• facebook
  • whatsapp
  • telegram

భారత ద్రవ్య  వ్యవస్థ - కరెన్సీ

* కరెన్సీ అంటే ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నాణేలు, కాగితం నోట్లు. వీటిని కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) ముద్రిస్తుంది.  కరెన్సీ నోట్లు, బ్యాంకు డిపాజిట్లు ద్రవ్యంలో భాగాలే.


ద్రవ్యత్వం: ద్రవ్యానికి ద్రవ్యత్వం ఉంటుంది. దీని అర్థం కొనుగోలు చేసే శక్తి (Ready purchasing power).-ఒక వస్తువు విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాలంలో ద్రవ్యంగా మార్చగల (సత్వరం కొనుగోలు చేయగలిగే శక్తి) గుణాన్ని ద్రవ్యత్వంగా పేర్కొంటారు. అందుకే ద్రవ్యాన్ని ‘పరిపూర్ణ ద్రవ్యత్వం ఉన్న ఆస్తి’ అంటారు.


ద్రవ్యం


Money (ద్రవ్యం) అనే ఆంగ్ల పదం ‘మానెటా’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. రోమన్ల కాలం నుంచే ఈ పదాన్ని వాడారు. ఆ కాలంలో రోమన్‌ దేవత మానెటా ఆలయంలో నాణేలు ముద్రించారు.


పరిణామక్రమం


ద్రవ్య పరిణామక్రమంలో కింది దశలను పేర్కొంటారు.


వస్తురూప ద్రవ్యం: చర్మంతో చేసిన వస్తువులు, జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలు, గోధుమ, వరి, పశువులు.


లోహద్రవ్యం: బంగారం, వెండి, రాగి, నికెల్‌ నాణేలు.


కాగితం ద్రవ్యం: కరెన్సీ నోట్లు.


పరపతి ద్రవ్యం: బ్యాంకు డిపాజిట్లు, చెక్కులు.


సమీప ద్రవ్యం: ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు.


భారతదేశ కరెన్సీ చరిత్ర


క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికే మన దేశంలో నాణేల వాడకం అమల్లో ఉంది. మొగలుల కాలంలో వీటి వినియోగం విస్తృతమైంది. 


*  నాణేలను మొదట వ్యాపార సంఘాలు వాడాయి. క్రమంగా ప్రభుత్వాలు నాణేలను ముద్రించాయి.


*  ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఆధునిక రూపాయికి మాతృక రూపియా. దీన్ని మొగల్‌ పాలకుడు షేర్షా సూరి (1486-1545) అమల్లోకి తెచ్చాడు. 


* మన దేశంలోనే కాకుండా మొగల్‌ సామ్రాజ్య ప్రాబల్యం ఉన్న ఇండోనేసియా, మాల్దీవులు, మారిషస్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలో కూడా రూపియా ప్రాబల్యం పొందింది.


* భారతదేశ ద్రవ్య మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. రూపాయి నోటు సాంకేతికంగా కరెన్సీ కాదు. దాన్ని నాణెంగానే పరిగణిస్తారు.


*  1957కు ముందు రూపాయి - అణాలు - పైసల కరెన్సీ వ్యవస్థ అమల్లో ఉండేది. 1957, ఏప్రిల్‌ 1 నుంచి దశాంశ వ్యవస్థను(Decimal System) ప్రవేశపెట్టారు.


నాణేల ముద్రణ


క్రీ.పూ. 7 నుంచి 1వ శతాబ్దం మధ్యకాలం వరకు వెండి నాణేలపై ఒకవైపు చిత్రాలను ముద్రించారు. వాటిని ‘పంచ్‌ మార్క్‌డ్‌’ నాణేలు అనేవారు.


* అప్పటి నుంచి వివిధ రాజవంశాలు భారతీయ చరిత్రను, సాంఘిక - సాంస్కృతిక పరిస్థితులను ప్రతిబింబించే వివిధ రకాల బొమ్మలతో అనేక రకాల నాణేలను ముద్రించాయి. వీటి తయారీకి బంగారం, వెండి, రాగి లోహాలను ఉపయోగించారు.


*  మొగల్‌ చక్రవర్తి షేర్షా దేశవ్యాప్తంగా ఒకే ద్రవ్యం చలామణి అయ్యేలా రూపియా పేరుతో ఒక వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. దాని బరువు 178 గ్రా. మొహర్‌ అనే బంగారు నాణేన్ని, డామ్‌ అనే రాగి నాణేన్ని కూడా ఆ కాలంలోనే చలామణిలోకి తెచ్చారు.


*  ప్రస్తుతం మన దేశంలో 1, 2, 5, 10 రూపాయిల విలువైన నాణేలు చలామణిలో ఉన్నాయి.


మనదేశంలోని నాణేల ముద్రణా కేంద్రాలు:


*  ముంబయి (మహారాష్ట్ర)    *  కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా)


*  హైదరాబాద్‌ (తెలంగాణ)    *  నోయిడా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


కాగితం కరెన్సీ


భారతదేశంలో కాగితం కరెన్సీ జారీ 18వ శతాబ్దంలో ప్రారంభమైంది.


*  మొదటిసారి కరెన్సీ నోట్లు జారీ చేసిన బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ (1770 - 1832), బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ అండ్‌ బిహార్‌ (1773 - 75).


*  ఇవేకాకుండా, బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ (1806), బ్యాంక్‌ ఆఫ్‌  బొంబాయి (1840), బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843) ప్రెసిడెన్సీ బ్యాంకులు కూడా కాగితం కరెన్సీని జారీ చేశాయి.


* 1861 కాగితం కరెన్సీ చట్టం భారత ప్రభుత్వానికి కాగితం కరెన్సీని జారీ చేసే అధికారాన్ని కల్పించింది. అప్పటినుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీ చేసింది. వీటి పంపిణీకి ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏజెంట్లుగా పని చేశాయి.


*  1935, ఏప్రిల్‌ 1న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏర్పడింది. ఇది 1938 నుంచి కరెన్సీ నోట్లు జారీ చేస్తోంది.


*  రూపాయి నోటును భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. దీనిపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది.


*  ప్రస్తుతం కేంద్ర బ్యాంకు 10, 20, 50, 100, 200, 500 రూపాయిల విలువైన కాగితం కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. వీటిపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం ఉంటుంది.


*  ముద్రణా ఖర్చు పెరగడంతో ప్రభుత్వం 1994 నుంచి రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో రూపాయి నోటును ముద్రించింది.


*  కరెన్సీ నోటుపై దాని విలువను 17 భారతీయ భాషల్లో ముద్రిస్తారు. నోటు వెనుక ఒక పక్క ఉండే అక్షరక్రమంలో 15 భారతీయ భాషలు ఉంటే, రెండో పక్క (ముఖం వైపు) ఆంగ్లం, హిందీ భాషలు ఉంటాయి.


*  ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ: 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 రూపాయలు.


దేశంలోని కరెన్సీ నోట్ల ముద్రణా కేంద్రాలు:


*  మహారాష్ట్రలోని నాసిక్‌ (1928). ఇందులో 10, 100, 200, 2000 రూపాయల విలువైన నోట్లను ముద్రిస్తారు.


*  మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ (1974). ఇక్కడ 20, 50, 100, 500, 2000 రూపాయల విలువగల నోట్లను ముద్రిస్తారు.


*  1995లో కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ్‌ బంగాలోని సాల్బోనీలో కరెన్సీ ముద్రణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఆధునిక కరెన్సీ ముద్రణా కేంద్రాలుగా పేర్కొంటారు. వీటిలో 2016లో 500, 2000 రూపాయల విలువైన కరెన్సీ నోట్లు ముద్రించారు. 2023, మే 19న ఆర్‌బీఐ రూ.2000 నోట్లను రద్దు చేసింది.


ప్రముఖుల అభిప్రాయాలు


‘‘ఒక చర్య తర్వాత మరొక చర్యను కొనసాగించి, చలామణి ద్వారా ద్రవ్యాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించడమే ద్రవ్య సారాంశం.’’ 


- జి.డి.హెచ్‌.కోల్‌


‘‘వస్తు చెల్లింపులు లేదా ఇతర వ్యాపార వ్యవహారాల పరిష్కారానికి అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యం. ప్రజల అభిప్రాయంతో లోహ ద్రవ్యం మాత్రమే సాధారణ ఆమోదాన్ని పొందుతుంది.’’ 


- డి.హెచ్‌. రాబర్ట్‌సన్‌


‘‘అందరికీ ఆమోదయోగ్యమైన వినిమయ మాధ్యమంగా, కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడే దేన్నైనా ద్రవ్యం అంటారు.’’ 


- జి.ఎఫ్‌.క్రౌథర్‌


‘‘ Money is What Money Does - అంటే ద్రవ్య విధులను నిర్వహించే విషయాలన్నింటినీ ద్రవ్యంలో చేర్చొచ్చు. ద్రవ్యం అంటే కేవలం లోహంతో చేసిన నాణేలు, కరెన్సీ నోట్లు మాత్రమే కాదు, ఇందులో చెక్కులు, హుండీలు, మారకపు బిల్లులు మొదలైనవి ఉంటాయి. ఎందుకంటే ద్రవ్యం చేసే పనులను ఇవి కూడా చేస్తాయి.’’ - ఫ్రాన్సిస్‌ వాల్కర్‌


 

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌