• facebook
  • whatsapp
  • telegram

  ప్రపంచ వాణిజ్య సంస్థ

అంతర్జాతీయ వ్యాపార కాపలాదారు! 


ప్రపంచంతో పాటు ప్రతి దేశ పురోగతికి అంతర్జాతీయ వాణిజ్యం తప్పనిసరి. దాన్ని నియంత్రించి, సులభతరం చేసేందుకు శిఖరాగ్ర స్థాయిలో ఏర్పాటైనదే ప్రపంచ వాణిజ్య సంస్థ. పలు దేశాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ సంస్థ సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అందుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తువులు, సేవల సరఫరాతో పాటు మేధోసంపత్తి వాణిజ్యాన్ని సులభతరం చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నియమాల రూపకల్పన, అమలు, సవరణల విషయంలో డబ్ల్యూటీవోకు ఉన్న ప్రాధాన్యాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ సంస్థ రూపొందించిన ప్రధాన ఒప్పందాలు, వాటి ప్రభావాలు భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. 


  

అంతర్జాతీయ వ్యాపారాన్ని 1930లో తలెత్తిన ఆర్థిక మాంద్య పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థల రక్షణ కోసం దిగుమతి సుంకాలు విధించడం ప్రారంభించాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపారం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపార అభివృద్ధికి కొన్ని దేశాలు ‘గాట్‌’ sGATT- General Agreement on Tariff and Trade) పేరుతో ఒప్పందం చేసుకున్నాయి. 1947, అక్టోబరులో 23 దేశాలు గాట్‌పై సంతకాలు చేశాయి. ఇందులో భారత్‌ ప్రారంభ సభ్య దేశం. 1948, జనవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇది బహుళపక్ష ఒడంబడిక. సభ్యదేశాల మధ్య వ్యాపార అభివృద్ధి కోసం గాట్‌ నిరంతర చర్చావేదికను ఏర్పాటు చేసింది.


ముఖ్యమైన నిబంధనలు:  

1) సుంకాలు తగ్గించడం.

 2) పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు. 

3) అత్యంత అభిమాన దేశం హోదా (MFN) ను అన్ని సభ్యదేశాలకు ఇవ్వడం.  

4) వాణిజ్య వివాదాల పరిష్కారం.


* సభ్యదేశాల మధ్య వివక్ష లేకుండా వ్యాపారం జరగాలని చెప్పేదే MFN అంటే ఒక దేశం మరొక దేశానికి అనుకూల తీర్మానాలు చేస్తే అవి గాట్‌లోని అన్ని దేశాలకు వర్తిస్తాయి.


గాట్‌ సమావేశాలు-డబ్ల్యూటీవో ఆవిర్భావం: గాట్‌కి సంబంధించి 8 సమావేశాలు (రౌండ్లు) జరిగాయి. 1986లో 8వ సమావేశం ఉరుగ్వేలో ప్రారంభమై 1994లో జెనీవాలో ముగిసింది. దీనిలో 15 అంశాలపై చర్చలు జరపగా, అందులో 14 అంశాలు వస్తువులకు, ఒకటి సేవలకు చెందినవి. సేవల అంశం వివాదాస్పదమైంది. ఈ చర్చల సారాంశాన్ని అప్పటి గాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్థర్‌ డంకెల్‌ ‘డంకెల్‌ డ్రాఫ్టు’గా రూపొందించారు. దీనిపై భారత్‌తో సహా 117 దేశాలు 1994, ఏప్రిల్‌లో మొరాకోలోని మారకేష్‌ నగరంలో సంతకాలు చేశాయి. ఫలితంగా 1994, డిసెంబరు 12న గాట్‌ రద్దయింది. దాని స్థానంలో WTO (ప్రపంచ వాణిజ్య సంస్థ) అనే స్వతంత్ర, శాశ్వత, చట్టబద్ధమైన సంస్థ 1995, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.


* గాట్‌ మాదిరిగానే ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రం కూడా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోనే ఏర్పాటైంది. దీనిలో ప్రారంభ సభ్యదేశాలు 121. ప్రస్తుతం 164కి చేరాయి. 2016లో అఫ్గానిస్థాన్‌ 164వ దేశంగా చేరింది. ప్రస్తుత డబ్ల్యూటీవో డైరెక్టర్‌ జనరల్‌ గోజి ఒకోంజో ఇవాలా (ఆఫ్రికా). డబ్ల్యూటీవో అంతర్జాతీయ వ్యాపార కాపలాదారుగా పనిచేస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం సభ్యదేశాలతో ప్రతి రెండేళ్లకోసారి సమావేశం నిర్వహిస్తుంది.


మంత్రుల స్థాయి సమావేశాలు: డబ్ల్యూటీవోలో ఇప్పటివరకు 12 మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి.


ప్రపంచీకరణ ప్రభావంతో నేడు ప్రపంచమంతా కుగ్రామం (గ్లోబల్‌ విలేజ్‌)గా మారుతోంది. ఇందులో ప్రపంచ వ్యాపారాన్ని సంరక్షించడంలో డబ్ల్యూటీవో కృషి చేస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా వస్తువులు, మూలధనం, టెక్నాలజీ, శ్రామికులు ఒక దేశం నుంచి మరో దేశానికి స్వేచ్ఛగా తరలాలి. అయితే శ్రామికుల స్వేచ్ఛా గమనశీలతను అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించడమే డబ్ల్యూటీవో లక్ష్యం. ‘గాట్‌’ కంటే దీని పరిధి ఎక్కువ. వాణిజ్య సంబంధాలు నిర్వహించేందుకు వీలుగా పన్నులు వేసే ప్రాంతం కలిగి ఉంటే డబ్ల్యూటీవోలో సభ్యత్వం పొందవచ్చు. ఇందుకు పూర్తి స్వతంత్య్ర దేశం కావాల్సిన అవసరం లేదు. అందుకే హాంకాంగ్, తైవాన్‌ కూడా ఇందులో సభ్యదేశాలయ్యాయి. డబ్ల్యూటీవో ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు మాదిరిగా కాకుండా ఒక దేశం - ఒక ఓటు విధానాన్ని అనుసరిస్తూ ఏటా ప్రపంచ వ్యాపార నివేదికను ప్రచురిస్తుంది.


సాధారణ మండలి: సభ్యదేశాల దౌత్యాధికారులు ప్రతి ఏడాది దీనికి హాజరవుతారు. మంత్రుల సమావేశం తరఫున ఇది పనిచేస్తుంది. వివాదాల పరిష్కార మండలిగా, ట్రేడ్‌ పాలసీ సమీక్ష మండలిగా వ్యవహరిస్తుంది. సాధారణ మండలి నిర్ణయాలపై డబ్ల్యూటీవోలోని అప్పిలేట్‌ సంస్థకు నివేదించవచ్చు.


వ్యాపార మండలి: దీనిలో 

1) వస్తువుల వ్యాపార మండలి 

2) సేవల వ్యాపార మండలి 

3) ట్రిప్స్‌ (Trade Related aspects of Intellectual Rights) కు చెందిన వ్యాపార మండలి ఉంటాయి. వీటిపై సాధారణ మండలికి నివేదించవచ్చు.


డబ్ల్యూటీవో నియమాలు:


అత్యంత అభిమాన దేశం హోదా (ఎంఎఫ్‌ఎన్‌): డబ్ల్యూటీవో సభ్యదేశాలు వ్యాపారపరంగా ఎలాంటి వివక్ష చూపకూడదు. అంటే ఒక దేశానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే, మిగతా సభ్య దేశాలకూ వాటినే అందించాలి. అయితే 

1) ప్రాంతీయ ఆర్థిక ఒప్పందాలకు మినహాయింపు ఉంటుంది. 

2) అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేకంగా తక్కువ సుంకాలు విధించవచ్చు.

3) ప్రత్యేక దేశాల నుంచి న్యాయంగా లేని వస్తువులు దిగుమతి అవుతున్నప్పుడు ఆంక్షలు పెంచవచ్చు. 

4) దేశ భద్రత నిబంధన వర్తిస్తుంది.


* భారతదేశం 1996లో పాకిస్థాన్‌కు ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇచ్చింది. 2019లో పుల్వామా దాడి కారణంగా ఆ హోదాను ఉపసంహరించి, పాకిస్థాన్‌ నుంచి వచ్చే దిగుమతులపై 200% సుంకాలు విధిస్తోంది.


నేషనల్‌ ట్రీట్‌మెంట్‌: వ్యాపార ఉత్పత్తులపై దేశీయ, విదేశీ అనే వివక్ష చూపకూడదు. అంటే దిగుమతి సుంకాలు విధించిన తర్వాత  దిగుమతి అయిన వస్తువులు, దేశీయ ఉత్పత్తుల మధ్య వివక్ష ప్రదర్శించకూడదు.


* భారతదేశం ప్రారంభించిన నేషనల్‌ సోలార్‌ మిషన్‌ కింద ప్రాజెక్టులో 30% దేశీయ ఉత్పత్తులు ఉండాలి. దీనివల్ల దేశీయ సోలార్‌ సెల్స్‌ పరిశ్రమలను ప్రోత్సహించినట్లు అవుతుంది. దీనిపై అమెరికా వ్యాపార ప్రతినిధులు వివాదాల పరిష్కార మండలికి వెళ్లగా భారత్‌కు ప్రతికూల తీర్పు వచ్చింది. అయితే అప్పిలేట్‌ అథారిటీలో మాత్రం భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక మినహాయింపులు: వాణిజ్య ఒప్పందాలను అమలుచేసే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. డంపింగ్‌ వ్యతిరేక సుంకాలు, రక్షణకు కొంత అవకాశం ఇవ్వాలి. డబ్ల్యూటీవోలో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఇతర దేశాలు సుంకాలు తగ్గించవచ్చు. దోహాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


డబ్ల్యూటీవో ప్రధాన ఒప్పందాలు:


వ్యవసాయ ఒప్పందం: 


ఎ) గ్రీన్‌ బాక్స్‌ సబ్సిడీలు: వ్యవసాయ పరిశోధన, శిక్షణ, మార్కెట్‌ సమాచారం, గ్రామీణ అవస్థాపన సదుపాయాలకు ఇచ్చే రాయితీలను ‘గ్రీన్‌బాక్స్‌ సబ్సిడీలు’ అంటారు. ఎలాంటి పరిమితి లేకుండా వీటిని అనుమతిస్తారు. ఎందుకంటే ఇవి వ్యాపారాన్ని తగ్గించవు.


బి) బ్లూ బాక్స్‌ సబ్సిడీలు: ఉత్పత్తి కోటాలు విధించడం, రైతు భూమికి ఎకరా చొప్పున రాయితీలు ఇవ్వడం లాంటి చర్యల వల్ల ఉత్పత్తిని పరిమితం చేయవచ్చు. ఈ రాయితీలకు పరిమితి లేదు.


సి) అంబర్‌ బాక్స్‌ సబ్సిడీలు: ఎరువులు, విత్తనాలు, నీటిపారుదల విద్యుత్తుకు రాయితీల ద్వారా ఉత్పత్తిని పెంచి వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే వీటిపై పరిమితులున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తి విలువపై 5%, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10% రాయితీ మించకూడదు. ఎగుమతి సబ్సిడీలను అభివృద్ధి చెందిన దేశాలు ఆరేళ్లలో 36%, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదేళ్లలో 24% తగ్గించాలి. 


* వ్యవసాయ ఒప్పందం వల్ల, ముఖ్యంగా అంబర్‌ బాక్స్‌ రాయితీలపై పరిమితుల కారణంగా భారత ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలు కూడా దీని పరిధిలోకి వస్తుండటంతో పేదలకు ప్రజాపంపిణీ (పీడీఎస్‌) ద్వారా ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించలేకపోవచ్చు.


వ్యవసాయేతర మార్కెట్‌ - సౌలభ్యం: పారిశ్రామిక వస్తువులు, వస్త్రాలు, ఇంధన ఉత్పత్తులు, ఎగుమతులపై సుంకాలు తగ్గించాలి.


గాట్స్‌ (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ సర్వీసెస్‌): సభ్యదేశాల మధ్య సేవల వ్యాపార సరళీకరణకు సంబంధించింది.


ట్రిప్స్‌ (అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ రిలేటెడ్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌): కాపీరైట్లు, పేటెంట్‌ హక్కులు, ట్రేడ్‌ మార్కులు, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌కు సంబంధించిన నిబంధనలు ఇందులో ఉంటాయి. దీని ప్రకారం వస్తువును కనుక్కున్న దేశానికి పేటెంట్‌ హక్కులు వస్తాయి. భారత్‌లో పేటెంట్‌ హక్కు కాలం 21 ఏళ్లు. వస్తువులకు ట్రేడ్‌మార్క్‌ లేదా బ్రాండ్‌ పేరు కూడా ఉంటుంది. ట్రేడ్‌మార్క్‌ కాలవ్యవధి పదేళ్లు. సాహిత్యం, సంగీతం, కళాకారుల ప్రతిభకు కూడా కాపీరైట్స్‌ వర్తిస్తాయి. ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో ప్రత్యేక లక్షణాలు ఉండే ఉత్పత్తులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఇస్తారు.


ఉదా: డార్జిలింగ్‌ టీ, కాంచీపురం పట్టుచీరలు, నాగ్‌పుర్‌ కమలాలు, కొల్హాపూర్‌ చెప్పులు, ఆల్ఫాన్సో మామిడి 


ట్రిమ్స్‌ (ట్రేడ్‌ రిలేటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మెజర్‌): ఇది వస్తు వ్యాపారానికి సంబంధించింది. దీని ప్రకారం దేశ, విదేశీ పెట్టుబడుల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదు.


శానిటరీ అండ్‌ ఫైటోశానిటరీ మెజర్‌  (SPS): ఒక దేశం విదేశాల నుంచి ఆహారం దిగుమతి చేసుకునేటప్పుడు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఆహార భద్రత, జంతువులు, మొక్కల ఆరోగ్య ప్రమాణాలపై డబ్ల్యూటీవో ప్రత్యేక ఒప్పందం చేస్తుంది.


ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ అగ్రిమెంట్‌ (TFA): దేశాల మధ్య వస్తువులు రవాణా అయ్యేటప్పుడు కాలయాపన జరుగుతుంది. అందుకే ఎగుమతి, దిగుమతుల ప్రక్రియలో ఆధునికీకరణ, సమతౌల్యం తీసుకొచ్చి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి రూపొందించిన ఒప్పందం. దోహా సమావేశ ఫలితంగా 2017 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

 


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌