• facebook
  • whatsapp
  • telegram

పోలీసు చర్య అనంతరం హైదరాబాదు రాష్ట్ర పరిస్థితులు

  దాస్యాన్ని దాటి.. సంస్కరణల బాటలో!
 


 

నిజాం పాలనలో తీవ్రమైన అణచివేతలు, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజలు, భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్యతో దాస్య విముక్తులయ్యారు. స్వతంత్ర భారతావనిలో భాగమై స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందారు. నిజాంను నామమాత్రపు ప్రతినిధిగా మార్చిన భారత ప్రభుత్వం కొన్నాళ్లు నేరుగా పాలించింది. అనంతరం ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటి హైదరాబాదు రాష్ట్రం రాజకీయ స్వరూపం, తొలి ఎన్నికల ఫలితాలు, ఆ తరం కీలక నేతలు, కమ్యూనిస్టుల క్రియాశీలత గురించి అభ్యర్థులకు తగిన అవగాహన ఉండాలి. అప్పటి సమాజంలోని కల్లోల పరిస్థితులు క్రమంగా సద్దుమణిగిన విధానం, అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలు, వాటి ఫలితాలు, మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనితీరు, వినోబాభావే ఆధ్వర్యంలో జరిగిన భూదాన ఉద్యమం, పర్యవసానాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాదు సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే ఉండిపోయింది. 1948, సెప్టెంబరు 13 నుంచి 17 వరకు భారత ప్రభుత్వం హైదరాబాదు రాజ్యంపై ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో పోలీసు చర్య జరిపి భారత యూనియన్‌లో కలిపేసింది. అనంతరం భారత ప్రభుత్వం మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌధరీని హైదరాబాదు రాష్ట్రానికి సైనిక గవర్నరుగా 1948, సెప్టెంబరు 18న నియమించింది. సెప్టెంబరు 17న నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలందరూ కొత్త గవర్నరుకు పరిపాలనలో సహకరించాలని ఫర్మానా జారీ చేశాడు. నూతన గవర్నరు ఎదుర్కొన్న మొదటి సమస్య కమ్యూనిస్టుల సాయుధ పోరాటం. ఇందుకోసం ప్రభుత్వం 50 వేల మంది సాయుధ పోలీసు దళాలను, టెలిగ్రాఫ్, టెలిఫోన్‌ సౌకర్యాలను; వైర్‌లెస్‌ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది.

గవర్నరు ఫర్మానా: సైనిక గవర్నరు 1949, ఫిబ్రవరి 6న ఫర్మానా జారీ చేశాడు. దాని ప్రకారం 1) నిజాం కరెన్సీ (హూలిసిక్కా) రద్దయింది. 2) నిజాం సొంత ఆస్తి సర్ఫేఖాస్‌ను వాడుకోవాల్సి వచ్చింది. 3) నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు దినం ఉండేది. దాన్ని ఆదివారానికి మార్చారు.


 మిలటరీ గవర్నరు జె.ఎన్‌.చౌధరీ చాలామంది యువకులను రజాకార్లుగా అనుమానించి చంపారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత ప్రభుత్వం 1950, జనవరి 26న సైనిక పాలన స్థానంలో ఎం.కె.వెల్లోడి అనే ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ (ఐసిఎస్‌) అధికారిని ముఖ్యమంత్రిగా నియమించింది. వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యాశాఖ మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. కొండా వెంకట రంగారెడ్డి, వల్లూరి బసవరాజు కూడా మంత్రులుగా ఉన్నారు.


రాజప్రముఖ్‌గా నిజాం:  హైదరాబాదుపై పోలీసు చర్య అనంతరం నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో భారత ప్రధాని చర్చలు జరిపారు. ఫలితంగా 1950, జనవరి 25న నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత యూనియన్‌లో హైదరాబాదు కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1950, జనవరి 26న హైదరాబాదు రాష్ట్రానికి రాజప్రముఖ్‌ (గవర్నరు)గా నియమితుడయ్యారు. అదేరోజు గణతంత్ర వేడుకల్లోనూ పాల్గొన్నారు. నిజాంకు సంవత్సరానికి రూ.కోటి 50 లక్షలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 1948, సెప్టెంబరు 18 నుంచి 1950, జనవరి 26 వరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఫర్మానా రాజముద్ర వేసే అధికారం ఉన్న రాజ్యాధినేతగా నిజాం వ్యవహరించారు. రాజప్రముఖ్‌గా 1950, జనవరి 26 నుంచి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే వరకు ఉన్నారు. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1967, ఫిబ్రవరి 24న మరణించారు. ఈయన మృతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.


హైదరాబాదు రాష్ట్రంలో ఎన్నికలు: హైదరాబాదు రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలుండేవి.


తెలంగాణ: ఇందులో 8 జిల్లాలు, 98 శాసనసభ స్థానాలుండేవి. హైదరాబాదు, రంగారెడ్డి ఒకే జిల్లాగా, వరంగల్, ఖమ్మం కలిసి వరంగల్‌ జిల్లాగా ఉండేవి.


మరఠ్వాడా : ఇందులో 5 జిల్లాలు, 44 శాసనసభ స్థానాలు ఉండేవి..


కన్నడ ప్రాంతం: ఇందులో 3 జిల్లాలు, 36 శాసనసభ స్థానాలు ఉండేవి.


హైదరాబాదు శాసనసభలో మొత్తం 175 స్థానాలు ఉండేవి. 1952, ఫిబ్రవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, సోషలిస్టు, ఏజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ; షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ పార్టీలు పాల్గొన్నాయి. కమ్యూనిస్టులు 1951, అక్టోబరు 21న మూడో దశ సాయుధ పోరాటం విరమించారు. డాక్టర్‌ ఎం.ఎన్‌. జయసూర్య భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కమ్యూనిస్టు నాయకులపై ఉన్న ఆంక్షలు తొలగింపజేశాడు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కారణంగా వారు పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందారు. శాసనసభా పక్ష నాయకుడిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు.


బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఈ మంత్రి వర్గం ఏర్పడిన 9 నెలల తరువాత 1952, డిసెంబరు 17న  ప్రభుత్వంపై జి.రాజారాం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది మెజార్టీ శాసనసభ్యుల తిరస్కారంతో వీగిపోయింది. నిజాం రాజ్య కరెన్సీని ‘హూలి రూపాయ’, బ్రిటిష్‌ ఇండియా కరెన్సీని ‘కల్దారు రూపాయ’ అనేవారు. బూర్గుల ప్రభుత్వం నిజాం కరెన్సీని రద్దు చేసి భారత కరెన్సీని ప్రవేశపెట్టింది. దేశంలోనే మొదటిసారిగా మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టింది. 1953, అక్టోబరు 1న వరంగల్‌ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా కొత్తగా ఏర్పాటైంది. 1954, ఫిబ్రవరిలో హైదరాబాదులో కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం భూస్వాములు తమ కింద భూములను సాగు చేసే కౌలుదార్లను తొలగించకుండా (బేదఖలీ) చట్టం చేశారు. 1955, జులై 1న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని నెలకొల్పారు. ఈ ప్రభుత్వ కాలంలోనే 1955, డిసెంబరు 10న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.


భూసంస్కరణలు

 భూసంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థిక సమానత్వం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం. జనసామాన్య సామాజిక - ఆర్థిక జీవితాన్ని నియంత్రించే కొద్దిమంది వ్యక్తుల శక్తిని భూపంపిణీ ద్వారా తొలగించవచ్చని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారు. వేలాది ఎకరాలున్న జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదం హైదరాబాదులో బయలుదేరింది. పోలీసు చర్య అనంతరం భారతదేశంలోని రాష్ట్రాలతో పాటు ఇక్కడా జాగీర్లను రద్దు చేశారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటానికి రైతుల భూమి సమస్యే ముఖ్యకారణమని భావించారు. అందుకే అభివృద్ధి పంథాలో భూసంస్కరణలు అమలుచేస్తే రైతుల్లో అశాంతి పోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందనే సదుద్దేశంతో ‘1950, జూన్‌ 10న హైదరాబాదు కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ద్వారా భూమిని కౌలుకు చేస్తున్న రైతును భూస్వామి బేదఖలు (తొలగించడం) చేయకుండా రక్షణలు కల్పించారు. నిర్ణీతమైన కౌలు రేట్లు ఏర్పరచడమే కాకుండా, కుటుంబ కనిష్ఠ, గరిష్ఠ భూకమతాల విస్తీర్ణ ప్రమాణాలను నిర్ణయించారు. అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి వ్యవసాయ ఖర్చులు పోను సంవత్సరానికి రూ.800 ఆదాయం ఇవ్వగలిగిన భూమిని ఒక కుటుంబ కమతం (భూమి)గా నిర్ణయించారు. హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు భూసంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటికే రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 నుంచి అమల్లో ఉంది. ఈ చట్టంలో కౌలుదార్లకు రక్షణ ఉన్నప్పటికీ భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని శ్రామికులకు ఇచ్చే ఏర్పాటు లేదు. దీంతో భూములను ఆక్రమించి సేద్యం చేయకుండా ఉన్న మధ్యవర్తుల నుంచి స్వాధీనం చేసుకుని సేద్యానికి వీలుగా చేశారు. ఇంకా, కౌలుదార్ల నుంచి భూస్వాములు ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా ఈ చట్టం నిరోధించింది. సేద్యం చేయకుండా ఉన్న భూములను శ్రామికులకు పంచాలని ప్రభుత్వం భూస్వాములకు తీవ్ర హెచ్చరిక చేసింది. బూర్గుల రామకృష్ణారావు రాజనీతిజ్ఞతతోనే ఇది సాధ్యపడింది. దేశంలో భూకమతాల (భూముల)పై గరిష్ఠ పరిమితిని విధించిన ప్రథమ సాహసిగా ఆయన పేరు పొందారు.

 

భూదానోద్యమం


 మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన వినోబా భావే 1951లో భూదానోద్యమాన్ని ప్రారంభించారు. హైదరాబాదుకు ఏడు మైళ్ల దూరంలోని శివరాంపల్లిలో 1951, ఏప్రిల్‌ 8, 9, 10, 11 తేదీల్లో సర్వోదయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి హాజరుకావడానికి  పవనార్‌ ఆశ్రమం నుంచి వినోబా భావే పాదయాత్ర ద్వారా శివరాంపల్లి చేరుకున్నారు. అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టుల మూడోదశ సాయుధ పోరాటం జరుగుతోంది. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో సాయుధ పోరాటం వల్ల అరాచక పరిస్థితి తలెత్తింది. కమ్యూనిస్టులు కొంతమంది భూస్వాములను హత్య చేశారు. ఈ పరిస్థితుల్లో అనేకమంది భూస్వాములు పట్టణాలకు వలసపోయారు. ఈ కల్లోలిత ప్రాంతంలో తాను ఒక శాంతి సైనికుడిగా పర్యటిస్తానని వినోబా ప్రకటించారు. భావే పాదయాత్ర 1951, ఏప్రిల్‌ 16న హైదరాబాదు నుంచి ప్రారంభమైంది. మొదటిరోజు హయత్‌ నగర్, రెండో రోజు బాటసింగారంలో ఆగారు. మూడోరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా, భువనగిరి తాలూకా, పోచంపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని దళితులు తమ 40 కుటుంబాలకు 80 ఎకరాల సాగు భూమి కావాలని అడిగారు. ఆ సమయంలోనే ఆ గ్రామ భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి తన 100 ఎకరాల భూమిని దానంగా ప్రకటించాడు. ఈ ఘటనతో భూదానోద్యమం ప్రారంభమైంది.


భూదానోద్యమంలో భాగంగా వినోబా భావే తెలంగాణ గ్రామాల్లో రెండు విడతలు పర్యటించారు. గాంధేయ మార్గంలో నడిచిన భూదానోద్యమం లక్ష్యం భూస్వాముల్లో దయాగుణాన్ని కలిగించి వారే తమ భూములను స్వచ్ఛందంగా భూమి లేనివారికి పంచే విధంగా చేయడం. వినోబా భావే తన భూదాన యాత్రలో రెండు లక్షల ఎకరాలను దానంగా పొందారు. భూవితరణ కమిటీని ఏర్పాటు చేసి అనేకమంది నిరుపేదలకు ఆ భూమిని పంచారు. భూదానోద్యమం దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించి గొప్ప ఫలితాలు సాధించింది.


డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి


 

 

Posted Date : 19-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌