• facebook
  • whatsapp
  • telegram

శ‌తాబ్దాల ముల్కీ స‌మ‌స్య‌

ముల్కీ... మా కొలువులు మాకే!

తెలంగాణ ఉద్యమం మూల కారణాల్లో ప్రధానమైనది ‘స్థానికత’. ముల్కీ వివాదంతో ముడిపడి పరిచయమైన ఈ పదం ఈ మధ్య విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినట్లు అనిపించినప్పటికీ, దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అప్పటి నుంచే స్థానికులపై స్థానికేతరుల ఆధిపత్యం అసంతృప్తులకు, ఆ తర్వాత తీవ్రమైన ఉద్యమాలకు కారణంగా మారింది. మా కొలువులు మాకే అంటూ రాజ్యాలను కూల్చింది. అనంతర పరిణామాలతో  ప్ర‌త్యేక తెలంగాణ‌ రాష్ట్ర ఆవిర్భవానికీ దారితీసింది. 

దక్కన్‌ భారత చరిత్రలో ముల్కీ సమస్యకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సమస్య చిలికి చిలికి పెను తుపానుగా మారి దక్కన్‌లో రాజ్యాలనే కూల్చివేసింది.  ‘ములుక్‌’ అనే పదం నుంచి ముల్కీ అనే పదం వచ్చింది. దీని అర్థం దేశం లేదా స్థానికత. ముల్కీలు అంటే స్థానికులు లేదా స్వదేశీయులు అని అర్థం. ముల్కీ పదానికి వ్యతిరేకమైంది గైర్‌ ముల్కీ. అంటే స్థానికేతరులు లేదా విదేశాల నుంచి వచ్చినవారని అర్థం. ఈ ముల్కీ, గైర్‌ ముల్కీ సమస్య బహమనీల కాలంలోనే ఉత్పన్నమైంది.

కాకతీయ రాజ్య పతనానంతరం దిల్లీ సుల్తానుల కాలంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి స్థిరపడిన వారిని దక్కనీ ముస్లింలు అనేవారు. కాలక్రమంలో వారు దక్కన్‌ ప్రాంత స్థానికులుగా అంటే ముల్కీలుగా ప‌రిగ‌ణించ‌బ‌డ్డారు. కానీ బహమనీ సుల్తానుల కాలంలో ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా దేశాల నుంచి అనేక మంది ముస్లింలు దక్కన్‌ ప్రాంతానికి వలస వచ్చారు. వీరిని స్థానికేతరులుగా అంటే గైర్‌ ముల్కీలు లేదా అఫాకీలుగా పిలిచేవారు. ముల్కీ, గైర్‌ ముల్కీల సమస్య దక్కన్‌ ముస్లింలలో విభేదాలకు దారితీసింది. ముల్కీలు సున్నీ వర్గానికి, గైర్‌ ముల్కీలు షియా వర్గానికి చెందినవారు కావడమే ఇందుకు కారణం.

స్థానికేతరులైన అఫాకీలకు ఉన్నత పదవులు దక్కగా, స్థానికులైన దక్కనీలు దిగువస్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. అఫాకీలు మంత్రులుగా, సేనాధిపతులుగా ఉంటే దక్కనీలు సైనికులుగానే ఉండేవారు. మరోవైపు సున్నీ, షియాల ఘర్షణలు నిరంతరం జరుగుతూ వచ్చాయి. స్థానికులైన దక్కనీలు కుట్ర పన్ని 78 ఏళ్ల వయోవృద్ధుడైన ప్రధాని ఖాజీ మహ్మద్‌ గవాన్‌ను హత్య చేయించారు. గవాన్‌ హత్యతో బహమనీ రాజ్యం అంతమైంది. ఆ తర్వాత వచ్చిన గోల్కొండ పాలకులైన కుతుబ్‌షాహీల కాలంలో ముల్కీ, గైర్‌ ముల్కీల సమస్య ఉత్పన్నం కాలేదు. కుతుబ్‌షాహీ రాజ వంశస్థులు అఫాకీలు అయినప్పటికీ వారు స్థానికులైన ముల్కీలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. స్థానిక హిందువులను కూడా ఉన్నత పదవుల్లో నియమించారు. దీనికి ఉదాహరణ అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో అత్యున్నత పదవుల్లో అక్కన్న, మాదన్నలను నియమించడం.

కుతుబ్‌షాహీల తర్వాత హైదరాబాద్‌ రాజ్య పాలకులైన అసఫ్‌ జాహీల కాలంలో (1724 - 1948) తొలుత ముల్కీ, గైర్‌ ముల్కీల సమస్య తలెత్తలేదు. కానీ మొదటి సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల (1853 - 1883) ఫలితంగా ఆ సమస్య తిరిగి రాజుకుంది. తాను ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలను విజయవంతం చేయడంలో భాగంగా మొదటి సాలార్‌జంగ్‌ బ్రిటిష్‌ ఇండియాలోని ఉత్తర భారతదేశం నుంచి అంటే నాటి యునైటెడ్‌ ప్రావిన్స్, సెంట్రల్‌ ప్రావిన్స్, బెంగాల్, బొంబాయితోపాటు మద్రాసు ప్రావిన్స్‌ల నుంచి విద్యావంతులు, సుశిక్షితులను రప్పించి ఉన్నత పదవుల్లో నియమించాడు. వీరంతా స్థానికేతరులైన గైర్‌ (నాన్‌) ముల్కీలే. అంతేకాకుండా 1857 తిరుగుబాటు అణిచివేత అనంతరం ఉత్తరాదిన అనేకమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని బ్రిటిష్‌ ప్రభుత్వం తొలగించింది. అలాంటివారంతా హైదరాబాదుకు వలస వచ్చారు. వీరిలో అత్యధికులు ముస్లింలే. హైదరాబాద్‌ రాజ్యం వీరికి ఉద్యోగాలు ఇచ్చింది. ఉన్నత పదవుల్లో నియమితులైన నాన్‌ముల్కీ అధికారులు తమ బంధువులు, తమ ప్రాంతం వారిని ఇక్కడికి పిలిపించి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించారు. ఈ క్రమంలో హైదరాబాదు పాలనా వ్యవస్థలో స్థానికేతరులైన నాన్‌-ముల్కీల ఆధిపత్యం పెరిగింది. దీంతో స్థానికులైన ముల్కీలు తమ అవకాశాలను కోల్పోయి గైర్‌ ముల్కీలపై వ్యతిరేకత పెంచుకున్నారు. అలా హైదరాబాదు రాజ్యంలో ముల్కీ ఉద్యమానికి బీజాలు పడ్డాయి. ఉద్యోగులుగా స్థానికులనే నియమించాలంటూ ఉత్తరాది హిందుస్థానీలకు వ్యతిరేకంగా నిరసనోద్యమం వచ్చింది.

* మొదటి సాలార్‌జంగ్‌ మరణం (1883) త‌ర్వాత‌ ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ అధికారంలోకి వచ్చాడు. ఇతను నాన్‌ ముల్కీల ఒత్తిడితో అప్పటివరకు అధికార భాషగా ఉన్న పర్షియన్‌ స్థానంలో ఉర్దూ భాషను పరిపాలనా భాషగా ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఉన్నతోద్యోగులకు ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యం ఉండాలని నిర్దేశించాడు. ఫలితంగా స్థానికులు (ముల్కీలు) అవకాశాలు కోల్పోయారు.

* 1884లో ఆరో నిజాం హైదరాబాదు సివిల్‌ సర్వీసెస్‌ను (హెచ్‌.సి.ఎస్‌.) ఏర్పాటు చేశాడు. నిజానికి హైదరాబాదు సివిల్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని మొదటి సాలార్‌జంగ్‌ ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించకముందే 1883లో అకాలమరణం చెందాడు.

* స్థానికులైన ముల్కీలకు జరుగుతున్న అన్యాయం ఆరో నిజాం దృష్టికి వచ్చింది. దాంతో అతడు సివిల్‌ సర్వీసుల్లో స్థానిక, స్థానికేతరుల జాబితాలను రూపొందించాలని ఆదేశించాడు. సివిల్‌ సర్వీసుల తొలి జాబితా ప్రకారం ముల్కీలు 246 మంది (52 శాతం), నాన్‌ ముల్కీలు 230 మంది (48 శాతం) ఉన్నారు. 52 శాతం ముల్కీల వేతనాల మొత్తం 42 శాతం కాగా, 48 శాతంగా ఉన్న నాన్‌ ముల్కీల మొత్తం వేతనం 58 శాతం అని వెల్లడైంది. స్థానిక ముల్కీలకు తక్కువ వేతనాలు, స్థానికేతరులైన నాన్‌ ముల్కీలకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్టు ఈ నివేదిక బహిర్గతం చేసింది.

స్థానికులకు అవకాశాలు కల్పించేందుకు ఆరో నిజాం 1888లో ఒక ఫరీదా (గజిట్‌/రాజపత్రం) విడుదల చేశాడు.

 

నిజాం ఫరీదాలోని వివరాలు

* ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో అర్హతల మేరకు విదేశీయుల జోక్యం లేకుండా స్థానికులనే నియమించాలి.

* గైర్‌ (నాన్‌) ముల్కీలను ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాలంటే దివాన్‌ (ప్రధానమంత్రి) అనుమతి తప్పనిసరి.

* ఈ ఫరీదా ప్రకారం ఎవరైతే హైదరాబాద్‌ రాజ్యంలో 12 సంవత్సరాలుగా నివాసముంటున్నారో వారిని స్థానికులుగా పరిగణిస్తారు.

ఆ తర్వాత ఈ ముల్కీ - నాన్‌ముల్కీల గొడవల కారణంగానే రెండో సాలార్‌జంగ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం దివాన్‌గా నియమితులైన మహరాజా కిషన్‌ పర్షాద్‌ స్థానిక ముల్కీలకు అండగా నిలవగా, నాటి హైదరాబాద్‌ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి కాసన్‌ వాకర్, నాన్‌ ముల్కీల పక్షాన ఉన్నారు. అందుకే మహరాజా కిషన్‌ పర్షాద్‌ను ‘గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ముల్కీస్‌’గా పేర్కొంటారు. దివాన్‌ సలహా మేరకు ఆరో నిజాం 1910లో మరో ఫరీదా జారీ చేశాడు.

 

1910 ఫరీదాలోని ముఖ్యాంశాలు

* నాన్‌ముల్కీ ఉద్యోగులందరినీ తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణించాలి.

* హైదరాబాదు రాజ్యంలోని ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ఆధారంగా నియమించాలి.

* ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ ముల్కీలతోనే భర్తీ చేయాలి.

 

ముల్కీ నిర్వచనం

1911లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అధికారంలోకి వచ్చాడు. అతడి కాలంలో కూడా ముల్కీ - గైర్‌ ముల్కీల మధ్య విభేదాలు కొనసాగుతుండగా 1919లో మరో ఫర్మానా జారీ చేసి, అందులో ముల్కీని నిర్వచించారు.

* ముల్కీ తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తి, పుట్టుకతోనే ముల్కీ అవుతాడు.

* హైదరాబాదు రాజ్యంలో 15 సంవత్సరాలకు తగ్గకుండా నివసించి, తర్వాత అతని స్వస్థలానికి తిరిగి వెళ్లనని అఫిడవిట్‌ సమర్పించినవారు ముల్కీలవుతారు.

* గైర్‌ ముల్కీలై ఉండి పదిహేనేళ్లు ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగితే వారిని ముల్కీలుగా పరిగణిస్తారు.

* 15 ఏళ్లు పూర్తి చేసుకున్న గైర్‌ ముల్కీ ప్రభుత్వోద్యోగుల పిల్లలు ముల్కీలవుతారు.

* గైర్‌ ముల్కీగా ఉన్న మహిళ, ముల్కీ పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె ముల్కీ అవుతుంది.

* ముల్కీ మహిళ, గైర్‌ ముల్కీ పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమెను గైర్‌ ముల్కీగా పరిగణిస్తారు.

* ముల్కీలుగా గుర్తింపు పొందాలంటే తాలూక్‌దార్‌ (కలెక్టర్‌) స్థాయి అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి.

ఈ ఫర్మానాను దిగువస్థాయి ఉద్యోగుల నియామకాల్లో కచ్చితంగా అమలు చేశారు. కానీ ఉన్నత ఉద్యోగాల నియామకాల్లో ముల్కీ నిబంధనలు పాటించలేదు. 1929 - 30 కాలంలో పంజాబ్‌ ప్రాంతానికి చెందిన అనేకమంది ఖాన్‌లను ముల్కీ నియమాలకు విరుద్ధంగా ఉన్నత ఉద్యోగాలలో నియమించారు. దీని కారణంగా ముల్కీ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. ఫలితంగా 7వ నిజాం 1933లో ఉన్నత ఉద్యోగాలలో కూడా విద్యావంతులైన ముల్కీలను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ కాలంలో ‘హైదరాబాద్‌ ఫర్‌ హైదరాబాదీస్‌’ అనే నినాదం ప్రాచుర్యంలోకి వచ్చింది.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

  సాలార్‌జంగ్‌ - సంస్కరణలు

  భారతదేశంలో హైదరాబాద్‌ విలీనం (1948)

  తెలంగాణలో జాతరలు - వారసత్వం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 11-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌