• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం (ద్రవ్యం-బ్యాంకింగ్‌-ప్రభుత్వ విత్తం)

అందరూ అంగీకరించే కల్పితం!

  తళ తళ మెరుస్తూ, పెళ పెళలాడే నోటును చూడగానే ఎవరి కళ్లయినా కాస్త పెద్దవి కావాల్సిందే. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనికీ మనీ ఉండాల్సిందే. అందరి ఆనందాలు, అవసరాలు అన్నీ ఆ డబ్బుతో అంటే ఆర్థిక పరిభాషలో ద్రవ్యంతోనే ముడిపడి ఉంటాయి. చేసే శ్రమకు, తయారయ్యే వస్తువుకు, అందించే సేవకు విలువ కట్టే విశిష్ట కొలమానం ద్రవ్యం. ప్రాచీన కాలం నుంచి అనేక రూపాలు మార్చి ఇప్పటికీ చలామణిలో చెలరేగి పోతోంది. నిజానికి దాని విలువ కల్పితం, కానీ అందరికీ ఆమోదనీయం. కనిపెట్టిన మనిషినే కట్టి పడేసే కనికట్టుగా నిలిచిన ఆ ద్రవ్యం పుట్టుక, పరిణామక్రమం, ప్రస్తుత రూపాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

  ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఆధునిక సమాజంలో ద్రవ్యం ప్రవేశపెట్టక పూర్వం వస్తుసేవల కొనుగోలు, అమ్మకాలకు నిర్దిష్ట మాధ్యమం లేదు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దీనిలోని లోపాల వల్ల ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమంగా అమల్లోకి వచ్చింది.

 

వస్తుమార్పిడి పద్ధతి: వస్తువును ఇచ్చి దానికి బదులుగా కావాల్సిన మరో వస్తువును పొందటాన్ని వస్తుమార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అంటారు. గతంలో మనిషి కోర్కెలు, ఆర్థిక కార్యకలాపాలు రెండూ పరిమితంగా ఉండటం వల్ల ఈ పద్ధతి సాధ్యమైంది. ఇందులో వినిమయ మాధ్యమం ఉండదు. అందువల్ల దీన్ని వస్తువు నుంచి వస్తువు ఆర్థిక వ్యవస్థ అనేవారు.

 

వస్తుమార్పిడి పద్ధతిలో లోపాలు: 1) కోరికల సమన్వయం లేకపోవడం 2) కాల సమన్వయం లేకపోవడం 3) విలువలను కొలిచే కొలమానం లేకపోవడం 4) వస్తువును విభజించే వీలు లేకపోవడం 5) సంపదను నిల్వ చేయలేకపోవడం

 

ద్రవ్య ఆవిర్భావం-నిర్వచనం-పరిణామ క్రమం: ‘మనీ’ అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది. రోమన్‌ దేవత అయిన మానెటా ఆలయంలో మొదటిసారి నాణేలను ముద్రించడం వల్ల ‘మనీ’ పేరు స్థిరపడిందనేది చరిత్రకారుల అభిప్రాయం. అతిముఖ్యమైన మానవ కల్పనల్లో ద్రవ్యం ఒకటి. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది. 

ఉదా: యాంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ద్రవ్యం ప్రధాన కల్పనలని క్రౌధర్‌ అనే ఆర్థికవేత్త అభిప్రాయం.

 

ద్రవ్య నిర్వచనాలు: * ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం - వాకర్‌ 

* సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం - సెలిగ్‌మన్‌ 

* వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం - క్రౌధర్‌  

* ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం - మిల్టన్‌ ప్రీడ్‌మన్‌ 

* రుణ ఒప్పందాలు ఉండి వివాదాల పరిష్కార శక్తి కలిగిందే ద్రవ్యం - జె.ఎం.కీన్స్‌

 

ద్రవ్య పరిణామ క్రమం 

 

వస్తురూప ద్రవ్యం: ప్రారంభంలో వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించారు.

ఉదా: స్విట్జర్లాండ్‌లో గవ్వలు, భారత్‌లో పశువులు, ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, ఉత్తర అమెరికాలో పొగాకు

 

లోహద్రవ్యం: వస్తురూప ద్రవ్యంలోని కొన్ని సమస్యల వల్ల, నాగరికత అభివృద్ధి చెందడంతో లోహద్రవ్యం వాడుకలోకి వచ్చింది.

ఉదా: బంగారం, వెండి, రాగి, ఇత్తడి మొదలైనవి. ప్రారంభంలో లోహాన్ని ముద్దలుగా, కడ్డీలుగాను ఉపయోగించేవారు. తర్వాత కాలంలో లోహాలతో నాణేలు తయారుచేశారు.క్రీ.పూ.700 సంవత్సరంలో లిధియా దేశంలో మొదటగా నాణేలు జారీ చేశారు. రోమన్ల కాలంలో బిసాంత్‌ అనే బంగారు నాణెం, మౌర్యుల కాలంలో ఫణ అనే వెండి నాణేలు ఉండేవి.

 

కాగితపు ద్రవ్యం: క్రీ.శ.600 సంవత్సరంలో చైనాను పాలించిన సోంగ్‌ రాజవంశీయులు మొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌లో మౌర్యుల కాలం నుంచి ‘హుండీ’ అనే కాగితపు ద్రవ్య వ్యవస్థ ఉండేది. కాగితపు కరెన్సీ మొదటి రూపం హుండీ అని భావిస్తారు.

 

పరపతి ద్రవ్యం: కరెన్సీని నిల్వగా దాచి పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టిస్తారు.

ఉదా: బ్యాంక్‌ చెక్‌లు, క్రెడిట్‌ కార్డులు, వాణిజ్య బిల్లులు, ట్రెజరీ బిల్లులు మొదలైనవి. పరపతి ద్రవ్యం రుణ లావాదేవీలకు సహకరిస్తుంది. క్రెడిట్‌ కార్డ్‌ను స్మార్ట్‌మనీగా పిలుస్తారు. మొదటి క్రెడిట్‌ కార్డును 1950లో అమెరికాకు చెందిన ‘డిన్నర్స్‌ క్లబ్‌’ ప్రవేశపెట్టింది.

 

సమీప ద్రవ్యం: ద్రవ్యానికి ఉండే లక్షణాలు ఉన్నదాన్ని సమీప ద్రవ్యం అంటారు.

ఉదా: హుండీలు, బాండ్‌లు, డిమాండ్‌ డ్రాఫ్టులు, పే ఆర్డర్లు మొదలైనవి.

 

ప్లాస్టిక్‌ ద్రవ్యం: ప్రపంచంలో మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్లాస్టిక్‌ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు.

 

పాలిమర్‌ ద్రవ్యం: కరెన్సీ ముద్రణలో ప్లాస్టిక్‌ను ఉపయోగించేదే పాలిమర్‌ ద్రవ్యం. దీనికి ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.

ఉదా: ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంకు ముద్రించే కరెన్సీ నోట్లు.

 

ద్రవ్యం రకాలు

విలువ, ఉపయోగం ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. 

1) ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువు 

2) ఆమోద యోగ్యత 

3) ద్రవ్యత్వం 

4) ఇతర రకాలు

1) పూర్తి ప్రమాణ ద్రవ్యం: ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత, బహిర్గత విలువ సమానంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారు. 

ఉదా: 1835-93 మధ్య మన దేశంలో పూర్తి ప్రమాణం ఉన్న వెండి నాణేలు చలామణిలో ఉండేవి.

 

2) తక్కువ ప్రమాణ ద్రవ్యం: నాణేల బహిర్గత విలువ, నాణేల అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటారు. దీన్నే టోకెన్‌ మనీ అంటారు.

ఉదా: ప్రస్తుతం మన దేశంలో ముద్రించే అన్నిరకాల కరెన్సీ నాణేలు

 

3) ప్రాతినిధ్యపు ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. 

ఉదా: ప్రస్తుతం ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్లు, నాణేలు.

 

4) ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం: నూటికి నూరు శాతం లోహాన్ని నిల్వగా ఉంచి ద్రవ్యాన్ని జారీ చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు.ఉదా: మన దేశంలో జారీ చేసిన బంగారం, బులియన్‌ సర్టిఫికెట్లు.

 

5) పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిలోకి మార్చుకునే వీలున్న ద్రవ్యం.

ఉదా: 19వ శతాబ్దంలో వాడుకలో ఉన్న స్వర్ణ ప్రమాణంలో ఈ సౌకర్యం ఉండేది.

 

6) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యం బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలులేని ద్రవ్యం.

 

7) చట్టబద్ధ ద్రవ్యం: ఆర్‌బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. దీనికి చట్టం సమ్మతి ఉంటుంది. ఇది రెండు రకాలు.

ఎ) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: వ్యాపార వ్యవహారాల నిర్వహణకు, రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలో అయినా తప్పనిసరిగా ఆమోదించాల్సిన ద్రవ్యం ఇది. 

ఉదా: మన దేశంలో 50 పైసలకు మించి ఉన్న నాణేలు, రూపాయి నుంచి రూ.2 వేల వరకు నోట్లు భారత్‌లో కాగితపు కరెన్సీని ఫియట్‌ మనీ అని, నాణేలను లీగల్‌ టెండర్‌ అంటారు.

 

బి) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితికి లోబడి మాత్రమే ఆమోదించే ద్రవ్యం.

ఉదా: * 5, 10, 20, 25 పైసల నాణేలు. వీటిని 25 వరకే ఆమోదిస్తారు.

* 2011, జూన్‌ 30 నుంచి 25 పైసల నాణేన్ని ఆర్‌బీఐ రద్దు చేసింది.

 

8) చట్టబద్ధం కాని ద్రవ్యం: చట్ట ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అంగీకరిస్తే అలాంటి వాటిని చట్టబద్ధం కాని ద్రవ్యం అంటారు. దీన్నే ఐచ్ఛిక ద్రవ్యంగా పిలుస్తారు.

ఉదా: బ్యాంకులు ఇచ్చే చెక్కులు, డ్రాఫ్టు, హుండీలు

 

9) సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం అంటారు. దీన్నే సంకుచిత ద్రవ్యం అని కూడా అంటారు. దీనికి వంద శాతం ద్రవ్యత్వం ఉంటుంది.

 

సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. అవసరమైనప్పుడు వీటిని తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకోవచ్చు. అందుకే వీటిని సమీప ద్రవ్యం అంటారు.

ఉదా: జాతీయ పొదుపు డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు.

 

ఇతర రకాల ద్రవ్యాలు

 

1) ఆవర్జా ద్రవ్యం: జమా ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్‌ రూపంలో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు.

ఉదా: ఇండియాలో రూపాయి, అమెరికాలో డాలర్‌.

 

2) వ్యవహారిక ద్రవ్యం: ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు. అన్నిరకాల వ్యవహారాలు దీనితోనే జరుగుతాయి.

 

3) విశ్వాసాశ్రిత ద్రవ్యం: వ్యవస్థపై లేదా ప్రభుత్వంపై లేదా కేంద్ర బ్యాంకుపై విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని ద్రవ్యాన్ని ముద్రిస్తే అలాంటి ద్రవ్యాన్ని విశ్వాసాశ్రిత ద్రవ్యం అంటారు. మన దేశంలో ద్రవ్యాన్ని కనీస నిల్వలను ఆధారంగా చేసుకొని, విశ్వాసాశ్రిత పద్ధతిలో ముద్రిస్తారు.

 

4) పరపతి ద్రవ్యం: దీన్నే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. 

ఉదా: బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైనవి.

 

5) ఫియట్‌ మనీ: ప్రభుత్వ అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే దాన్ని ఫియట్‌ మనీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. ఈ ద్రవ్యం వెనుక రిజర్వులు ఉండవు.

 

6) హాట్‌ మనీ: విదేశీ సంస్థాగత పెట్టుబడులను హాట్‌ మనీ అంటారు. ఈ పెట్టుబడులను ఒక దేశం నుంచి మరొక దేశానికి వేగంగా తరలిస్తారు.

 

7) డియర్‌ మనీ: అధిక వడ్డీ రేటు ఉండి, రుణాలు సులభంగా లభించని వ్యవస్థను డియర్‌ మనీ అంటారు.

 

8) నియర్‌ మనీ: బ్యాంకుల డిమాండ్‌ డ్రాప్టులు, పే ఆర్డర్లను నియర్‌ మనీ అంటారు.

 

9) కాల్‌ మనీ: ఒక బ్యాంకు అడిగిన వెంటనే మరో బ్యాంకు రుణాలు అందించటాన్ని కాల్‌ మనీ అంటారు. 

ఒక్క రోజుకు బ్యాంకులు ఇచ్చే రుణం కాల్‌ మనీ, రెండు నుంచి 14 రోజులకు ఇచ్చే రుణాన్ని నోటీస్‌ మనీ, 14 రోజులకు మించితే టర్మ్‌ మనీ అంటారు.

 

ద్రవ్యం విధులు: ప్రాథమిక, గౌణ విధులు అని ఇవి రెండు రకాలు.

 

1) ప్రాథమిక విధులు: ద్రవ్యం ప్రాథమికంగా నిర్వర్తించే విధులు. అవి..

ఎ) వినిమయ మాధ్యమం: వస్తువుకి, వస్తువుకి మధ్య మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయడంలో ద్రవ్యం ఉపయోగపడుతుంది.

బి) విలువ కొలమానం: అన్ని రకాల వస్తుసేవలను ద్రవ్యంతో కొలుస్తారు. దీనినే విలువ కొలమానం అంటారు.

 

2) గౌణ విధులు: ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. వీటిని ఉత్పన్న విధులు అని కూడా అంటారు.

ఎ) విలువ నిధి: దీన్ని ప్రతిపాదించింది జె.ఎం.కీన్స్‌. సంపదను ప్రస్తుత ఉపయోగానికే కాకుండా భవిష్యత్తుకూ ఉపయోగపడే విధంగా నిల్వ చేయడానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.

బి) వాయిదాల చెల్లింపుల ప్రమాణం: వ్యాపార వ్యవహారాల అరువు పద్ధతిలోనూ నిర్వర్తించడానికి ద్రవ్యం ఉపయోగపడటాన్ని వాయిదాల చెల్లింపుల ప్రమాణం అని అంటారు.

సి) విలువ బదిలీ: ద్రవ్యం విలువను బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది.

 

* ఆచార్య కిన్లే ప్రకారం ద్రవ్యానికి ప్రాథమిక, గౌణ విధులతో పాటు అనుషంగిక విధులు కూడా ఉ ంటాయి. అంటే 

1) జాతీయ ఆదాయాన్ని మదించడం  

2) ఆదాయ సంపద పంపిణీ 

3) ద్రవ్యత్యాన్ని ఆపాదించడం మొదలైనవి.

 

* పాల్‌ ఎన్‌.జింగ్‌ ప్రకారం ద్రవ్యం విధులు రెండు రకాలు.

1) నిశ్చల విధులు: అంటే ప్రాథమిక, ద్వితీయ అనుషంగిక విధులు.

2) చలన విధులు: ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేసే విధులు.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌