• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ బ్యాంకు

 ఆర్థిక వ్యవస్థలకు అంతర్జాతీయ అండ!
 

అభివృద్ధి చెందుతున్న దేశాల పురోభివృద్ధికి రుణ సాయం చేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థే ప్రపంచ బ్యాంకు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేస్తోంది. సభ్య దేశాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి ఆశయంతో పాటు పేదరికం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి ఉన్నత లక్ష్యాలతో పనిచేస్తోంది. రెండో ప్రపంచ యద్ధానంతరం దీని ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల నుంచి ప్రస్తుత పనితీరు, పరిధి, ఇందులో మన దేశ భాగస్వామ్యం, ఇంతవరకు పొందిన ప్రయోజనాల గురించి అభ్యర్థులకు తగిన అవగాహన ఉండాలి. ప్రపంచబ్యాంకు నిర్వహణ, నిర్మాణంలోని లోపాల కారణంగా ఏర్పాటైన కొత్తతరం అంతర్జాతీయ సంస్థలు, అందులో భారత్‌ పోషిస్తున్న క్రియాశీల పాత్ర గురించి తెలుసుకోవాలి.

  

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం, సులభ ద్రవ్యత్వం ప్రపంచానికి అత్యవసర లక్ష్యంగా మారింది. ఇందుకోసమే 1944లో జులై 1 నుంచి 22 వరకు న్యూహంప్‌షైర్‌ (అమెరికా)లోని బ్రిటన్‌ వుడ్స్‌లో 44 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ‘ఐక్యరాజ్య సమితి ద్రవ్య, ఆర్థిక సమావేశం’గా వ్యవహరించిన ఆ కార్యక్రమంలో దేశాలన్నీ ఐబీఆర్‌డీ, ఐఎమ్‌ఎఫ్‌ అనే రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఏర్పాటుకు అంగీకరించాయి. వీటినే బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు అంటారు. అందులోని ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD) ను ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు సంస్థలు: ప్రపంచ బ్యాంకు గ్రూపులో అయిదు సంస్థలున్నాయి.అవి  

1) ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD)

2) ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA) 3)

3) ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (IFC) 4)

4) మల్టీలేటరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్యారంటీ ఏజెన్సీ (MIGA)

5) ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిస్ప్యూట్స్‌ (ICSID)

భారతదేశానికి ICSIDలో తప్ప మిగిలిన నాలుగు సంస్థల్లోనూ సభ్యత్వం ఉంది. వీటిలో మొదటిసారిగా ఏర్పడింది ఐబీఆర్‌డీ (1945). ప్రపంచ బ్యాంకు సభ్యత్వం కావాలంటే మొదట ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం అవసరం. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రస్తుత (2019 నుంచి అయిదేళ్ల కాలానికి) ఛైర్మన్‌ డేవిడ్‌ మాల్‌పాస్‌. ఈయన జపనీస్‌ జాతీయుడు. ఈ బ్యాంకు ఆర్థిక పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఐఎమ్‌ఎఫ్‌ సభ్యదేశాలన్నీ ఐబీఆర్‌డీలోనూ సభ్య దేశాలే. ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం రద్దయితే ఐబీఆర్‌డీలోనూ సభ్యత్వం పోతుంది. అయితే 75% సభ్యులు అనుమతి ఇస్తే ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం రద్దయినప్పటికీ ఐబీఆర్‌డీలో కొనసాగవచ్చు.

ఐబీఆర్‌డీలో రెండురకాల సభ్య దేశాలుంటాయి.

1) 1945, డిసెంబరు 31 నాటికి ఉన్న స్థాపక సభ్య దేశాలు. వీటిలో భారత్‌ ఉంది.

2) సాధారణ సభ్యదేశాలు.

 

విధులు: 

 1) మధ్య ఆదాయ, పరపతి సామర్థ్యం ఉన్న అల్ప ఆదాయ దేశాలకు రుణాలను అందిస్తుంది.


2) పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇస్తుంది. 


3) అవినీతి వ్యతిరేక, సురక్షిత వలయానికి చెందిన సంస్థాగత సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. 


4) విత్త సంక్షోభ సమయంలో సహాయం చేస్తుంది.


ప్రపంచ బ్యాంకు-భారతదేశం

మొదటి రుణం: రైల్వే పునరావాసం కోసం 1948, నవంబరులో 34 మిలియన్‌ డాలర్లు తీసుకుంది.

తర్వాత రుణం: 104 కార్యకలాపాలకు 27.1 బిలియన్‌ డాలర్ల మేరకు భారత్‌ రుణాలు పొందింది.

* కొవిడ్‌-19కు సంబంధించి సామాజిక సహాయం కోసం 400 మిలియన్‌ డాలర్లు, ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం’లో 80 కోట్ల మందికి అదనపు రేషన్, తక్షణ నగదు బదిలీ కోసం 750 మిలియన్‌ డాలర్లు రుణాలు తీసుకుంది.

అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (IDA): 1960లో ఏర్పాటు చేశారు. భారతదేశం ఇందులో సభ్యదేశం. దీనిని సాఫ్ట్‌ విండో లేదా సాఫ్ట్‌ లెండింగ్‌ ఆర్మ్‌ ఆఫ్‌ వరల్డ్‌ బ్యాంక్‌ అంటారు. వెనుకబడిన, పేద దేశాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. వీటిని 30-40 సంవత్సరాల్లోపు చెల్లించాలి. దేశాలు తమ సొంత కరెన్సీలోనూ తిరిగి చెల్లించవచ్చు. అందుకే ఐడీఏను సాఫ్ట్‌ లోన్‌ విండో అని పిలుస్తారు. 2023 నాటికి ఏ దేశాల తలసరి ఆదాయం 1255 డాలర్ల కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలు మాత్రమే దీని కింద రుణాలు పొందడానికి అర్హులు.


ప్రపంచ దేశాల వర్గీకరణ

1) తక్కువ ఆదాయ దేశాలు → తలసరి ఆదాయం 1,085 డాలర్ల కంటే తక్కువ.

2) తక్కువ మధ్య ఆదాయ దేశాలు → 1,086 డాలర్ల కంటే అధికం, 4,255 డాలర్ల కంటే తక్కువ.

3) అధిక మధ్య ఆదాయ దేశాలు → 4,256 డాలర్ల కంటే అధికం, 13,205 డాలర్ల కంటే తక్కువ.

4) అధిక ఆదాయ దేశాలు → 13,205 డాలర్ల కంటే ఎక్కువ.

* ఇండియా తలసరి ఆదాయం 2277 డాలర్లు.

 

కొన్ని దేశాల తలసరి ఆదాయం కటాఫ్‌ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ పరపతి సామర్థ్యం లేకపోవడం వల్ల ఐబీఆర్‌డీ నుంచి రుణాలు పొందలేకపోతున్నాయి. వాటికి కూడా ఐడీఏ సహాయం చేస్తుంది. 

ఉదా: నైజీరియా, పాకిస్థాన్‌.


ఐడీఏ ద్వారా భారత్‌ ఎక్కువ లబ్ధి పొందింది. అయితే 2015 నుంచి ఎలాంటి మద్దతు తీసుకోలేదు. కారణం 2014లో భారతదేశాన్ని గ్రాడ్యుయేటెడ్‌గా ప్రకటించింది (వరుసగా 2 ఆర్థిక సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఆపరేషనల్‌ కటాఫ్‌ మించిపోతే ఆ దేశాన్ని గ్రాడ్యుయేట్‌గా ప్రకటిస్తారు). 2020 నాటికి 37 దేశాలు ఈ హోదాను పొందాయి.


భారతదేశం-ఐడీఏ 


1) 1960, సెప్టెంబరు 24న కలకత్తా, బొంబాయి, మద్రాసు ఓడరేవు సౌకర్యాల విస్తరణ కోసం రుణం పొందింది.


2) భారతీయ రైల్వే సరకు రవాణా సామర్థ్యం విస్తరణతోపాటు దుర్గాపుర్, కొయనా, కోర్బా విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు రుణం పొందింది.


3) బియాస్‌ - సట్లెజ్‌ నదీ వ్యవస్థ ఆనకట్టలు, కాలువల నిర్మాణ కోసం రుణం.


4) ఎడారి సాగు కోసం కాలువల నిర్మాణం, రాజస్థాన్‌ నీటిపారుదల వ్యవస్థ విస్తీర్ణం పెంచేందుకు రుణం.


5) హరిత విప్లవం, శ్వేతవిప్లవం, పోలియో, టి.బి. నివారణకు సహాయం.


* 1961 నుంచి 2015 వరకు పొందిన మొత్తం రుణాలు 46 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.


అంతర్జాతీయ విత్త కార్పొరేషన్‌ (IFC):  1956, జులై 20న ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేటు రంగ పరిశ్రమలకు రుణ సదుపాయం అందిస్తుంది. బలమైన ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులను, సాంకేతిక నిపుణులను, సలహా సేవలను అందిస్తుంది. అందుకే దీన్ని ‘ప్రైవేట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ బ్యాంక్‌’ అంటారు. అంతర్జాతీయ విత్త మార్కెట్‌లో బాండ్లు జారీ చేయడం ద్వారా ఐఎఫ్‌సీ నిధులు సమకూర్చుకుంటుంది.


ఉదా: అమెరికా డాలర్‌ బెంచ్‌ మార్క్‌ బాండ్, లోకల్‌ కరెన్సీ బాండ్స్, 2014లో రూపీ బాండ్, మసాలా బాండ్‌ల ద్వారా భారత కంపెనీలకు  ఐఎఫ్‌సీ విత్తాన్ని సమకూర్చింది.


భారతదేశం - ఐఎఫ్‌సీ:

1) ఆర్థిక సమ్మిళిత్వానికి తోడ్పడేందుకు 20 మిలియన్‌ డాలర్లతో ఐఎఫ్‌సీ భారత్‌లో పెట్టుబడులు పెట్టింది.

 2) వాతావరణ మార్పులను సరిదిద్దడం కోసం పెట్టుబడులు

 3) నీటికొరత ప్రభావాలను పరిష్కరించడం.


బహుపాక్షిక పెట్టుబడి హామీ ఏజెన్సీ (MIGA): ఇది 1988లో ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. కరెన్సీ బదిలీలు, యుద్ధం, పౌర అశాంతి తదితర నష్టభయ సమయాల్లో విదేశీ పెట్టుబడిదారులకు బీమాను అందిస్తుంది. 


పెట్టుబడి వివాదాల పరిష్కార అంతర్జాతీయ కేంద్రం(ICSID):  1966, అక్టోబరు 14న విదేశీ పెట్టుబడిదారులు, వారికి ఆతిథ్యం ఇచ్చే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏర్పడే పెట్టుబడి వివాదాలను సయోధ్య లేదా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఈ సంస్థను స్థాపించారు.

 

భారతదేశం - ఐసీఎస్‌ఐడీ:  దీనికి సంబంధించిన సమావేశంలో భారతదేశం సంతకం చేయలేదు. కారణం ఈ కన్వెన్షన్‌ నియమాలు అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉండటమే.


న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌/ బ్రిక్స్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌: ప్రపంచ జనాభాలో సగం జనాభా బ్రిక్స్‌ దేశాల్లో ఉన్నప్పటికీ ఐఎమ్‌ఎఫ్‌ ఓటింగ్‌లో మాత్రం 15% కంటే తక్కువ ఓటింగ్‌ ఉంది. అందుకే ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా కొత్త అభివృద్ధి బ్యాంకును 2015లో రష్యాలో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం షాంఘై (చైనా)లో ఉంది. ఇటీవల (2023) 6 కొత్త దేశాలను బ్రిక్స్‌లో చేర్చారు. అవి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. ప్రస్తుత అధ్యక్షుడు మార్కోస్‌ ట్రోయోజో (బ్రెజిల్‌). బ్రిక్స్‌ దేశాల్లో BOP సమస్యలు ఎదురైనప్పుడు స్వల్పకాల ద్రవ్యత్వ సర్దుబాటుకు 2015లో కాంటింజెంట్‌ రిజర్వ్‌ అరేంజ్‌మెంట్‌ (CRA) ను ఏర్పాటు చేశారు. దీనిని 100 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేశారు. దీనిలో చైనా 41%; బ్రెజిల్, ఇండియా, రష్యాలు 18%; దక్షిణాఫ్రికా 5% వాటా కలిగి ఉంటాయి.


ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB): 31 సభ్యదేశాలతో 1966లో ఏడీబీని ఏర్పాటు చేశారు. ఇండియా కూడా ప్రారంభ సభ్య దేశం. 2019 నాటికి సభ్య దేశాల సంఖ్య 68కి పెరిగింది. ఇందులో 49 దేశాలు ఆసియా-పసిఫిక్, 19 దేశాలు బయట ప్రాంతాల నుంచి ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం ఫిలిప్పైన్స్‌లోని మండలాయాంగ్‌లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు మసత్సుజు అసకవా (జపాన్‌). భారత్‌ ప్రారంభ సభ్యదేశం, 4వ అతిపెద్ద వాటాదారు.


ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (AIIB):  ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో అవస్థాపన సదుపాయాల అభివృద్ధికి చైనా ప్రతిపాదన ఆధారంగా 2014లో ఈ బ్యాంకు ప్రారంభమైంది. 2016 నాటికి సభ్యదేశాలు 57. భారత్‌ కూడా సభ్యదేశమే. 2020 నాటికి సభ్యదేశాలు 103కి పెరిగాయి. అమెరికా, జపాన్‌ సభ్యత్వం తీసుకోలేదు. ఏఐఐబీ ప్రధాన కార్యాలయం బీజింగ్‌ (చైనా)లో ఉంది. దీని అధ్యక్షుడు జిన్లీ క్వున్‌ (చైనా).


ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (OECD): దీనిని 1947లో ఏర్పాటు చేశారు. 1960లో అమెరికా, కెనడాలు, 1964లో జపాన్‌ చేరాయి. దీనిలో భారత్, చైనా సభ్య దేశాలు కావు. దీని ప్రధాన కేంద్రం ప్యారిస్, సభ్యదేశాల సంఖ్య 38. అధ్యక్షుడు మథియాస్‌ కోర్మాన్‌.


యూరోపియన్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (EBRD):  ఇది 1991లో ఏర్పడింది. దీనిలో 71 సభ్య దేశాలున్నాయి. 2018 నుంచి భారత్‌ సభ్యత్వం పొందింది. ప్రధాన కేంద్రం లండన్‌. అధ్యక్షుడు ఒడిలే రెనాడ్‌ బస్సో.

 

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 31-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌