• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో మానవ వనరులు 

అదే వరం... అదే శాపం!

దేశ ప్రగతిలో ఆర్థిక వ్యవస్థదే కీలకపాత్ర. ఆర్థికాభివృద్ధి మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. జనాభా సామర్థ్యం, ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు, నైపుణ్యాల వంటి అనేక అంశాలు ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. జనాభా పెరగడం ఒక రకంగా అభివృద్ధికి దోహదం చేస్తే మరో విధంగా ప్రతిబంధకంగా మారుతుంది. ఈ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉందో పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలోని సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడి ఉంటుంది. భౌతిక మూలధనంలాగా మానవ మూలధనం కూడా విలువైంది. మానవ వనరుల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను అమర్త్యసేన్‌ నొక్కి చెప్పారు. దీనికి యోగత్య, సామర్థ్య సిద్ధాంతాలను ఉపయోగించారు.

   మానవ వనరుల సామర్థ్యం పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు, నైపుణ్యాల లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ప్రగతిపై ఆ దేశ మానవ వనరుల ప్రభావం ఉంటుందని భావించినప్పుడు, అది దేశంలోని జనాభా పరిమాణంపైనే కాకుండా వారి యోగ్యత పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలోని జనాభా అభిలషణీయ స్థాయిలో ఉంటే ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే జనాభా పెరుగుదలను ఒక వరంగా పరిగణించవచ్చు.  జనాభా వృద్ధి అవసరానికంటే అధికంగా ఉన్నట్లయితే అది ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంది. అప్పుడు అధిక జనాభా శాపం అవుతుంది. ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అధిక జనాభా ఉన్నప్పటికీ అది విజ్ఞానవంతం, నైపుణ్యవంతమైంది అయితేనే ఆర్థికాభివృద్ధికి దోహదకారిగా ఉంటుంది. 

   ఆర్థికాభివృద్ధి, సహజ వనరులు, సమర్థ వినియోగం, మూలధన కల్పన, వ్యవసాయ-పారిశ్రామిక రంగ ఉత్పత్తులు, విదేశీ వాణిజ్యం, విద్య, వైద్యం, ఆరోగ్య వసతుల కల్పన, సామాజిక వ్యవస్థ లాంటి అంశాలను సమర్థంగా నిర్వహించాలంటే మానవ వనరులు, వాటి సంఖ్య, సమర్థత, నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకం. నైపుణ్య మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేసే భౌతిక సహజ వనరులు, మానవ నిర్మిత వనరులను అభిలషణీయంగా, సమర్థంగా వినియోగిస్తే అవి ఉత్పత్తి పెంపుదల, దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడతాయి. 

(ఆధారం: తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక అవుట్‌లుక్‌ - 2022, సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా - 2020 (పాపులేషన్‌ ప్రొజెక్షన్స్‌ 2011 - 2036))  

 

జనాభా వృద్ధిరేటు 

రాష్ట్రంలో జనాభా పెరుగుదలలో భాగంగా ఒక సంవత్సరం కాలంలో ఎంత శాతం మేరకు జనాభా పెరిగింది అనే అంశం వార్షిక జనాభా వృద్ధిరేటును తెలుపుతుంది. జనాభా వృద్ధిరేటులోని తగ్గుదల జనాభా పెరగడంలో తగ్గింపును సూచిస్తుంది. ఒక ప్రదేశంలో రెండు వివిధ సమయాల్లో జనాభాలో సంభవించే మార్పు లేదా పెరుగుదలను జనాభా వృద్ధి అంటారు. ఈ మార్పును శాతాల్లో తెలిపితే దాన్ని జనాభావృద్ధి రేటు, దాన్ని ఒక సంవత్సరానికి గుణిస్తే వార్షిక జనాభా వృద్ధిరేటుగా పరిగణిస్తారు. ఇది   పెరిగితే ధనాత్మక వృద్ధిరేటు, తగ్గితే రుణాత్మక వృద్ధిరేటు అని అంటారు.

(ఆధారం: తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక అవుట్‌లుక్‌ - 2022) 

జనసాంద్రత: ఒక ప్రదేశంలో ప్రతి చ.కి.మీ.కు నివసించే జనసంఖ్యను జనసాంద్రత అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 312 గా ఉంది.  

2011 గణాంకాల ప్రకారం జిల్లాల వారీగా జనాభా 

ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 

అధిక జనాభా ఉన్న జిల్లాలు:

1) హైదరాబాద్‌ (39.43 లక్షలు)

2) మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (24.60 లక్షలు)

3) రంగారెడ్డి (24.26 లక్షలు).

తక్కువగా ఉన్న జిల్లా: ములుగు (2,94,671 లక్షలు) 

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పురుషుల జనాభా 1.76 కోట్లు ఉండగా స్త్రీలు 1.73 కోట్ల మంది ఉన్నారు. పురుష జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్‌ (20.18 లక్షలు) కాగా తక్కువగా జిల్లా ములుగు (1.46 లక్షలు). స్త్రీ జనాభా అధికంగా హైదరాబాద్‌లో (19.24 లక్షలు) ఉండగా తక్కువగా ములుగులో (1.48 లక్షలు) ఉంది. 

 

గ్రామీణ, పట్టణ స్త్రీ, పురుష జనాభా

మొత్తం గ్రామీణ జనాభా 2.13 కోట్లు అయితే పట్టణ జనాభా 1.36 కోట్లుగా ఉంది. గ్రామీణ పురుష జనాభా మొత్తం 1.07 కోట్లు ఉంటే స్త్రీ జనాభా 1.06 కోట్లు. పట్టణ పురుష జనాభా 69,06,640 లక్షలు కాగా స్త్రీ జనాభా 67,02,025 లక్షలు. గ్రామీణ పురుషుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా నల్గొండ (6.33 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (1.08 లక్షలు). స్త్రీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా నల్గొండ (6.16 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (1.01 లక్షలు). 

    పట్టణ పురుష జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్‌ (20.18 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా ములుగు (5776). పట్టణ స్త్రీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్‌ (19.24 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా ములుగు (5717).

    మొత్తం గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా నల్గొండ (12.50 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (2.09 లక్షలు). మొత్తం పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్‌ (39.43 లక్షలు), తక్కువగా ఉన్న జిల్లా ములుగు (11493).

 

సమగ్ర కుటుంబ సర్వే - 2014

భారతదేశంలో తొలిసారిగా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్రం అంతటా 2014 ఆగస్టు 19న ఒకేరోజులో నిర్వహించి రికార్డు నెలకొల్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా చెప్పవచ్చు. వ్యక్తిగత అవసరాలు తెలుసుకోవడం, ఆహార భద్రత, పెన్షన్, రెండు పడకల గదుల ఇల్లు లాంటి ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు అర్హులను ఎంపిక చేసుకోవడానికి గణాంకాలను సేకరించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా గ్రామీణ, పట్టణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ సర్వేలో సుమారు 3.9 లక్షల మంది ఎన్యూమరేటర్‌లు (గణకులు) పాల్గొన్నారు.

 

లింగ నిష్పత్తి

స్త్రీ పురుష నిష్పత్తినే లింగ నిష్పత్తిని అని కూడా అంటారు. ఈ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను తెలియజేస్తుంది. స్త్రీ, పురుషుల నిష్పత్తి సరిగా లేకపోతే అది అనేక సాంఘిక, ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. జీన్‌డ్రీజ్, అమర్త్యసేన్‌ అంచనా ప్రకారం ప్రపంచ దేశాల జనాభా వివరాలను పరిశీలిస్తే చాలా దేశాల్లో స్త్రీల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది.

(ఆధారం: తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక అవుట్‌లుక్‌ - 2022, సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా - 2020 (పాపులేషన్‌ ప్రొజెక్షన్స్‌ 2011 - 2036))

2011లో తెలంగాణలో స్త్రీ, పురుష నిష్పత్తి 988 ఉండగా, 2036 నాటికి 996 ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే, 2022 అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎక్కువగా నిజామాబాద్‌ (1044), జగిత్యాలలో (1036)  ఉండగా తక్కువగా రంగారెడ్డిలో (950) ఉంది.

 

జనాభా పరిణామక్రమం

ఏదైనా దేశంలో లేదా రాష్ట్రంలో జనన - మరణ, శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, సంతాన సాఫల్యత రేటు ఆ దేశ/రాష్ట్రం జనాభా పరమైన మార్పు ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఇవన్నీ ప్రధాన భూమికను పోషిస్తాయి. జనాభా వృద్ధి అనేది జనన, మరణాల రేటు, వలసల స్థాయి దిశను బట్టి మారుతుంది. జనన, మరణాల రేటులోని తేడా ఆధారంగా జనాభా వృద్ధిని విశ్లేషించవచ్చు. 

శుద్ధ జననాల రేటు (Crude Birth Rate): జననాల రేటు ప్రతి 1000 మందిలో పుట్టే వారి సంఖ్యను తెలుపుతుంది.

శుద్ధ జననాల రేటు = (మొత్తం జననాల సంఖ్య/మొత్తం జనాభా) × 1000

2011 - 15 మధ్య తెలంగాణలో శుద్ధ జననాల రేటు 15.7% ఉండగా 2031 - 35 నాటికి 10.2% ఉండవచ్చని సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా - 2020 జులై నివేదిక తెలిపింది.

శుద్ధ మరణాల రేటు (Crude Death Rate): మరణాల రేటు అంటే ప్రతి 1000 మందిలో మరణించే వారి సంఖ్యను తెలుపుతుంది. 2011 - 15 మధ్య తెలంగాణలో శుద్ధ మరణాల రేటు 7.3% ఉండగా 2031 - 35 నాటికి 8.6% గా ఉంటుందని అంచనా.

శుద్ధ మరణాల రేటు = (మొత్తం మరణాల సంఖ్య/మొత్తం జనాభా) × 1000

శిశు మరణాల రేటు (Infanty Mortality Rate): ప్రతి 1000 మంది శిశువుల్లో పుట్టిన ఒక సంవత్సరంలోపు మరణించేవారి సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. 

 శిశు మరణాల రేటు = (మరణించిన శిశువుల సంఖ్య/జననాల సంఖ్య) × 1000

2014లో తెలంగాణలో శిశు మరణాల రేటు 35 ఉండగా 2019 నాటికి 23కు తగ్గింది. శిశు మరణాల రేటు 2011 - 15 మధ్య 39 ఉండగా 2031 - 35 నాటికి 27గా ఉంటుందని అంచనా.

సంతాన సాఫల్యత రేటు (Total Fertility Rate):  ఒక దేశంలోని ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సంఖ్యను సంతాన ఉత్పత్తి రేటు అంటారు.

మాతా శిశు మరణాల రేటు (Maternity Mortality Rate): ఒక దేశంలో ఏటా ప్రతి లక్ష మంది తల్లులకు (ప్రసవ సమయంలో) మరణించే తల్లుల సంఖ్యను మాతా శిశు మరణాల రేటు అంటారు. రాష్ట్రంలో 2016 - 18 మధ్య ఇది 63గా ఉంది.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 24-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌