• facebook
  • whatsapp
  • telegram

జై తెలంగాణ ఉద్యమ నేపథ్యం (1969)

విన్న‌వించినా విన‌లేదు.. ఉద్య‌మం త‌ప్ప‌లేదు!

  తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను, రక్షణలను ఆంధ్రా పాలకులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. నిబంధనలను నీరుగార్చారు. స్థానికుల భయాందోళనలను నిజం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన వందల విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. అడుగడుగునా అవమానాలే మిగిలాయి. తెలంగాణవాసులకు అన్యాయం వాస్తవమేనని ఆనాటి పాలకులూ అంగీకరించారు. అయినా సరిదిద్దేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితులు ఉద్యమానికి దారితీశాయి. 

  

తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులే 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన కారకులు. ఆ తర్వాత విద్యార్థులు, యువతతో పాటు యావత్‌ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ భాగస్వాములవడంతో అదొక మహా ప్రజా ఉద్యమంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలంగాణ ప్రాంతమంతటా చెలరేగిన ఆందోళనలు, జరిగిన సంఘటనలు మొత్తం భారతదేశాన్ని ఆకర్షించాయి. విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించడం వల్ల పరిపాలనా యంత్రాంగం స్తంభించిపోవడం లాంటివి జాతీయ స్వాతంత్య్ర పోరాటం నాటి సంఘటనలను గుర్తుచేశాయి. నిత్యకృత్యమైన పోలీసుల లాఠీఛార్జ్‌లు, కాల్పులు, అమాయక ప్రజల ప్రాణ త్యాగాలు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని అతలాకుతలం చేశాయి. 

 

గ‌ళం విప్పిన తెలంగాణ నాయ‌కులు - హెచ్చ‌రిక‌లు  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికైన పెద్దమనుషుల ఒప్పందం, దానిలోని రక్షణలు, హామీలను నాటి ఆంధ్రా పాలకులు ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడమే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. నాటి తెలంగాణ ప్రాంత కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ రాజబహదూర్‌ గౌర్‌ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పటివరకు అంటే రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలం వరకు తాము హామీ ఇచ్చిన రక్షణలకు చట్టబద్ధత కల్పించాలనే సంగతి నాటి ఆంధ్రా పాలకులు మరిచిపోయారు. రాష్ట్రం ఏర్పడే ముందు తెలంగాణ ప్రాంత ప్రజలు వెలిబుచ్చిన అనేక భయాందోళనలు క్రమంగా నిజమవడంతో గత్యంతరంలేక వారు ప్రత్యేక ఉద్యమ బాట పట్టారు.  

  1968 - 69 మహోద్యమానికి ముందే తెలంగాణ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అన్యాయాలను అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయాలను అరికట్టి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విస్మరించింది. రాష్ట్రం ఏర్పడిన 17 నెలల తర్వాత అంటే 1958 మార్చిలో వరకాంతం గోపాలరెడ్డి నేతృత్వంలో తెలంగాణ మహాసభ నాటి కేంద్ర హోంమంత్రి జి.బి.పంత్‌కు ఉల్లంఘనల గురించి వినతి పత్రాన్ని సమర్పించింది. ఆ పత్రంలో ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య సమైక్యత, సమగ్రత, సహజీవనాన్ని పెంపొందించడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయతత్వాన్ని సృష్టించి ప్రజల మధ్య అగాథాన్ని సృష్టిస్తోందని తెలిపారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న ఆంధ్రా వారు నోటి దురుసుతో వ్యవహరించి తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానపరచడాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి మరొక ఫిర్యాదు చేశారు. నాటి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయకోవిదుడు గులాం పంజాతన్‌ 1959, డిసెంబరు 12న ‘పరిస్థితి చేజారక మునుపు మేల్కొనండి’ అనే శీర్షికలో ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ హెచ్చరిక చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులకు జరుగుతున్న అనేక అన్యాయాలు, అక్రమాలపై ఆయన విజ్ఞాపన పత్రంలో ఒక పెద్ద చిట్టా ప్రకటించారు. 

  తెలంగాణ మహాసభ నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు ఒక వినతి పత్రాన్ని పంపుతూ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలను వివరించి వాటిని అరికట్టడానికి  ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని మనవి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్లోని వాస్తవాలను గ్రహించి భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికీ నాటి ఆంధ్రా పాలకులు బేఖాత‌రు (నిర్లక్ష్యం) చేశారు. 

  రాజ్యసభ సభ్యుడైన వి.కె.ధగే 1960లో రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే అన్ని విషయాలను సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు కె.అచ్యుత్‌ రెడ్డి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాలను పత్రికా గోష్టిలో ప్రకటించాడు. ఇందులో తెలంగాణకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను బయటపెట్టాడు. ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తెలంగాణకు జరిగిన ఈ అన్యాయాలు, వాటిపై చేసిన ఫిర్యాదులను అర్థం చేసుకొని సరిదిద్దాలని 1961లో ఒక‌ శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఇది నాటి తెలంగాణ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది.

  1968-69లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కారావు పదవిలోకి వచ్చిన నాటి నుంచి అన్యాయాలను నివారించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాడు. నాటి తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకుడు కె.ఆర్‌.ఆమోస్‌ ఉద్యోగుల ఇబ్బందులు, వాటిలోని మెలికలు, చిక్కులను ఎప్పటికప్పుడు ప్రాంతీయ సంఘం అధ్యక్షుడికి వివరిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నించాడు. మిగులు నిధుల దోపిడీకి సంబంధించి చర్చించడానికి 1968లో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గరకు వెళ్లినప్పుడల్లా తనను ఒక గుమస్తాగా, చప్రాసీగా చూసిన విషయం చొక్కారావు జీవితాంతం మర్చిపోలేదు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని అత్యవసర ప్రాతిపదికపై అభివృద్ధి చేయాల్సి ఉండగా ఇక్కడి ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేయకుండా ఆంధ్రా ప్రాంతంలో ఖర్చు చేశారని విమర్శించాడు. తెలంగాణకు అన్యాయం జరిగిందని మొదట అంగీకరించినవారు రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. ఆయన నిజాయతీగా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రయత్నించి పదవినే కోల్పోయాడు.  

  1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం పార్లమెంటు తెలంగాణలో ఉద్యోగాలకు నివాస యోగ్యతను విధించే చట్టాన్ని ఆమోదించింది. అదే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ రిక్వైర్‌మెంట్‌ (యాజ్‌ టు రెసిడెన్స్‌) యాక్ట్‌ - 1957. తర్వాత రెండేళ్లకు ఈ చట్టం కింద నియమావళిని రూపొందించారు. దీని ప్రకారం 1959, మార్చి 21 నుంచి ముల్కీలకే ఇక్కడి ఖాళీల్లోని కింది స్థాయి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ముల్కీ రూల్స్‌ వర్తించకుండా తెలంగాణ వారికి ఉద్యోగావకాశాలు లేకుండా చేయడం కోసం సంజీవరెడ్డి ప్రభుత్వం అనేక ప్రభుత్వ శాఖలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చింది. రోడ్డు రవాణా శాఖను రోడ్డు రవాణా సంస్థగా (కార్పొరేషన్‌), విద్యుత్‌చ్ఛక్తి శాఖను విద్యుత్‌చ్ఛక్తి బోర్డుగా మార్చింది. ఇదేవిధంగా మరికొన్ని ప్రభుత్వ శాఖలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చింది. 

ఉదా: హౌసింగ్‌ బోర్డు, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.  

  ఈ విధంగా ప్రభుత్వ వివక్ష ధోరణి, నిర్లక్ష్య వైఖరిని నాటి తెలంగాణ నాయకులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా విమర్శించి హెచ్చరించారు. 

  1968, జులై 10న ‘తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం’ సందర్భంగా ఒక సభ నిర్వహించారు. ఈ సభలో హైదరాబాదు స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ కార్మిక నాయకుడు మహదేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణిని నిరసించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించి తీరుతామని హెచ్చరించాడు.  

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాలు

 తెలంగాణ ప్రజా సమితి పగ్గాలు

  తెలంగాణ‌లో 1969 నాటి ప‌రిణామాలు

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 26-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌