• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ పండుగలు - పర్వదినాలు

బోనాలు
    ఆషాఢమాసం మొదలవగానే తెలంగాణలో ఊరూరా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేది బోనాల పండుగ. శక్తి స్వరూపిణి మహంకాళి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో బోనం (భోజనం/ నైవేద్య) సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన మట్టికుండలో అమ్మవారి కోసం వండిన నైవేద్యాన్ని ఉంచి, ఆ కుండపై మూత పెడతారు. మూతలో దీపాన్ని వెలిగించి బాజాభజంత్రీలు, పోతరాజుల విన్యాసాలతో, ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించడమే బోనాల పండుగ.

ఉజ్జయిని మహంకాళి
    ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. సికింద్రాబాద్‌కు చెందిన సురటి అప్పయ్యకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్నప్పుడు కలరా సోకింది. తనను కాపాడమని మహంకాళి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు కరుణించడంతోనే ఆరోగ్యవంతుడయ్యాడు. దీనికి గుర్తుగా క్రీ.శ. 1815లో ఉజ్జయిని నుంచి మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘ఉజ్జయిని మహంకాళి’గా పూజలందుకుంటోంది. ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా, సంప్రదాయంగా, వారసత్వ పరంపరగా, ఆచారంగా కొనసాగుతోంది. జాతరలో రెండోరోజు పచ్చి మట్టికుండపై నిల్చుని ‘రంగం- భవిష్యవాణి’ వినిపించే కార్యక్రమం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు ‘లష్కర్‌ బోనాలు’గా ప్రసిద్ధిగాంచాయి.

గోల్కొండ ఎల్లమ్మ 
గోల్కొండ కోట నిర్మాణానికి ముందు యాదవులు ఆ కొండ మీద  గొర్రెలు, మేకలను మేపేవాళ్లు. అప్పటికే ఆ కొండ మీద అమ్మవారు కొలువైన గుడి ఉండటం వల్ల గొల్లలు మొక్కులు తీర్చుకుని, బోనాలు సమర్పించేవారు. కాలక్రమంలో ఈ కొండపై కాకతీయులు కోట నిర్మించడంతో, ఇది గోల్కొండగా మారింది. గోల్కొండ రాజ్యం కాకతీయుల తర్వాత బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. కుతుబ్‌షాహీల కాలం నుంచే గోల్కొండలోని అమ్మవారికి బోనాలు సమర్పించే సంబరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం ప్రారంభమైంది. గోల్కొండ ఎల్లమ్మ తల్లి ‘జగదాంబ’ మాతగా పూజలందుకుంటోంది.

లాల్‌దర్వాజా మహంకాళి 
    హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజాలో కొలువై ఉన్న మహంకాళి ‘సింహ వాహిని’గా భక్తులకు దర్శనమిస్తోంది. ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండలో, రెండోవారం సికింద్రాబాద్‌లో లష్కర్‌ బోనాల తర్వాత లాల్‌దర్వాజలో బోనాల ఉత్సవం నిర్వహిస్తారు.

ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం కొన్ని ఉత్సవాలను, ప్రముఖుల జయంతి రోజులను రాష్ట్ర ఉత్సవాలుగా అధికారికంగా ప్రకటించి, నిర్వహిస్తూ వస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014, జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో ఏటా ఆ రోజును రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రాజధాని, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలంగాణ పోరాట వీరులను సత్కరిస్తారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలను అందించిన వారికి ప్రశంసా పత్రాలు, అవార్డులు, రివార్డులను ప్రకటిస్తారు.

ఇంజినీర్స్‌ డే
హైదరాబాద్‌ నగరంలో ఉన్న పలు మంచినీటి జలాశయాల నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రఖ్యాత నిజాం ప్రభుత్వ ఇంజినీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌జంగ్‌ జయంతి రోజైన జులై 11ను 2014లో ప్రభుత్వం అధికారికంగా ఇంజనీర్స్‌ డేగా నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. 

దాశరథి జయంతి (జులై 22)
    పద్యాన్ని, కవిత్వాన్ని తన పదునైన ఆయుధంగా మలచుకుని,  నిజాం నిరంకుశత్వాన్ని గొంతెత్తి ఖండించిన పోరాటయోధుడు దాశరథి కృష్ణమాచార్య ‘మా నిజాము రాజు తరతరాల బూజు’ అన్నాడు. ‘ఓ  నిజాము పిశాచమా..’, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ జాతి ప్రజలను చైతన్యపరచిన దాశరథి కృష్ణమాచార్య జయంతిని ప్రభుత్వం 2014, జులై 22న అధికారికంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రళేఖరరావు స్వయంగా పాల్గొని దాశరథి పేరిట అవార్డును కూడా నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. 

చార్మినార్‌ అమ్మవారు
హైదరాబాద్‌లో మూసీ నదికి వరదలు తలెత్తాయి. చార్మినార్‌ పూర్తిగా మునిగిపోయే పరిస్థితుల్లో నవాబుకు కలలో కనిపించిన అమ్మవారు బంగారు చేటలో పసుపు, కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలను నదిలో విడిచిపెట్టినట్లయితే వరదలు తగ్గుతాయని చెప్పి అదృశ్యమైందట. అమ్మవారు చెప్పిన విధంగా పూజా ద్రవ్యాలతో ప్రార్థించగానే మూసీనది శాంతించి వరదలు తగ్గుముఖం పట్టాయని చెబుతారు. నాటి నుంచే చార్మినార్‌ అమ్మవారు మత సామరస్యానికి ప్రతీకగా  పూజలు అందుకుంటోంది. స్థానికులు ఇక్కడి అమ్మవారిని ‘భాగ్యలక్ష్మి’ దేవతగా ఆరాధిస్తారు. హైదరాబాద్‌ పాతబస్తీ బోనాల తర్వాత చివరి ఆదివారం నగర శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలో ఊరూరా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ... ఇలా పేరేదైనా ఆషాఢమాసం మొత్తం అమ్మవారికి బోనాల పండుగ నిర్వహించడం తెలంగాణలో శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.

బోనాలు - నేపథ్యం
ఇప్పుడు గోల్కొండ కోట ఉన్న స్థానంలో పూర్వం అంటే క్రీ.శ. 1143లో కాకతీయ సామ్రాజ్య చక్రవర్తులు ఒక మట్టికోటను నిర్మించారు. కోట నిర్మాణ సమయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, బోనం సమర్పించారు. అప్పటి నుంచే భాగ్యనగరంలో బోనాల పండుగ ప్రారంభమైందని ప్రతీతి. ప్రతాపరుద్రుడి తర్వాత గోల్కొండ రాజ్యాన్ని పాలించిన కుతుబ్‌షాహీ వంశీయులు కూడా బోనాల సంప్రదాయాన్ని గౌరవిస్తూ, హిందు-ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించే ఉత్సవంగా దీనికి ప్రాచుర్యాన్ని కల్పించారు. ఏటా ఆషాఢ మాసం తొలి ఆదివారం రోజు ప్రారంభమయ్యే బోనాలు నెల రోజులపాటు సాగుతాయి. మొదటగా గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ అమ్మవారి బోనాలతో ఈ పండుగ మొదలవుతుంది. గోల్కొండలోని బడా బజార్‌లో ఉండే ఆలయ పూజారి ఇంటి నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలు అమ్మవారికి మొక్కుల రూపంలో సమర్పించుకునే తొట్టెలు, ఫలహారం బండ్లు, ఘటాల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు, రంగం - భవిష్య వాణి మొదలైన విశేషాలతో ఆద్యంతం అంగరంగ వైభవంగా జరుగుతాయి.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌