• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం-పరిచయం

పర్యావరణ అంశాలు (Components of the Environment)

* పర్యావరణ అంశాలను సహజ, మానవ, మానవ నిర్మిత అంశాలు అనే మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.

సహజ పర్యావరణం 

సహజ పర్యావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువుల లాంటి జీవులు ఉంటాయి.పర్యావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి. 

1. శిలావరణం     2. జలావరణం   3. వాతావరణం     4. జీవావరణం 

* వీటిని భూమి సహజ ఆవరణాలు అంటారు.

శిలావరణం (Lithosphere) :

Litho(లిథో),Sphaira(స్పైరా) అనేవి గ్రీకు పదాలు. ఈ భాషలో లిథో అంటే రాయి, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం.

* భూమి రాతి పొరను శిలావరణం అంటారు. 

* ఇది రాళ్లు, ఖనిజాలతో రూపొంది, పలుచని మట్టి పొరతో కప్పి ఉంటుంది. 

*పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు, వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం.

శిలావరణాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి.

i. భూపటలం (crust)

ii. భూప్రావారం (mantle)

iii. భూకేంద్రం (core)
భూపటలం: మనం నివసిస్తూ ఉన్న భూమి బయటి పొరను భూపటలం అంటారు. 

* ఈ పొర భూఉపరితలం నుంచి 30100 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. 

* భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్‌.

* ఈ పటలంలో ఉండే మూలకాలు (శాతాల్లో)

1. ఆక్సిజన్‌ - 49%                  2.సిలికాన్‌ - 26.03% 

3. అల్యూమినియం - 7.28%      4. ఐరన్‌ - 4.12%

* భూపటల మందం పర్వతాల్లో ఎక్కువగా, సముద్ర ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.

* అత్యధికంగా ఉండే లోహ మూలకం - అల్యూమినియం.

* ఉపరితల పొర నుంచి సమస్త జీవులకు కావాల్సిన పోషక పదార్థాలు లభ్యమవుతాయి.

* దీని సాంద్రత 2.27 గ్రా/ఘ.సెం.మీ.

భూప్రావారం: ఈ పొర భూమి లోపల 100 కి.మీ నుంచి 2900 కి.మీ. వరకు ఉంటుంది. భూప్రావారంలో పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై పైపొర తేలుతూ ఉంటుంది.

* దీని సాంద్రత 3.2 గ్రా/ఘ.సెం.మీ.

* భూప్రావారం ద్రవ, ఘన స్థితిలో కాకుండా కొల్లాయిడ్‌ రూపంలో ఉంటుంది.

* ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియం(Mg) అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. 

* దీని రసాయన సాంకేతిక నామం సిమా(sima)

* భూకంపాలు భూప్రావారం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి.

భూకేంద్ర మండలం:  ఇది భూమి లోపల 2900 కి.మీ. నుంచి 6376 కి.మీ. వరకు ఉంటుంది.

*ఈ పొరలో ప్రధానంగా నికెల్‌ (Ni), ఫెర్రస్‌ (Fe)లేదా ఇనుము లాంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. దీని రసాయన సాంకేతిక నామం నిఫె (Nife).

* దీన్ని తిరిగి రెండు ఉప పొరలుగా విభజించవచ్చు.

అవి : 1) బయటి కేంద్ర భాగం      2) లోపలి కేంద్ర భాగం

* బయటి కేంద్ర భాగం 2900 కి.మీ. నుంచి 5100 కి.మీ. వరకు ఉంటుంది. ఈ పొరలో ఇనుము, నికెల్‌ లాంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి.

*లోపలి కేంద్ర భాగం 5100 కి.మీ. నుంచి 6376 కి.మీ. వరకు ఘన రూపంలో విస్తరించి ఉంటుంది. ఈ పొరలో ఇనుము లోహ మిశ్రమాలు, బంగారం లాంటి భార పదార్థాలు ఉంటాయి.

* భూమి ఘనపరిమాణంలో భూపటలం 1% మాత్రమే. భూప్రావారం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటాయి.

*భూకేంద్ర మండలం సాంద్రత 12 గ్రా/ ఘ.సెం.మీ.

* భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 60000C గా ఉంటుంది.

* వ్యవసాయం, మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. 

* శిలావరణ పలుచటి నేలపొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది. మనకు ఆహారాన్ని అందిస్తుంది.

* శిలావరణం రాతిపొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

వాతావరణం (Atmosphere):

గ్రీకు భాషలో అట్మాస్‌ అంటే ఆవిరి (Vapour).

* భూమి చుట్టూ ఉన్న గాలి పలుచటి పొరను వాతావరణం అంటారు. ఇది భూఉపరితలం నుంచి సుమారు 600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది.

*వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. నైట్రోజన్‌(78%), ఆక్సిజన్‌(21%), కార్బన్‌డైఆక్సైడ్‌(0.03%), ఆర్గాన్‌(0.93%)ఇతర వాయువులు(0.04%) ఉంటాయి. ఇందులో ఆక్సిజన్‌ ప్రాణవాయువు.

* భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావాల్సిన అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర వహిస్తుంది.

* వాతావరణాన్ని సాధారణంగా భూఉపరితలం నుంచి అయిదు పొరలుగా విభజించారు.

అవి: 1. ట్రోపో ఆవరణం        2. స్ట్రాటో ఆవరణం        3. మీసో ఆవరణం  

         4. థర్మో ఆవరణం       5. ఎక్సో ఆవరణం

* వాతావరణ పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు లేదు.

* కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలకు కార్బన్‌డైఆక్సైడ్‌ సహాయపడుతుంది.

* సూర్యుడి హానికరమైన కిరణాలు, తీవ్రమైన వేడి నుంచి వాతావరణం మనల్ని రక్షిస్తుంది.

* వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ధూళి కణాలు మేఘాలను ఏర్పర్చి వర్షాలు పడేలా చేస్తాయి.

జీవావరణం (Biosphere):

* గ్రీకు భాషలో బయోస్‌ అంటే జీవం.

*భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతిని జీవావరణం అంటారు.

*జీవావరణం భూఉపరితలం నుంచి సుమారు 200 మీటర్ల లోతు వరకు, భూఉపరితల వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది.

* జీవావరణంతో మిగిలిన భౌతిక ఆవరణాలైన జలావరణం, శిలావరణం, వాతావరణం ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటాయి.

* భూమి ప్రత్యేక సహజ ఆవరణంగా జీవావరణాన్ని పరిగణిస్తారు.

* ప్రతి సంవత్సరం ఓజోన్‌ దినోత్సవాన్ని సెప్టెంబరు 16న నిర్వహిస్తారు.

* ఏటా ప్రపంచ జల దినోత్సవాన్ని (World water day) మార్చి 22న జరుపుకుంటారు.

* ప్రతి సంవత్సరం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని (World earth day) ఏప్రిల్‌ 22న నిర్వహిస్తారు.

జలావరణం (Hydrosphere):
హైడ్రోస్పియర్‌ అనే పదం హైడర్‌(Hydro),  స్పైరా (sphaira) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. గ్రీకు భాషలో హైడర్‌ అంటే నీరు. 

* భూమి ఉపరితలంలోని అన్ని నీటి వనరులను సమష్టిగా జలావరణం అంటారు. 

* నీరు సమృద్ధిగా ఉన్న ఏకైక గ్రహం భూమి. అందుకే దీన్ని జలయుత గ్రహం (water planet) అంటారు.

*మన గ్రహం మీద జీవం ఉనికి ప్రధానంగా నీరు, గాలిపైనే ఆధారపడి ఉంది. 

*భూమి ఉపరితలం సుమారు 2/3వ వంతు నీటితో ఆవరించి ఉంది. కానీ కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పునీరు తదితర రూపాల్లో ఉంటుంది.

జలచక్రం/జలవలయం (water cycle):

నీరు తేమ రూపంలో వాతావరణంలో చేరి, తర్వాత వర్షం/వడగళ్లు/మంచు రూపాల్లో తిరిగి భూమిని చేరే ప్రక్రియను జలవలయం అంటారు.

* నీటి చక్రాన్ని గణిత రూపంలో కింది విధంగా తెలియజేస్తారు.
వర్షపాతం = ఉపరితలంపై వాన నీటి ప్రవాహం + నీరు ఆవిరి కావడం, బాష్పోత్సేకం.

జలచక్రంలో ఆరు దశలు ఉంటాయి.

అవి: 1. బాష్పీభవనం     2. రవాణా        3. ద్రవీభవనం     

4. అవపాతం     5. ఉపరితల ప్రవాహం    6. భూగర్భ జలం

* ప్రధానంగా జలావరణాన్ని కార్బన్‌ సింక్‌ అంటారు.

* జలావరణం భూగోళ ఉష్ణోగ్రతలను క్రమపరుస్తుంది.

పర్యావరణంలోని అంశాలు


 

Posted Date : 11-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌