• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను అభివృద్ధి పేరుతో ఎన్నో దేశాలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాయి. స్వార్థం, తాత్కాలిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీని పర్యవసానంగా పర్యావరణ క్షీణత, భూతాపం పెరిగిపోయి సమస్త మానవాళి దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చేదే అసలైన అభివృద్ధి అన్న స్పృహ ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. వనరులను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, ఆధునిక పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు, జీవన నాణ్యతను పెంచే పరిణామాలను తెలుసుకోవాలి.

 

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చే విధంగా, వాటిని వివేకవంతంగా (జ్యుడీషియస్‌ యుటిలైజేషన్‌) వినియోగిస్తూ సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. అంటే భావితరాల అవసరాలను విస్మరించకుండా ఇప్పటి అభివృద్ధి ఉండాలని అర్థం. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు. పర్యావరణ సంరక్షణతో కూడిన వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను ఏర్పరిచి అభివృద్ధి కొనసాగిస్తే నిజమైన సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు; వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరంగా మారింది. సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశుసంపదలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవడానికి పర్యావరణానికి హాని చేసే రసాయనిక పురుగు మందులు, ఎరువులు, జన్యుమార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్లను ఇటీవల ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన జీవ ఎరువులను వినియోగించి చేసే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ‘సర్‌ ఆల్బర్ట్‌ హూవార్డ్‌’ని పిలుస్తారు. మన దేశంలో సిక్కింను మొదటి సేంద్రియ వ్యవసాయ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) రాష్ట్రంగా ప్రకటించారు. ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సంస్థ’ను స్థాపించారు.


జీవ ఎరువులు: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు, వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అంటారు. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో సహజీవనం చేస్తూ పంటకు కావాల్సిన అనేక పోషకాలను అందజేస్తాయి. వీటిలో పలు రకాలున్నాయి.


ఉదా: 

* జనుము, సుబాబుల్‌ చెట్ల ఆకులు, కొమ్మలను ఎరువుగా వాడుకునే హరిత ఎరువు.

 * నాస్టాక్, అనబీనా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు. 

* వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం, స్వేచ్ఛాయుత నత్రజని స్థాపన జరిపే అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాలు.

* ఎత్తయిన మొక్కల వేర్లపై పెరిగి భూమి నుంచి ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాపర్, జింక్, ఇనుము లాంటి పోషకాలను మొక్కలకు అందించే శిలీంధ్రాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి.

* వరి పంట పొలాల్లో జీవ ఎరువుగా వాడే మొక్క ‘అజొల్లా లేదా టెరిడోఫైట్‌’.


జీవ క్రిమిసంహారాలు: పర్యావరణానికి హానిచేసే రసాయన క్రిమిసంహారాల స్థానంలో పర్యావరణ అనుకూల క్రిమిసంహారాలను వినియోగించడాన్ని జీవ క్రిమిసంహారాలు అంటారు. పంట మొక్కలు, ఉత్పత్తులను నష్టపరిచే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టే క్రిమిసంహారిణులను; మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు లాంటి ప్రకృతిపరమైన వాటి నుంచి తీసే ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలు అంటారు.


ఉదా: పత్తి పంటను నష్టపరిచే బోల్‌వార్మ్‌ నివారణకు వాడే బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, బావేరియా బాసియానా, ట్రైకోడెర్మా లాంటి శిలీంధ్రాలు; కలుపు మొక్కల నివారిణిగా ఉపయోగించే యూకలిప్టస్‌ నూనె, టమాట పంటలో కీటక నాశినిగా ఉపయోగించే లెగ్యూమ్‌ జాతి మొక్కల వేర్ల నుంచి తయారుచేసిన రొటెనాన్‌ లాంటి ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలుగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, బయోమాగ్నిఫికేషన్‌ జరగదు.


పునరుత్పాదక ఇంధన వనరులు: వాడేకొద్దీ తిరిగి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉన్న కాలుష్య రహితమైన ఇంధన వనరులను పునరుత్పత్తి ఇంధన వనరులు అంటారు. కాలుష్య కారకాలైన బొగ్గు, పెట్రోలియం, షెల్‌ గ్యాస్‌ లాంటి సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలలశక్తి, సముద్ర పోటు-పాట్ల శక్తి, భూతాప శక్తి, హైడ్రోజన్‌ ఇంధనశక్తి లాంటివి వినియోగించడం పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది.


జీవ ఇంధనాల వాడకం: ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరాభివృద్ధిని పెంపొందించేవి జీవ ఇంధన వనరులు. జీవ వ్యర్థాలను నేరుగా మండించడం లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా శక్తిని పొందే వనరులను జీవ ఇంధనాలు అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పశుసంపద భారతదేశంలోనే ఉండటం, ప్రధానంగా వ్యవసాయ దేశం కావడంతో జీవ ఇంధనాల ఉత్పత్తికి కావాల్సిన జీవ వ్యర్థాలు బాగా లభిస్తాయి. భారత ప్రభుత్వం 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించింది.


ఎ) బయోగ్యాస్‌: పశువుల పేడను ఆక్సిజన్‌ రహితంగా కుళ్లబెట్టడం లేదా పట్టణ, చెట్ల వ్యర్థాలను మిథనోమోనాస్, మిథనోకోకస్‌ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయోగ్యాస్‌ను తయారుచేస్తారు. ఇది 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లతో ఉంటుంది.


బి) బయో డీజిల్‌: జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ లాంటి మొక్కల విత్తనాల నుంచి తీసిన నూనెలను ఆల్కహాల్‌ లేదా ఆమ్లాలను ఉపయోగించి చర్యనొందించే ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా జీవ ఇంధనాన్ని తయారుచేస్తారు. దీన్ని డీజిల్‌తో కలిపి బయోడీజిల్‌గా వినియోగించడం వల్ల పర్యావరణ మిత్రుడిగా మారుతుంది.


సి) బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌ కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న లాంటి వాటి నుంచి గ్రహించిన గ్లూకోజ్‌కు ఈస్ట్‌ కలిపి కిణ్వన ప్రక్రియ (మురగబెట్టడం)కు గురిచేస్తే బయో ఇథనాల్‌ తయారవుతుంది. దీన్ని పెట్రోల్‌తో కలిపి బయోపెట్రోల్‌గా వాడొచ్చు. భారత ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలిపి విజయం సాధించింది. 2030 నాటికి 20% ఇథనాల్‌ కలపాలని నిర్ణయించింది.


డి) బయో బ్యుటనాల్‌: బయో ఇథనాల్‌ మాదిరిగా చెరకు లేదా మొక్కజొన్న మొలాసిన్‌ను క్లాస్ట్రీడియం ఎసిటోబ్యుటలికం అనే బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఎసిటో బ్యుటనాల్‌ ఏర్పడుతుంది. దీన్ని గృహ సంబంధ అవసరాలు, ఇంటర్నల్‌ ఇంజిన్‌ కంబుషన్‌లో వాడవచ్చు. 


ఇ) బయో హైడ్రోజన్‌ గ్యాస్‌: బయోమాస్‌ను హైడ్రోజోనోమోనాస్‌ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేసినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది. దీన్ని రాకెట్ల ఇంధనంగా, వాహనాలు నడవడానికి ఉపయోగపడే హైడ్రోజన్‌ బ్యాటరీలోనూ వాడవచ్చు.


హరిత నగరాలు: పునరుద్ధరించదగిన కార్బన్‌ రహిత శక్తి వనరులను వినియోగించడం, ప్రత్యేకమైన, వ్యవస్థీకృత వనరులు వినియోగించగలిగేలా రహదారులు ఉండటం, పరిశ్రమలకు దూరంగా, వృక్ష సహిత నగరాలను నిర్మించడం నవీన పట్టణ అభివృద్ధికి సూచిక. ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణంగా 2008లో అబుదాబిలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేశారు.


జాతీయ పర్యావరణ విధానం: భారతదేశం జాతీయ పర్యావరణ విధానాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా 2006లో ప్రకటించింది. సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆవరణ పరిమితులు తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించడం జాతీయ పర్యావరణ విధాన ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టుల్లో పర్యావరణ అంశాలను చేర్చి ఆర్థిక, సాంఘిక అభివృద్ధిని సాధించడం; జీవనోపాధికి పర్యావరణంపై ఆధారపడే పేదలకు పర్యావరణ వనరులు అందుబాటులో ఉండేలా సహజ వనరులను సంరక్షించడం; జీవనానికి ఆధారమైన సంక్షేమానికి దోహదపడే ఆవరణ వ్యవస్థను సంరక్షించడం.. లాంటి ముఖ్య ఉద్దేశాలతో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించారు.


ఎకో ఎఫీషియన్సీ: ‘వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ ఎకో ఎఫీషియన్సీని నిర్వచించింది. జీవన నాణ్యతను పెంచుతూ, మానవ అవసరాలను తీరుస్తూ, వస్తుసేవలను అందించే పోటీదారులను సమాజానికి అందించడమే ఎకో ఎఫీషియన్సీ. దీనిలో పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ, సహజవనరులు నాశనం కాకుండా చూస్తూ, వ్యర్థాలను భూమి శోషించుకునే శక్తి నిర్వహించేలా ప్రణాళికలు ఉండాలి.


గ్రీన్‌ జీడీపీ: పారిశ్రామిక వృద్ధి స్థూల దేశీయోత్పత్తిని పెంచుతున్నప్పటికీ పర్యావరణానికి నష్టం చేస్తోంది. పర్యావరణ క్షీణత పారిశ్రామిక ప్రక్రియ, సహజ వనరుల సేకరణ, వ్యవసాయోత్పత్తులను పెంచడం, పారిశ్రామిక వస్తువుల వినియోగంలో అనేక విధాలుగా అంతర్లీనంగా తిరిగి మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. సంప్రదాయ జీడీపీ పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సంప్రదాయ జీడీపీని పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేస్తే గ్రీన్‌ జీడీపీ వస్తుంది.


గ్రీన్‌ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) = సంప్రదాయ జీడీపీ - ఎన్విరాన్‌మెంటల్‌ (లేదా) ఎకలాజికల్‌ కాస్ట్‌


పర్యావరణ వనరుల నష్టం, పర్యావరణ నష్టాన్ని నిరోధించడానికి, నష్టపోయిన వనరుల పునరుద్ధరణకు, పర్యావరణాన్ని నిర్వహించడానికి చేసే వ్యయం ఎన్విరాన్‌మెంటల్‌ కాస్ట్‌లో ఇమిడి ఉంటుంది. 2006లో చైనా ప్రభుత్వం గ్రీన్‌ జీడీపీని ప్రకటించింది. గాలి, నీరు, ఘనపదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం; సహజ వనరుల క్షీణత కారణంగా కలిగిన వ్యయాన్ని తీసుకుని దీన్ని గణించింది.


భారత ప్రణాళికా సంఘం గ్రీన్‌ నేషనల్‌ ఎకౌంట్‌ను తయారుచేయడానికి ప్రొఫెసర్‌ పార్థదాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జాతీయ వనరులపై రుణాత్మక ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుని జాతీయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సహజ, మానవ, భౌతిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రగతిని అంచనా వేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేసింది. భారతదేశం గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగుతోంది. 1991లో స్థాపితమైన ఈ సంస్థకు 183 దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ నిధులను ప్రపంచ పర్యావరణ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు అందిస్తున్నారు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌