• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో జాతరలు - వారసత్వం

ఏడుపాయల జాతర
    మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లెలో దుర్గాభవానీ ఆలయం వద్ద ఏటా శివరాత్రి పర్వదినాన ఏడుపాయల జాతరను జరుపుకుంటారు. ఇక్కడే మంజీరా నది ఏడుపాయలుగా చీలిపోతుంది. మూడుపాయలు భవానీమాత ఆలయం ముందు భాగం నుంచి, తక్కిన నాలుగు పాయలు ఆలయం వెనుక భాగం నుంచి ప్రవహిస్తాయి. ఈ ఆలయాన్నే ‘గరుడ గంగ’ అని కూడా అంటారు. ఈ జాతరకు వచ్చిన భక్తులు ఏడుపాయల వద్ద స్నానమాచరించడం, ఒక రాత్రి గుడిలో నిద్రపోవడం ప్రధాన ఆచారంగా కొనసాగుతోంది.

కేతకి సంగమేశ్వరస్వామి 
మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని ‘ఝరాసంగం’ గ్రామంలో ఉన్న కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

జోగినాథుడి జాతర:
మెదక్‌ జిల్లా జోగిపేటలోని కొండపై జోడు లింగాలుగా వెలసిన జోగినాథస్వామి జాతర ఏటా మార్చిలో జరుగుతుంది.

గొల్లగట్టు/దురాజ్‌పల్లి 
   నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని పాల శేర్లయ్యగట్టు ప్రాంతంలో గొల్లగట్టు/ దురాజ్‌పల్లి జాతర జరుగుతుంది. దీన్నే ‘పెద్ద గట్టు జాతర’ అని కూడా అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర. నాలుగు రోజులపాటు జరుగుతుంది. యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుపుకుంటారు. లింగమంతుల స్వామి సోదరి చౌడమ్మ.
    జాతరలో మొదటి రోజున 30 విగ్రహాలున్న దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకెళ్లి, హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. తర్వాత కంకణాలు కట్టి, ఊరేగింపుగా గుట్టపైకి తీసుకువస్తారు. చౌడమ్మ తల్లికి మొక్కులు సమర్పిస్తారు. ఖాసీమ్‌పేట యాదవులు పసిడి కుండను ఆలయ గోపురం మీద అలంకరిస్తారు. జాతరలో రెండో రోజున లింగమంతుల స్వామికి బోనాలతో ఊరేగింపుగా వచ్చి, బోనాలు (నైవేద్యం) సమర్పిస్తారు. పక్కనే ఉన్న చౌడమ్మ తల్లికి కూడా బోనాలను సమర్పిస్తారు. జాతరలో మూడో రోజున నెలవారం చేసి పోతరాజు, మిగిలిన దేవుళ్లకు మొక్కులు సమర్పిస్తారు. చివరి రోజున  సూర్యాపేట యాదవులు మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళతారు. తర్వాత పూజారులు దేవుళ్లకు కేసారం నిర్వహించడంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరలో దిష్టిపోయడం అనేది ప్రధాన ఆచారం/ఆనవాయితీగా వస్తోంది. వరంగల్‌ జిల్లాకు చెందిన చీకటాయపాలెంలోని దేవర వంశీయులు, నల్గొండ జిల్లాకు చెందిన తుండు, మట్ట వంశాలకు చెందిన పూజారులు ఈ జాతరను నిర్వహిస్తారు.

చెరువుగట్టు 
నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉన్న కొండపై ‘చెరువుగట్టు’ జాతర జరుగుతుంది. ఏటా మహాశివరాత్రి రోజుల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. ఇక్కడి ప్రధాన దైవం శ్రీపార్వతీసహిత జడల రామలింగేశ్వరస్వామి.

మేళ్లచెరువు 
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ తాలుకాలోని మేళ్లచెరువు గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ శ్రీ శంభులింగేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఈ స్వామి లింగం పైభాగాన ఉండే 5 సెం.మీ. లోతైన వివరంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఈ లింగం లోపల ఉండే జలాన్నే భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు.

అడవిదేవులపల్లి జాతర
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లిలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి ప్రధాన దైవం కనకదుర్గమ్మ తల్లి. సిడిమాన్, బండ్ల ఊరేగింపు, గండ దీపం మొదలైన కార్యక్రమాలు ఈ జాతరలోని ప్రత్యేక ఆకర్షణలు.

కోదండాపురం
నల్గొండ  జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని కోదండాపురం గ్రామంలో ఏడురోజులపాటు కొండాపురం జాతర జరుగుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ పంచమి నుంచి ఏకాదశి వరకు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ జాతరలో రథోత్సవం, కళ్యాణం ముఖ్యమైన ఘట్టాలు.

చౌడమ్మ జాతర
    నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలోని అనేక గ్రామాల్లో ఈ జాతరను మూడురోజులపాటు నిర్వహిస్తారు. చౌడమ్మ అంటే యాదవుల కులదేవత. 

తుల్జాభవానీ 
నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పెద్దమునిగల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ఈ జాతరను జరుపుకుంటారు. ఇందులో ఎక్కువగా లంబాడా తెగకు చెందినవారు పాల్గొంటారు. జాతర జరిగే తొమ్మిది రోజులపాటు పూజార్లు ఉపవాసం ఉండి, దసరా పండుగ రోజున ఉపవాస దీక్షను విరమిస్తారు.

సిద్ధులగుట్ట 
    నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం సిద్ధులగుట్ట వద్ద ఈ జాతర జరుగుతుంది. ప్రాచీనకాలంలో ఈ గుట్టపై నవనాథులు శివలింగాన్ని స్థాపించి, తపస్సు చేయడంతో దీనికి ‘సిద్ధుల గుట్ట’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి దేవాలయంలోని శివుడిని సిద్ధలింగేశ్వరుడిగా కొలుస్తారు.

కురుమూర్తి 
    మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం అమ్మాపూర్‌ గ్రామంలో 19 రోజులపాటు సాగుతుంది. ఈ జాతరలో 8వ రోజున జరిగే ‘శ్రీవారి ఉద్ధాలసేవ’ చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఇక్కడి ప్రధాన దైవం కురుమూర్తి రాయుడు.

మన్నెంకొండ 
    మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్నెంకొండ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి ప్రముఖ దైవం శ్రీ ఆంజనేయస్వామి.

సిరసనగండ్ల జాతర
    మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని చారగొండ సమీపంలోని సిరసనగండ్లలో శ్రీరామనవమి రోజున ఈ జాతర జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.

రంగాపూర్‌ (ఉమామహేశ్వరం)
    మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి నల్లమల అడవుల్లోని కొండలపై ఉమామహేశ్వర ఆలయం ఉంది. కొండ కింది భాగంలోని రంగాపూర్‌ గ్రామంలో హజ్రత్‌ నిరంజన్‌ షావలీ దర్గా ఉంటుంది. వారం రోజులపాటు సాగే ఈ జాతరలో భక్తులు కుల మతాలకు అతీతంగా పాల్గొనడం విశేషం.

సలేశ్వరం 
    మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని నల్లమల అడవుల్లో సలేశ్వర తీర్థం ఉంది. ఇక్కడ ఉండే స్థానిక చెంచుల ఆధ్వర్యంలో, ఏటా ఏప్రిల్‌లో చైత్ర పౌర్ణమికి ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు మొత్తం ఏడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. వీరి ప్రధాన దైవం శివుడు.

మల్దగల్‌ 
    మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దగల్‌లో తిమ్మప్ప జాతర జరుగుతుంది. వేంకటేశ్వరస్వామిని ఇక్కడి భక్తులు తిమ్మప్పగా కొలుస్తారు.

చేవెళ్ల  
    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఉత్సవాలు ప్రతి ఏడాది చైత్రమాసంలో జరుగుతాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో బ్రహ్మోత్సవం, రథోత్సవం ప్రధానమైనవి.

అమ్మపల్లి 
    రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నర్కుడ గ్రామ సమీపంలోని శ్రీ సీతారాముల ఆలయాన్ని ‘అమ్మపల్లి గుడి’గా పిలుస్తారు. ఏటా శ్రీరామనవమికి స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరుపుకుంటారు.

సిద్ధులగుట్ట
    రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కవ్వగూడా సమీపంలోని సిద్ధులగుట్టలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి ప్రధాన దైవమైన శివుడిని వెండికొండ సిద్ధేశ్వరుడిగా భక్తులు పిలుచుకుంటారు. ఏటా శివరాత్రి రోజుల్లో ఉత్సవాలు జరుగుతాయి.

బుర్నూరు జాతర
    ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో గోండుల దేవతలైన అకిపెణ్, ఆవులపెణ్, మాసోబాలను గ్రామ పొలిమేరల్లో నెలకొల్పారు. ఈ దేవతలను పూజిస్తూ గోండులు తమ కార్యక్రమాలను కొనసాగిస్తారు.

వేలాల 
    ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాల గ్రామంలో మహాశివరాత్రి రోజున జాతర నిర్వహిస్తారు. గోదావరి నదీ తీరంలో కొలువైన శివుడికి భక్తులు భజనలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు.

గూడెంగుట్ట
    ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట తాలూకాలోని గూడెం గ్రామంలో ఉన్న కొండపై కొలువైన సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.

తేగడ జాతర
    ఖమ్మం జిల్లా నూగూరు తాలూకా తేగడ గ్రామంలో భద్రకాళి, వీరభద్రుడి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవతలకు మాఘ బహుళ త్రయోదశి, చతుర్దశిలో కల్యాణం చేస్తారు. వీరభద్రస్వామి విగ్రహానికి గోదావరిలో స్నానం చేయించి, తిరిగి గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు.

నాగోబా జాతర
    ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉన్న నాగోబా దేవాలయంలో ఈ జాతర జరుగుతుంది. ‘నాగోబా’ గిరిజనుల ఆరాధ్య దైవం. పూర్వ కాలంలో గోండుల కుటుంబంలో జన్మించిన నాగోబా అద్భుతమైన మహిమల్ని ప్రదర్శించి కేస్లాపూర్‌ గ్రామానికి సమీపంలో ఉన్న పుట్టలోకి ప్రవేశించిందని చెబుతారు. అప్పటి నుంచి గోండులు ఆ పుట్టకు పూజలు చేస్తూ, అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. సర్పజాతిని పూజించడం ఈ జాతరలో ప్రత్యేకత. ఏటా పుష్య మాసం అమావాస్య రోజు నుంచి నాలుగు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. నాగోబా జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేసింది ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్న్‌ (1946).

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌