• facebook
  • whatsapp
  • telegram

జై తెలంగాణ ఉద్యమం-1969

ఒక్క‌సారిగా ఎగ‌సి.. రాజ‌ధానిలో ర‌గిలి!

 

తెలంగాణ ఉద్యమ చరిత్రలో 1969కి ప్రత్యేకస్థానం ఉంది. ఆ సంవత్సరం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది. విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నాటి పాలకులు మొదట నిర్లక్ష్యం ప్రదర్శించారు. తర్వాత తీవ్రతను గమనించి చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. చివరకు రాజకీయ చర్యలతో ఉద్యమం ముగిసింది. 

 

జై తెలంగాణ ఉద్యమానికి (1969) పెద్ద మనుషుల ఒప్పందం(1956)లోని రక్షణల ఉల్లంఘనలు, ప్రాంతీయ వివక్షలు ప్రధాన కారణాలు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నాటి పాలకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రుల నిర్లక్ష్య ధోరణులు వాటికి తోడయ్యాయి. రక్షణల ఉద్యమం పేరుతో నాటి ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్‌ విద్యుచ్ఛక్తి కేంద్రం (కేటీపీఎస్‌)లో తెలంగాణ ప్రజా పోరాటానికి అంకురార్పణ జరిగింది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు పాల్వంచ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో జరిగిన అన్యాయాలను మొదట వెలుగులోకి తెచ్చి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులకు, యువకులకు, తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అవగాహన కల్పించారు. అందరినీ మొదట రక్షణల అమలు ఉద్యమానికి, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సమాయత్తం చేశారు. రామదాసు అనుచరులు రామ సుధాకరరాజు, ఇ.ఎల్‌.నరసింహారావు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. 1968, జులై 10న ‘తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం’ నిర్వహణ సందర్భంగా సోషలిస్టు పార్టీకి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు మహదేవ్‌ సింగ్‌ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తామంటూ హెచ్చరించారు. 1968, నవంబరు 19న పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)లో నాటి తెలంగాణ ప్రాంతీయ స్థాయి సంఘం (టి.ఆర్‌.ఎస్‌.సి) అధ్యక్షుడు జె.చొక్కారావు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ రక్షణలను పరిరక్షించాలని డిమాండ్‌ను ముందుకు తీసుకురావడంతో, అవి అమలయ్యేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

      1969, జనవరి 5న కేటీపీఎస్‌లోని నాన్‌ముల్కీ ఉద్యోగులందరినీ తొలగించి వారి స్థానంలో స్థానిక ముల్కీలను నియమించాలని ఉద్యమం జరిగింది. అదేరోజు కార్మిక నాయకుడైన కృష్ణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థి నాయకుడు ఎ.రవీంద్రనాథ్‌ 1969, జనవరి 8న తెలంగాణ రక్షణల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. జనవరి 22న నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చర్యల ఫలితంగా ఈ దీక్షను విరమించాల్సి వచ్చింది. అయినప్పటికీ రవీంద్రనాథ్‌ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ప్రభావం తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో సంచలనం మొదలైంది. 1969, జనవరి 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకుడు ఎస్‌.వెంకట్‌ రాంరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు.

* తెలంగాణ ప్రాంత మంత్రులంతా రాజీనామా చేయాలి.

* తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యులంతా రాజీనామా చేయాలి.

* తెలంగాణ నిధుల మళ్లింపుపై ఒక న్యాయ విచారణ కమిటీని నియమించాలి.

* పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలుచేయాలి.

* తెలంగాణలోని అన్ని శాఖల్లో ఉన్న నాన్‌ముల్కీ, బోగస్‌ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తెలంగాణకు చెందిన ముల్కీలను నియమించాలి.

ఈ ఉద్యమ కార్యాచరణ సంఘంలో అభిప్రాయ భేదాలు వచ్చి రెండు గ్రూపులుగా విడిపోయారు.జనవరి 13న ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థి నాయకుడు మల్లికార్జున్‌ అధ్యక్షతన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ కమిటీ ఏర్పడింది. వెంకట్‌ రాంరెడ్డి వర్గం రక్షణల కోసం, మల్లికార్జున వర్గం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని నిర్ణయించారు. వెంకట్‌ రాంరెడ్డి వర్గం వివేకవర్ధిని కాలేజీని కేంద్రంగా చేసుకొని పనిచేసింది. వీరికి కాసు బ్రహ్మానందరెడ్డి మద్దతు ఉంది.  మల్లికార్జున వర్గం నిజాం కాలేజీ కేంద్రంగా ఉద్యమించింది. వెంకట్‌ రాంరెడ్డి వర్గం జనవరి 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమైతే, మల్లికార్జున వర్గం జనవరి 15 నుంచి ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్రవాదులు జనవరి 14న నిజాం కాలేజీ ఆవరణలో సభ నిర్వహిస్తే, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. తర్వాతి రెండు రోజులు 15, 16 తేదీల్లో కూడా విద్యార్థులు పట్టుదలతో సభలు జరపడంతో పోలీసులు క్రూరంగా విద్యార్థులను చితకబాదారు. పోలీసుల దమనకాండను నిరసిస్తూ పత్రికల్లో పతాక శీర్షికలుగా వార్తలు రావడంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులు, యువకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈ దశలోనూ ముఖ్యమంత్రి దాన్ని చిన్న విషయంగా కొట్టిపారేశారు. ఒకవైపు విద్యార్థులు ఉద్యమం బాట పట్టగా, మరోవైపు జనవరి 13న పరిరక్షణ కమిటీ అనే ఒక రాజకీయ కమిటీ ఏర్పాటైంది. దీని అధ్యక్షుడిగా కాటం లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. జనవరి 28న వరంగల్‌లో తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సును కాళోజీ నారాయణరావు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 1969, జనవరి 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఉద్యమ సమస్యను చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం జనవరి 21న రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీఓ 36ను జారీ చేసింది. 

అఖిల పక్షాల తీర్మానాల ఆధారంగా రవీంద్రనాథ్‌ దీక్షను విరమింపజేసేందుకు బ్రహ్మానందరెడ్డి నాటి ఎమ్మెల్యే పురుషోత్తమరావు, జలగం వెంగళరావులను  వినియోగించారు. రామదాసు అభ్యంతరాలతో వారు చేసి ప్రయత్నాలు ఫలించలేదు. జనవరి 22న చర్చలకు రామదాసు హైదరాబాదుకి పిలిపించారు. అదే రోజు రాత్రి నిషేధాజ్ఞలు విధించి, లాఠీఛార్జీలు చేసి అందరినీ చెదరగొట్టి రవీంద్రనాథ్‌ దీక్షను భగ్నం చేశారు. దాంతో ఉద్యమం చల్లబడింది. 


జీవో 36లోని ప్రధానాంశాలు

* తెలంగాణ ప్రాంత రక్షణల ఉల్లంఘనలను రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది.

* తెలంగాణ ప్రాంతంలో పనిచేసే నాన్‌ముల్కీ, బోగస్‌ ముల్కీ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారిని జనవరి 28 లోపు ఆంధ్రా ప్రాంతానికి బదిలీ చేసి, వారి స్థానంలో తెలంగాణకు చెందిన ముల్కీలను నియమించాలి.

* అర్హులైన ముల్కీ అభ్యర్థులు లభ్యం కాకపోతే, ఆ ఖాళీలను ఆ తర్వాత అర్హులైన తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయాలి.

* జీవో 36ను అనుసరించి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే నాన్‌-ముల్కీ, బోగస్‌ ముల్కీ ఉద్యోగులను ఆంధ్రా ప్రాంతానికి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కొంతమంది ఆంధ్రా ఉద్యోగులు జీవో 36 రాజ్యాంగ బద్ధతను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో సవాలు చేయడంతో, ఆ జీవో చెల్లదంటూ సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఓ.చిన్నపరెడ్డి 1969, ఫిబ్రవరి 3న తీర్పుచెప్పారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ పి.జగన్‌మోహన రెడ్డి, ఆవుల సాంబశివరావు ఈ జీవో రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పి సింగిల్‌ బెంచ్‌ తీర్పును పక్కనపెట్టారు. ఇంతలోనే కొందరు ఆంధ్రా ఉద్యోగులు జీవో 36ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఫిబ్రవరి 17న కోర్టు ఆ జీవో అమలును నిలిపేసింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులెవరినీ బదిలీ చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా జీఓ 36 విఫలమైంది.

రచయిత: ఎ.ఎం.రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాలు

 తెలంగాణ ప్రజా సమితి పగ్గాలు

  తెలంగాణ‌లో 1969 నాటి ప‌రిణామాలు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌