• facebook
  • whatsapp
  • telegram

పేదరికం

వృద్ధి నిరోధక విషవలయం!

ఒక దేశం ప్రతి పథంలో ఏ మేరకు సాగుతోంది అనే విషయాన్ని, అక్కడి పేదరికం లెక్కలతో తేలిగ్గా అంచనా వేయవచ్చు. ఇది ఒక సామాజిక, ఆర్థిక సమస్యగా పలు దేశాలను పట్టి పీడిస్తోంది. అందుకే అన్ని దేశాలూ ఆ పేదరికపు విషవలయం నుంచి బయటపడటానికి అనేక రకాల పథకాలు అమలు చేస్తుంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు పేదరికం, రకాలు, దాన్ని రూపుమాపేందుకు చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి. 

 

  పేదరికం అనేది ఒక సాంఘిక, ఆర్థిక లక్షణం. పేదరికం అంటే కనీస అవసరాలు కూడా పొందలేని స్థితి. అవి ముఖ్యంగా తిండి, గూడు, దుస్తులు, ఆరోగ్యం, విద్య అని ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నార్‌ నర్క్స్‌ తెలిపారు. ఈయన ‘పేదరిక విష వలయం’ (Vicious Circle Of Poverty)అనే భావనను ప్రతిపాదించారు. భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలకు నిరుద్యోగం, జనాభా పెరుగుదల ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. 

 

పేదరికం రకాలు

నిరపేక్ష పేదరికం: ఒక వ్యక్తి కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, దుస్తులు పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ఇది మన దేశంలో ఉంది. దీన్ని ‘తలల లెక్కింపు పద్ధతి’ (Head Count Ratio) ద్వారా లెక్కిస్తారు.

సాపేక్ష పేదరికం: ఇది ఆర్థిక అసమానతలకు సంబంధించిన భావన. ఇతరుల కంటే తక్కువ ఆదాయం పొందేవారిని పేదవారిగా పేర్కొంటారు. సాపేక్ష పేదరికం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. దీన్ని లారెంజ్‌ వక్రరేఖ లేదా గిణి గుణకం ద్వారా లెక్కిస్తారు.

దారిద్య్ర రేఖకు దిగువ స్థాయి (BPL): ఒక వ్యక్తి రోజుకు 2300 కేలరీల కంటే తక్కువ ఆహారం పొందితే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లుగా పరిగణిస్తారు. 

దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు (APL): ఒక వ్యక్తి రోజుకు 2300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం పొందితే వారిని దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారిగా చెప్పవచ్చు.

పేదరిక లేదా దారిద్య్ర రేఖ: సగటున 2300 కేలరీల స్థానాన్ని దారిద్య్రరేఖగా పేర్కొంటారు. ఒక వ్యక్తికి రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల ఆహారం అవసరమని ప్రణాళికా సంఘం తెలిపింది. సగటున భారతీయుడికి 2300 కేలరీల ఆహారం కావాల్సి ఉంటుందని నివేదించింది.


కారణాలు:

* ఆర్థిక శక్తి కేంద్రీకరణ

* వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత

* సహజ వనరుల అల్ప వినియోగం

* అధిక జనాభా ఒత్తిడి

* నిరుద్యోగిత 

* నిరక్షరాస్యత

* నిత్యావసర వస్తువుల లభ్యత తక్కువగా ఉండటం

* ద్రవ్యోల్బణం

* పంచవర్ష ప్రణాళికల వైఫల్యం 

* తక్కువ సాంకేతికత

* మూలధన సమస్య

* సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అభివృద్ధి (ఎల్‌పీజీ) నమూనా (1991)

* రాజకీయ, సామాజిక, వ్యవస్థాపక కారణాలు

* ఆర్థిక వృద్ధిరేటు తక్కువగా ఉండటం 

* ఆర్థిక అసమానతలు 

  1975లో ఇందిరా గాంధీ అయిదో ప్రణాళికా కాలంలో 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం పేదరిక నిర్మూలన. దాదాభాయ్‌ నౌరోజీ ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని రాశారు. అదేవిధంగా ‘సంపద దోపిడి’ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. మన దేశం నుంచి (1901) బ్రిటన్‌కు సంపద తరలించడమే భారతదేశ పేదరికానికి కారణమని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

 

పేదరికాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలు

* 1979 - వై.కె.అలఘ్‌ కమిటీ 

* 1993 - డాక్టర్‌ లక్డావాలా కమిటీ 

* 2005 - ప్రొఫెసర్‌ సురేష్‌ డి.తెందూల్కర్‌ కమిటీ

  దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం 2012లో డాక్టర్‌ సి.రంగరాజన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇది 2009 - 10, 2011 - 12 పేదరిక స్థితిని అంచనా వేసి 2014లో తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ ప్రకారం 2009 - 10లో దేశంలో మొత్తం పేదరికం 38.2% ఉంది. పేదరికాన్ని అంచనా వేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

 

నీతి ఆయోగ్‌ బహుళ కోణ పేదరిక సూచీ 2021 నివేదిక ప్రకారం దేశంలో పేదరిక గణాంకాలు

  బహుళ కోణ పేదరిక సూచిక (Multi Dimensional Poverty Index - MPI) ను 2010లో ప్రవేశ పెట్టారు. ఇది 3 అంశాలు, 12 సూచికలను తెలియజేస్తుంది. 

1) ఆరోగ్యం: పోషకాహారం, చిన్నపిల్లల మరణాలు, తల్లుల ఆరోగ్యం, 

2) విద్య: సంవత్సరాల చదువు, పాఠశాల నమోదు, 

3) జీవన ప్రమాణాలు: వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇల్లు, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు

  బహుళ కోణ పేదరిక సూచీ - 2021 ప్రకారం మన దేశంలో మొత్తం పేదరికం 25.01%గా ఉంది. అధిక పేదరికం గల రాష్ట్రాలు వరుసగా బిహార్‌ (51.91%), ఝార్ఖండ్‌ (42.16%), ఉత్తర్‌ ప్రదేశ్‌ (37.79%). తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు వరుసగా కేరళ (0.71%), గోవా (3.76%). అదేవిధంగా ఎక్కువ పేదరికం గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలీ (27.36%),  త‌క్కువగా పుదుచ్చేరిలో (1.72%) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పేదరికం 12.3% గా (20వ స్థానం) ఉంది. అధికంగా కర్నూలు (20.69%), విజయనగరం (19%); తక్కువగా గుంటూరు (8.31%) జిల్లాల్లో ఉంది. తెలంగాణలో మొత్తం పేదరికం 13.74% గా (18వ స్థానం) ఉంది. ఎక్కువ పేదరికం గల జిల్లాలు వరుసగా ఆదిలాబాద్‌ (27.43%), మహబూబ్‌నగర్‌ (26.11%); తక్కువగా గల జిల్లాలు హైదరాబాద్‌ (4.27%), రంగారెడ్డి (5.83%).

 

పేదరిక గణాంకాల అంచనాలు

  1950లో జాతీయ నమూనా సర్వే సంస్థను (NSSO) ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ 1950 నుంచి 1972 - 73 వరకు ప్రతి సంవత్సరం పేదరిక గణాంకాలను అంచనా వేసింది. 1973 - 74 నుంచి అయిదేళ్లకు ఒకసారి పేదరిక గణాంకాలను సేకరించింది. 2019లో జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO), కేంద్ర గణాంక సంస్థ (CSO) ను విలీనం చేసి జాతీయ గణాంక సంస్థ (NSO) గా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో జాతీయ గణాంక సంస్థ పేదరిక గణాంకాలను సేకరిస్తుంది. 

 

ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం 

  మన దేశంలో 1950లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని ప్రారంభించారు. పంపిణీ కంటే ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించారు. దీని ద్వారా జాతీయాదాయం పెరిగి పేదరికం తగ్గుతుందని భావించారు. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం అంటారు.

 

పంచవర్ష ప్రణాళికలు - పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం

* నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో (1969 - 74) ఇందిరా గాంధీ 1971లో గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదంతో పేద‌రికంపై ప్ర‌త్య‌క్ష యుద్ధం ప్ర‌క‌టించారు. గరీబీ  హఠావో అంటే పేదరికాన్ని తరిమివేయండి అని అర్థం.  

* అయిదో ప్రణాళికలో (1974 - 79) పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీన్ని పేదరిక నిర్మూలన ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
 

 పేదరిక నిర్మూలన చర్యలు

 2000 సంవత్సరం సెప్టెంబరులో యూఎన్‌వో శిఖరాగ్ర సమావేశంలో 189 దేశాల నాయకులు ప్రపంచ పేదరికానికి ముగింపు పలకాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. సహస్రాబ్ది లక్ష్యాలుగా (మిలీనియమ్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) భావించే పేదరిక నిర్మూలన, మానవ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం, ప్రజాస్వామ్య, పర్యావరణ నిలకడ గల స్థితిని పెంపొందించడం లాంటి 8 లక్ష్యాలను సాధించడానికి నిర్దేశించారు. 2016లో యూఎన్‌డీపీ ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో పాటు సహస్రాబ్ది లక్ష్యాల్లో మొదటి రెండు 2030 సంవత్సరం నాటికి అన్ని రకాల పేదరికం, ఆకలిని అంతం చేయాలనే అంశానికి సంబంధించినవి.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 22-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌