• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికాభివృద్ధిలో విత్తమార్కెట్లు

సమగ్ర ప్రగతికి  సమర్థ వ్యవస్థలు!



పొదుపును సమీకరించి పెట్టుబడిగా సమకూర్చేవే విత్తమార్కెట్లు. దేశంలో అనాదిగా ఉన్న వడ్డీ వ్యాపారులు, దేశీయ బ్యాంకర్లు, ఆధునిక యుగంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకుల డిపాజిట్‌ సరిఫికెట్లు, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ప్రైవేటు కంపెనీల వాణిజ్య పత్రాలు, ప్రామిసరీ నోట్లు తదితరాలన్నీ ఆ విత్తమార్కెట్‌లో భాగమే. పెట్టుబడులకు కీలకమైన ఈ వ్యవస్థ విధివిధానాలు, అవి సాధారణ వ్యక్తుల నుంచి ప్రభుత్వాల వరకు వివిధ రూపాల్లో పరపతి అవసరాలను తీరుస్తున్న తీరుపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విత్తమార్కెట్‌ రకాలు, కాలపరిమితి ఆధారంగా వాటి వర్గీకరణ, వివరణలు, ఉదాహరణలతో పాటు వ్యవస్థాగత విత్త వ్యవస్థలు, కాలానుగుణంగా ప్రవేశపెట్టిన  విత్త సాధనాలు, అసంఘటిత మార్కెట్‌ల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే సమర్థ విత్త వ్యవస్థ అవసరం. విత్త వ్యవస్థలో నాలుగు భాగాలు ఉంటాయి.

1) విత్త సంస్థలు

2) విత్త మార్కెట్లు    

3) విత్త సాధనాలు

4) విత్త సేవలు


విత్త సంస్థలు: వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.

ఎ) బ్యాంకేతర విత్త సంస్థలు: అవి

i) అభివృద్ధి విత్త  సంస్థలు

ii)  బ్యాంకేతర విత్త కంపెనీలు

iii)  గృహనిర్మాణ విత్త కంపెనీలు


బి) బ్యాంకింగ్‌ సంస్థలు :  అవి

i)  టర్మ్‌ విత్త సంస్థలు. ఉదా:IDBI, ICICI, IFCI మొదలైనవి.

ii) నిర్దిష్ట విత్త సంస్థలు: ఉదా: EXIM బ్యాంకు, టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

iii)  రంగాలవారీ విత్త సంస్థలు ఉదా: NABARD.

iv)  పెట్టుబడి విత్త సంస్థలు. ఉదా:UTI

v) బీమా సంస్థలు ఉదా: LIC, GIC

vi) రాష్ట్ర స్థాయి సంస్థలు ఉదా: SFCS


విత్త మార్కెట్లు: విత్త వ్యవస్థలో ప్రధాన విభాగం విత్త మార్కెట్లు. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి విత్త మార్కెట్లు దోహదం చేస్తాయి. ఇవి రెండు రకాలు.

1) ద్రవ్యమార్కెట్‌

2) మూలధన మార్కెట్‌. ద్రవ్య మార్కెట్‌ స్వల్పకాలిక విత్తం సమకూరిస్తే, మూలధన మార్కెట్‌ దీర్ఘకాల విత్తాన్ని సేకరిస్తుంది.


ద్రవ్య మార్కెట్‌: స్వల్పకాలిక విత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను ద్రవ్యమార్కెట్‌ అంటారు. ఇందులో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. ఈ మార్కెట్‌లో లభించే నిధులు స్వల్ప కాలానికి పరిమితమై ఉంటాయి. అందువల్ల ద్రవ్య మార్కెట్‌ను స్వల్పకాలిక పరపతి మార్కెట్‌ అని కూడా అంటారు. ద్రవ్య మార్కెట్‌ ప్రత్యక్షంగా ద్రవ్యంతో వ్యవహరించదు. సమీప ద్రవ్యంగా పేర్కొనే స్వల్పకాలిక పరపతి ఉన్న వర్తక బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకారాలు మొదలైన పత్రాల కొనుగోలు, అమ్మకం వ్యవస్థనే ద్రవ్య మార్కెట్‌ అంటారు. ఈ పత్రాలన్నింటికీ అధిక ద్రవ్యత్వం ఉంటుంది.


భారతీయ ద్రవ్య మార్కెట్‌: దీన్ని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించారు.

1) సంఘటిత ద్రవ్య మార్కెట్‌

2) అసంఘటిత ద్రవ్యమార్కెట్‌


సంఘటిత మార్కెట్‌లో ఉప మార్కెట్లు, ద్రవ్య మార్కెట్‌ ప్రధానమైనవి. వీటిని బ్యాంకింగ్‌ రంగం పర్యవేక్షిస్తుంది.

1) కాల్‌మనీ మార్కెట్‌: వివిధ బ్యాంకుల మధ్య నిధుల బదిలీ ఈ మార్కెట్‌ లక్ష్యం. మిగులు నిధులున్న బ్యాంకులు.. తాత్కాలికంగా నగదు కొరత ఏర్పడిన బ్యాంకులకు నిధులు సమకూర్చడమే కాల్‌మనీ మార్కెట్‌. దీన్ని అంతర బ్యాంకుల తక్షణ ద్రవ్య మార్కెట్‌ అంటారు. ఇందులో రెండు విభాగాలుంటాయి.

1) తక్షణ ద్రవ్య మార్కెట్‌    

2) అల్ప వ్యవధి ద్రవ్య మార్కెట్‌. తక్షణ రుణం కాలపరిమితి ఒక రోజు మాత్రమే. అల్ప వ్యవధి రుణ కాలపరిమితి 14 రోజులు. అన్నిరకాల బ్యాంకులు ఈ మార్కెట్‌లో పాల్గొంటాయి.


2) బిల్లుల మార్కెట్‌: బిల్లుల మార్కెట్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్‌

బి) వాణిజ్య బిల్లుల మార్కెట్‌.


ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్‌: ట్రెజరీ బిల్లులతో వ్యవహరించే ద్రవ్య మార్కెట్‌ను ట్రెజరీ బిల్లుల మార్కెట్‌ అంటారు. భారత ప్రభుత్వం తాత్కాలిక ద్రవ్య నిధుల అవసరాలు తీర్చుకోవడానికి, స్వల్పకాలిక రుణాలు పొందడానికి ఉపయోగించే సాధనాలను కోశ బిల్లులు లేదా ట్రెజరీ బిల్లులు అంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వ స్వల్పకాలిక రుణ సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. 


నగదు నిర్వహణ బిల్లులు: ఇవి కూడా ట్రెజరీ బిల్లుల లాంటివే. కాలవ్యవధి 91 రోజుల కంటే తక్కువ. కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక అవసరాల కోసం రిజర్వ్‌ బ్యాంకు విక్రయించే సెక్యూరిటీ. వీటిని చట్టబద్ధ ద్రవ్యత్వ నిబంధన కింద బ్యాంకులు తమ వద్ద ఉంచుకోవచ్చు.


వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌: వీటిని తాత్కాలిక ట్రెజరీ బిల్లుల స్థానంలో ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాత్కాలికంగా రిజర్వు బ్యాంకు ఇచ్చే రుణాలు లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌. వీటి కాలవ్యవధి 10-14 పనిదినాలు.


తేదీ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు: బ్యాంకుల చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (SLR)ని కొంత కాలవ్యవధి లోపల తగ్గించాలనే నరసింహం కమిటీ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5 ఏళ్లు, 10 సంవత్సరాలు కాల పరిపక్వత తేదీ ఉన్న సెక్యూరిటీలను ఈ కొత్త విధానంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


బి) వాణిజ్య బిల్లుల మార్కెట్‌: ఒక వ్యాపారి మరొక వ్యాపారికి అరువుపై సరకు అమ్మినప్పుడు ఒక నిర్ణీత తేదీన చెల్లిస్తానని అంగీకారం తెలియజేస్తూ కొనుగోలుదారుడు రాసిన పత్రాన్నే వాణిజ్య బిల్లు లేదా వర్తక బిల్లు అంటారు. ఇవి దేశీయ కార్యకలాపాలకు చెందినవి. సాధారణంగా దీని కాలవ్యవధి మూడు నెలలు. భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు. 


3) వాణిజ్యపత్రాలు: వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వుబ్యాంకు వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది. 1990, జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. కార్పొరేట్‌ సంస్థలు నిధులను సమకూర్చుకోవడానికి స్వల్పకాలిక సాధనమే వాణిజ్య పత్రాలు. మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉండి, రూ.5 కోట్ల కంటే ఎక్కువ వర్కింగ్‌ క్యాపిటల్‌ (మూలధనం) ఉన్న కంపెనీలు వీటిని జారీ చేస్తాయి. వీటిని స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చు. వాణిజ్య పత్రాలు జారీ చేయాలంటే ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. దేశంలో లీజింగ్, విత్త సంస్థలు ఎక్కువగా వీటిని జారీ చేస్తాయి.


4) డిపాజిట్‌ సర్టిఫికెట్లు: వాఘల్‌ వర్కింగ్‌ గ్రూపు సిఫార్సు మేరకు 1989, జూన్‌లో వీటిని ప్రవేశపెట్టారు. వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్లను డిపాజిట్‌ సర్టిఫికెట్లు అంటారు. డిస్కౌంట్‌ ప్రాతిపదికన ఇవి జారీ అవుతాయి. 1991-92 నుంచి అఖిలభారత విత్త సంస్థలైన IDBI, ICICI, IFCI వీటి జారీకి అనుమతి పొందాయి. వీటికి మార్కెట్‌లో ఒక సంవత్సరం వరకు కాలవ్యవధి ఉంటుంది.


అసంఘటిత ద్రవ్య మార్కెట్‌:  ఈ మార్కెట్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 


1) క్రమబద్ధీకరించని నాన్‌-బ్యాంకింగ్‌ విత్తసంస్థలు: ఇందులో రుణ లేదా విత్త కంపెనీలు దేశమంతటా విస్తరించి ఉంటాయి. డిపాజిట్లు, రుణ సేకరణ ద్వారా కావాల్సిన నిధులు సమకూర్చుకుంటాయి. 1/5 నుంచి 1/4వ వంతు నిధులు సొంత వనరుల నుంచే సేకరిస్తాయి. రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారులకు, చేతివృత్తుల వారికి రుణాలు ఇస్తాయి.వాణిజ్య బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి పరపతి పొందలేనివారు వీటి నుంచి రుణాలు తీసుకుంటారు.


చిట్‌ఫండ్‌ కంపెనీలు: ఇవి పొదుపు సంస్థలు. దీనిలోని సభ్యులు కాలానుగుణంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని లాటరీ పద్ధతిలో కానీ వేలంపాట ద్వారా కానీ సభ్యులకు అందిస్తారు. ఈ వ్యాపారం అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా ఉంది.


నిధి: దక్షిణ భారతదేశంలో ఇవి ఎక్కువగా పనిచేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు సభ్యుల వరకే పరిమితమవుతాయి. సభ్యుల కుటుంబ అవసరాలకు, ఇంటి నిర్మాణాల మరమ్మతులకు తక్కువ వడ్డీకి ఇవి రుణాలను అందిస్తాయి. వీటికి కావాల్సిన నిధులు కూడా సభ్యుల డిపాజిట్ల ద్వారానే సమకూరతాయి. కార్యాలయం కూడా స్థానికంగానే ఉంటుంది.


2) దేశీయ బ్యాంకులు: దేశీయ బ్యాంకులు వ్యక్తిగతంగా లేదా ప్రైవేటు సంస్థలుగా ఏర్పడతాయి. ఇవి డిపాజిట్లు స్వీకరించి, రుణాలు ఇస్తాయి. దేశీయ బ్యాంకర్లకు, వడ్డీ వ్యాపారులకు తేడా ఉంది. వడ్డీ వ్యాపారులు కేవలం ద్రవ్యాన్ని రుణాలు ఇచ్చి వ్యాపారం చేస్తారు. వీరు విత్త సంబంధ మధ్యవర్తులు కారు. వాణిజ్య బ్యాంకులు భద్రత లేని రుణాలు ఇవ్వవు కానీ, దేశీయ బ్యాంకులు అలాంటి రుణాలు ఇస్తాయి. వ్యక్తిగత సేవలను కూడా అందిస్తాయి. దేశీయ బ్యాంకులకు CRR నిర్వహించాల్సిన అవసరం లేకపోవడంతో వీటి స్థాపన వ్యయం తక్కువ.


3) వడ్డీ వ్యాపారులు: వీరు రెండు రకాలు

1) వడ్డీ వ్యాపారమే ప్రధాన వృత్తిగా ఉన్నవారు.

2) ఇతర వృత్తులతో పాటు వడ్డీ వ్యాపారం చేసేవారు.


విత్త సాధనాలు: భవిష్యత్తులో నిర్ణీత తేదీలో లేదా కొన్ని కాలవ్యవధుల్లో, వడ్డీ లేదా డివిడెండ్‌ రూపంలో, కొంత ద్రవ్యాన్ని చెల్లించే విధంగా ఒక వ్యక్తి మీద లేదా ఒక సంస్థ మీద రాసిన క్లెయిమ్‌ను విత్తసాధనం అంటారు.    ఉదా: కాగితపుసంపద, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు.

*  ఒక నిర్ణీత కాలవ్యవధి తర్వాత నిర్దిష్ట వ్యక్తి అనుకున్న మొత్తంపై వడ్డీ లేదా డివిడెండ్‌ చెల్లించాల్సిన క్లెయిం పత్రాన్ని విత్త ఆస్తి అంటారు.

ఉదా: బ్యాంకు డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, కంపెనీ వాటాలు, రుణపత్రాలు మొదలైన విత్త ఆస్తులను, సెక్యూరిటీలను విత్త ఆస్తులు అంటారు.

విత్త సేవలు: నిధులను రుణంగా స్వీకరించడానికి,  సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి, చెల్లింపులు చేయడానికి, విత్త మార్కెట్‌లో నష్టభయాన్ని అదుపు చేయడానికి ఉపకరించే సేవలే విత్త సేవలు.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

Posted Date : 16-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌