• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర్వులు-ఉల్లంఘనలు

ఆదేశించారు.. అమలు మరిచారు!

  తెలంగాణ వాసుల హక్కుల కోసం పదే పదే నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యమాలు తలెత్తాయి. ఉపశమింపజేయడానికి నాటి ప్రభుత్వాలు  కమిటీల మీద కమిటీలు వేసి అనేక ఉత్తర్వులు ఇచ్చాయి. కానీ వాటి అమలుపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. యథావిధిగా ఉల్లంఘనలు జరిగాయి. మళ్లీ ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈసారి అన్యాయాలన్నింటినీ సరిచేసే లక్ష్యంతో ఆరొందల పది జీఓను జారీ చేశారు. ఆఖరికి అది కూడా ఆచరణలో విఫలమైంది. ఈ అంశాలను అభ్యర్థులు పరీక్షల కోసం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. 

 

  ఆరు సూత్రాల పథకం(1973)తో తెలంగాణ ప్రాంత రక్షణలన్నీ రద్దయ్యాయి. అందులో భాగంగా జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉల్లంఘనకు గురయ్యాయి. ఆ పరిస్థితుల వల్ల జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఉద్దేశించిందే 610 జీఓ.

 

అంతటా అతిక్రమణలు

 

1) ఓపెన్‌ కోటాను నాన్‌-లోకల్‌ కోటాగా నిర్వచించడం: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి ఉద్యోగాల్లో 80 శాతం, జోనల్‌ స్థాయి ఉద్యోగాల్లో 70 శాతం, మల్టీజోనల్‌ స్థాయి ఉద్యోగాల్లో 60 శాతం స్థానికులకు రిజర్వు చేశారు. మిగిలిన పోస్టుల్లో ఓపెన్‌ కాంపిటీషన్‌ ద్వారా ఏ ప్రాంతం వారినైనా సమానంగా మెరిట్‌ ప్రాతిపదికన నియమించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఆ పోస్టులన్నింటినీ నాన్‌-లోకల్‌ వారితో నింపేశారు. నాన్‌-లోకల్‌ అంటే తెలంగాణేతరులని భాష్యం చెప్పి, ఆ మొత్తం పోస్టుల్లో ఆంధ్రా ప్రాంతం వారిని నియమించారు. ఫలితంగా మెరిట్‌లో వచ్చిన తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. నిజానికి ఓపెన్‌ పోస్టుల్లో కూడా తెలంగాణ స్థానిక అభ్యర్థులను నియమించాలి.

 

2) పోస్టుల స్థాయిని పెంచి స్థానిక కోటాను తగ్గించడం: ఆంధ్రా ప్రాంత అభ్యర్థులకు లాభం చేకూరే విధంగా తెలంగాణలోని జిల్లా స్థాయి పోస్టులను జోనల్‌ స్థాయి పోస్టులుగా మార్చడంతో వాటిలో స్థానికులకు ఉన్న రిజర్వేషన్‌ 80% నుంచి 70%కి తగ్గింది. నాన్‌-గెజిటెడ్‌ జోనల్‌ స్థాయి పోస్టులను గెజిటెడ్‌ పోస్టులుగా మార్చి వాటిలో స్థానికులకు లభించాల్సిన 70% రిజర్వేషన్లను 60%కు తగ్గించారు.

 

3) సమన్యాయ కోటాను (ఫెయిర్‌ షేర్‌) ఉల్లంఘించడం: రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కార్యాలయాల్లో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని ఉల్లఘించి ఆ ఉద్యోగాల్లో దాదాపు 90 శాతం వరకు ఆంధ్రా ప్రాంతం వారిని నియమించారు.

 

4) హైదరాబాద్‌ను 7వ జోన్‌గా మార్చడం: రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించిన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాలయాలు తదితరాలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో రాష్ట్ర రాజధానిలోని ఉద్యోగ నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని, అది ఫ్రీ జోన్, ఏడో జోన్‌ అంటూ పలు వాదనలను ముందుకు తెచ్చారు. యథేచ్ఛగా స్థానికేతరులను నియమించారు. దీనివల్ల హైదరాబాద్‌ స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 1975, నవంబరు 1న వెలువడిన జీఓ నెం.729, హైదరాబాద్‌ నగరం 6వ జోన్‌ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంలో మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగతా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లోకల్‌ రిజర్వేషన్‌ పాటించాలని, మినహాయింపు పొందిన రాష్ట్ర స్థాయి ఆఫీసుల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో ‘ఫెయిర్‌ షేర్‌ (సమన్యాయ భాగం)’ సూత్రాన్ని పాటించాలని ఈ జీఓ చెప్పింది. ఫెయిర్‌ షేర్‌  అంటే జనాభా ప్రాతిపదికపై తెలంగాణ ప్రాంతం వారికి 42 శాతం కేటాయించాలి. కానీ ఆ అంశాన్నీ విస్మరించి పెద్దఎత్తున స్థానికేతరులను నియమించారు.

  రాష్ట్రపతి ఆదేశాల్లో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ లేదా ఏడో జోన్‌ అనే ప్రస్తావన లేదు. ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌ను 6వ జోన్‌లో చేర్చారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ధ్రువీకరించాయి. 1998లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ అధికార్లకు సంబంధించిన కేసులో హైదరాబాద్‌ 6వ జోన్‌లో భాగమని హైకోర్టు స్పష్టం చేసింది.

  ఆరు సూత్రాల పథకంలోని నాలుగో సూత్రం ప్రకారం రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేయడానికి ఏర్పాటుచేశారు. అయితే ఇందులోని జ్యుడీషియల్, నాన్‌-జ్యుడీషియల్‌ సభ్యుల నియమాకాల్లో స్థానిక రిజర్వేషన్‌ పాటించాలనే నిబంధన లేకపోవడంతో 90 శాతం సభ్యులుగా ఆంధ్ర ప్రాంతం వారినే నియమించారు. ఫలితంగా న్యాయం కోసం ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయమే జరిగిందనే విమర్శలు తలెత్తాయి.

  రాష్ట్ర సచివాలయంలో జీఏడీ శాఖకి ఎస్‌పీఎఫ్‌ (సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా) నిబంధన ఉన్నప్పటికీ అందులో ఉన్నవారంతా ఆంధ్రా అధికారులవడంతో న్యాయం కోసం ఎదురు చూసిన తెలంగాణ ఉద్యోగులకు నిరాశ మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కార్పొరేషన్‌లు, బోర్డులు, విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ గ్రాంటు పొందే విద్యాసంస్థల్లోని ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో అక్కడి ఉద్యోగాల్లో 90 శాతానికి పైగా ఆంధ్రా ప్రాంతం వారినే నియమించారు.

5) అక్రమ బదిలీలు: రాష్ట్రపతి ఉత్తర్వులు కల్పించిన అవకాశంతో ఆంధ్రా ప్రాంతంలోని ఉద్యోగులను పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ ఉద్యోగుల బదిలీల్లో 99 శాతం ఆంధ్రా ప్రాంతం ఉద్యోగులను తెలంగాణ ప్రాంతానికి తరలించారు. కానీ తెలంగాణ నుంచి ఆంధ్రా ప్రాంతానికి చేసిన బదిలీలు ఒక్క శాతం కంటే తక్కువే జరిగాయి.

 

టీఎన్‌జీఓ సంఘం ఆందోళన 

  రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో నియమించిన ప్రభుత్వ ఉద్యోగులను వారి సొంత జోన్‌లకు (ప్రాంతాలకు) బదిలీ చేసి (పంపివేసి) వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించాలని, డిమాండ్‌ చేస్తూ తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (టీఎన్‌జీవో) సంఘం ఆందోళన ప్రారంభించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనతో తెలంగాణ ప్రాంత వాసులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని నాటి టీఎన్‌జీవో సంఘం నాయకుడు స్వామినాథన్‌ అధ్యక్షతన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన నాటి ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణలోని 5, 6వ జోన్లలో నియమించిన 1, 2, 3, 4 జోన్‌లకు చెందిన ఆంధ్రా, రాయలసీమ ప్రాంత ఉద్యోగులను గుర్తించాలని ఆదేశించారు. అందుకోసం అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి అధ్యక్షతన 1984లో కమిటీని నియమించారు. ఇందులో ఇద్దరు సభ్యులుగా ఐఏఎస్‌ అధికారులు కమలనాథన్, ఉమాపతిరావు ఉన్నారు. ఈ కమిటీ 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లఘించి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం వారు ఎంతమంది తెలంగాణలో నియమితులయ్యారో తేల్చడానికి విచారణ చేపట్టింది.  నాటి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కొన్ని ఈ కమిటీకి పూర్తి వివరాలను సమర్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి 1975-84 మధ్య కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలోని 5, 6వ జోన్‌లలో నియమించిన స్థానికేతర (1, 2, 3, 4 జోన్‌లకు చెందినవారు) ఉద్యోగుల సంఖ్య 58,962 అని నిర్ధారించింది. టీఎన్‌జీఓ లెక్కల ప్రకారం ఈ నాన్‌-లోకల్‌ ఉద్యోగుల సంఖ్య 89 వేలకు పైగా ఉంది. ఈ నివేదికను పునఃపరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుందరేశన్‌ అనే ఐఏఎస్‌ అధికారితో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 610 జీఓను 1985, డిసెంబరు 30న జారీ చేసింది. అందులోని అంశాలన్నింటినీ 1986 మార్చి 31 లోగా అమలుచేయాలని ఆదేశించింది.

 

జీఓ 610 ప్రధానాంశాలు

* రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన 1975, అక్టోబరు 18 నుంచి జీఓ 610 జారీ అయ్యే నాటికి తెలంగాణ ప్రాంతంలోని 5, 6 జోన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన నాన్‌లోకల్‌ ఉద్యోగులందరినీ వారి సొంత జోన్లకు 1986 మార్చి 31లోగా తిరిగి పంపించాలి.

* జూరాల, శ్రీశైలం ఎడమ కాలువ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నాన్‌-గెజిటెడ్‌ కేడర్లలో ఉన్న ఉద్యోగులతో పాటు గెజిటెడ్‌ హోదా ఉన్న జూనియర్‌ ఇంజినీర్లను వారి సొంత జోన్‌లకు బదిలీ చేయాలి.

* రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఉండే ఉద్యోగాల నియామకాల్లో అన్నిప్రాంతాల వారికి సమన్యాయం జరగాలి.

* బోగస్‌ సర్టిఫికెట్ల ద్వారా తెలంగాణ ప్రాంత ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజీల్లో పేరు నమోదుచేసి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతరులపై చర్యలు తీసుకోవాలి.

* అక్రమ నియామకాలు, పదోన్నతులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత అభ్యర్థులు చేసుకున్న అప్పీళ్లన్నింటినీ 1986, మార్చి 31 లోగా పరిష్కరించాలి.

* రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, పదోన్నతులన్నింటినీ 1986, జూన్‌ 30 లోపు పునఃపరిశీలించి పరిష్కరించాలి.

 

అదే తీరు

  తలుపులకు తాళం వేసి గొళ్లెం వేయడం మరిచిపోయినట్లు తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి వదిలేసిన మిగతా జీఓల మాదిరిగానే 610 జీఓ కూడా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ఉల్లంఘనలు యథావిధిగా కొనసాగాయి. అదే కాలంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణంలో నియమితులైన కోస్తాంధ్ర ప్రాంతానికి (1, 2, 3 జోన్‌లకు) చెందిన స్థానికేతర ఉద్యోగులను వారి స్థానిక జోన్‌లకు పంపేందుకు జారీ చేసిన జీఓ 564ను ఆగమేఘాల మీద అమలుచేశారు. 610 జీఓ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అమలుకాలేదు.

 

  610 జీఓ ఉల్లంఘనలను పరిశీలించి వాటిని సరిచేయడానికి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2001లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎం.గ్లిర్‌గానీతో ఏకసభ్య కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. ఆ విధంగా అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి, కమిషన్‌ల మీద కమిషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, వాటి నివేదికలను మాత్రం అమలుచేయడం మాత్రం మరిచిపోయాయి.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌