• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ అస్తిత్వవాదం

నిలిచి గెలిచిన వాదం!

తెలంగాణ కోసం కొన్ని దశాబ్దాలపాటు పోరాటాలు సాగాయి. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడానికి ఎందరో నాయకులు నిరంతరం శ్రమించారు. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై పత్రికలు పెట్టి ప్రచారం చేశారు. సభలు ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించారు. ట్రస్టులు స్థాపించి అసమానతలపై అధ్యయనాలు చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి వెళ్లి జాతీయస్థాయిలో వినతిపత్రాలను సమర్పించారు. పట్టు విడవకుండా పాదయాత్రలు నిర్వహించారు. సమితులు, పార్టీలు, ఫోరాలతో పోరాట స్ఫూర్తిని కొనసాగించారు. మలిదశ ఉద్యమానికి గట్టి పునాదులు వేశారు. తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలిపి, గెలుపు వైపు నడిపించడానికి నాటి నేతలు చేసిన కృషిని పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


ఉవ్వెత్తున ఎగసిన 1969 జై తెలంగాణ ఉద్యమం తర్వాత సద్దుమణిగింది. అయినా ప్రత్యేక తెలంగాణ వాదం ప్రజల అంతరాల్లో కొనసాగుతూనే వచ్చింది. 1983లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధాన సభ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారందరినీ ఏకం చేసేందుకు తెలుగు జాతి భావనను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దాని వల్ల తెలంగాణ అస్తిత్వవాదం దెబ్బతింటుందని  తెలంగాణవాదులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా 1983 నుంచి తమ వాదాన్ని కాపాడుకోవడానికి కొందరు మేధావులు అనేక వేదికలపై తమ గొంతుకను వినిపించడం మొదలుపెట్టారు.


1969 నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. ఆ పోరాటాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న తెలంగాణవాదులు తెలంగాణ అస్తిత్వవాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. నాడు జనంలో స్ఫూర్తిని వ్యాపింపజేసిన వారిలో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, తెలంగాణ ప్రభాకర్, సంతపురి రఘువీరరావు, ఇ.వి.పద్మనాభం, భూపతి కృష్ణమూర్తి, తోట ఆనందరావు, ప్రతాప్‌ కిషోర్, వెలిచాల జగపతిరావు, గద్దర్, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు.


రకరకాలుగా ప్రజల్లోకి

ఫ్లాష్‌ అండ్‌ ఫెలోమెన్‌: ప్రముఖ తెలంగాణవాది, హైదరాబాద్‌ నగర సంస్థ మాజీ కౌన్సిలర్‌ ఇ.వి.పద్మనాభం ఆయన ప్రచురించే ‘ఫ్లాష్‌ అండ్‌ ఫెల్లోమెన్‌’ పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెచ్చారు.

 

తెలంగాణ జనసభ: 1985లో ‘అడ్వైజర్‌’ పత్రిక సంపాదకుడైన సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ సభ అదే ఏడాది ఫిబ్రవరి 27న ఆంధ్ర సార్వత్రిక పరిషత్తులో ఒక సదస్సు నిర్వహించింది. దీనికి ఆర్యసమాజ నాయకుడైన వందేమాతరం రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి, తెలంగాణవాదాన్ని ప్రచారం చేశారు. తెలంగాణ జనసభ ప్రతినిధుల బృందం నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించింది.


తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్టు: ఇ.వి.పద్మనాభం ప్రభావంతో 1986లో టి.ప్రభాకర్‌ తన సహచరులైన ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌లను సంప్రదించి ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌’ను ప్రారంభించారు. ఈ సంస్థ 1956 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రచురితమైన సమాచారాన్ని సేకరించి కరపత్రాలుగా ముద్రించేది.  సదస్సులు నిర్వహించి ప్రచారం చేసేది. సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి తెలంగాణ మేధావులతో కలిసి ప్రభాకర్‌ 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్టుగా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టులో టి.ప్రభాకర్, ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, పి.హరినాథ్, డాక్టర్‌ వినాయక్‌ రెడ్డి, తోట ఆనందరావు, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు. ట్రస్టు కార్యకలాపాలన్నీ టి.ప్రభాకర్‌కు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్, ఇంటి నుంచే జరిగేవి. తెలంగాణ కోసం చేసిన కృషి ఫలితంగానే ఆయన తెలంగాణ ప్రభాకర్‌గా ప్రసిద్ధిచెందారు. ఈ ట్రస్టు ప్రధాన లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ అసమానతలను అధ్యయనం చేసి వాటిని ప్రజలకు చేరవేసి చైతన్య పరచడమే.

 

తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్టు 1986, ఆగస్టు 13న ‘మా తెలంగాణ’ అనే పత్రికను ఆవిష్కరించింది. ఆ సందర్భంగా కాచిగూడలోని బసంత్‌ టాకీస్‌లో జరిగిన సభకు ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ అధ్యక్షత వహించారు. జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి, యువజన, ఉద్యోగ, మేధావి వర్గాల నుంచి పెద్దసంఖ్యలో జనం  హాజరయ్యారు. సభలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించిన జస్టిస్‌ మాధవరెడ్డి వాటికి వ్యతిరేకంగా ప్రతిఘటించాలని సూచించారు. 1988లో ట్రస్టు ప్రచురించిన ‘పర్స్పెక్టివ్స్‌ ఆన్‌ తెలంగాణ’ గ్రంథంలో తెలంగాణకు సాగునీరు, విద్యుత్తు రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సమగ్ర సమాచారంతో వివరించింది. 

 

రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పడానికి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కోస్తాలో గుడివాడ, రాయలసీమలో హిందూపురం, తెలంగాణలో కల్వకుర్తి నుంచి ఏకకాలంలో పోటీ చేశారు. కానీ కల్వకుర్తిలో ఓడిపోయారు. అందుకు కారణం తెలంగాణ ఇన్ఫర్మేషన్‌  ట్రస్టు ఎన్నికల ప్రచారం, దాని ప్రచురణల ప్రభావమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

 

తెలంగాణ లిబరేషన్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌: దీన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడైన కె.మనోహర్‌రెడ్డి స్థాపించాడు. తెలంగాణ ప్రాంతంలోని స్థానిక ఉద్యోగాల్లో స్థానికేతరులను నియమించడం, విశ్వవిద్యాలయంలో సీట్లను స్థానికేతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. ఇందులో చురుకుగా పాల్గొన్న నాటి జర్నలిస్టు జగన్‌రెడ్డి ‘కాకతి’ అనే పుస్తకాన్ని ప్రచురించి తెలంగాణవాదాన్ని ప్రచారం చేశాడు. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ఆంధ్ర ప్రాంతం వారిని నియమించాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓకు వ్యతిరేకంగా కె.మనోహర్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. దాంతో ప్రభుత్వం ఆ జీఓను రద్దు చేసింది. ఈ సంస్థ ఆధ్యర్యంలో ఒక బృందం దిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జాతీయ నాయకులకు వినతిపత్రాలను సమర్పించింది.

 

ప్రతాప్‌ కిషోర్‌ దిల్లీ పాదయాత్ర: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడానికి 1969 తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు అయిన ప్రతాప్‌ కిషోర్‌ తన మిత్రులైన షేర్‌ఖాన్, షాబుద్ధీన్‌లతో కలిసి 1987, జూన్‌ 6న హైదరాబాద్‌ నుంచి దిల్లీకి పాదయాత్ర చేపట్టారు. నాగ్‌పుర్‌ చేరుకునే స‌రికే కాళ్లు బొబ్బలెక్కడంతో అక్క‌డి నుంచి దిల్లీకి రైలులో ప్రయాణించారు. దిల్లీలో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వినతిపత్రాలు సమర్పించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చాక ప్రతాప్‌ కిషోర్‌ కొంతమంది తెలంగాణవాదులతో కలిసి 1987లో ‘తెలంగాణ ప్రజాసమితి’ని ఏర్పాటు చేశాడు. దీని వల్ల 1969 నాటి తెలంగాణ ప్రజాసమితిని మరోసారి ఆవిష్కరించినట్లయింది.

 

తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌): తెలంగాణ గాంధీగా పేరు పొందిన భూపతి కృష్ణమూర్తి టీపీఎస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈయన 1952 ముల్కీ ఉద్యమం, 1969 జై తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీపీఎస్‌ మొదటి సమావేశం 1994, జనవరి 23న హైదరాబాద్‌లో జరిగింది. ఈ స‌మావేశానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసమితి ప్రచురించిన ఒక పుస్తకంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను తాజా గణాంకాలతో వివరించారు. దీనికి వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నవంబరు 1ని తెలంగాణ బ్లాక్‌ డేగా, విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ ప్రజాసమితి 1996, నవంబరు 1న వరంగల్‌లో నిర్వహించిన సదస్సులో ప్రకటించింది.

 

వెలిచాల జగపతిరావు - సాగునీటి ఉద్యమం: కరీంనగర్‌కు చెందిన మాజీ శాసనమండలి సభ్యుడు వెలిచాల జగపతిరావు. ఈయన 1946 - 48 నాటి హైదరాబాద్‌ విమోచన పోరాటంలో, 1969 జై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, విద్యుత్తు, నీటివనరుల రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించారు. ప్రధానంగా సాగునీటి కోసం ఉద్యమించారు. తన ప్రసంగాలు, కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ భావజాల వ్యాప్తికి నిస్వార్థంగా కృషి చేశారు. తరచూ ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రతాప్‌ కిషోర్, రఘవీర్‌రావులతో సమావేశాలు నిర్వహించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించేవారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు వంద మంది శాసనసభ్యులతో నాటి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను జగపతిరావు వివరించారు.


దుశ్చర్ల సత్యనారాయణ: తెలంగాణ జలసాధన సమితి ఉద్యమ నాయకుడు. శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు నిర్మాణం (ఎ.ఎం.ఆర్‌ ప్రాజెక్టు) త్వరితగతిన పూర్తిచేసి ఫ్లోరైడ్‌ పీడిత నల్గొండ జిల్లా వాసులకు సురక్షిత తాగునీరు, సాగునీరు అందించాలని ఉద్యమించారు. సత్యనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రముఖ తెలంగాణవాదులు పాల్గొన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రాజెక్టు ప్రాంతంలో సదస్సు ఏర్పాటుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలపై అనేక సదస్సులు నిర్వహించారు.

 

ఓయూ ఫోరం ఫర్‌ తెలంగాణ: సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను చర్చించడానికి 1989లో ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫోరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, విద్యార్థుల్లో తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేతుల మీదుగా మొదటిసారిగా తెలంగాణ పొలిటికల్‌ మ్యాప్‌ను విడుదల చేసింది.

 

తెలంగాణ సంఘర్షణ సమితి: మాచినేని కిషన్‌రావు ఆధ్వర్యంలో 1989లో ఏర్పడింది. తెలంగాణకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి కృషి చేసింది.

 

తెలంగాణ పార్టీ: దీన్ని 1984లో దేవానంద స్వామి వరంగల్‌లో స్థాపించారు. ఈ పార్టీ తెలంగాణ వాదాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడానికి కొంతకాలం కృషి చేసింది.

 

తెలంగాణ ఫోరం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న మేధావులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులతో తెలంగాణ ఫోరం ఏర్పడింది. దీని కన్వీనర్‌గా కె.జానారెడ్డిని ఎన్నుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, తెలంగాణ ప్రాంతానికి జరిగే అన్యాయాలను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ‘తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్‌’ అనే పుస్తకంలో ప్రభుత్వ గణాంకాల ఆధారంగా వివరించారు. 

 

 ఈ విధంగా 1983 తర్వాత తెలంగాణ అస్తిత్వవాదాన్ని బలోపేతం చేయడానికి ఈ వేదికలన్నీ 2001 తర్వాత జరిగిన మలి ఉద్యమానికి గట్టి పునాదులు నిర్మించాయి.

రచయిత: ఎ.ఎం.రెడ్డి

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాలు

 తెలంగాణ ప్రజా సమితి పగ్గాలు

  తెలంగాణ‌లో 1969 నాటి ప‌రిణామాలు

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌