• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం

  చరిత్రలో కొన్ని సంఘటనలు విచిత్రంగా అనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే అంశం సందర్భాలను బట్టి రెండు పరస్పర విరుద్ధమైన ప్రభావాలను చూపుతుంటుంది. అలాంటి ఒక ఒప్పందం తెలుగు రాష్ట్రాలు కలవడానికి, విడిపోవడానికి కారణమైంది. అదే పెద్దమనుషుల ఒప్పందం. తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో   14 అంశాల ఆధారంగా కలిశారు. అవి అమలుకు నోచుకోలేదనే అసంతృప్తి తీవ్రమై చివరకు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు.ఒప్పందం నేపథ్యాన్ని, రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను అభ్యర్థులు సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షల్లో ప్రశ్నలు తరచూ అడుగుతున్నారు. సంఘటనలను కేవలం బట్టీపెట్టకుండా వివరంగా, విశ్లేషణాత్మకంగా చదివితే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

 

పెద్దమనుషుల ఒప్పందం

  ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడిన తర్వాత ఆగమేఘాల మీద నాటి మద్రాస్‌ ప్రభుత్వం  ఆంధ్ర రాష్ట్రాన్ని తరలించింది. దాంతో ఆంధ్రకు  సరైన రాజధాని లేకపోయింది. నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను విలీనం చేసి తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల తెలుగు జాతి సంస్కృతిని పెంపొందించుకోవచ్చని కొందరు పెద్దలు ఆకాంక్షించారు. అప్పట్లో ఆంధ్ర ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, సమస్యలు.కూడా విలీనానికి కారణమయ్యాయి. 

  ఆంధ్ర రాష్ట్రం ఎగువ భాగంలో ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉండటం, హైదరాబాద్‌ రాష్ట్రం ద్వారా ప్రవహించే కృష్ణా, గోదావరి నదీ జలాల అందుబాటు లాంటి కారణాలు విశాలాంధ్ర రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రేరేపించాయి. కానీ దీన్ని చాలామంది నాటి తెలంగాణ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తెలంగాణ నాయకుల భయాలను తొలగించడానికి తెలంగాణ ప్రాంతానికి అనేక హామీలతో కూడిన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి, హోం మంత్రి, కాంగ్రెస్‌ కమిటీలో పలుకుబడి ఉన్న ఆంధ్ర నాయకుల ఒత్తిడి లాంటి కారణాలు పెద్ద మనుషుల ఒప్పందానికి దారి తీశాయి. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్‌లో జరిగిన భారత్‌ సేవక్‌ సమాజ్‌ సమావేశంలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుగురు నాయకులు, హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన మరో నలుగురు నాయకులు 1956 ఫిబ్రవరి 20న కేంద్ర హోం మంత్రి గోవింద వల్లభ్‌ పంత్‌ సమక్షంలో సంతకాలు చేశారు. దీనికే పెద్ద మనుషుల ఒప్పందమని పేరు.

 

ఆంధ్ర రాష్ట్ర నాయకులు

1) బెజవాడ గోపాల్‌ రెడ్డి - ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి

2) నీలం సంజీవ రెడ్డి - ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

3) గౌతు లచ్చన్న - ఆంధ్ర రాష్ట్ర కేబినెట్‌ మంత్రి

4) అల్లూరి సత్యనారాయణ రాజు - ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు

 

తెలంగాణ నాయకులు 

1) బూర్గుల రామకృష్ణారావు - హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి

2) కొండా వెంకట రంగా రెడ్డి - రాష్ట్ర కేబినెట్‌ మంత్రి

3) మర్రి చెన్నారెడ్డి - రాష్ట్ర కేబినెట్‌ మంత్రి

4) జె.వి.నరసింగ రావు - హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు  

 

పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలు

* ఈ అంశాలు విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు కల్పించిన రక్షణలు.

1) కేంద్ర, సాధారణ పరిపాలనా ఖర్చులకు వ్యయాన్ని రెండు ప్రాంతాల నిష్పత్తిని అనుసరించి ఖర్చు చేయాలి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ ఒప్పందంలోని అంశాలు 5 సంవత్సరాలకు వరకు కొనసాగుతాయి. కానీ తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభ్యులు కోరితే దీన్ని మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. 

 

2) తెలంగాణ మద్యపాన నిషేదాన్ని తెలంగాణ ప్రాంత విధానసభ సభ్యులు నిర్ణయించిన ప్రకారం కొనసాగిస్తారు. 

 

3) ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విద్యార్థులకు ఉండే సౌకర్యాలను కొనసాగిస్తారు. తెలంగాణ ప్రాంత కళాశాలలు,  సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలన్నీ తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అమలు చేయబడతాయి. లేదంటే మొత్తం రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రవేశాల్లో 1/3వ వంతుకు తగ్గకుండా తెలంగాణ వారికి కేటాయించాలి. ఈ రెండు అంశాల్లో తెలంగాణ వారికి ఏది సమ్మతమైతే అది కొనసాగుతుంది.

 

4) రెండు రాష్ట్రాల విలీనం వల్ల మిగులు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఇరు ప్రాంతాల నిష్పత్తిలో మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

 

5) భవిష్యత్తులో ఉద్యోగుల నియామకం ఇరు ప్రాంతాల ప్రజల నిష్పత్తిలో కొనసాగాలని పేర్కొన్నారు.

 

6) రాష్ట్ర సాధారణ పరిపాలనలో లేదా న్యాయవ్యవస్థలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉర్దూను 5 ఏళ్ల వరకు కొనసాగించాలి. ప్రాంతీయ మండలి సమీక్షపై ఇది ఆధారపడి ఉంటుంది.

 

7) ప్రభుత్వ సర్వీసు నియామకానికి సంబంధించి ఉద్యోగుల్లో తెలంగాణ వారికి తెలుగు నిర్బంధం చేయకూడదు. (ఎందుకంటే వారికి తెలుగు రాదు)

 

8) తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో నియమించడానికి నివాస అర్హతను 12 ఏళ్లుగా నిర్ణయించారు. 

 

9) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకాలను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ మండలి నియంత్రిస్తుంది. 

 

10) తెలంగాణ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కావాల్సిన రక్షణలు పొందడం కోసం తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తారు. 

 

11) ప్రాంతీయ మండలి నిర్మాణాన్ని పేర్కొంటుంది.

* ప్రాంతీయ మండలిలోని సభ్యుల సంఖ్య 20.

* ఈ 20 మందిలో తొమ్మిది మందిని తొమ్మిది జిల్లాల నుంచి ఎన్నుకున్న విధాన సభ సభ్యులు అంటే ఒక జిల్లాలోని విధాన సభ సభ్యులు తమలోని ఒకరిని విధాన సభ సభ్యుడిగా ఎన్నుకుంటారు.

* ఆరుగురు సభ్యులను తెలంగాణ విధాన సభ్యుల నుంచి లేదా తెలంగాణ పార్లమెంట్‌ సభ్యుల నుంచి తెలంగాణ విధాన సభ సభ్యులు ఎన్నుకుంటారు.

మిగిలిన అయిదు మందిని రాష్ట్ర విధాన సభ సభ్యులు కాని వారిని రాష్ట్ర తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.

* తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు (20 మంది సభ్యులు కాకుండా).

* ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి దీనిలో సభ్యులుగా ఉంటారు.

* రాష్ట్ర కేబినెట్‌ మంత్రులు ఈ ప్రాంతీయ మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

 

12) ఈ ప్రాంతీయ మండలిని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతీయ మండలి పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవి ప్రధానంగా ప్రణాళిక, అభివృద్ధి, నీటిపారుదల సౌకర్యం, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినవి. ఒకవేళ ప్రాంతీయ మండలి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయానికి వదిలేయడం. ఈ ఏర్పాటును పదేళ్ల తర్వాత సమీక్షించాల్సి ఉంటుంది.

 

13) రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య 60 : 40 నిష్పత్తిలో (ఆంధ్ర : తెలంగాణ) నియమిస్తారు. ఈ 40% మంత్రుల్లో తప్పకుండా ఒక ముస్లింను తెలంగాణ నుంచి నియమించాలి.

 

14) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందినవారై ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రాకు చెందినవారై ఉండాలి. హోంశాఖ, ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖ, ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, వాణిజ్యం - పరిశ్రమలు ..... ఈ అయిదు శాఖల్లో ఏవైనా రెండు మంత్రిత్వ శాఖలు తప్పనిసరిగా తెలంగాణ వారికి ఇవ్వాలి.

  నిజానికి పెద్దమనుషుల ఒప్పందంలోని ఈ14 హామీలు మొదటి పన్నెండు సంవత్సరాల్లోనే పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. దాని పర్యవసానమే 1969లో వచ్చిన మొదటి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఆ తర్వాత మెల్లగా కొనసాగుతూనే ఉంది. 2001 నుంచి ఉద్యమం తీవ్రం కావడంతో 2014లో రాష్ట్ర విభజనకు దారితీసింది.

 

కింది ప్రశ్నలను పరిశీలిస్తే పరీక్షల్లో ఎంత లోతుగా అడుగుతున్నారో తెలుస్తుంది.

1. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం అప్పటి కేంద్ర హోం మంత్రి సమక్షంలో జరిగింది. ఆ కేంద్ర హోం మంత్రి ఎవరు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ 

2) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

3) ఆచార్య జె.బి.కృపలాని 

4) గోవింద వల్లభ్‌ పంత్‌

సమాధానం: 4

 

2. 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయనివారు ఎవరు?

1) జె.వి.నర్సింగరావు             2) గౌతు లచ్చన్న

3) అల్లూరి సత్యనారాయణ రాజు    4) కొండా లక్ష్మణ్‌ బాపూజీ 

సమాధానం: 4

 

3. కిందివాటిలో పెద్దమనుషుల ఒప్పందంలో లేని అంశం ఏది?

1) తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ మండలి ఏర్పాటు 

2) తెలంగాణ ప్రాంతంలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణ ప్రాంత విధాన సభ్యులు నిర్ణయించినట్లుగా కొనసాగడం 

3) ఇరు ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు జనాభా ప్రాతిపదికన జరగడం

4) ఇరు ప్రాంతాలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు శాశ్వతంగా, వేర్వేరుగా కొనసాగడం

సమాధానం: 4

ఈ విధమైన ప్రశ్నలన్నింటికీ కచ్చితమైన సమాధానాలు గుర్తించాలంటే ప్రతి అంశాన్ని వివరంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి.  
 

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌