• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ జాతరలు

సమ్మక్క - సారక్క జాతర
    భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. భారతదేశంలోనే ఇది  అతిపెద్ద గిరిజన జాతర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996, ఫిబ్రవరి 1న ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. దీన్ని నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. 
* మొదటి రోజున పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును మేడారానికి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 
* రెండో రోజున సారక్క తల్లిని కన్నెపల్లి/ కన్నెబోయినపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. 
* మూడో రోజున సమ్మక్క తల్లిని మేడారానికి ఈశాన్యం వైపున ఉన్న చిలుకలగట్టు నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువై ఉండి భక్తులను రక్షిస్తారని నమ్మకం. అందుకే ఆ రోజున అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు ప్రసాదంగా బంగారాన్ని (బెల్లం) సమర్పిస్తారు. భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. 
* నాలుగో రోజున సమ్మక్క, సారక్క తల్లులిద్దరూ తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. 
* సమ్మక్క, సారక్క జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు జరుగుతుంది. 
* మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో పొలవాస అనే గిరిజన ప్రాంతాన్ని పాలించే మేడ రాజు కాకతీయులకు సామంత రాజు. ఈయన కూతురే సమ్మక్క. ఈ సమ్మక్కకు పగిడిద్ద రాజులకు కలిగిన సంతానమే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు.
* కుంభమేళా తర్వాత మేడారం సమ్మక్క జాతర ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది. 
* ఈ జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో గుర్తించింది.

బెజ్జంకిలో లక్ష్మీ నరసింహస్వామి
    కరీంనగర్‌ జిల్లాలోని బెజ్జంకి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంపై గోపికల నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథనం కథ మొదలైనవి అద్భుతంగా చెక్కారు. ఈ జాతర చైత్రమాసంలో జరుగుతుంది. చైత్ర పౌర్ణమి రోజు బండ్ల సేవ నిర్వహిస్తారు. ఎడ్లబండ్ల పోటీలు జరుగుతాయి. ఈ ఆలయానికి ఉత్తరాన 35 అడుగుల ఎత్తు స్తంభం ఉంది. దీన్ని ‘అండాల్‌ స్తంభం’ అని అంటారు. సంతానం కోసం ఈ స్తంభానికి చీరకట్టి, బియ్యం పోసే ఆచారం ఉంది. 

నల్లకొండ జాతర
    కరీంనగర్‌ జిల్లా కొడిమ్యాల మండలం నల్లకొండ సమీపంలో ఏటా మాఘ పౌర్ణమి రోజున ఈ జాతర జరుగుతుంది. 
* ప్రధాన దైవం - నల్లకొండ నరసింహస్వామి.

సింగరాయ జాతర
 కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏటా పుష్య మాసం బహుళ అమావాస్య రోజున ఈ జాతర జరుగుతుంది. 
* ప్రధానదైవం - లక్ష్మీ నరసింహస్వామి

కొమురవెల్లి మల్లికార్జునుడు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ఏటా మాఘ మాసం నుంచి చైత్ర మాసం వరకు ఈ జాతర జరుగుతుంది.
* ప్రధాన దైవం - మల్లికార్జునస్వామి. ‘కొమురవెల్లి మల్లన్న’గా భక్తులు ఆరాధిస్తారు.


కొరివి జాతర
మహబూబాబాద్‌ జిల్లా కురవి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఏటా మహాశివరాత్రి రోజు నుంచి 20 రోజులపాటు ఈ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఐనవోలులో మైలారదేవుడు
    వరంగల్‌ సమీపంలోని ఐనవోలులో ఉన్న మైలార దేవుడికి ఏటా జాతర జరుగుతుంది. 20 రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.


కోటంచ జాతర
    భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో ఏటా ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
* ప్రధాన దైవం - లక్ష్మీ నరసింహస్వామి.


రామప్ప జాతర 
భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా పాలంపేట గ్రామంలో ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది.
* ప్రధాన దైవం - రామగలింగేశ్వరస్వామి - ‘రామప్ప’గా ప్రసిద్ధి.


గుంజేడు ముసలమ్మ జాతర
మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ఏరియా పరిధిలోని గుంజేడు శివారులో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క జాతర సమయంలోనే ఈ జాతర జరుగుతుంది. సంతానం కలిగినవారు ఉయ్యాలకట్టి మొక్కులు చెల్లించుకుంటారు.


వేల్పులమ్మ జాతర
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలో వేల్పులమ్మను దేవతగా కొలుస్తారు. ఈ జాతర ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంది. ఒకటిన్నర అంగుళాల బంగారు వెండి కడ్డీలు దేవతకు గుర్తుగా ఒక వెదురుబొంగులో పెట్టి, దాన్ని కుండలో పెడతారు. జాతర జరిగే సమయంలో ఆ వెదురు బొంగును పూజలో ఉపయోగిస్తారు.

కొండగట్టు అంజన్న
కరీంనగర్‌ జిల్లా ముత్యంపేట సమీపంలో ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి.
* ప్రధాన దైవం - ఆంజనేయస్వామి. ‘కొండగట్టు - అంజన్న’గా భక్తులు పిలుస్తారు. 
* ఇక్కడి హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపు ఆంజనేయస్వామి ముఖంతో రెండు ముఖాలను కలిగి ఉంటాడు.

మేడారానికి అనుబంధంగా.. 
పగిడిద్దరాజు
  సమ్మక్క జాతర ముగిసిన మూడో రోజు పెదక వంశానికి చెందిన వడ్డెలు పునుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు జాతర జరుపుతారు. సమ్మక్క జాతర నుంచి గిరిజనులు నేరుగా పగిడిద్దరాజు జాతరకు వెళతారు.


ముసలయ్య జాతర
    వరంగల్‌ జిల్లా లక్నవరం సరస్సు గుట్టలోని ఒక సొరంగంలో ‘నాగలికర్రు’ ఆకారంలో ముసలయ్య ఉంటాడు. మేడారం జాతర ముగిసిన తర్వాత వచ్చే మార్చి నెలలో ఈ జాతర జరుగుతుంది.
 * ముసలయ్య కాకతీయులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. యుద్ధం ముగిసిన తర్వాత రాయిని గూడెంలో కరవు, అతిసార వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతున్న సమయంలో ముసలయ్య బాలుడిగా జన్మించాడని, ఇతడి పుట్టుకతో ఆ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండాయని భక్తుల విశ్వాసం. ఈ జాతర సందర్భంగా ఆయన్ని రక్తపు పాన్పుతో కొలుస్తారు. దేవుడి రాయిని తెచ్చి రాత్రంతా నృత్యాలు చేస్తూ జోగు ఆడుతారు. అనంతరం దేవుడికి బలిస్తారు. 


సూరుగొండయ్య జాతర
వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న రంగాపురం గ్రామంలో ఏప్రిల్, మే నెలల్లో చైత్ర పౌర్ణమి రోజున ఈ జాతర జరుగుతుంది.
* కోయజాతి గిరిజనుల్లో భరద్వాజ రుషి గోత్రానికి చెందిన మూడో గట్టు వేల్పుల్లో పెద్ద సూరుగొండయ్య, చిన్నసూరు గొండయ్య ఉండేవారు. పెద్దసూరు గొండయ్యకు పొలితగలని వడ్డె బోయాడు, చిన్న సూరుగొండయ్యకు బోయనికి వడ్డె ప²జలు నిర్వహిస్తారు.
* ఈ పూజలు జరిపే వడ్డెలు మూడు రోజులు ఉపవాసం ఉంటారు. పెద్ద ఎత్తున కోళ్లను బలిస్తారు. బెల్లాన్ని ప్రసాదంగా పంచుతారు.

నాగులమ్మ 
వరంగల్‌ జిల్లాలో కొండాయిలో గోవిందరాజుల గుడికి సమీపాన ఉన్న చిన్న గుడిసెలో నాగులమ్మ దేవతను నిలిపి పూజిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఫాల్గుణశుద్ధ పౌర్ణమి రోజున గోవిందరాజుల జాతర జరిగే సమయంలోనే నాగులమ్మ జాతర జరుపుతారు. కోయతెగకు చెందిన మూడోగట్టు గోత్రం ఇంటికి చెందిన ‘అందె’ అనే ఇంటి పేరున్న వారు వంశపారంపర్యంగా పూజారిగా ఆచార సంప్రదాయాలను నిర్వహిస్తున్నారు.

బాలకుమారస్వామి 
తాడ్వాయి మండలం గట్టుపై బాలకుమారస్వామి ‘గండ్రగొడ్డలి’ రూపంలో ఉంటాడు. ఈయనను సమ్మక్కకు సోదరుడని కొందరు, పినతండ్రి కుమారుడని ఇంకొందరు, కోటం వంశస్థుడని మరికొందరు పలు రకాలుగా భావిస్తారు.
* మేడారం జాతర జరిగిన తర్వాత వచ్చే మంగళవారం ఈ జాతర జరుగుతుంది. జాతరకు ముందురోజు దేవతను గ్రామంలో ఊరేగించి ఏడు బిందెలతో జలాభిషేకం చేస్తారు. డోలీ చప్పుళ్లు, గంటల శబ్దాలతో పడగలు ధరించిన బాలకుమారుడు గుడికి చేరుకుంటాడు.

కార్నేపల్లిలో
భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా ములుగుకు 20 కి.మీ.ల దూరంలో ఉన్న కార్నేపల్లి గ్రామ పంచాయతీలోని సండ్రగూడెంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ సారలమ్మను పులి రూపంలో పూజిస్తారు.

భూపతిపురం
వరంగల్‌ జిల్లాలోని భూపతిపురంలో మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 11 రోజులపాటు ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ప్రాంతంలోని కోయలు కొండ సారలమ్మ పేరుతో సారలమ్మను పూజిస్తారు.

Posted Date : 17-09-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు