• facebook
  • whatsapp
  • telegram

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

 

  ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

  భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.

పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

 

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు (Indirect Tax): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

 

పంపిణీ న్యాయం ఆధారంగా విధించే పన్నులు

అనుపాత పన్ను (Proportional Tax):  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను (Progressive Tax): పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను (Regressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను (Degressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

 

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను (ad valorem tax): ఇది వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను (Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

 

కేంద్ర ప్రభత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు: 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860) 

* కార్పొరేషన్‌ పన్ను (1965 - 66) 

* వడ్డీపై పన్ను (1974) 

* వ్యయ పన్ను (1957) 

* సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు) 

* ఎస్టేట్‌ డ్యూటీ (1953) 

* కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు : కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను

 

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ ్బదితీదీగ్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ ్బదితీనిద్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ్బదితీఖిద్శి గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 

దేశంలో పన్నుల సంస్కరణలు - కమిటీలు  

* 1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

* 1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను)

* 1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన)

* 1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ)

* 1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం)

* 1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను)

* 1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

* 1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

* 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

* 2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

* 2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌)  

 

కలపబడిన విలువ పన్ను (VAT - Value Added Tax)

అమ్మకం పన్ను చట్టం స్థానంలో వ్యాట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వ్యాట్‌ అనేది పరోక్ష పన్ను. మన దేశంలో మొదటిసారి 2003 ఏప్రిల్‌లో వ్యాట్‌ను అమలు చేసిన రాష్ట్రం హరియాణా. 2005 ఏప్రిల్‌ 1న దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 2012 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 

* సవరించిన కలపబడిన విలువ పన్ను(Modified Value Added Tax - MODVAT)ను1986లో ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ప్రవేశపెట్టారు.

* కేంద్ర కలపబడిన విలువ పన్ను(CENVAT - Central Value Added Tax)ను 2004లో ప్రవేశపెట్టారు. మాడ్‌ వ్యాట్‌ను సెన్‌ వ్యాట్‌ పథకంగా మార్చారు. ప్రపంచంలో తొలిసారిగా వ్యాట్‌ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్‌ (1954). టర్నోవర్‌ ట్యాక్స్‌కు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టింది.  

 

వస్తుసేవల పన్ను (Goods and Service Tax)

దేశంలో వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ పరోక్ష పన్ను. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్‌ (1954). మన దేశంలో తొలిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. అదే సంవత్సరంలో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణ కోసం డాక్టర్‌ సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ల నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి ఆసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 

* జీఎస్టీ రూపశిల్పి ఆసిమ్‌దాస్‌ గుప్తా. దీని నినాదం ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌.

* జీఎస్టీ అంటే అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్ను.

* మన దేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అసోం (2016 ఆగస్టు 12).

  పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 

జీఎస్టీ మండలి: జీఎస్టీ కౌన్సిల్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్‌ 279్బత్శ్బి1్శ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక అంటారు.

 

జీఎస్టీ నాలుగు రకాలు 

1) కేంద్ర జీఎస్టీ

2) స్టేట్‌ జీఎస్టీ

3) ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ

4) యూజీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్‌ నాలుగు రకాల పన్నురేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం 5%, 12%, 18%, 28% పన్నురేట్లను ప్రతిపాదించింది. మొత్తం 1211 వస్తువులపై పన్నురేట్లను నిర్ణయించారు. మరో 500 రకాల సేవలపై జీఎస్టీని ప్రకటించింది.

 

భారత ఆర్థిక సంఘం (విత్తసంఘం)

  భారత రాజ్యాంగంలోని అధికరణం 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు లేదా అంతకంటే ముందుగా విత్తసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్తవనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ప్రాతిపదికను సూచించడం విత్తసంఘం విధి. 1951 నుంచి 2017 వరకు 15 విత్తసంఘాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయమైన జవహర్‌ వ్యాపార్‌ భవన్‌ న్యూదిల్లీలో ఉంది. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951 నవంబరు 22న, 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరు 27న ఏర్పాటు చేశారు. 

  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ (నందకిషోర్‌ సింగ్‌). ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఉంటారు. ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అరవింద్‌ మెహతా. 15వ ఆర్థికసంఘం ప్రస్తుత సభ్యులు అజయ్‌ నారాయణ్‌ ఝూ, ప్రొఫెసర్‌ అనూప్‌సింగ్, అశోక్‌ లాహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 - 26 వరకు అమల్లో ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1) వస్తుసేవల పన్నును (జీఎస్టీ) మన దేశంలో ఎప్పుడు అమలు చేశారు?

1) 2017 జులై 1           2) 2016 జులై 1 

2) 2017 జులై 4            3) 2017 జులై 2 

 

2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాలను తెలియజేస్తుంది?

1) 268వ అధికరణ            2) 300వ అధికరణ               3) 1, 2          4) 280వ అధికరణ

 

3. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు? 

1) 5వ షెడ్యూల్‌            2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌            4) 8వ షెడ్యూల్‌

 

4. ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరిగితే అది 

1) పురోగామి పన్ను            2) తిరోగామి పన్ను            3) వ్యాట్‌         4) జీఎస్టీ

 

5. తిరోగామి పన్ను అంటే?

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గడం.

2) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరగడం.

3) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

4) పైవన్నీ 

 

6. అనుపాతపు పన్ను అంటే? 

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

2) పన్నురేటు స్థిరంగా లేకపోవడం. 

3) ఆదాయం పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణించడం. 

4) పైవన్నీ

 

7. వస్తువు విలువను బట్టి విధించే పన్ను?  

1) మూల్యానుగత పన్ను        2) నిర్దిష్ట పన్ను 

3) వ్యాట్‌                        4) జీఎస్టీ 

 

8. కలపబడిన విలువపన్ను (వ్యాట్‌) ను తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్రం, ఎప్పుడు అమలు చేసింది? 

1) హరియాణా, 2003            2) ఒడిశా, 2004 

3) అసోం, 2005                 4) గుజరాత్, 2006 

 

9. వ్యాట్‌ను దేని స్థానంలో ప్రవేశపెట్టారు? 

1) టర్నోవర్‌ పన్ను             2) అమ్మకం పన్ను 

3) ఆక్ట్రాయ్‌ పన్ను               4) ఎక్సైజ్‌ సుంకం 

 

10. వ్యాట్‌ ఒక 

1) పరోక్ష పన్ను             2) ప్రత్యక్ష పన్ను 

3) పురోగామి పన్ను         4) తిరోగామి పన్ను 

 

సమాధానాలు

1-1     2-3     3-3     4-1     5-1     6-1     7-1     8-1     9-2     10-1.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌