• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - వాణిజ్య బ్యాంకులు - 01

దేశంలోని పొదుపును సమీకరించి, పెట్టుబడిగా తరలించడానికి విత్తమార్కెట్లు దోహదం చేస్తాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. అవి: 

1) ద్రవ్య మార్కెట్‌   2) మూలధన మార్కెట్‌


ద్రవ్య మార్కెట్‌ 

*  స్వల్పకాలిక మొత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను ద్రవ్య మార్కెట్‌ అంటారు. సమీప ద్రవ్యంగా(near money) పేర్కొనే స్వల్పకాలిక పరిమితి ఉన్న వర్తక బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీనోట్లు, బ్యాంకుల అంగీకారాలు మొదలైన పత్రాల కొనుగోలు, అమ్మకాలు జరిగే వ్యవస్థను ‘ద్రవ్య మార్కెట్‌’ అంటారు.


* భారతదేశంలో ఆర్‌బీఐ చట్టం, 1934 ప్రకారం వాణిజ్య బ్యాంకులు(Commercial Banks) పనిచేస్తాయి. మన దేశంలో వాణిజ్య బ్యాంకులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1) షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు    2) షెడ్యూల్డ్‌ కాని వాణిజ్య బ్యాంకులు

షెడ్యూల్డ్‌వాణిజ్య బ్యాంకులు 

ఆర్‌బీఐ చట్టం - 1934 ప్రకారం, రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు. వీటి నమోదుకు ఉండాల్సిన అర్హతలు:

* బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని భారతదేశంలోనే నిర్వహించాలి.

* రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం నికర ఆస్తి ఉండాలి.

* ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించాలి.

*షెడ్యూల్‌ బ్యాంకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను కేంద్ర బ్యాంకుకు నివేదించాలి.

* వాణిజ్య బ్యాంకులు ఇండియన్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ కింద లేదా భారత ప్రభుత్వ ప్రత్యేక చట్టం కింద లేదా స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులుగా నమోదు చేసుకోవాలి.

* ఆర్‌బీఐ క్లియరింగ్‌ హౌస్‌లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా వాణిజ్య బ్యాంకుల మధ్య ద్రవ్యాన్ని బదిలీ చేస్తుంది.


షెడ్యూల్డ్‌ కాని బ్యాంకులు

* ఇవి ఆర్‌బీఐ చట్ట 1934 ప్రకారం, రెండో షెడ్యూల్‌లో నమోదు కాని బ్యాంకులు. ఇవి చాలా చిన్న బ్యాంకులు, వాటి పెట్టుబడి రూ.5 లక్షలలోపు ఉంటుంది. ఉదా: జమ్మూ-కశ్మీర్‌ బ్యాంకు 


భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల చరిత్ర

ప్రపంచంలో అతి ప్రాచీన వాణిజ్య బ్యాంకు - బ్యాంక్‌ ఆఫ్‌ వెనిస్‌. దీన్ని క్రీ.శ. 1157లో ఇటలీలో స్థాపించారు.

* భారతదేశంలో నెలకొల్పిన మొదటి వాణిజ్య బ్యాంకు - బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌. అలెగ్జాండర్‌ అండ్‌ కో ఆంగ్ల ఏజెన్సీ హౌస్‌ క్రీ.శ.1770లో దీన్ని స్థాపించింది.

ప్రెసిడెన్సీ బ్యాంకులు: బ్రిటిష్‌ వారు మన దేశంలో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి:

1. బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా(1806)

2. బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే (1840)

3. బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843)


ఔద్‌ వాణిజ్య బ్యాంకు: దీన్ని 1881లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో స్థాపించారు. ఇది పూర్తిగా భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొట్టమెదటి వాణిజ్య బ్యాంకు. దీని ప్రధాన కార్యాలయం ఫైజాబాద్‌. ఔద్‌ వాణిజ్య బ్యాంకు 1958 వరకు పనిచేసింది.


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

దీన్ని 1894, మే 19న దిల్లీ కేంద్రంగా నెలకొల్పారు. దీని స్థాపకులు - దయాల్‌సింగ్‌ మజితియా, లాలా లజపతి రాయ్‌. ప్రస్తుతం ఇది దేశంలో మూడో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతోంది. పూర్తి భారతీయ యాజమాన్యంతో నెలకొల్పిన రెండో వాణిజ్య బ్యాంకు ఇది.


ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

* బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా, బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌లను కలిపి 1921, జనవరి 27న ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు. దీని స్థాపకుడు జె.ఎం.కీన్స్‌. ప్రధాన కార్యాలయం ముంబయి.

గ్రామీణ ప్రాంతాల్లో పరపతి అవసరాలు అంచనా వేసి, పరపతి సహాయం కల్పించే మార్గాలపై అధ్యయనం చేయడానికి 1951లో ఎ.డి.గోర్వాలా ఆధ్వర్యంలో అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన కమిటీని నియమించారు. ఇది 75 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 8 గ్రామాల చొప్పున సుమారు 600 గ్రామాల్లో సర్వే నిర్వహించింది. ఈ కమిటీ 1954లో తన నివేదిక సమర్పించింది. దీని సిఫార్సు మేరకు ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను 1955, జులై 1న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు.


ఆంధ్రా బ్యాంకు

ఇది 1923, నవంబరు 28న (రిజిస్టర్డ్‌ 1923, నవంబరు 20) మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభమైంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య దీని వ్యవస్థాపకులు. రూ.లక్ష ప్రాథమిక మూలధనంతో బ్యాంకు ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్నే బందరు బ్యాంకు అని కూడా పిలుస్తారు.

ఇది 1980 నాటికి దేశంలోని ముఖ్యమైన ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. 1980, ఏప్రిల్‌ 15న ఆంధ్రా బ్యాంకును జాతీయం చేశారు. ఇది 2020, ఏప్రిల్‌ 1న యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైంది.


భారతీయ మహిళా బ్యాంకు (BMB)

ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా 2013, నవంబరు 19న భారతీయ మహిళా బ్యాంకును ముంబయిలో ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకు. ప్రధాన కార్యాలయం దిల్లీ. రూ.1000 కోట్ల మూలధనంతో దీన్ని నెలకొల్పారు.

దీని మొదటి ఛైర్‌పర్సన్‌గా ఉషా అనంతసుబ్రమణియన్‌ పనిచేశారు. 

దీన్ని 2017, ఏప్రిల్‌ 1న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీనం చేశారు.


ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)

* ఇది ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వ్‌ బ్యాంకుకు అనుబంధ సంస్థగా 1964, జులై 1న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి.

* 1975 పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌ ప్రకారం, 1976, ఫిబ్రవరి 16 నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కిందికి వచ్చింది. 

*1956 కంపెనీల చట్టం కింద, ఐడీబీఐ బ్యాంకు పేరును 2004, అక్టోబరు 1న ఐడీబీఐ లిమిటెడ్‌గా మార్చారు.

* ఆర్‌బీఐ చట్టం 1934 ప్రకారం, 2004 అక్టోబరు 11న ఐడీబీఐ బ్యాంకును జాతీయం చేశారు.

* ఇది పరిశ్రమల అభివృద్ధికి మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది.

* 2019, జనవరి 21న ఐడీబీఐ బ్యాంకును మళ్లీ ప్రైవేట్‌పరం చేశారు.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

*ఇది 1955, జులై 1 న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబయి. ఇది మన దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంకు. దీని ప్రస్తుత ఛైర్మన్‌ దినేష్‌కుమార్‌ ఖారా.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం - 1959: 1959లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం చేశారు. దీని ప్రకారం, ఎస్‌బీఐకి అనుబంధంగా ఎనిమిది బ్యాంకులు ఏర్పాటు చేశారు. అవి:

1) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ (రాజస్థాన్‌)

2) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జైపూర్‌ (రాజస్థాన్‌) 

3) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర (గుజరాత్‌)

4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)

5) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (తెలంగాణ)

6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (కర్ణాటక)

7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పటియాలా (పంజాబ్‌)

8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (కేరళ)


1963లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జైపూర్‌లను కలిపి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ - జైపూర్‌గా ఏర్పాటు చేశారు.

* 2008, ఆగస్టు 13న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు.

* 2010, ఆగస్టు 26న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కలిపారు.

* 2017, ఏప్రిల్‌ 1న ఎస్‌బీఐ మిగిలిన  5 అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకుంది.


భారతదేశంలో బ్యాంకుల జాతీయీకరణ

బ్యాంకు అంటే అందరూ డబ్బులు దాచుకునే ‘ధనాలయం’. 1969 నాటికి ఎస్‌బీఐ ఒక్కటే ప్రభుత్వరంగ బ్యాంకు కాగా, మిగిలినవన్నీ ప్రైవేట్‌ రంగానికి చెందినవే. ప్రైవేట్‌ బ్యాంకులపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. కొంతమంది ధనికులకు, వ్యాపారులకు మాత్రమే బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండేవి.

* 1947-55 మధ్య కాలంలో 361 ప్రైవేట్‌ బ్యాంకులు కుప్పకూలాయి. ఎంతోమంది ఖాతాదార్లు తమ సొమ్ము పోగొట్టుకున్నారు. ఆశించిన రీతిలో ఆర్థికాభివృద్ధి జరగలేదు.

* వివిధ రంగాల్లోని ప్రైవేట్‌ సంస్థలను జాతీయం చేయాలనే డిమాండు అధికంగా ఉండేది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా 1969, జులై 19న బ్యాంకింగ్‌ కంపెనీస్‌ అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ అనే ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. తర్వాత దాన్ని చట్టం చేశారు.

* ప్రైవేట్‌ రంగంలో రూ. 50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు ఇందులో ఉన్నాయి. దాంతో అప్పటి వరకు ఉన్న 70% బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రభుత్వ అజమాయిషీ కిందకి వచ్చాయి.

* ఈ పరిణామంతో దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయింది. ప్రజలకు బ్యాంకులను చేరువ చేయడంలో, పారిశ్రామిక రంగానికి పెట్టుబడి అవసరాలు తీర్చడంలో, రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో దోహదం చేసింది.

* గ్రామాలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రజలంతా బ్యాంకులను ఉపయోగించడం ప్రారంభించారు.

* దేశ ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణ విస్తరణ లాంటి వివిధ భాగాల్లో బ్యాంకులు క్రియాశీల పాత్ర పోషించాయి. 

* ప్రభుత్వరంగ బ్యాంకులు దేశం నలుమూలలా విస్తరించాయి. 

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1967, డిసెంబరు 14న బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానాన్ని ప్రకటించింది. దేశ మౌలిక, ఆర్థిక, సాంఘిక ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య బ్యాంకుల విధానాల్లో  మార్పు తేవడం దీని ఉద్దేశం. 1969, ఫిబ్రవరిలో ఈ విధానం అమల్లోకి వచ్చింది.

Posted Date : 15-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌