• facebook
  • whatsapp
  • telegram

సాలార్‌జంగ్‌ సంస్కరణలు - 2

నిజాం రాజ్యంలో నిర్మాణాత్మక యుగం!

 

  మొదటి సాలార్‌జంగ్‌ అనేక సంస్కరణలు చేపట్టి హైదరాబాద్‌ రాజ్యాన్ని ఆధునిక పథంలో నడిపాడు. న్యాయవ్యవస్థను పటిష్టపరిచాడు. విద్యారంగాన్ని చక్కదిద్ది సమర్థ ఉద్యోగులను తయారుచేశాడు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచాడు. రవాణా, సమాచార వ్యవస్థలను అభివృద్ధిపరిచాడు. నిజాం రాజ్య చరిత్రలో నిర్మాణాత్మక యుగాన్ని ఆవిష్కరించాడు. ఈ వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

  హైదరాబాద్‌ రాజ్యంలో సరికొత్త విధానాలతో సమూల మార్పులు చేసి ఆధునిక పాలనకు మొదటి సాలర్‌జంగ్‌ (నవాబ్‌ తురబ్‌ అలీఖాన్‌) శ్రీకారం చుట్టాడు. భూమిశిస్తు తీరు మార్చి ఆదాయం పెంచాడు. రాజ్యాన్ని భాగాలుగా చేసి పాలనను చక్కదిద్దాడు. నయా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పరిరక్షించాడు. వీటితోపాటు న్యాయవ్యవస్థలో, విద్యారంగంలో, ఆర్థిక, రవాణా తదితరాల్లోనూ సంస్కరణలు చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత తరం పాలకులకు ఆదర్శంగా నిలిచాడు. 

 

న్యాయవ్యవస్థ సంస్కరణలు

  పరిపాలన, శాంతి భద్రతల వ్యవస్థను పటిష్ఠపరచడంలో భాగంగా న్యాయ వ్యవస్థను కూడా మార్చాడు. న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వేచ్ఛను కల్పించాడు. నిజాం రాజ్యంలో సర్వోన్నత న్యాయస్థానం (అదాలత్‌-ఇ-పాదుషా) అనే ఒక అప్పీల్‌ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర న్యాయమూర్తులను నియమించాడు. కింది స్థాయిలో నగర, జిల్టా కోర్టులు ఏర్పరిచాడు. న్యాయవ్యవస్థలో ప్రత్యేక సివిల్‌ (దివాని అదాలత్‌), క్రిమినల్‌ (ఫౌజ్‌దారి అదాలత్‌) కోర్టులతో పాటు 1862లో ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయశాఖ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశాడు. ముస్లిం న్యాయశాస్త్ర, మత సంబంధమైన కేసులను పర్యవేక్షించి పరిష్కరించడానికి మహాక్మా-ఇ-సదారత్‌ అనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. 1872లో మహాక్మా-ఎ-మురాఫా-ఎ-అజ్లా అనే పేరుతో కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ను స్థాపించాడు. ఈ కోర్టు అన్ని రకాల సివిల్, క్రిమినల్‌ కేసుల అప్పీళ్లను విచారిస్తుంది. నిజాం రాజ్యంలో సాలార్‌జంగ్‌ కాలంలోనే మొదటిసారిగా అంగ విచ్ఛేదన శిక్షను రద్దు చేశారు.  

 

విద్యా సంస్కరణలు

  రాజ్యపాలనా వ్యవహారాలను సక్రమంగా, సమర్థంగా నిర్వహించడానికి విద్యావంతులైన, శిక్షణ పొందిన సిబ్బంది అవసరమని గ్రహించిన సాలార్‌జంగ్‌ విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాడు. సంప్రదాయ పద్ధతులు, ఆలోచన విధానంలో మార్పు రావడానికి నూతన పాశ్చాత్య విద్య, విజ్ఞానం అవసరమని గుర్తించి నిజాం రాజ్యంలో ఆధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. నిజాం రాజ్యం అంతటా అనేక పాఠశాలలను నెలకొల్పాడు. మహిళా విద్యను ప్రోత్సహించాడు. పారశీక (పర్షియన్‌), అరబిక్‌ భాషలతో పాటు ఆంగ్ల భాష, పాశ్చాత్య విద్యాబోధనను ప్రవేశపెట్టాడు. దారుల్‌ ఉల్మ్, ఓరియంటల్‌ కళాశాల, సిటీ హైస్కూల్, చాదర్‌ఘాట్‌ హైస్కూల్, మదర్స-ఇ-ఆలియా లాంటి విద్యాసంస్థలను స్థాపించాడు. వీటితో పాటు ఇంజినీరింగ్, మెడికల్‌ విద్యాసంస్థలను నెలకొల్పాడు. తద్వారా హైదరాబాద్‌ రాజ్యంలో ఆధునిక విద్యను అభ్యసించిన సమర్థులైన ఉద్యోగులు రూపొందారు. ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన విద్యావంతులను భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆహ్వానించి ప్రాంత, కుల, మత, భాషా భేదాలు లేకుండా పదవులిచ్చి ప్రోత్సహించాడు.

 

ద్రవ్య సంస్కరణలు

  ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని క్రమబద్ధీకరించడం, ద్రవ్య (కరెన్సీ ) స్తరీకరణకు సాలార్‌జంగ్‌ నాణేలను ప్రభుత్వ గుత్తాధిపత్యం కిందకు తెచ్చాడు. నియంత్రణ లోపించిన జిల్లా టంకశాలలను రద్దు చేసి హైదరాబాద్‌లో ప్రభుత్వ టంకశాలను ఏర్పాటు చేశాడు.సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన కొత్త నాణేలను ‘హలిసిక్కా’ అని పిలిచేవారు. ఈ నాణేన్ని వస్తు వినిమయంలో ప్రామాణికంగా గుర్తించారు. సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన ద్రవ్య సంబంధ సంస్కరణల ఫలితంగా రాజ్య ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. 

 

రవాణా, సమాచార రంగాల్లో సంస్కరణలు 

  సాలార్‌జంగ్‌ హైదరాబాద్‌ రాజ్యమంతటా రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇంగ్లిష్‌ వారి సహాయంతో రోడ్లు, రైలు మార్గాలను నిర్మించాడు. 1876లో నిజాం స్టేట్‌ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. క్రీ.శ.1856 నాటికి నిజాం రాజ్యంలో సమాచార విప్లవం చోటుచేసుకుంది. అధికార కార్యకలాపాల కోసం విద్యుత్, టెలిగ్రాఫ్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారు. 1862 నాటికి పూర్తిస్థాయి తపాల వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత రైల్వేలు కూడా వచ్చాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం షోలాపూర్‌ మీదుగా బొంబాయి, మద్రాసులను కలుపుతూ రైల్వేలైన్‌ను నిర్మించింది. సాలార్‌జంగ్‌ హైదరాబాద్‌ నుంచి  వాడీని కలుపుతూ రైలు మార్గాన్ని మొదలుపెట్టి 1878 నాటికి పూర్తి చేశాడు. హైదరాబాద్‌ నుంచి షోలార్‌పూర్‌ వరకు రోడ్లు నిర్మించాడు. దాంతో హైదరాబాద్‌ రాజ్యానికి మిగిలిన భారతదేశంతో రవాణా మార్గాలు ఏర్పడి వర్తక, వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. రవాణా సౌకర్యాలతో పాటు 1857లో ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్, 1871లో పోస్టల్‌ డిపార్టుమెంట్‌ను నెలకొల్పి ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 

 

 

ఇతర సంస్కరణలు 

  సాలార్‌జంగ్‌ సతీసహగమన దురాచారం, కార్మికుల కట్టు బానిసత్వం, పిల్లల అమ్మకాలను నిషేధించాడు. అవినీతిపరులైన ఉద్యోగులను దండించాడు. శక్తిసామర్థ్యాలను బట్టి ఉద్యోగాలను ఇచ్చాడు. ఇంగ్లిషు, ఉర్ధూ పత్రికలను నిర్వహించాడు.చాదర్‌ఘాట్‌లో పారిశ్రామిక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. 

 

సంస్కరణల ఫలితాలు 

* సాలార్‌జంగ్‌ సంస్కరణల వల్ల హైదరాబాద్‌ రాజ్యం సర్వతోముఖాభివృద్ధి చెందింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. రైతుల బాధలు తగ్గాయి.  

* విద్యావంతులు పెరిగారు. పటిష్ఠమైన పాలనా పద్ధతి ఏర్పడింది. రాజ్యంలో ఆధునికత రూపురేఖలు దిద్దుకుంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. అందువల్ల సాలార్‌జంగ్‌ కాలం నిజాం రాజ్యచరిత్రలో నిర్మాణాత్మక యుగమని పలువురు ప్రశంసించారు. 

* శతాబ్దాల పురోగతిని మూడు దశాబ్దాల్లో వీక్షించవచ్చని గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మెట్‌కాఫ్‌ అభివర్ణించాడు. ప్రస్తుతం మనకు తెలిసిన ఆధునిక ప్రభుత్వానికి సాలార్‌జంగ్‌ బీజాలు వేశాడు.  

* ఎనలేని కృషితో తాను ప్రవేశపెట్టిన సంస్కరణల పూర్తి ఫలితాలను చూడకుండానే 1883లో 54వ ఏటనే సాలార్‌జంగ్‌  మరణించాడు.  

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 సాలార్‌జంగ్‌

 సాలార్‌జంగ్‌ - సంస్కరణలు

  తెలంగాణ కళలు

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 04-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌