• facebook
  • whatsapp
  • telegram

సాలార్‌జంగ్‌ - సంస్కరణలు

హైదరాబాద్‌ రాజ్యంలో ఆధునిక పాలన!

నిజాంల పాలకవర్గంలో మొదటి సాలార్‌జంగ్‌కు అత్యంత విశిష్టస్థానం ఉంది. హైదరాబాద్‌ రాజ్యం ఆర్థికంగా, పాలనాపరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దివాన్‌గా ఈయన బాధ్యతలు చేపట్టి పరిస్థితులను సమర్థంగా చక్కదిద్దాడు. భూమిశిస్తు విధానంలో మార్పులు చేసి ఆదాయాన్ని పెంచాడు. రాజ్యాన్ని జిల్లాలు, సుబాలుగా విడగొట్టి చక్కటి పాలనకు మార్గం వేశాడు. సరికొత్త పోలీసు వ్యవస్థకు బీజాలు వేసి శాంతిభద్రతలను కాపాడాడు. ఆధునిక పాలనకు బీజాలు వేశాడు.

  దక్షిణ భారతదేశంలో క్రీ.శ.1724 నుంచి 1948 వరకు అంటే 224 సంవత్సరాల పాటు సుదీర్ఘపాలన సాగిన శక్తిమంతమైన, విశాలమైన రాజ్యం హైదరాబాద్‌. దీని పాలకులు అసఫ్‌జాహీ రాజ వంశస్థులు. వీరిని నిజాంలు అని కూడా అంటారు. ఈ రాజుల పాలన మధ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు కొనసాగింది. ఈ కాలంలో అనేక రకాల సంస్కరణలను ఆనాటి పాలకులు చేపట్టారు. 

 

మొదటి సాలార్‌ జంగ్‌

నిజాం పాలనా కాలంలో హైదరాబాద్‌ రాజ్యాన్ని ఆధునికీకరించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన దివాన్‌ మొదటి సాలార్‌జంగ్‌. ఆయన అసలు పేరు నవాబ్‌ తురబ్‌ అలీఖాన్‌. సాలార్‌జంగ్‌ అనేది అతడి బిరుదు. 1853 - 1883 మధ్య కాలంలో 30 సంవత్సరాల పాటు ముగ్గురు అసఫ్‌జాహిల కొలువుల్లో (నసీర్‌-ఉద్‌-దౌలా, అఫ్జల్‌-ఉద్‌-దౌలా, మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌) దివాన్‌గా పదవిని నిర్వహించాడు. దివాన్‌ అంటే ప్రధానమంత్రి. హైదరాబాద్‌ రాజ్యంలో ఆ పదవిని నిర్వహించిన ప్రధానమంత్రులందరిలో సాలార్‌జంగ్‌ అగ్రగణ్యుడు, మేధావి, సంస్కర్త. పదవిని చేపట్టే నాటికి అతడి వయసు 24 ఏళ్లు మాత్రమే. అతి పిన్న వయసులోనే ప్రధాని పదవిని దక్షతతో నిర్వహించిన రాజనీతిజ్ఞుడు, పరిపాలనావేత్త అనే ప్రశంసలు అందుకున్నాడు. 

మొదటి సాలార్‌జంగ్‌ బాధ్యతలు స్వీకరించే నాటికి నిజాం రాజ్యపాలన అస్తవ్యస్థంగా ఉండి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. అంతే కాకుండా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. నాటి భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్‌లు, వడ్డీ వ్యాపారస్థులైన అరబ్బులు, పఠాన్‌లు, రోహిల్లాలు, మార్వాడీలు సామాన్య ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేశారు. వారి జీవనం దుర్భరంగా మారింది.

 దివాన్‌ కాకముందు బ్రిటిషర్ల వద్ద పరిపాలనా పద్ధతులు నేర్చుకున్నాడు. ముఖ్యంగా డైటన్‌ అనే  అధికారి వద్ద భూమి శిస్తుకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నాడు. ప్రజా సంక్షేమం, రాజ్య రక్షణ కోసం ఉన్నతమైన పరిపాలనా వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని బ్రిటిషర్ల నుంచి నేర్చుకున్నాడు. వారి నుంచి తెలుసుకున్న విజ్ఞానానికి తన ప్రతిభను మేళవించి గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరుపొందాడు. మొదటి సాలార్‌జంగ్‌ను హైదరాబాద్‌  దివాన్‌గా నియమించే నాటికి హైదరాబాద్‌ మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా ఉండేది. దాన్ని ఆయన ఆధునిక పరిపాలనా వ్యవస్థగా తీర్చిదిద్దాడు. నిజాం - బ్రిటిష్‌ సంబంధాలను సమన్వయపరుస్తూ సంస్కరణల ప్రక్రియను కొనసాగించాడు. 

 

రెవెన్యూ సంస్కరణలు

సాలార్‌జంగ్‌ తన సంస్కరణల ప్రక్రియకు భూమిశిస్తు విధానంతో శ్రీకారం చుట్టాడు. ఆనాటి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. దీనిలో ఆయన సమూలమైన మార్పులు చేపట్టాడు. పంట దిగుబడి ఆధారంగా వస్తు రూపేణ శిస్తు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికాడు. బొంబాయి ప్రెసిడెన్సీలో అమలు చేస్తున్న 30 ఏళ్ల నిర్ణీత కాలానికి స్థిరంగా ఉండే భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ కాలంలో పంట దిగుబడి పెరిగినా అదనపు శిస్తు చెల్లించాల్సిన అవసరం లేదు. 

  హైదరాబాద్‌ రాజ్యంలో 1853కు పూర్వం అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో వేలం వ్యవస్థ ప్రధానమైంది. జిల్లా స్థాయిలో తాలూకాదారులు శిస్తు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమయ్యారు. వేలంపాటదారులు, తాలూకాదారులు అధిక మొత్తంలో శిస్తుతో పాటు ఇతర పన్నులను వసూలు చేసి రైతులపై నిర్బంధాన్ని ప్రయోగించారు. అసమర్థులు, అవినీతిపరులైన తాలూకాదారులు, మధ్యవర్తులను తొలగించి తక్కువ వేతనాలు ఇచ్చి కొత్త తాలూకాదారులను సాలార్‌జంగ్‌ ఎంపికచేశాడు. వీరికి సహకరించడానికి ప్రభుత్వమే ఉద్యోగులను నియమించింది. 

  సాలార్‌జంగ్‌ పాత భూమిశిస్తు విధానానికి స్వస్తి చెప్పి 1865 జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీని ద్వారా తాలూకాదారు (జిల్లా కలెక్టర్‌), తహశీల్దార్‌ను నియమించి వారికి జీతభత్యాలు చెల్లించి సమర్థంగా శిస్తు వసూలు చేసి శాంతి భద్రతలను నిర్వహించాడు. ఈ విధానం వల్ల  దళారుల కబంధ హస్తాల నుంచి రైతులు విముక్తి పొందారు. జిలాబందీ విధానం బ్రిటిష్‌ ఇండియాలోని రైత్వారీ విధానాన్ని పోలి ఉండేది. దీనివల్ల ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. రైతులకు భూమి పట్టాదారు హక్కు కల్పించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్దిష్ట పాలనా యంత్రాంగాన్ని నిర్మించి రెవెన్యూ వ్యవస్థను సమన్వయం చేయడానికి రెవెన్యూ కార్యదర్శిని నియమించారు. క్రీ.శ.1875లో సర్వే, సెటిల్‌మెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ రికార్డులు, హక్కుదారు పట్టా వ్యవస్థ ద్వారా రైతుకు రక్షణ కల్పించారు.ఫలితంగా రైతుకు భద్రత ఏర్పడి వ్యవసాయం అభివృద్ధి చెందింది. క్రీ.శ.1864లో సాలార్‌జంగ్‌ హైదరాబాద్‌ రాజ్యంలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు. ఈ బోర్డు రాజ్యమంతటా రెవెన్యూ వ్యవస్థను పర్యవేక్షించింది. 

 

పాలనా సంస్కరణలు 

సాలార్‌జంగ్‌ బ్రిటిష్‌ ఇండియా పాలనా వ్యవస్థను ప్రాతిపదికగా తీసుకొని పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టి రాజ్య పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని అయిదు సుబాలుగా, పదిహేడు జిల్లాలుగా; జిల్లాలను తాలూకాలుగా విభజించాడు. ప్రతి సుబాకు ఒక సుబేదార్, ప్రతి జిల్లాకు ఒక తాలూకాదారు (కలెక్టర్‌), ప్రతి తాలూకాకు ఒక తహశీల్దార్‌ను నియమించాడు. రెవెన్యూ, పౌర, మెజిస్టీరియల్‌ అధికారాలను కలెక్టర్‌కు కల్పించాడు. అంతకు ముందు హైదరాబాద్‌లో ఒక ఖజానా మాత్రమే ఉండేది. సాలార్‌జంగ్‌ ప్రతి జిల్లాలోనూ ఖజానాలు ఏర్పరిచాడు. జిల్లా స్థాయిలో పోలీసు, వైద్య, విద్యాలయాలను నెలకొల్పాడు. అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంతో పాటు సచివాలయ శాఖల్లో కొన్నింటిని కూడా ప్రారంభించాడు.  

  సాలార్‌జంగ్‌ 1882లో అత్యంత ముఖ్యమైన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. వివిధ పాలనారంగాల్లో అంతకు ముందు చేపట్టిన సంస్కరణలను ఏకీకృతం చేసేందుకు అయిదు మంత్రిత్వ శాఖలను ఏర్పరిచి, నలభై అయిదు శాఖలను వాటి పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ సంస్కరణల్లో భాగంగా అంతకుముందున్న విధానాన్ని రద్దు చేసి గ్రామాల్లో మాలిపటేల్, కొత్వాలిపటేల్, పట్వారీ, దళారి లాంటి ఉద్యోగులను నియమించి వారి ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాడు.  ఈ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేయడానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్రిటిష్‌ ఇండియాలో తగినంత విద్య, అనుభవం ఉన్నవారితో ప్రభుత్వంలోని వివిధ స్థాయుల్లో కీలక ఉద్యోగాలను భర్తీచేయాలని సంకల్పించాడు. దీనికోసం ఉత్తరాది నుంచి, దక్షిణాన మద్రాసు నుంచి అనేకమంది విద్యావంతులను ఆహ్వానించాడు. బ్రిటిష్‌ ఇండియాలో ప్రత్యేకించి ఉత్తరభారతంలో ముస్లిం ప్రజలను ఆధునీకరించడంలో చురుకైన పాత్ర పోషించిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ సలహా తీసుకొని అనువైన అభ్యర్థులను ఎంపిక చేశాడు. ప్రభుత్వ సర్వీసులోని ఉద్యోగుల పనితీరు, ప్రతిభ ఆధారంగా పదోన్నతులను కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టాడు.

 

పోలీసు సంస్కరణలు 

నిజాం రాజ్యంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతలను కాపాడటానికి సాలార్‌జంగ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించాడు. 1865లో ఆధునిక పోలీసు వ్యవస్థను రూపొందించాడు. దాని ప్రకారం జిల్లాకొక పోలీసు సూపరింటెండెంట్‌ను (మెహత్‌మెన్‌) నియమించాడు. పోలీసు సిబ్బందికి జీతభత్యాలు చెల్లించి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్ఠమైన శాంతిభద్రతల యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాడు. 

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌