• facebook
  • whatsapp
  • telegram

జనాభా

ఒక దేశ ప్రగతికీ, పతనానికీ జనాభా ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. అవసరమైన స్థాయిలో పెరిగే జనం అభివృద్ధికి దోహదపడితే, అడ్డుఅదుపూ లేకుండా వృద్ధి చెందే జనాభా అథోగతికి దారితీస్తుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతుంటాయి. ఆర్థిక వ్యవస్థ అధ్యయనంలో భాగంగా జనాభా తీరుతెన్నులను అభ్యర్థులను తెలుసుకోవాలి. 

 

ఆర్థికాభివృద్ధి భౌతికమైన సహజ వనరులపైనే కాకుండా మానవ వనరుల మీద కూడా ఆధారపడుతుంది. మానవ వనరులు అంటే ముఖ్యంగా దేశంలోని జనాభా, విద్య, ఆరోగ్యం, పోషకాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ. వీటిలో జనాభా ముఖ్యమైంది. 

  ఒక దేశంలోని జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు ఆ దేశ అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఒక దేశ జనాభా అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే జనాభా అభిలషణీయ స్థాయిని దాటి పెరుగుతుంటే అది ప్రగతికి ఆటంకంగా మారి పతనానికి కారణమవుతుంది. అప్పటి వరకు సాధించిన ఆర్థికాభివృద్ధిని హరించి అనర్థాలకు దారితీస్తుంది.

  స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో జనాభా లెక్కల సేకరణ తొలిసారిగా 1872లో లార్డ్‌ మేయో కాలంలో ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో 1881లో లార్డ్‌ రిప్పన్‌ కాలంలో జరిగింది. స్వాతంత్య్రం తర్వాత 1948లో జనాభా లెక్కల సేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం 1951లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. మన దేశంలో పదేళ్లకోసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. 1951 - 2011 మధ్య 7 సార్లు జనాభా లెక్కలను సేకరించారు. ఇది కేంద్ర జాబితాకు చెందిన అంశం. మన దేశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఆఫీస్‌ ఆఫ్‌ ది రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియాను 1961లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 2011 జనాభా లెక్కల సేకరణ సెన్సెస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.చంద్రమౌళి, ప్రస్తుత సెన్సెస్‌ కమిషనర్‌ వివేక్‌ జోషి.     

 

జనాభా - భావనలు

జనాభా: ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా అంటారు. 

 

జనసాంద్రత: ఒక దేశంలో ప్రతి చ.కి.మీ.కు నివసించే జనసంఖ్యను జనసాంద్రత అంటారు.

 

జనాభా విస్ఫోటం: మరణాల రేటు తగ్గుతూ జననాల రేటు పెరుగుతుండటం వల్ల మొత్తం జనాభాలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా పెరుగుతున్న జనాభా పరిస్థితిని జనాభా విస్ఫోటం అంటారు.

 

జననాల రేటు: దేశంలో ప్రతి 1000 మందికి పుట్టేవారి సంఖ్య.

 

మరణాల రేటు: దేశంలో ప్రతి 1000 మందికి మరణించే వారి సంఖ్య.

 

సంతాన ఉత్పత్తి రేటు: సగటున ఒక స్త్రీ (15 - 49 ఏళ్ల మధ్య వయసు) తన పునరుత్పత్తి కాలంలో జన్మనిచ్చే పిల్లల సంఖ్య.

 

శిశు మరణాల రేటు: పుట్టిన తేదీ నుంచి సంవత్సరంలోపు అంటే తొలి జన్మదినం చూడక ముందే దేశంలో ప్రతి 1000 జననాలకు మరణించే శిశువుల సంఖ్య.

 

మాతా మరణాల రేటు (MMR): ఒక లక్ష మంది స్త్రీలలో ప్రసవ సమయంలో మరణించే తల్లుల సంఖ్య.

 

ఆయుర్దాయం (జీవన ప్రమాణం): సగటున ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో తెలిపేది.

 

లింగ నిష్పత్తి: దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య.

 

బాల, బాలికల నిష్పత్తి: దేశంలో ప్రతి 1000 మంది బాలలకు (0-6 ఏళ్ల మధ్య వయసు) బాలికల సంఖ్య.

 

అక్షరాస్యులు: ఏదైనా ఒక భాషను చదివే, రాసే సామర్థ్యం ఉన్న వారిని అక్షరాస్యులు అంటారు.

 

దశాబ్ద జనాభా వృద్ధిరేటు: దేశంలో రెండు కాలాల మధ్య పెరిగే జనాభా వృద్ధిరేటు. ఉదా: 2001 - 2011 మధ్య జనాభా వృద్ధి 1.63%

* భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు అని తెలిపినవారు - టి.ఆర్‌.మాల్థస్‌

* భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అని తెలిపినవారు - ఎడ్విన్‌ కానన్‌

 

జనాభా పరిణామ సిద్ధాంతం

1798లో థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ ‘యాన్‌ ఎస్సే ఆన్‌ ది ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌’ అనే పుస్తకాన్ని రచించారు. జనాభా పరిణామ సిద్ధాంతం జనన, మరణాల రేటు, ఆర్థికాభివృద్ధికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా వర్గీకరించారు.

 

మొదటి దశ: ఈ దశలో జనన, మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది.

 

రెండో దశ: దీనిలో మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉంటుంది.

 

మూడో దశ: ఈ దశలో తగ్గిన మరణాల రేటుకు అనుకూలంగా జననాల రేటు కూడా తగ్గుతుంది.

 

నాలుగో దశ: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆరోగ్య, వైద్య సదుపాయాలు విస్తరించి మనిషి సగటు జీవిత కాలం పెరిగి మరణాల రేటు గణనీయ స్థాయిలో తగ్గుతుంది.

 

జనాభా పెరుగుదలకు కారణాలు

* అధిక జననాల రేటు

* తక్కువ మరణాల రేటు

* వలసలు వెళ్లడం 

* వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడటం

* నగరీకరణ

* పేదరికం

* చిన్న వయసులో వివాహం

* ఉమ్మడి కుటుంబాలు

* నిరక్షరాస్యత

* గర్భనిరోధక పద్ధతులు పరిమితంగా ఉండటం

* రోగాల నియంత్రణ

* కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం

* ఆరోగ్య, వైద్య సదుపాయాలు లేకపోవడం

* ఇతర కారణాలు (పారిశుద్ధ్యం, తాగునీరు లాంటివి) 

 

ప్రభుత్వ చర్యలు

కేంద్ర ప్రభుత్వం 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కొన్ని చర్యల ద్వారా అమలు చేసింది. దీని ఉద్దేశం జనాభా పెరుగుదలను అరికట్టడం.

- వివాహ వయసును పెంచడం

- ఉపాధి

- ఆదాయ పంపిణీ

- విద్య 

- స్త్రీల హోదా మెరుగుపరచడం

 

ప్రపంచ జనాభా గణాంకాల స్వరూపం

*1830 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్‌ (100కోట్లు)  ఉండగా 1987 జులై 11 నాటికి 5 బిలియన్లకు  (500 కోట్లు)  చేరింది. ప్రతి సంవత్సరం జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

* యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (UNPF) నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 1999 అక్టోబరు 12 నాటికి 6 బిలియన్లకు (600 కోట్లు) చేరింది. అందుకే ఐక్యరాజ్య సమితి ఆ రోజును 6 బిలియన్‌ రోజుగా ప్రకటించింది.

 

UNPF - SOWP 2022 నివేదిక ప్రకారం 

* మొత్తం భారతదేశ జనాభా 140.66 కోట్లు.

* 2020 - 25 మధ్య సగటు వార్షిక జనాభారేటు మార్పు 0.9 శాతం

* మొత్తం జనాభాలో 0 - 14 ఏళ్ల వయసు మధ్య జనాభా 25 శాతం, 10 - 19 ఏళ్ల వయసు మధ్య జనాభా 18 శాతం, 10 - 24 ఏళ్ల వయసు మధ్య జనాభా 27 శాతం,  15 - 64 ఏళ్ల వయసు మధ్య జనాభా 68 శాతం, 65 సంవత్సరాలు దాటిన జనాభా 7 శాతం ఉన్నారు.

* సంతాన ఉత్పత్తిరేటు 2.1% గా ఉంది. పురుషుల సగటు జీవితకాలం 69 ఏళ్లు ఉండగా స్త్రీ సగటు జీవిత కాలం 72 సంవత్సరాలుగా ఉంది.

*ప్రపంచ విస్తీర్ణంలో భారత్‌ వాటా 2.4%. 1951లో మన దేశంలో మొత్తం జనాభా 36.11 కోట్లు.

*జనాభా పరంగా ప్రపంచంలో రెండో పెద్ద దేశం భారత్‌. 2011 నాటికి ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా వాటా 17.5%.

 

భారతదేశ జనాభా గణాంకాలు (2011 - 2021)

జాతీయ గణాంక సంస్థ (విళీవ్శీ నివేదిక 2021 ప్రకారం దేశంలో 2011లో వార్షిక జనాభా వృద్ధిరేటు 1.63% ఉండగా 2021 నాటికి 1.07% కు తగ్గింది. 2001 - 2011 మధ్య జనాభా 18.19 కోట్లు పెరిగింది. 2011 ప్రకారం దేశంలో మొత్తం జనాభా 121.06 కోట్లు. దీనిలో పురుష జనాభా 62.31 కోట్లు,  స్త్రీ జనాభా 58.75 కోట్లు, గ్రామీణ జనాభా 83.35 కోట్లు, పట్టణ జనాభా 37.71 కోట్లుగా ఉంది.

2021 ఎన్‌ఎస్‌ఓ నివేదిక: 2021లో దేశ జనాభా 136.13 కోట్లు. దీనిలో పురుష జనాభా 69.90 కోట్లు, స్త్రీ జనాభా 66.24 కోట్లు, గ్రామీణ జనాభా 89.14 కోట్లు, పట్టణ జనాభా 46.99 కోట్లుగా ఉంది. 

 

2011 ప్రకారం అధిక జనాభా రాష్ట్రాలు 

1) ఉత్తర్‌ ప్రదేశ్‌ - 19.98 కోట్లు  (16.49%)

2) మహారాష్ట్ర - 11.24 కోట్లు (9.29%)

3) బిహార్‌ - 10.41 కోట్లు (8.58%)

4) పశ్చిమ్‌ బంగా - 9.13 కోట్లు (7.55%)

* తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం (6.11 లక్షలు)(0.05%). 

* అధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దిల్లీ (1.68 కోట్లు), తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు (64,473).

* దేశంలో అధిక జనాభా ఉన్న జిల్లా మహారాష్ట్రలోని థానే (1.10 కోట్లు), తక్కువగా ఉన్న జిల్లా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ది బాంగ్‌ వ్యాలీ (7,900 మంది). 

* దేశ జనసాంద్రత ప్రతి చ.కి.మీ. 382. ఎక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం బిహార్‌ (1106), తక్కువ జనసాంద్రత రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌ (17). ఎక్కువ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దిల్లీ (11,320), తక్కువగా అండమాన్‌లో (46) ఉంది.

 

 లింగ నిష్పత్తి: 2011లో దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 943 ఉంటే అది 2021 నాటికి 948కి పెరిగింది. 2011 లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ (1084), తక్కువగా ఉన్న రాష్ట్రం హరియాణా (879). ఎక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (1037), తక్కువగా డామన్‌ డయ్యూలో (618) ఉంది.

 

బాల బాలికల నిష్పత్తి: 2011లో దేశంలో మొత్తం బాల బాలికల నిష్పత్తి 918 ఉంది. 2011 ప్రకారం దేశంలో ఎక్కువ బాల బాలికల నిష్పత్తి ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ (972), తక్కువగా హరియాణాలో (834) ఉంది. ఎక్కువ బాల బాలికల నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌ (968), తక్కువగా దిల్లీలో (871) ఉంది.

 

అక్షరాస్యత రేటు: 2011లో దేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 73%. దీనిలో పురుషుల అక్షరాస్యత రేటు 80.9%,  స్త్రీల అక్షరాస్యత రేటు 64.6%గా ఉంది. అధిక అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం కేరళ (94%), తక్కువ బిహార్‌లో (61.8%) ఉంది. ఎక్కువ అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు (91.8%), తక్కువ అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్‌ 76.2%.

 

జాతీయ గణాంక సంస్థ - 2021 నివేదిక ప్రకారం 2017 నాటికి దేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 77.7%. దీనిలో పురుష అక్షరాస్యత రేటు 84.7%, స్త్రీ అక్షరాస్యత రేటు 70.3%గా ఉంది. ఎక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ (96.2%), తక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో (66.4%) ఉంది.

 

పట్టణ జనాభా: 2011 ప్రకారం అధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు వరుసగా గోవా - 62.2%, మిజోరం - 52.1%, తమిళనాడు - 48.4%, కేరళ - 47.7%, మహారాష్ట్ర - 45.2%. తక్కువ పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు వరుసగా హిమాచల్‌ప్రదేశ్‌ - 10%, బిహార్‌ - 11.3%, అసోం - 14.1%, ఒడిశా - 16.7%. 

* పట్టణ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దిల్లీ (97.5%), తక్కువగా అండమాన్‌లో (37.75%) ఉంది.

* 2011 ప్రకారం దేశంలో మొత్తం ఎస్సీ జనాభా 16.6% కాగా ఎస్టీ జనాభా 8.6%.

మతాలవారీగా జనాభా: 2011 ప్రకారం దేశంలో హిందువులు 79.8%, ముస్లింలు 14.23%, క్రైస్తవులు 2.3%, సిక్కులు 1.72%, బౌద్ధులు 0.7%, జైనులు 0.37%, ఇతర మతాలు 0.66%, ఏ మతం చెప్పనివారు 0.29%గా ఉన్నారు.

 

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  నిరుద్యోగం

  నిరుద్యోగిత 

 యూఎన్‌ఓ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 

 

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌