• facebook
  • whatsapp
  • telegram

 భారతదేశంలో హైదరాబాద్‌ విలీనం (1948)

సంక్షోభ రాజ్యంలో శాంతిస్థాపన!

 

  నిజాంల పాలనలో ఒక స్వదేశీ సంస్థానంగా ఉన్న హైదరాబాద్‌ రాజ్యంలో మతతత్వం ప్రజ్వరిల్లింది. అడ్డూ అదుపు లేకుండా రజాకార్లు తమ అకృత్యాలను సాగించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో అక్కడ శాంతిస్థాపన కోసం భారత ప్రభుత్వం పోలీస్‌ చర్యను చేపట్టింది. తెలంగాణ ఉద్యమం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ చారిత్రక సంఘటన గురించి తెలుసుకోవాలి. 

  హైదరాబాద్‌ రాజ్యాన్ని అసఫ్‌ జాహీ రాజ వంశం క్రీ.శ.1724 నుంచి 1948 వరకు పాలించింది. 1798లో నాటి హైదరాబాద్‌ నిజాం (రెండో నిజాం అయిన నిజాం అలీఖాన్‌) బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీతో సైన్య‌ సహకార పద్ధతి (Subsidiary Alliance) ఒడంబడిక చేసుకున్నాడు. దీనివల్ల హైదరాబాద్‌ రాజ్యం ఒక ప్రిన్స్‌లీ స్టేట్‌గా మారి 1947 వరకు బ్రిటిషర్ల ఆధిపత్యంలో కొనసాగింది.

  1947 భారతదేశ స్వాతంత్య్ర చట్టం ప్రకారం బ్రిటిష్‌ ఇండియాపై బ్రిటిషర్ల సార్వభౌమాధికారం తొలగిపోయింది. ఈ చట్టం దేశంలోని ప్రిన్స్‌లీ స్టేట్స్‌ (స్వదేశీ సంస్థానాలు లేదా రాజ్యాలు) తమ ఇష్టానుసారం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగడం లేదా భారత్‌/పాకిస్థాన్‌లో విలీనమయ్యే స్వేచ్ఛను కల్పించింది. స్వాతంత్య్రానంతరం నాటి భారత ఉపప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విశేష కృషి ఫలితంగా దేశంలోని మొత్తం 562 స్వదేశీ సంస్థానాల్లో మూడు మినహా మిగిలినవన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి. ఆ మూడు రాజ్యాలు హైదరాబాద్, జమ్మూ-కశ్మీర్, జునాగఢ్‌. నాటి హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారతదేశంలో విలీనమవడానికి నిరాకరించి హైదరాబాద్‌ సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలని ప్రకటించాడు. ఆ నిర్ణయం ఫలితంగా హైదరాబాద్‌ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం (స్టాండ్‌స్టిల్‌ అగ్రిమెంట్‌) చేసుకున్నాడు. అంటే భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్‌ రాజ్యం నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధాలను కలిగి ఉందో అలాంటి సంబంధాలను స్వతంత్ర భారతదేశంతో హైదరాబాద్‌ కొనసాగించడం. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌ రాజ్యం తన ఏజెంట్‌ను దిల్లీలో నియమించగా దానికి ప్రతిగా భారతదేశం తన ఏజెంట్‌ను హైదరాబాద్‌లో నియమించింది. దీని ప్రకారం హైదరాబాద్‌ ఏజెంట్‌గా నవాబ్‌ జైన్‌ యార్‌ జంగ్‌ను దిల్లీలో, భారత ఏజెంట్‌గా కె.ఎం.మున్షీని హైదరాబాద్‌లో నియమించారు. ఈ యథాతథ ఒప్పందంపై నాటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్, హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌లు 1947 నవంబరు 29న సంతకాలు చేశారు.

 

యథాతథ ఒప్పందం - ముఖ్యాంశాలు 

* ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌ రాజ్యం 1947 ఆగస్టు 15 కంటే ముందు బ్రిటిష్‌ ప్రభుత్వంతో కలిగిన సంబంధాలను భారతదేశంతో కూడా కొనసాగిస్తుంది. 

* హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో అనుబంధ రాష్ట్రంగా కొనసాగడం.

* నిజాం హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేయకూడదు.

* భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం సంభవిస్తే హైదరాబాద్‌ తటస్థంగా ఉండాలి.

* హైదరాబాద్‌ రక్షణ, విదేశీ వ్యవహారాలు భారత ప్రభుత్వ బాధ్యత.

* ఈ ఒప్పందం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.

* ఈ కాలంలో ప్రజాసేకరణ ద్వారా హైదరాబాద్‌ భవిష్యత్తును నిర్ణయించడం.

* నిర్బంధంలో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయడం. 

* హైదరాబాద్‌ ప్రజలకు పౌర హక్కులను కల్పించడం. ముఖ్యంగా వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన హక్కు కలిగి ఉండటం.

* హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.

* హైదరాబాద్‌ ప్రజలపై ఎలాంటి అరాచకాలు, అకృత్యాలు చేయకూడదు

 

ఒప్పంద ఉల్లంఘనలు

* వాస్తవానికి హైదరాబాద్‌ నిజాం ఈ యథాతథ ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా చేసుకున్నాడు. దీనికి కారణం ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో విలీనాన్ని వ్యతిరేకించడానికి కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం.

* ఈ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్‌ రాజ్యంలో భారతదేశ జోక్యంపై ఐక్యరాజ్య సమితికి నాటి హైదరాబాద్‌ రాజ్యాంగ సలహాదారుడైన సర్‌ వాల్టర్‌ మూరిక్టన్‌ ద్వారా 1948 ఆగస్టు 21న ఫిర్యాదు చేయడం. 

* బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడానికి నాటి నిజాం సైనికాధిపతి సయ్యద్‌ అహ్మద్‌ ఎల్‌ ఇద్రూస్‌ను బ్రిటన్‌కు పంపడం కోసం నిజాం  రూ.10 కోట్లు మంజూరు చేయడం. 

* ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్‌ అనే స్మగ్లర్‌కు ఆయుధాలను స్మగ్లింగ్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం. 

* ముందు జాగ్రత్తగా భారత సైన్యం హైదరాబాద్‌ రాజ్యంలోకి ప్రవేశించకుండా ఉండటానికి  భారతదేశానికి, హైదరాబాద్‌కు మధ్య గల అనేక వంతెనలను కూల్చివేయమని ఆజ్ఞాపించడం. 

* హైదరాబాద్‌ రాజ్యంలోని బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించడం. 

* హైదరాబాద్‌ రాజ్యంలో భారత కరెన్సీ వినియోగాన్ని రద్దు చేయడం. 

* నిజాం నాటి బ్రిటిష్‌ రాజు ఆరో కింగ్‌ జార్జ్, బ్రిటిష్‌ ప్రధాని క్లిమెంట్‌ అట్లీ, బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన విన్‌స్టన్‌ చర్చిల్, నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌లకు ఫిర్యాదు చేసి వారి సహాయాన్ని కోరాడు. కానీ అప్పుడు యథాతథ ఒప్పందం అమల్లో ఉన్న కారణంగా వారు జోక్యం చేసుకోవడానికి తిరస్కరించారు. 

  ఈ విధంగా నిజాం యథాతథ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించినప్పటికీ భారత ప్రభుత్వం నిజాంతో శాంతియుతంగా వ్యవహరించింది.

 

ఆపరేషన్‌ పోలో

  ఖాసీం రజ్వీ హైదరాబాద్‌ రాజ్యంలో మతతత్వ జ్వాలలను విస్తరింపజేశాడు.  అతడి ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రజలను భీతావహులను చేశారు. రజాకార్ల అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు అదుపు లేకుండా కొనసాగాయి. ఆ వేధింపులతో గ్రామీణ ప్రాంతాల్లోని హిందువులు తమ గ్రామాలను విడిచి వెళ్లారు. నాటి హైదరాబాద్‌ రాజ్యంలో కొనసాగిన రజాకార్ల అకృత్యాలు, నిజాం నిరంకుశపాలన, కమ్యూనిస్టుల తిరుగుబాటు చర్యలను అణిచి వేసి రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీస్‌ చర్యకు సిద్ధమైంది. ఈ చర్య శాంతి భద్రతలకు సంబంధించింది కాబట్టి దీన్ని పోలీస్‌ చర్యగా పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్నది మాత్రం భారతసైన్యమే.

  ఆపరేషన్‌ పోలో అనే రహస్య కోడ్‌ బహిర్గతమవడం వల్ల దీన్ని ఆ తర్వాత ఆపరేషన్‌ క్యాటర్‌ పిల్లర్‌ అని పిలిచారు. ఈ ఆపరేషన్‌ 1948 సెప్టెంబరు 13న ప్రారంభమై 17న ముగిసింది. ఈ ఆపరేషన్‌కు మరో పేరు ఇ.ఎన్‌.గడ్డార్ట్‌ ప్లాన్‌. ఎందుకంటే దీని వ్యూహకర్త నాటి దక్షిణ భారతదేశంలోని భారత సైనిక దళాల చీఫ్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇ.ఎన్‌.గడ్డార్ట్‌. ఆపరేషన్‌ పోలో చర్యలో భాగంగా భారతసైన్యం హైదరాబాద్‌ రాజ్యంపై అన్ని దిక్కుల నుంచి దాడి చేసింది.

* మేజర్‌ జనరల్‌ జయంత్‌ నాథ్‌ చౌదరి నేతృత్వంలోని భారత సైన్యం షోలాపూర్‌ వైపు నుంచి 

* మేజర్‌ జనరల్‌ ఎ.ఎన్‌.రుద్ర నేతృత్వంలోని సైన్యం మద్రాసు వైపు నుంచి 

* బ్రిగేడియర్‌ శివదత్తు నేతృత్వంలోని సైన్యం బేరార్‌ వైపు నుంచి 

* మేజర్‌ జనరల్‌ డి.ఎస్‌.ధర్‌ నేతృత్వంలోని సైన్యం బొంబాయి వైపు నుంచి దాడి చేసి హైదరాబాద్‌ రాజ్యాన్ని అన్ని దిక్కుల నుంచి దిగ్బంధం చేసింది.

 మొదట షోలాపూర్‌ నుంచి వచ్చే సైన్యం షోలాపూర్‌ - హైదరాబాద్‌ మార్గంలో ఉన్న నల్‌దుర్గ్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత భారత సైన్యానికి హైదరాబాద్‌ సైన్యం నుంచి పెద్దగా ప్రతిఘటన రాకపోవడం వల్ల భారత సైన్యం 1948 సెప్టెంబర్‌ 17వ తేదీ ఉదయానికి హైదరాబాద్‌  చేరుకుంది. ఆ తర్వాత అన్నివైపుల నుంచి హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. ఈ పరిణామాల క్రమంలో హైదరాబాద్‌ ప్రధాని లాయక్‌ అలీ తన పదవికి రాజీనామా చేశాడు. నాటి హైదరాబాద్‌లోని భారతదేశ ఏజెంట్‌ కె.ఎం.మున్షీ నిస్సహాయస్థితిలో ఉన్న నిజాంకు భారతదేశానికి లొంగిపొమ్మని సలహా ఇచ్చాడు. 

  నిజాం తన సైన్యాధిపతి సయ్యద్‌ అహ్మద్‌ ఎల్‌ ఇద్రూస్‌ను భారత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరికి ఏ విధమైన షరతులు లేకుండా లొంగిపొమ్మని ఆదేశించాడు. ఆ మరుసటిరోజు నిజాం అధికారికంగా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనమైందని ప్రకటించాడు. అందుకే సెప్టెంబరు 17వ తేదీని హైదరాబాద్‌ విలీన దినంగా పేర్కొంటారు. 18వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్‌ రాష్ట్రంలో మిలిటరీ పాలనను విధించి మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరిని హైదరాబాద్‌ మిలిటరీ గవర్నర్‌గా నియమించింది.

 

హైదరాబాద్‌ విలీనంపై ప్రముఖుల పుస్తకాలు

1) యాన్‌ ఎండ్‌ ఆఫ్‌ ది ఎరా - కె.ఎం.మున్షీ

2) ది ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌ - లాయక్‌ అలీ

3) ది స్టోరీ ఆఫ్‌ ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ - వి.పి.మీనన్‌

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

Posted Date : 22-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌