• facebook
  • whatsapp
  • telegram

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

ద్రవ్యం - విధులు


ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం నిర్వర్తించే విధులను రెండు రకాలుగా విభజించారు. అవి:

1. ప్రాథమిక విధులు     2. ద్వితీయ విధులు


ప్రాథమిక విధులు


ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:


విలువ కొలమానం (Measures of value) : అన్ని వస్తు, సేవల విలువను ద్రవ్యంతో కొలుస్తారు. ఆ విలువను ద్రవ్యరూపంలో పేర్కొంటే ధర ఏర్పడుతుంది.


వినిమయ మాధ్యమం(Medium of exchange) : వస్తువుకు, వస్తువుకు మధ్య ద్రవ్యం మధ్యవర్తిగా ఉంటుంది. ఇది అమ్మకాలు, కొనుగోళ్లు చేయడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ప్రజల సమయం, శక్తి ఆదా అవుతాయి. 


ద్వితీయ విధులు


ఇందులో మూడు రకాలు ఉన్నాయి. అవి:


విలువ నిధి(Store of value): జె.ఎం. కీన్స్‌ విలువ నిధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంపద అనేది ప్రస్తుత వినియోగానికే కాక, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.


వాయిదా చెల్లింపుల ప్రమాణం(Standard of deferred Payments): వ్యాపార, వ్యవహారాలు అరువు పద్ధతిలో కూడా నిర్వహించేందుకు ద్రవ్యం తోడ్పడుతుంది. ‘వాయిదా’ అంటే చెల్లింపులను భవిష్యత్తులో చేయడం.


విలువ బదిలీ(Transfer of value):  ఒక వ్యక్తి ఒక ప్రదేశంలోని ఆస్తిని అమ్మి, మరొక ప్రదేశంలో కొత్త ఆస్తిని కొనొచ్చు. రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం కూడా ద్రవ్యరూపంలోనే జరుగుతుంది. డేవిడ్‌ కిన్లే విలువ బదిలీ విధిని కింది విధంగా వివరించాడు. అవి:


ఎ) జాతీయాదాయ మదింపు - పంపిణీ: జాతీయాదాయాన్ని కొలవడంలో ద్రవ్యం సహాయపడుతుంది. వివిధ వస్తు, సేవల విలువను ద్రవ్యం రూపంలోకి మార్చి జాతీయాదాయాన్ని కొలుస్తారు.


బి) ఉపాంత ప్రయోజనాలు, ఉత్పాదకతలను సమానం చేసేదిగా ఉంటుంది: వస్తువుల ధరలు వాటి ఉపాంత ప్రయోజనాలను సూచించడమే కాక, అవి ద్రవ్యరూపంలోనే ఉంటాయి. కాబట్టి వివిధ వస్తువుల ఉపాంత ప్రయోజనాలను సమానం చేయడంలో ద్రవ్యం సహాయపడుతుంది.


సి) పరపతిని సృష్టించడం: ద్రవ్యం లేకుండా పరపతి సాధనాలు చలామణిలో ఉండే అవకాశం లేదు.


డి) అధిక  ద్రవ్యత్వ ఆస్తి: అన్ని రకాల సంపదను ద్రవ్యంలోకి మార్చవచ్చు.


వస్తు ద్రవ్యం 


వస్తు మార్పిడి లేదా వినిమయ పద్ధతి: ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతిని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి అమల్లో ఉండేది. ప్రాచీనకాలంలో మనిషి వస్తువును ద్రవ్యంగా ఉపయోగించాడు. ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, అమెరికాలో పొగాకు, సముద్రతీర ప్రాంతాల్లో అరుదైన గవ్వలు, భారతదేశంలో గోవులను ద్రవ్యంగా వాడారు.


లక్షణాలు: ప్రజల కోరికలు పరిమితంగా ఉంటాయి.


* వినిమయ మాధ్యమం ఉండదు.


*  ప్రత్యక్షంగా వస్తువుకు బదులు వస్తువును మార్పిడి చేసుకుంటారు.


* లావాదేవీలు మందకొడిగా ఉంటాయి.


*  పరిమితమైన మార్కెట్‌ ఉంటుంది.


లోపాలు: ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల విషయంలో ఏకాభిప్రాయం ఉండకపోవొచ్చు.


* వస్తువు విలువను కొలిచే ప్రామాణిక కొలమానం లేదు.


* వస్తువులను విభజించలేం.


* వస్తువులను నిల్వ చేసుకోవడం కష్టం.


* సేవల మార్పిడికి పనికిరాదు.


* వాయిదా చెల్లింపులకు పనికిరాదు.


* ప్రత్యేకీకరణకు ఉపయోగపడదు.


* విలువలను బదిలీ చేయలేం.


కాగితపు ద్రవ్యం 


ఇందులో కాగితాన్ని ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీని చలామణికి ప్రభుత్వ అనుమతి ఉంటుంది.


*  ప్రపంచంలోనే మొదటిసారి క్రీ.శ.9వ శతాబ్దంలో చైనాలో కాగితపు ద్రవ్యాన్ని ఉపయోగించారు.


*  కాగితపు ద్రవ్యాన్ని పెద్ద మొత్తంలో వాడటం క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో ప్రారంభమైంది.


*  మన దేశంలో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది.

 

*  1861 పేపర్‌ కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితం కరెన్సీని జారీచేసే అధికారాన్ని కల్పించింది. అప్పటి నుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీ చేసేది.


*  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 1935, ఏప్రిల్‌ 1న ఏర్పడింది. ఆర్‌బీఐ 1938 నుంచి కరెన్సీ నోట్లను జారీచేస్తోంది.


*  మన దేశంలో కాగితం కరెన్సీని మొదటగా జారీ చేసింది - బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌. ఇది 1806లో దీన్ని తెచ్చింది.


*  కాగితం కరెన్సీ సౌకర్యవంత వినిమయ మాధ్యమంగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు, నిల్వ చేయొచ్చు. ఈ కారణంగానే కాగితం కరెన్సీ ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది.


పాల్‌ ఐన్‌జిగ్‌ వర్గీకరణ

పాల్‌ ఐన్‌జిగ్‌ తాను రచించిన‘‘How money is managed'' అనే పుస్తకంలో ద్రవ్య విధులను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి: 

1. నిశ్చల విధులు 

2. చలన (గతిశీల) విధులు


నిశ్చల విధులు: ద్రవ్యం అనేది వినిమయ సాధనం, విలువల కొలమానం,  విలువల నిధి లాంటి సంప్రదాయక విధులను నిర్వహిస్తుంది. వీటిని నిశ్చల విధులు లేదా సాంకేతిక విధులు అంటారు. ఈ విధుల వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై ఎలాంటి ప్రభావం ఉండదు. 


చలన విధులు: ద్రవ్యం తన విధుల ద్వారా ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేస్తే వాటిని చలనాత్మక విధులు అంటారు.


ద్రవ్య పరిణామక్రమం


ద్రవ్య పరిణామక్రమంలో ముఖ్యంగా కింది దశలు  ఉంటాయి. అవి:

1. వస్తు ద్రవ్యం   2. లోహ ద్రవ్యం

3. కాగితపు ద్రవ్యం  4. పరపతి ద్రవ్యం 

5. సమీప ద్రవ్యం


లోహ ద్రవ్యం 


నాగరికత, అభివృద్ధి చెందిన వ్యాపార సంబంధాలు పెరగడం వల్ల లోహ ద్రవ్యం వాడుకలోకి వచ్చింది. బంగారం, వెండి, రాగి, మొదలైన లోహాలను ద్రవ్యంగా వాడేవారు.


*  లోహాన్ని ప్రారంభంలో కడ్డీల రూపంలో లేదా ముద్దరూపంలో వాడారు. తర్వాతి కాలంలో నాణేలుగా చలామణిలోకి తెచ్చారు.


*  నాణేలను మొదటగా క్రీ.పూ. 700లో వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.


పరపతి ద్రవ్యం 


ప్రజలు తమ వద్ద అవసరానికంటే ఎక్కువగా ఉన్న డబ్బును బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంచుతారు. 


*  ఆ ధనాన్ని వారు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు లేదా ఇతరులకు బ్యాంకు చెక్కుల ద్వారా బదిలీ చేయొచ్చు. 


* బ్యాంకు చెక్కును పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యం అంటారు. 


సమీప ద్రవ్యం 


ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు మొదలైనవాటిని సమీప ద్రవ్యంగా పేర్కొంటారు.


*  వీటికి ద్రవ్యత్వం ఎక్కువ. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో వీటిని నగదులోకి మార్చుకోవచ్చు.


ద్రవ్యం - రకాలు 

స్వభావం ఆధారంగా ద్రవ్యాన్ని కింది విధాలుగా వర్గీకరించారు. అవి:  

1. పదార్థాన్ని బట్టి ద్రవ్యం రకాలు

2. చట్టబద్ధతను బట్టి ద్రవ్యం రకాలు

3. ద్రవ్యత్వాన్ని బట్టి ద్రవ్యం రకాలు

4. ఇతర రకాలు


 

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌