• facebook
  • whatsapp
  • telegram

  తెలంగాణ ఉద్యమ వినూత్న నిరసనలు

స‌మ‌ర‌శీల పోరులో స‌క‌ల జ‌నం 


మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చడంలో తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో జరిగిన క్రియాశీలక నిరసనలే ప్రధాన కారణం. మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపై నిలిపి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమింపజేసిన ఈ వరుస కార్యక్రమాలు, వినూత్న నిరసనల తీరుతెన్నుల గురించి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అంతిమ ఘట్టానికి చేర్చిన ఈ ఘటనల వరుసక్రమాన్ని అభ్యర్థులు తేదీలతో సహా గుర్తుంచుకోవాలి. ఆయా నిరసనల్లో సకల జనుల భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అవి చూపిన ప్రభావం, అంతిమంగా ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లడంతో పరిస్థితులు రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన వైనాన్ని అర్థం చేసుకోవాలి.


శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. తెలంగాణ సమాజం భిన్న రీతుల్లో వినూత్న నిరసనలు తెలపడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. వీటన్నింటికీ కారణం కేంద్రం అనుసరించిన సాగదీత విధానాలే. కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ఏకాభిప్రాయ సాధన కావాలంటూ ఒకసారి, అసెంబ్లీ తీర్మానం కావాలంటూ మరోసారి ప్రకటనలు చేస్తూ తాత్సారం చేస్తోందని తెలంగాణ సమాజం గ్రహించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఇక్కడి ప్రజలు పలు రూపాల్లో నిరసనలు ప్రదర్శించారు. ఇవి దేశాన్నంతటినీ ఆలోచింపజేశాయి. దీంతో ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తప్పదనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది.


సహాయ నిరాకరణ ఉద్యమం: తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని 2011, ఫిబ్రవరి 17న ప్రారంభించి మార్చి 4 వరకు మొత్తం 16 రోజులపాటు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ స్తంభింపజేశారు. భారత స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ 1920లో నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇందుకు స్ఫూర్తి.


సహాయ నిరాకరణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు చేస్తారు. కానీ విధులు నిర్వర్తించకుండా నిరసన తెలియజేస్తారు. అంటే విద్యుత్తు బిల్లులు వసూలు చేయకపోవడం, ఇంటి పన్నులు, వ్యాట్‌ (అమ్మకం) పన్నులు, ఇతర అన్నిరకాల రాష్ట్ర పన్నులు వసూలు చేయకపోవడం; ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకోకుండా ప్రయాణించడం, రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలను నిర్వహించకపోవడం మొదలైనవి. ఈ ఉద్యమాన్ని కేంద్రంలో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల కాలంలో నిర్వహించడం రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. దీని ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ త్వరితగతిన ప్రారంభింపజేయడం. ఈ ఉద్యమాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించినప్పటికీ దీని షెడ్యూల్‌ను ఐకాస ఫిబ్రవరి 12నే ప్రకటించింది. 13న తెలంగాణ ప్రాంతమంతా గ్రామగ్రామాన చాటింపులు, ప్రతిఒక్కరితో దీక్షా కంకణం కట్టించడం, 14న శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, 15న జైల్‌ భరో, 16న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటన్నింటినీ ప్రజల సహకారంతో నిర్వహించి తెలంగాణలో ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేసింది. ప్రజలు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఘెరావ్‌ చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం రాజీనామా చేయాలంటూ నిలదీశారు. నాయకుల చావు డప్పులు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు నిత్యకృత్యమయ్యాయి.


తెలంగాణలోని సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు పెన్‌ డౌన్, కార్మికులు టూల్‌ డౌన్, ఉపాధ్యాయులు చాక్‌ డౌన్, కంప్యూటర్‌ ఆపరేటర్లు మౌస్‌ డౌన్‌ లాంటి కార్యక్రమాల ద్వారా నిరసనలు కొనసాగించడంతో తెలంగాణలో పరిపాలన స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులు, విద్యుత్తు బకాయిలు, రిజిస్ట్రేషన్‌ సుంకాలు లాంటివన్నీ కలిపి ఈ 16 రోజుల్లో దాదాపు రూ.12,800 కోట్ల ఆదాయం నిలిచిపోయింది.


ఈ ఉద్యమంలో ప్రైవేట్‌ వాణిజ్య సంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్ల యాజమాన్యాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్‌లు, రాస్తారోకోలు, పట్టణాల్లో ‘వాక్‌ ఫర్‌ తెలంగాణ’, గ్రామాల్లో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 1న నిర్వహించిన ‘పల్లెపల్లె పట్టాల పైకి’ అనే కార్యక్రమం ద్వారా రైల్‌ రోకో, రైల్‌ బంద్‌ నిర్వహించడంతో తెలంగాణ నుంచి నడిచే రైళ్లను ఇతర మార్గాలకు మళ్లించారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ఉద్ధృతి తెలిసింది. ‘పల్లె పల్లె పట్టాల పైకి’ కార్యక్రమ ఫలితంగా ఉత్తర, దక్షిణ భారతదేశానికి రైల్వే లింకు దాదాపు తెగిపోయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఫలితంగా రైల్వేకు చాలా నష్టం వాటిల్లింది. దక్షిణ మధ్య రైల్వేలోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగుల జేఏసీ ఏర్పాటై ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఈ ఉద్యమ కాలంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో, లోక్‌సభ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ (నేటీ బీఆర్‌ఎస్‌) సభ్యులు ప్రత్యేక రాష్ట్ర వాదనలను వినిపిస్తూ నిరసనలు తెలియజేశారు. 2011 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో 48 గంటలపాటు సంపూర్ణ తెలంగాణ బంద్‌ నిర్వహించారు. దీనికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు పూర్తి మద్దతు పలికాయి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్తు కేంద్రాలకు, సిమెంటు పరిశ్రమలకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. 23న తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు ముక్తకంఠంతో చేసిన జై తెలంగాణ నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. సహాయ నిరాకరణ ఉద్యమం ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు కొనసాగింది.


మిలియన్‌ మార్చ్‌ (2011, మార్చి 10): 


లక్ష్యం: మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రాంతం మీద గత 55 సంవత్సరాలుగా ఆంధ్రా పాలకులు కొనసాగిస్తున్న ఆధిపత్యానికి చరమగీతం పాడటం. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని 8వ అధ్యాయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి నిరసనగా తెలంగాణ ఉద్యమాన్ని క్రియాశీలకంగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్‌ 2011, మార్చి 10న హైదరాబాద్‌ దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. అయితే కేసీఆర్‌ ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉస్మానియా వర్సిటీ జేఏసీని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించారు. అయినప్పటికీ టీపీజేఏసీ, ఓయూ విద్యార్థి జేఎసీ, ఇతర జేఏసీలు కేసీఆర్‌ ప్రకటనకు మద్దతు తెలుపుతూనే ఆయన సూచించిన హైదరాబాద్‌ దిగ్బంధం అనే పేరుకు బదులుగా ‘మిలియన్‌ మార్చ్‌’ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల నుంచి ప్రజల చేతులకు మారింది.


మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమానికి స్ఫూర్తి: ఈజిప్టులో తెహిరీర్‌ స్క్వేర్‌ ఉద్యమం 2011, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు 18 రోజులపాటు జరిగింది. ఆ దేశాధినేత హోస్నీ ముబారక్‌ నిరంకుశ పాలన, పోలీసుల అకృత్యాలను నిరసిస్తూ కైరోలోని తెహిరీర్‌ స్క్వేర్‌లో లక్షలాది మంది చేసిన నిరసన కార్యక్రమమే మిలియన్‌ మార్చ్‌కు స్ఫూర్తినిచ్చింది. అయితే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్‌ మార్చ్‌ ఒక రోజు మాత్రమే జరిగింది. ఈ మార్చ్‌ ప్రధాన ఉద్దేశం ‘తెలంగాణ సాధన కోసం కృషి చేస్తాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించడం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ విజయవంతంగా నిర్వహించారు. వాస్తవానికి ‘మిలియన్‌ మార్చ్‌’ను మార్చి 10న ఉదయం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఆ రోజు ఇంటర్మీడియట్‌ పరీక్షల దృష్ట్యా, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు మార్చారు. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి హైదరాబాదుకు వచ్చే విద్యార్థులు, కార్యకర్తలను పోలీసులు ఆపి, వెనక్కి పంపారు. హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నిర్బంధాలన్నింటినీ అధిగమించి దాదాపు 50 వేల మంది ఉద్యమకారులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. విద్యార్థులు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించిన ఆంధ్రా లెజెండరీ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆంధ్రా పాలకుల ఆధిపత్యానికి చిహ్నంగా భావించి వాటిని ధ్వంసం చేశామని, అంతే తప్ప విగ్రహాలను కాదని ఉద్యమకారులు వివరణ ఇచ్చారు.


నోట్‌: 1986లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు తెలుగుజాతికి చెందిన 33 మంది మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠింపజేశారు. ఈ విగ్రహాల్లో 7 మాత్రమే తెలంగాణ ప్రముఖులవి కావడంతో ఉద్యమకారులు దీన్ని తెలంగాణపై వివక్షగా భావించారు. విగ్రహాలను ధ్వంసం చేసే దృశ్యాలను చిత్రీకరించే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అక్కడికి చేరుకున్న కొంతమంది కాంగ్రెస్‌ నాయకులపైనా దాడికి ప్రయత్నించారు.


ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ, తెలంగాణ జాగృతి మొదలైన సంఘాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేవరకు ట్యాంక్‌బండ్‌పై విరిగిన విగ్రహాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశాయి. విగ్రహాల ధ్వంసాన్ని తెలంగాణ నాయకులతో పాటు పలువురు నేతలు ఖండించారు. ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన అన్ని జేఏసీలు సంయుక్తంగా ‘స్వాభిమాన్‌ యాత్ర ర్యాలీ’ నిర్వహించాయి. విగ్రహాల ధ్వంసాన్ని నిరసించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని వెంటనే పునఃనిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వట్టి వసంతకుమార్, మహేందర్‌ రెడ్డి, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాద్, కె.జానారెడ్డి సభ్యులు. ఈ కమిటీ సూచనల మేరకు విరిగిన 16 విగ్రహాలతో పాటు తెలంగాణకు చెందిన కొమురం భీమ్‌ విగ్రహాన్ని కూడా 2012, అక్టోబరు 5న ప్రతిష్ఠించారు.


సకలజనుల సమ్మె (2011, సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకు 42 రోజులు): తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమకారులు చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం సకల జనుల సమ్మె. తెలంగాణలోని అన్నివర్గాల ఆకాంక్షను ఈ సమ్మె ప్రతిబింబించింది. దీన్ని 42 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. సకల జనుల సమ్మె ప్రారంభానికి ఒక రోజు ముందుగా సెప్టెంబరు 12న కరీంనగర్‌లో ‘జనగర్జన’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్‌తో పాటు తెలంగాణ జేఏసీ, బీజేపీ, న్యూ డెమోక్రసీ నాయకులు హాజరై మరుసటి రోజు (సెప్టెంబరు 13) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా ‘సకలం బంద్‌’ సమ్మె ఆరంభమైంది. ఈ సమ్మెలో తెలంగాణ ప్రజలంతా చీమల దండుగా కదిలి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారు. సమ్మెలో భాగంగా రాస్తారోకోలు, రైల్‌రోకోలు, మానవహారాలు, ర్యాలీలతో తెలంగాణ దద్దరిల్లింది. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. విద్యార్థులు రోడ్లు ఎక్కారు. ఉద్యోగులు, న్యాయవాదులు విధులు బహిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. సింగరేణి పూర్తిగా స్తంభించింది. హైదరాబాదు మినహా మిగిలిన తెలంగాణ జిల్లాలన్నింటిలో ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. ఈ సమ్మెలో అటెండర్ల నుంచి అధికారుల వరకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్‌టీసీ, విద్యుత్తుశాఖ, సింగరేణి గని కార్మికులు; విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, రైతులు, రాజకీయ పార్టీల నాయకులు మొత్తం పౌరసమాజం అంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. రైతులు ట్రాక్టర్‌ ర్యాలీలు, మహిళలు బతుకమ్మ, బోనాలు; గీత కార్మికులు మోకు ర్యాలీలు; కుమ్మరులు కుండలతో ర్యాలీలు, ఆటోడ్రైవర్లు ఆటో ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలను బహిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సమ్మెను అణచివేయడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, నిలువరించలేకపోయింది. ఈ సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి చేర్చి, 2011 అక్టోబరు 24న ముగిసింది.


సాగర హారం (2012 సెప్టెంబరు 30): దీనిని తెలంగాణ మార్చ్‌ అని కూడా అంటారు. హుస్సేన్‌సాగర్‌ - నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత 30న సాయంత్రం 3 నుంచి 7 గంటల మధ్య నాలుగు గంటల పాటు నిర్వహించుకొనేందుకు అనుమతినిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ జేఏసీ నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుంది. ఈ సందర్భంగా స్థానిక రైళ్లను నిలిపేయడంతో పాటు ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే బస్సులను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో నిషేదాజ్ఞలను నాటి ప్రభుత్వం విధించింది. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను క్యాంపస్‌ నుంచి బయటికి రాకుండా కట్టడి చేసింది. పోలీసులు ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు వేశారు. ఇన్ని నిర్బంధాలను ఛేదించి ఉద్యమకారులు పెద్దసంఖ్యలో మధ్యాహ్నం 2 గంటలకే నెక్లెస్‌ రోడ్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులను ప్రేరేపించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అనుమతి ముగిశాక కూడా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని అర్ధరాత్రి వరకు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. కానీ, వర్షం కారణంగా చెదిరిపోయారు.


సమరదీక్ష (2013 జనవరి 25): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ ఐకాస 2013 జనవరి 25 నుంచి 36 గంటలపాటు ఇందిరా పార్కులో సమర దీక్ష చేయాలని నిర్ణయించగా, దీనిని పోలీసులు ముందు అనుమతించలేదు. ఆ తర్వాత జనవరి 27, 28 తేదీల్లో అనుమతించడంతో నిర్వహించారు.


చలో అసెంబ్లీ (2013 జూన్‌ 13): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని రాజకీయ ఐకాస పిలుపు మేరకు 2013, జూన్‌ 13న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ విధంగా తెలంగాణ ప్రజలంతా కదం తొక్కడంతో ఉద్యమం పతాకస్థాయికి చేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు దారితీసింది.

రచయిత: ఎ.ఎం.రెడ్డి


 

 

Posted Date : 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌