017 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టి, మార్చిలో మార్పులు చేర్పులు చేసి చట్టసభ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెస్తున్నారు.


ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళికనే బడ్జెట్‌ అని చెప్పవచ్చు. రాబోయే ఏడాదిలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపులు, సంబంధిత పరిమాణాత్మక విలువలను ఇది తెలియజేస్తుంది. అలాగే చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున సమర్పిస్తారు. దానికి ముందురోజు ఆర్థిక సర్వే, అంతకు ముందు రోజు రైల్వే బడ్జెట్‌ను సమర్పిస్తారు. 


2017-18 బడ్జెట్‌ని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. 1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టి బ్రిటిష్‌ సంప్రదాయాన్ని విడిచిపెట్టారు. అదేవిధంగా 2017-18 బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిరోజున ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని వదిలేసి, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంభించారు.


మనదేశంలో సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేయాలని అక్వర్త్‌ కమిటీ 1921లో సూచించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేసి చూపిస్తున్నారు. బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ సిఫార్సులపై 2016 సెప్టెంబరులో రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌తో కలిపేందుకు అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా 2017-18 బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి చూపుతున్నారు. 


బ్రిటిష్‌ పాలనలో భారతదేశ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు జేమ్స్‌ విల్సన్‌ (1860). స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్‌ని ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి (1947) ప్రవేశపెట్టారు. ఆనాటి ఆదాయం రూ.171 కోట్లు కాగా, వ్యయం రూ.194 కోట్లు. గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను జాన్‌ మత్తాయ్‌ 1949 - 50లో ప్రవేశపెట్టారు.

* ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్‌ (10 బడ్జెట్‌లు), రెండో స్థానంలో పి.చిదంబరం (9 బడ్జెట్‌లు) ఉన్నారు.


* బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని నెహ్రూ, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ.

 ప్రధానిగా ఉంటూ విత్తమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది

* జవహర్‌లాల్‌ నెహ్రూ - 1958 - 59

* ఇందిరాగాంధీ - 1970 - 71 

* రాజీవ్‌గాంధీ - 1987 - 88

* మన్మోహన్‌సింగ్‌ - 2009 - 10


రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు ప్రణబ్‌ ముఖర్జీ. తొలిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌ (1951 - 52). కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్, మొదటి మహిళ ఇందిరా గాంధీ.


కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌ను రాజ్యసభ 14 రోజుల్లోపు ఆమోదించి తిరిగి పంపించాలి. లేకపోతే రాజ్యసభ ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.


* కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే ప్రారంభ సమయం సందర్భంగా నిర్వహించే వేడుక హల్వా - సెర్మనీ.


* రైల్వే బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి మహిళ మమతా బెనర్జీ.

భారతదేశ బడ్జెట్‌ నిర్మాణం: దేశ బడ్జెట్‌లో భాగంగా రాబోయే ఏడాదికి అంచనా వేసిన రాబడులు, చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం మూడు ఖాతాలుగా చూపుతుంది. 1) సంఘటిత నిధి 2) ఆగంతుక నిధి 3) ప్రభుత్వ ఖాతా.


సంఘటిత నిధి: కేంద్రం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని మార్గాల నుంచి వచ్చే రాబడి మొత్తం సంఘటిత నిధిలో చేరుతుంది. ప్రభుత్వం చేసే అన్ని రకాల వ్యయాలను ఈ నిధి నుంచి సేకరించాలి. పార్లమెంటు అనుమతి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నిధి నుంచి కావాల్సినంత మొత్తాన్ని సేకరించవచ్చు.


ఆగంతుక నిధి: పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం వ్యయం చేయాల్సి వస్తుంది. భారత దేశాధ్యక్షుడి అధీనంలో ఉన్న ఆగంతుక నిధి నుంచి ప్రభుత్వం ఆ వ్యయం చేయవచ్చు. అయితే తర్వాత పార్లమెంటు ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ఈ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని కేంద్రం తిరిగి జమ చేయాలి.


ప్రభుత్వ ఖాతా: సంఘటిత నిధి ఖాతాలో భారత ప్రభుత్వ రాబడి, వ్యయాల గణాంకాలతోపాటు ఇతర లావాదేవీలు కూడా ఉంటాయి. అలాంటి లావాదేవీల్లో ఉద్యోగుల భవిష్యనిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు ముఖ్యమైనవి. 


వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఈ మొత్తాలను వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహా ఈ లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం లేదు.

బడ్జెట్‌ - రకాలు: కొన్ని అంశాల ప్రాతిపదికపై బడ్జెట్‌ను పలు రకాలుగా విభజిస్తారు.


1) రాబడి, వ్యయాల ఆధారంగా బడ్జెట్‌లు: దీనిలో రెండు రకాలు ఉన్నాయి.


ఎ) సంతులిత బడ్జెట్‌: రాబోయే సంవత్సరంలో వ్యయాలు, రాబడులకు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్‌ అంటారు. అప్పుడు మిగులు కానీ, లోటు కానీ ఉండదు.


బి) అసంతులిత బడ్జెట్‌: రాబోయే ఏడాదిలో ప్రభుత్వ వ్యయాలు.. రాబడులకు సమానంగా లేకపోతే అది అసంతులిత బడ్జెట్‌. వ్యయం కంటే రాబడి ఎక్కువ ఉంటే మిగులు బడ్జెట్‌. వ్యయం కంటే రాబడి తక్కువ ఉంటే లోటు బడ్జెట్‌. 


2) సరళత్వాన్ని బట్టి బడ్జెట్‌లు: ఇవి రెండు రకాలు.


ఎ) స్థిర బడ్జెట్‌: బడ్జెట్‌ను అమలు చేసే కాల పరిమితిలో మార్పు లేకుండా స్థిరంగా ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయి, అంచనా వేసిన బడ్జెట్‌ కార్యక్రమాల స్థాయి సమానంగా ఉంటుంది.


బి) చర బడ్జెట్‌: అభివృద్ధి దశల్లోని మార్పులకు అనుకూలంగా, ఇతర అత్యవసర పరిస్థితులు కల్పించే మార్పుల వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థాయి మారుతుంది. కాబట్టి అంచనా వేసిన బడ్జెట్‌ కార్యక్రమాల స్థాయికి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయికి తేడా వస్తుంది.


3) గతేడాది కేటాయింపుల ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) సంప్రదాయ బడ్జెట్‌: గడిచిన సంవత్సరం కేటాయింపుల ఆధారంగా వర్తమాన సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు జరిగితే దాన్ని సంప్రదాయ/ఆధారిత బడ్జెట్‌ అంటారు. 


ఉదా: భారత్‌లో అమలు చేసే బడ్జెట్‌ విధానం.


బి) శూన్య ఆధారిత బడ్జెట్‌: గతంలో అమలు చేసిన బడ్జెట్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు చేసేది శూన్యధార బడ్జెట్‌. అంటే ప్రతి సంవత్సరం 0 నుంచి కొత్తగా ఆలోచించి కేటాయిస్తారు. 1969 పీటర్‌ఫైర్‌ (అమెరికా) దీన్ని ఒక ప్రైవేట్‌ పరిశ్రమలో ప్రవేశపెట్టారు. రాజీవ్‌ గాంధీ కాలంలో వి.పి.సింగ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు 1986-87లో భారత్‌లో శూన్యధార బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది కొనసాగలేదు. ఏపీలో 2000-01లో యనమల రామకృష్ణుడు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని దీర్ఘకాలిక బడ్జెట్‌ అని కూడా అంటారు.


4) సంఖ్య ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) బహుళ బడ్జెట్‌: ఆర్థిక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్‌లు ఉంటే అది బహుళ బడ్జెట్‌. భారత్‌లో 1924 తర్వాత రైల్వే, సాధారణ బడ్జెట్లు ఉండేవి. ఇది బహుళ బడ్జెట్‌ విధానం. 


ఉదా:

* కర్ణాటకలో 2011-12 నుంచి వ్యసాయ బడ్జెట్‌. 


* ఆంధ్రప్రదేశ్‌లో 2013-14 నుంచి వ్యవసాయ బడ్జెట్‌.


ఇవి సాధారణ బడ్జెట్‌లో కాకుండా విడిగా ప్రవేశపెట్టడం వల్ల బహుళ బడ్జెట్‌లోకి వస్తాయి.


బి) ఏక బడ్జెట్‌: ఆర్థిక వ్యవస్థలో ఒకే ఒక బడ్జెట్‌ను ప్రవేశపెడితే అది ఏక బడ్జెట్‌. 2017-18 నుంచి ఈ విధానాన్ని భారత్‌ అమలు చేస్తోంది.


5) పాలన సౌకర్యం ఆధారంగా: ఇవి రెండు రకాలు.


ఎ) కుంటి బాతు బడ్జెట్‌: ఇది ఏడాదిలో కొంత కాలానికి మాత్రమే సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలను, విధానాలను ప్రతిబింబించే బడ్జెట్‌. దీనిలో సూచించే రాబడులు, వ్యయాల వివరాలు సంవత్సరంలోని కొంత కాలానికి మాత్రమే సంబంధించి ఉంటాయి. రాజకీయ పరిపాలన అనిశ్చితి పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్‌ను అనుసరిస్తారు.


బి) అనుబంధ బడ్జెట్‌: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లాంటి అత్యవసర సమయంలో ప్రధాన బడ్జెట్‌ కాకుండా అనుబంధ బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టి అమలు చేయవచ్చు.


6) కాలపరిమితి బడ్జెట్‌: ఒక నిర్దిష్ట కాలానికి రూపొందించే బడ్జెట్‌. 

ఉదా:

* భారత్‌లో బడ్జెట్‌ కాలం - ఒక సంవత్సరం 


* అమెరికాలో బడ్జెట్‌ కాలం - రెండేళ్లు 


* సింగపూర్‌లో బడ్జెట్‌ కాలం - ఆరు నెలలు


7) మధ్యంతర బడ్జెట్‌: ప్రభుత్వం కొనసాగే వీలు లేనప్పుడు, ఎన్నికలు దగ్గర పడినప్పుడు స్వల్పకాలానికి రూపొందించే బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. సాధారణంగా ఈ బడ్జెట్‌ కాలం 2 నెలలు నుంచి 6 నెలలు. ఈ బడ్జెట్‌లో వ్యయాలు మాత్రమే ఉంటాయి.


8) బహిరంగ బడ్జెట్‌: ప్రజలకు బహిరంగపరిచి వారి సూచనలు, సలహాలు తీసుకుని ఆ మేరకు అవసరమైన మార్పులు చేసి చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందే బడ్జెట్‌. ఈ రకమైన బడ్జెట్‌ను 2002-03లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు.


9) ఔట్‌ కమింగ్‌ బడ్జెట్‌: 2005లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి ఈ రకమైన బడ్జెట్‌కు మార్గదర్శకాలను రూపొందించారు.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌