• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో భూసంబంధాలు

1956కు ముందు పరిస్థితులు
ఏ ఆర్థిక వ్యవస్థ పరిణామక్రమాన్నైనా నిర్దేశించేది భూ సంబంధాల అమరికే. ఎందుకంటే వ్యావసాయిక మిగులు దోపిడీ ద్వారా పారిశ్రామిక పెట్టుబడిగా రూపాంతరం చెందుతుంది. భూమిపై సాగు కోసం, యాజమాన్య హక్కుల కోసం జరిగిన పోరాటాలే ప్రపంచంలో అత్యధికంగా కనిపిస్తాయి. భూమి కోసం, భుక్తి కోసం వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం (1946-51) ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఈ ఉద్యమానికి కారణమైన నైజాం కాలం నాటి భూ సంబంధాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..

నిజాం సంస్థానంలోని ఉద్యోగులు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్, దేశ్‌పాండే లాంటి భూస్వాములంతా అధికార దర్పంతో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. వీరి ఫ్యూడల్ విధానాలతో నిజాం సంస్థానంలోని రైతులు, కూలీలు, ఇతర వృత్తులవారు దోపీడీ, దౌర్జన్యాలకు గురయ్యారు.సాగుభూమిలో ఎక్కువ భాగం, అందులోనూ సారవంతమైన భూములన్నీ భూస్వాముల చేతుల్లో ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో రైతులకు భూమిపై హక్కులు (పట్టాలు) ఉన్నప్పటికీ భూస్వాములు వాటిని పట్టించుకునేవారు కాదు. రైతుల్లో ఎక్కువ భాగం పేదవారే.

హైదరాబాద్ రాజ్యంలో..
హైదరాబాద్ రాజ్యంలో వ్యవసాయ భూమి 5.3 కోట్ల ఎకరాలు. నిజాం ప్రభువు రాజ్యంలోని మొత్తం భూమికి సర్వాధికారి. భూమిశిస్తు వసూలు అధికారం, వసూలైన శిస్తును ఎవరు ఎంత పొందుతున్నారనే అంశం ఆధారంగా రాజ్యంలోని భూమిని ఖాల్సా లేదా దివానీ, గైర్‌ఖాల్సా భూమి (సర్ఫేఖాస్, జాగీర్లు, సంస్థానాలు, ఇనాంలు లాంటివి)గా పేర్కొనవచ్చు.


ఖాల్సా లేదా దివానీ
ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండే భూమి ఖాల్సా భూమి. మొత్తం వ్యవసాయ భూమిలో (5.3 కోట్ల ఎకరాల్లో) సుమారు 60 శాతం భూమి (3 కోట్ల ఎకరాలు) ఖాల్సా భూమి ఉండేది. ప్రభుత్వ యంత్రాంగమే ఈ భూమిలో శిస్తు వసూలు చేసేది. దివాన్(ప్రధానమంత్రి) ఆధ్వర్యంలో ఈ వ్యవహారాలు చూసేవారు కాబట్టి ఈ భూమిని 'దివానీ' అని కూడా అనేవారు. సాలార్‌జంగ్ రైత్వారీ సంస్కరణలు చేపట్టక ముందు ఖాల్సా భూమిలో శిస్తు వసూలకు దళారి వ్యవస్థనే ఉండేది. పాన్‌మక్తా, సర్‌బస్తా, ఇజారా పద్ధతులు అందులో ముఖ్యమైనవి.

1. పాన్‌మక్తా: కొన్ని భూములను ప్రభుత్వం కౌలు పెంచడానికి వీల్లేని అంగీకారంతో నిర్ణీత కౌలుకు ఇచ్చేవారు. కౌలుకు తీసుకున్న వారు.. నిర్ణయించిన కౌలును ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన ఆదాయాలను తాము పొందేవారు. దీన్నే పాన్‌మక్తా అనేవారు.

2. సర్‌బస్తా: భూమిశిస్తు వసూళ్లను వేలం వేయగా వేలం పాటలో అధిక మొత్తానికి పాడినవారికి కౌలు దక్కేది. ఇది నిర్ణీత కాలం వరకే ఉండేది. ఆ గడువు పూర్తయిన తర్వాత తిరిగి కౌలులో మార్పునకు వీలుండేది. దీన్ని 'తాహుదు' లేదా 'సర్‌బస్తా' లేదా 'బిల్‌మక్తా' అనేవారు. అయితే ఈ తాహుదుదార్లు లేదా బిల్‌మక్తాదార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం కంటే అనేక రెట్లు ఎక్కువ శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించింది పోగా మిగిలినదంతా తామే ఉంచుకునేవారు. అధిక శిస్తు వసూలు వల్ల రైతులు పీడనకు గురయ్యేవారు.

3. ఇజారా: నిర్మానుష్యమైన గ్రామాల్లో పునరావాసం కల్పించడానికి, సేద్య యోగ్యమైన భూములను సాగులోకి తెచ్చే ఉద్దేశంతో సాలార్‌జంగ్ ఈ కౌలు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ప్రారంభంలో కౌలు నామమాత్రంగానే ఉన్నా క్రమంగా పెరుగుతూ ఉండేది. 1908లో ఈ విధానాన్ని రద్దు చేశారు.


రైత్వారీ విధానం
భూమిశిస్తు వసూళ్లలోని లోపాలను.. ముఖ్యంగా సర్‌బస్తా విధానంలోని వేలంపాటలో భూమిని పొంది రైతులను పీడిస్తున్న మధ్య దళారీ వ్యవస్థను తొలగించడానికి సాలార్‌జంగ్ 1875 (1317 ఫస్లీ)లో సర్వే సెటిల్‌మెంటు జరిపి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. భూమిశిస్తు వసూలను నేరుగా ప్రభుత్వ యంత్రాంగమే చేసేటట్లు మార్పులు చేశాడు. 'తరీధారాలు' (పల్లపు శిస్తు) ఎకరానికి 20 నుంచి 22 రూపాయలుగా నిర్ణయించారు.


అంతవరకు సర్‌బస్తా కాలంలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ దేశ్‌ముఖ్, సర్ దేశ్‌ముఖ్, దేశాయి, సర్ దేశాయి లాంటి బిరుదులిచ్చి అధికారాలిచ్చారు. రుసుం అనే పద్ధతి ద్వారా 'వతన్‌లు' లేదా 'మాష్' (ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇచ్చే ఫింఛన్లు)లను అంతకుముందు వసూలు చేసిన పన్నుల ప్రాతిపదికపై ఇచ్చేవారు. కానీ దేశ్‌ముఖ్, సర్ దేశ్‌ముఖ్, దేశాయి, సర్‌దేశాయి అనేవారు తమకున్న అధికారం, సర్వే సెటిల్‌మెంటులోని లోపాలు, రికార్డుల నిర్వహణలోని లోపాలు, రైతుల నిరక్ష్యరాస్యతలను ఆసరాగా చేసుకొని వేల ఎకరాలను తమపేరున రాసుకొని ఖాల్సా ప్రాంతంలో పెద్ద భూస్వాములుగా తయారయ్యారు. అటు జాగీర్దారులను ఆదర్శంగా తీసుకొని ఈ పెద్ద భూస్వాములు కూడా తమ ప్రాంతాల్లో అనేక విధాలుగా అధికారాలను సాగించే ప్రయత్నాలు చేసేవారు.
ఈ విధంగా పేరుకు ప్రభుత్వ భూమి అయిన ఖాల్సా గ్రామాల్లో కూడా ఫ్యూడల్ విధానం ప్రధాన సమస్యగా మారింది.


కౌలుదారీ విధానం
రైత్వారీ విధానంలో మధ్యవర్తిత్వం లేకుండా దున్నేవాడితో ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండాలి. కానీ ఆచరణలో క్రమక్రమంగా ఇందులో కూడా తిరిగి దళారుల ప్రవేశం పెరుగుతూ వచ్చింది. పట్టేదారుగా ఉన్న ఆసామి తానే స్వయంగా సేద్యం చేయకుండా ఇతరులకు కౌలుకు ఇచ్చే విధానం ద్వారా కౌలుదారీ పద్ధతి ఆచరణలోకి వచ్చింది.

1. పట్టేదారు: భూ యజమానిగా రికార్డుల్లో పేరు నమోదైన రైతును 'పట్టేదారు' అంటారు. సాధారణంగా పట్టేదారే స్వయంగా లేదా పాలేరు సాయంతో సేద్యం చేసేవాడు.

2. పోటు పట్టేదారు: ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువమంది ఉమ్మడి పట్టేదారులుగా ఉంటే, వారిని పోటుపట్టేదారు అంటారు. అసలు పట్టేదారు.. పోటు పట్టేదారును బేదఖలు (భూమి నుంచి వెళ్లగొట్టడం లేదా సేద్యం చేయనియ్యకపోవడం) చేయలేడు. అంతేకాదు శిస్తు కూడా మార్చలేడు.

3. షిక్మిదారు: పట్టేదారు కొన్ని షరుతులపై తన భూమిని సేద్యం చేసేవారికి ఇచ్చినప్పుడు ఆ సేద్యపు దారులను 'షిక్మిదారు'లంటారు. వీరు శాశ్వత కౌలుదార్లు. షరతులను అమలు చేసినంత కాలం పట్టేదారు, షిక్మిదారులను బేదఖలు చేయడానికి వీల్లేదు.

4. ఆసామీ షిక్మిదారు: వీరు ఏ హక్కులూ లేని సామాన్య కౌలుదార్లు. నిజానికి ఆసామీ షిక్మిదార్లు కౌలుభూమిని 12 సంవత్సరాలు తమ స్వాధీనంలో ఉంచుకోగలిగినప్పుడు షిక్మిదారులుగా గుర్తింపు లభించేది. కానీ హైదరాబాద్ రాజ్యంలోని ఫ్యూడల్ వ్యవస్థలో ఇది సాధ్యపడేదికాదు. ఒకవేళ స్వాధీనంలో ఉన్నప్పటికీ దాన్ని రుజువు చేసుకోవడం సులభమయ్యేదికాదు. అందువల్ల వారు ఆసామీ షిక్మిదార్లు (రక్షణ లేని కౌలుదార్లు) గానే కొనసాగేవారు. ఈ విధంగా ఖాల్సా లేదా దివానీ భూమి పేరుకు ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నట్లు కనిపించినా పెద్ద భూస్వాములు, దళారీల వ్యవస్థ సామాన్య రైతుల యాజమాన్య హక్కులను, సాగు అవకాశాలను అనిశ్చితిలోకి నెట్టింది. భూకేంద్రీకరణ, కౌలు భద్రత లేకపోవడం, అధిక శిస్తు వసూలు, భూస్వాముల దౌర్జన్యాలు లాంటివన్నీ ఖాల్సా రైతులను కుంగదీశాయి.


గైర్ ఖాల్సా
గైర్‌ఖాల్సా భూమి మొత్తం ప్రభుత్వభూమిలో 40 శాతంగా ఉండేది. ఇందులో నిజాం సొంత కమతం (సర్ఫేఖాస్) 10 శాతం కాగా, మిగిలిన 30 శాతం జాగీరుదార్లు, సంస్థానాలు, ఇనాందార్లు లాంటి పేర్లతో ఉండేవి.

1. సర్ఫేఖాస్: నిజాం సొంత ఖర్చుల కోసం నిర్దేశించిన పెద్ద జాగీరు లేదా గ్రామాలను సర్ఫేఖాస్ అనేవారు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా నిజాం ఖజానాకు చేరేది. సర్ఫేఖాస్ గ్రామాలు మొత్తం 1,961. ఇవి 8,109 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేవి. ఈ గ్రామాలు సంస్థానమంతా వ్యాపించి ఉన్నా, పరిపాలన మాత్రం ఒకే కేంద్రం ద్వారా సాగేది. ఈ పరిపాలనకు అధినేతగా నిజాం ఉండేవాడు.

2. జాగీర్లు: జాగీరు పదం 'జై-గిర్' అనే పర్షియా పదాల నుంచి వచ్చింది. వీటికర్థం 'ఆధీనంలో ఉంచుకొన్న ప్రాంతం'. రాజుకు ప్రత్యేకంగా సేవ చేయడానికి లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని, స్థాయిని నిలబెట్టడానికి ఉచితంగా దానం చేసిన గ్రామాలనే 'జాగీర్' అంటారు. నిజాం రాజు తనకు పరిపాలనలో సహకరించిన ముస్లిం, హిందూ పెద్ద మనుషులను సైనిక జనరల్స్, రెవెన్యూ, ఆర్థికశాఖల నిర్వాహకులుగా నియమించి వారి అవసరాల కోసం లేదా ఖర్చుల కోసం భూమిశిస్తును వసూలు చేసుకునే అధికారంతో జాగీర్లను కేటాయించారు. వారసత్వ అధికారంతో జాగీరు భూమిలో భూమిశిస్తును వసూలు చేసుకుని అనుభవించే అధికారం మాత్రమే వారికుంది. కాని కొందరు జాగీరుదార్లు ఆయా గ్రామాల్లోని ఆబ్కారీ, అటవీ, మత్స్యశాఖలపై అధికారం చెలాయించడంతో పాటు పోలీసు, న్యాయ పరిపాలన కూడా నిర్వహించేవారు.

జాగీర్లు ఆరు రకాలు
పాయిగా జమియత్ జాగీర్లు: పాయిగా లేదా అస్తబల్ అంటే గుర్రాలను కట్టివేసే స్థలం. తొలుత నిజాం అలీఖాన్ అనే రాజు అబుల్ బైర్‌ఖాన్‌కు అశ్వదళాలను పోషించడానికి ప్రతిఫలంగా జాగీర్లను ఇచ్చాడు. ఈ పాయిగా జాగీర్లు 4,352 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేవి.

ఆల్‌తమ్గా జాగీర్లు: రాజముద్రతో శిస్తు మినహాయించి ఇచ్చిన ప్రత్యేక జాగీర్లు ఇవి. వీటిని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. కానీ అమ్మడం, దానధర్మాల ద్వారా అన్యాక్రాంతం చేయడానికి వీలులేదు.

జాత్‌జాగీర్లు: ఎలాంటి సేవ చేసే షరతులు లేకుండానే తమ పోషణకై ఇచ్చినవి.

తన్‌ఖా జాగీర్లు: రాజుకు.. రాజ్యానికి సేవచేసేవారి జీతభత్యాల కోసం ఈ జాగీర్లు ఇచ్చారు.

మష్రూతి జాగీర్లు:
మత, సివిల్, సైనిక సంబంధ సేవలు చేసే షరతుపై ఇచ్చినవి. షరతులు అమలులో ఉన్నంత కాలమే ఈ జాగీర్లు కూడా ఉండేవి.

మదద్ మాష్ జాగీర్లు: జీవిత పోషణ కోసం లేదా ఇతర ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయానికి మరింత సహాయం కోసం ఇచ్చిన జాగీర్లు.
వివిధ రూపాల్లో ఇలా ఇచ్చిన జాగీర్లు హైదరాబాద్ రాజ్యంలో 6,535 గ్రామాలు గానూ, 40,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మొత్తం భూమిలో 30.9 శాతం ఉండేవి. హైదరాబాద్‌లో మొదటి జాగీరును 1726లో నిజాం ఉల్‌ముల్క్ ఇవ్వగా, చివరి జాగీరును మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911) కాలంలో ఇచ్చారు. 1922 నాటికి జాగీర్ల సంఖ్య 1167 కాగా, 1949 నాటికి 1500కు చేరుకుంది.

3. సంస్థానాలు: నిజాం రాజ్యస్థాపనకు పూర్వం అనేక చిన్న, పెద్ద ప్రాంతాలపై అధిపతులుగా హిందూ రాజులుండేవారు. నిజాం వీరి హక్కులను అంగీకరించి, ప్రతి సంవత్సరం 'పేష్కష్' పేర నిర్ణీతమైన సొమ్మును వసూలు చేసేవారు. సంస్థానాధీశులకు విస్తృతమైన పరిపాలనా అధికారాలుండేవి. మొత్తం 14 సంస్థానాలున్నప్పటికీ వాటిలో 5 పెద్ద సంస్థానాలను (గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, పాల్వంచ) మాత్రమే దివానీ పాలన (ప్రభుత్వ ప్రత్యక్ష పాలన) నుంచి మినహాయించారు. వీరి ఆధీనంలో 497 గ్రా మాలు.. 5,030 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేవి. మిగతా సంస్థానాలను చిన్న జాగీర్లుగా వ్యవహరించేవారు.

4. ఇనాం భూములు: పూర్వపు హైదరాబాద్ సంస్థానంలోని నిజాం ప్రభుత్వం, జాగీరుదార్లు, సంస్థానాధీశులు, తమ గ్రామాల్లో ఉన్న భూములను 'ఇనాం' (బహుమతి)గా ఇచ్చేవారు. కొన్ని విధులను నిర్వహించినందుకు ప్రతిఫలంగా ఆయా భూముల నుంచి భూమిశిస్తును పొందేహక్కు పూర్తిగానో, కొంత భాగమో ఆ ఇనాందారుకు సంక్రమించేది. ఒకవేళ పూర్తి గ్రామమే ఇనాందారులకు ఇస్తే దాన్ని 'ఉమ్లి' అని పిలిచేవారు. హైదరాబాద్ సంస్థానంలో మొత్తం ఇనాందార్ల సంఖ్య 83,000 కాగా, ఇందులో 57,000 మంది దివానీ ప్రాంతంలో ఉండగా, 26,000 మంది జాగీర్లలో ఉండేవారు. వీరి ఆధీనంలో సుమారు 8,00,000 ఎకరాల ఇనాం భూమి ఉండేది. (ఈ ఇనాములు 1. ఆరాజమక్తా 2. ఆరాజ అగ్రహార్ 3. మజరామక్తా 4. సేరి ఇనాం 5. బలవతా ఇనాం 6. నీరడి ఇనాం 7. ఖిద్‌మత్ ఇనాం 8. దేవాదాయ ఇనాం 9. ధర్మాదాయ ఇనాం లాంటి పేర్లతో ఉండేవి.)

ఇనాం భూములు తెలంగాణ ప్రాంతంలో విస్తీర్ణం పరంగా మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అధికంగా ఉండేవి. సాధారణంగా అనేక విధాలుగా ప్రభుత్వానికి సేవలు చేసే పేద ప్రజలకు ఇచ్చే ఇనాంలు చిన్నచిన్న కమతాలుగా ఉండేవి. బలవతా ఇనాం, నీరడి ఇనాం, ఖిద్‌మత్ ఇనాంలు ఇలాంటివే. గ్రామ సాముదాయిక అవసరాలు తీర్చే వెనుకబడిన కులాలవారికి ఇచ్చే చిన్న కమతాలు ఇవి. జాగీరుదార్లు, సంస్థానాధిపతులు తమ తరుఫున వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించేవారికి పెద్ద కమతాలను ఇనాంలుగా ఇచ్చేవారు. అవే ఆరాజమక్తా, ఆరాజ అగ్రహార్, మజరామక్తా, సేరీ ఇనాం లాంటివి. దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చినవి దేవాదాయ ఇనాంలు కాగా, ధార్మిక కార్యకలాపాల నిర్వహణకు ధర్మాదాయ ఇనాంలు ఇచ్చారు.

భూ కేంద్రీకరణ - అనుపస్థితి భూస్వాములు
హైదరాబాద్ సంస్థానంలోని భూ సంబంధాల వల్ల భూకేంద్రీకరణ అధికంగా జరిగి అనుపస్థితి భూస్వాముల సంఖ్య పెరిగింది. జాగీరుదార్లు సంస్థానాలతో పాటు దేశ్‌ముఖ్, దేశ్‌పాండే లాంటి వతన్‌దారులు పెద్ద భూస్వాములుగా అవతరించారు. ముఖ్యంగా వతన్‌దారులు తాము పన్ను వసూలు చేసే కాలంలోనే వందల, వేల ఎకరాల్లో అతి సారవంతమైన భూమిని సొంత భూములుగా దాఖలు చేసుకున్నారు. ఈ భూముల్లో సాగు చేసుకునే రైతులను ఎప్పుడైనా తొలగించే వీలు వీరికుండేది. దీంతో రైతులు కౌలుదార్ల స్థితికి దిగజారారు. గ్రామాల్లోని సారవంతమైన భూములు, నీటివనరులు, ఫలవృక్షాలన్నీ ఈ పెద్ద భూస్వాములవే. రైతులు నోరు మెదపకుండా ఉండేవారు. గ్రామాల్లో తగాదాలు ఏర్పడితే దొరలు తమ గడీల (కోటల్లాంటి భవనాలు)లో పరిష్కరించేవారు. జాగీరుదార్లు, దేశ్‌ముఖ్‌లు చాలామందికి తుపాకీ లైసెన్సులు ఉండేవి. అశ్విక దళాలు, సాయుధ బలగాలు కూడా ఉండేవి. జాగీరుదార్లు దేశ్‌ముఖ్‌ల లాంటి పెద్ద భూస్వాముల చేతుల్లో భూకేంద్రీకరణ జరిగిన విధానాన్ని వారి స్వాధీనంలో ఉన్న భూములే తెలియజేస్తాయి.

వీరే కాకుండా 10-20 వేల ఎకరాల వరకూ ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. వడ్డేపల్లి దేశ్‌ముఖ్ పింగిళి వెంకటరామిరెడ్డి తెలంగాణ మొత్తానికి ఆబ్కారీ కాంట్రాక్టుతో గ్రామాలపై అజమాయిషీ కలిగి ఉండేవాడు. 1950-51 నాటి పరిపాలనా నివేదిక ప్రకారం వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 500 ఎకరాలకు పైగా భూమి ఉన్న భూస్వాముల సంఖ్య 550 అని.. సాగులో ఉన్న మొత్తం భూమిలో 70శాతం వారి ఆధీనంలో ఉందని తెలుస్తోంది. అనుపస్థితి భూస్వాముల సంఖ్య 1891లో ఒక లక్ష కాగా, 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగింది.

జాగీరు గ్రామ ప్రజల స్థితిగతులు
సిద్ధాంత రీత్యా జాగీరుదారుకు భూమిశిస్తు అనుభవించే హక్కు ఉండి భూమితో ఎలాంటి నిమిత్తం లేకపోయినా, తానే భూ యజమానిగా వ్యవహరించేవాడు. జాగీరు గ్రామాల్లోని రైతులు సామాన్య కౌలుదారు స్థాయికి పరిమితమయ్యేవారు. జాగీరుదార్లలో కొందరు పన్నుల వల్ల వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించేవారు. మరికొంత మంది అసలేమీ చెల్లించేవారు కాదు. వీరు నిజాం కింద ఉప సామంతులుగా వ్యవహరించేవారు. గైర్‌ఖాల్సా ప్రాంతంలో ఎలాంటి సర్వే సెటిల్‌మెంట్ లేదు. రైతులకు భూమ్మీద గానీ, చివరకు తమ ఇళ్లమీద గానీ ఏ హక్కులు లేవు. గ్రామం వదిలి వెళ్లాల్సి వస్తే వట్టిచేతులతో వెళ్లాల్సిందే. సర్వాధికారాలు అనుభవించే జాగీరుదార్లు ఎప్పుడూ జాగీర్లలో ఉండకుండా బొంబాయిలో విలాస జీవితం గడిపేవారు. తమ విలాసాల కోసం జాగీరు గ్రామాల రైతులను దోపిడీ చేసేవారు. ఖాల్సా గ్రామాల్లో కంటే 25-50 శాతం వరకూ అధిక పన్నులు గైర్‌ఖాల్సా గ్రామాల్లో ఉండటం జాగీరుదార్ల దోపిడీకి నిరద్శనం. అంతేకాకుండా అక్రమ వసూళ్లు నిలిపివేయాలని నిజాం జారీచేసిన ఫర్మానాలో 82 రకాల నిర్బంధ వసూళ్ల వివరాలు కనిపిస్తాయి. వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల కంటే కౌలుపెంపుపై, బలవంతపు శిస్తు వసూళ్లపైనే జాగీరుదార్ల ఆలోచనలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానపు రెవెన్యూ ఆదాయం 8 కోట్ల రూపాయలు కాగా, 110 మంది జాగీరుదార్ల ఆదాయం 10 కోట్ల రూపాయలకు పైగా ఉండటం దోపిడీకి మరో ఉదాహరణ.

వెట్టి (నిర్బంధ ఉచితసేవ), నాగు (అప్పుగా తెచ్చిన ధాన్యంమీద ఇచ్చే వడ్డీ ధాన్యం) పద్ధతులు సామాన్య ప్రజానీకాన్ని పీల్చిపిప్పి చేయడానికి ఉపయోగపడ్డాయి. తెలంగాణలో దొరల అరాచకాల వల్ల ప్రజలు పడిన అరిగోస (తీవ్రమైన కష్టాలను) కథలు కథలుగా విన్నదే. పర్యవసానంగా వచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం భూ సంబంధాల మార్పును అనివార్యం చేసింది. ఈ క్రమంలోనే తదనంతరం దున్నేవాడికే భూమిపై హక్కును కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల భూసంస్కరణల చట్టాలను ప్రవేశపెట్టాయి.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌