• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి ఉత్తర్వులు - 1975

ముల్కీకి మంగళం.. జోన్లకు శ్రీకారం!

  ముల్కీ నిబంధనల అమలు కోసం తెలంగాణ ప్రాంతంలో, రద్దు కోరుతూ ఆంధ్రలో తీవ్ర ఉద్యమాలు జరిగాయి. వాటిని విరమింపజేసేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ దశలో సుప్రీంకోర్టు ముల్కీ నియమాల అమలు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇచ్చింది. దాంతో వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దాని ప్రకారం నాటి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికీ ఉద్యోగ నియామకాల్లో సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్పట్లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు, జీఓలు, స్థానికతకు సంబంధించిన వివరాలు, మినహాయింపుల గురించి తెలుసుకోవాలి. 

 

 కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రకటించిన ఆరు సూత్రాల పథకం అమలుకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు అదే ఏడాది 32వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించింది. సుప్రీంకోర్టు 1972, అక్టోబరు 3న ఇచ్చిన అంతిమతీర్పులో ముల్కీ నియమాల అమలు రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది. దాంతో రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. కొత్త చట్టం ద్వారా ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధంగా రద్దయి శాశ్వతంగా ఉనికిని కోల్పోయాయి.

  32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1973 డిసెంబరులో రూపొందించినప్పటికీ 1974, జులై 1 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లక్ష్యం నాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో అన్ని ప్రాంతాల వారికి సమానావకాశాలు కల్పించడం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఒక పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, అలాగే హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపన కోసం రాజ్యాంగంలో 371(D), (E) అధికరణలను చేర్చారు. 371(D) లోని క్లాజ్‌ 1 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాలను కల్పించడం కోసం అవసరమైన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారాన్ని భారత రాష్ట్రపతికి కట్టబెట్టింది.

  ఆర్టికల్‌ 371(D) ద్వారా లభించిన అధికారం ప్రకారం భారత రాష్ట్రపతి 1975 అక్టోబరు 18న ‘ది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్, 1975 పేరుతో భారత ప్రభుత్వ నోటిఫికేషన్‌ నెంబర్‌ జి.ఎస్‌.ఆర్‌.524(ని) ద్వారా జారీ చేశారు. దీన్నే ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ లేదా రాష్ట్రపతి ఉత్తర్వు అంటారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ సిబ్బంది నియామకాలకు సంబంధించిన నియమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబరు 20న జీఓ నెంబరు 674ను జారీచేసింది. రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లోని ఎస్‌పీఎఫ్‌ విభాగం దీన్ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీఓ 674 రాష్ట్రంలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి పాటించాల్సిన కింది విధివిధానాలను పేర్కొంటుంది.

 

జీఓ 674 ముఖ్యాంశాలు

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్థానిక కేడర్లు, స్థానిక ప్రాంతాలను నిర్ణయించడం

* స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు

* జోన్‌ల వర్గీకరణ

* అభ్యర్థుల స్థానికత నిర్ధారణ

* స్థానికుల రిజర్వేషన్‌ వివరాలు

 

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీఓ 674ను అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలను నాలుగు కేడర్లుగా వర్గీకరించారు. 

అవి 1) జిల్లా కేడర్‌ 2) జోనల్‌ కేడర్‌ 3) మల్టీజోనల్‌ కేడర్‌ 4) రాష్ట్ర కేడర్‌

 

జిల్లా కేడర్‌: ఒక జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లోగాని, ప్రభుత్వ సంస్థల్లోగాని లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ) (ప్రస్తుతం జూనియర్‌ అసిస్టెంట్‌) ఉద్యోగాలు, తత్సమాన ఉద్యోగాలన్నింటినీ జిల్లా కేడర్‌ ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఈ ఉద్యోగాలకు ఒక జిల్లాను లోకల్‌ ఏరియా యూనిట్‌గా తీసుకుంటారు.

 

జోనల్‌ కేడర్‌: ప్రభుత్వ ఉద్యోగాల్లోగాని, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లోగాని ఎల్‌డీసీ స్థాయి కంటే ఎగువన నిర్ణీత స్థాయి వరకు ఉన్న ఉద్యోగాలను జోనల్‌ కేడర్‌ ఉద్యోగాలుగా పేర్కొంటారు. కొన్ని జిల్లాలతో ఉన్న జోన్‌ను ఒక లోకల్‌ ఏరియాగా పరిగణిస్తారు. ఇందులో కొన్ని నిర్ణీత గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలు కూడా ఉంటాయి.

ఉదా: నాటి జూనియర్‌ ఇంజినీర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు, వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు మొదలైనవి

 

మల్టీజోనల్‌ కేడర్‌: కొన్ని నిర్ణీత గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలను (సాధారణంగా గ్రూప్‌-1 స్థాయి) మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగాలుగా పేర్కొంటారు. వీటికోసం రెండు లేదా మూడు జోన్లను కలిపి మల్టీజోనల్‌గా పరిగణిస్తారు. అంటే ఒక జోనల్‌ కేడర్‌ను ఒకటి కంటే ఎక్కువ జోన్‌లకు విస్తరింపజేసే ఉద్యోగాలని అర్థం.

 

రాష్ట్ర కేడర్‌: గ్రూప్‌- 1 కేడర్‌లో మల్టీజోనల్‌ పోస్టులను మినహాయిస్తే మిగిలిన ఉన్నతస్థాయి ఉద్యోగాలను రాష్ట్ర కేడర్‌ ఉద్యోగాలుగా నిర్ధారించారు. వీటికి స్థానికత వర్తించదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు ఉంటాయి.

ఉదా: డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్‌పీలు, సీటీవోలు

 

జోన్ల వర్గీకరణ 

జీఓ 674ను అనుసరించి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలను ఆరు జోన్లుగా విభజించారు.

జోన్‌-1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (1979)

జోన్‌-2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ

జోన్‌-3: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం

జోన్‌-4: కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు

జోన్‌-5: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం

జోన్‌-6: మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి (1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జోన్‌లో చేర్చారు)

 

లోకల్‌ కేడర్‌ స్థానికత నిర్ధారణ

అభ్యర్థి స్థానికతను పదో తరగతి వరకు జరిగిన పాఠశాల విద్యాభ్యాసం ఆధారంగా నిర్ధారిస్తారు. పదో తరగతి, దానికిముందు 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వరుసగా ఏ జిల్లా / జోన్‌లో చదివితే ఆ జిల్లా/జోన్‌ స్థానికత వర్తిస్తుంది. ఒక జోన్‌లోని మొత్తం జిల్లాల్లో ఎక్కడ చదివినా ఆ జోన్‌ స్థానికత వర్తిస్తుంది. రెండు లేదా ఎక్కువ జిల్లాల్లో/రెండు లేదా అంతకంటే ఎక్కువ జోన్‌లలో చదివితే అత్యధిక కాలం చదివిన జిల్లా/జోన్‌లో స్థానిక అభ్యర్థిగా గుర్తిస్తారు.  జిల్లా/జోన్‌లో స్థానిక అభ్యర్థిగా గుర్తిస్తారు. రెండు జిల్లాలు/జోన్‌లలో సమానంగా చదివితే పదో తరగతి పరీక్ష మొదటిసారి రాసిన జిల్లా/జోన్‌కు చెందినవారిగా పరిగణిస్తారు.

                                (లేదా)

ఈ 7 సంవత్సరాల కాలంలో ఏదైనా కొంతకాలం పాఠశాల విద్యకు దూరమైనప్పుడు లేదా ఏ విద్యాసంస్థల్లో చదవనప్పుడు ఆ కాలానికి సంబంధించిన నివాస ధ్రువపత్రాన్ని సంబంధిత తహసీల్దార్‌ జారీ చేయాలి.

 

స్థానిక రిజర్వేషన్‌ల కోటా

* జిల్లా స్థాయి ఉద్యోగాల్లో 80% స్థానికులకు మిగిలిన 20% ఓపెన్‌ కాంపిటీషన్‌కు కేటాయించారు. ఈ 20%లో లోకల్, నాన్‌లోకల్‌ ఎవరైనా సమానమే.

* జోనల్‌ స్థాయి ఉద్యోగాల్లో 70% స్థానికులకు, మిగతా 30% ఓపెన్‌ కాంపిటీషన్‌కు కేటాయించారు.

* మల్టీజోనల్‌ ఉద్యోగాల్లో 60% స్థానికులకు, 40% ఓపెన్‌ కాంపిటీషన్‌కు కేటాయించారు.

* జోనల్‌ స్థాయి ఉద్యోగాల కంటే పైస్థాయి ఉద్యోగాలను రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటారు. వీటికి స్థానికత నియమం ఉండదు. అంటే రాష్ట్ర స్థాయి (కేడర్‌) ఉద్యోగాలు. ఇవి అన్ని ప్రాంతాల వారికి సమానంగా వర్తిస్తాయి.

 

మినహాయింపులు

రాష్ట్రపతి ఉత్తుర్వుల్లో 14వ పేరాను అనుసరించి స్థానికత కింది ఉద్యోగాలకు వర్తించదు. వీటికి అన్ని ప్రాంతాల వారిని సమానంగా పరిగణిస్తారు. వివరాలను రాష్ట్రపతి ఉత్తర్వులు 14వ పేరాలో 14A - 14F వరకు పేర్కొన్నారు.

* 14A  రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగాలు. 

* 14B  శాఖాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల్లోని ఉద్యోగాలు. 

* 14C  రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యాలయాలు. 

* 14D కార్పొరేషన్‌లు, బోర్డులు.

* 14E ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లోని ఉద్యోగాలు 

* 14F హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పోలీస్‌ శాఖలోని ఉద్యోగాలు 

 

గమనిక: ఈ రాష్ట్రపతి ఉత్తర్వును తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జారీ చేసిన ఉత్తర్వుగా అభ్యర్థులు గుర్తించాలి.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

* ముల్కీ నిబంధనలు - కోర్టు తీర్పులు

* ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాలు - స‌యోధ్య సూత్రాలు

* పెద్దమనుషుల ఒప్పందం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌