• facebook
  • whatsapp
  • telegram

జీవ ఇంధనాలపై జాతీయ విధానం  

సుస్థిర భవితకు సురక్షిత శక్తివనరులు!
 

జీవ ద్రవ్యాల నుంచి జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. జంతు అవశేషాలతో సుదీర్ఘకాలంలో తయారయ్యే శిలాజ ఇంధనాల వినియోగంతో పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిపోతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఉత్పత్తులు, వ్యర్థాలతో తక్కువ కాలంలోనే సులభంగా తయారయ్యే జీవ ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అవి సుస్థిర ప్రగతికి బాటలు వేసే సురక్షిత శక్తి వనరులు. ప్రకృతిహితంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్న వాటి వినియోగం దేశంలో జరుగుతున్న తీరు, అందులో వస్తున్న ఆధునిక పరిణామాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జీవ ఇంధనాల ఉత్పత్తి, వినియోగం పెంచే విధంగా రూపొందిన జాతీయ విధానంలోని ముఖ్యాంశాలు, ఆశిస్తున్న ప్రయోజనాలు, లక్ష్యాల గురించి  తెలుసుకోవాలి.

జీవ ఇంధనాలు: తక్కువ వ్యవధిలో (రోజులు, వారాలు లేదా నెలలు) సేంద్రియ పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన హైడ్రోకార్బన్‌ ఇంధనాన్ని జీవఇంధనంగా పరిగణిస్తారు. ఇవి ఘన, ద్రవ లేదా వాయు స్వభావం కలిగి ఉండొచ్చు. 

ద్రవ ఇంధనాలు: బయోఇథనాల్, బయోడీజిల్‌.

ఘన ఇంధనాలు: వీటిని చెక్క, ఎండిన మొక్క పదార్థాలు, పేడతో తయారు   చేస్తారు.

వాయు ఇంధనాలు: బయోగ్యాస్‌

మొక్కల విత్తనాల నుంచి సంగ్రహించిన నూనెను పలు రసాయనిక మార్పులకు గురిచేయడం ద్వారా జీవ ఇంధనాలను తయారు చేస్తారు. ఇందుకు అవసరమయ్యే మొక్కలను పెద్ద మొత్తంలో సాగుచేయడం ద్వారా, శిలాజ ఇంధనాలకు బదులుగా జీవ ఇంధనాల వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరగదు. భవిష్యత్తు తరాలకు ఇంధన భద్రతను అందించవచ్చు. జీవఇంధనాలను సాధారణంగా రెండు వర్గాలుగా వర్గీకరిస్తారు.

మొదటితరం జీవ ఇంధనాలు: వీటిని చక్కెర, పిండిపదార్థం, కూరగాయల నూనె లేదా జంతువుల కొవ్వుల నుంచి సంప్రదాయ సాంకేతికతను ఉపయోగించి తయారుచేస్తారు. సాధారణ మొదటితరం జీవ ఇంధనాల్లో బయో ఆల్కహాల్స్, బయోడీజిల్, వెజిటెబుల్‌ ఆయిల్, బయో - ఈథర్స్, బయోగ్యాస్‌ ఉన్నాయి.

రెండోతరం జీవఇంధనాలు: ఇవి సెల్యులోనిక్‌ జీవ ఇంధనాలు. ఇవి ఆహార పంటల వ్యర్థాలు (గోధుమ, మొక్కజొన్న కాండాలు, కలప), ఆహారేతర పంటల నుంచి ఉత్పత్తి అవుతాయి. బయో హైడ్రోజన్, బయోఇథనాల్‌ లాంటి   అధునాతన జీవఇంధనాలు వీటికి   ఉదాహరణలు.

భారతదేశంలో జీవ ఇంధనాల  పరిణామం:

1975 - పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభమైంది. ఇందుకోసం ఆరు సాంకేతిక కమిటీలు, నాలుగు అధ్యయన బృందాలను ఏర్పాటు చేశారు.

2002 - తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌లో 5% ఇథనాల్‌ కలపడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీవఇంధనాల  అభివృద్ధిపై కమిటీ ఏర్పాటైంది.

2003 - పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం, జట్రోఫా మొక్కల పెంపకం ఆధారంగా బయోడీజిల్‌పై జాతీయ మిషన్‌ను ప్రారంభించడం లాంటి  కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

2004 - మొలాసిస్‌ ఫీడ్‌స్టాక్‌ సరఫరాలో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌లో ఇథనాల్‌ను తప్పనిసరిగా కలపడాన్ని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2005 - చమురు కంపెనీల ఇథనాల్‌ కొనుగోలు ధర లీటరుకు రూ.18.25గా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2006 - ప్రభుత్వం బయోడీజిల్‌ కొనుగోలు విధానాన్ని వెల్లడించింది చమురు కంపెనీల కొనుగోలు ధర లీటరుకు రూ.25గా ప్రకటించింది.

2007 - జాతీయ జీవఇంధనాల ముసాయిదా విధానం వెలుగులోకి వచ్చింది. పొంగామియా, జట్రోఫా మొక్కలపై ప్రత్యేక  దృష్టి సారించే జీవఇంధన మిషన్‌ను ప్రారంభించారు. 2009 - జాతీయ    జీవ ఇంధన విధానం ప్రారంభమైంది.

జీవ ఇంధనాలపై జాతీయ విధానం - 2009

దేశంలో జీవ ఇంధనాలను ప్రోత్సహించడానికి 2009లో నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని రూపొందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఇంధన దిగుమతులు తగ్గించడం, స్థానిక ఉపాధి కల్పించడం దీని లక్ష్యం.

ముఖ్యమైన అంశాలు: వ్యర్థ/క్షీణించిన భూముల్లో ‘నాన్‌-ఎడిబుల్‌’ నూనెగింజల నుంచి బయోడీజిల్‌ ఉత్పత్తి చేపడతారు. 2017 నాటికి బయోడీజిల్, బయో ఇథనాల్‌ రెండింటిని 20% మేర సాధారణ ఇంధనాలకు కలపాలనే లక్ష్యాన్ని ప్రతిపాదించారు. సాగుదారులకు సరసమైన ధరలు అందించడానికి కాలానుగుణంగా సవరణలతో ‘నాన్‌ - ఎడిబుల్‌’ నూనెగింజలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తారు. బయో ఇథనాల్, బయో డీజిల్‌ కొనుగోలు కోసం కనీస కొనుగోలు ధరను కాలానుగుణ సవరణలతో వెల్లడిస్తారు. రెండోతరం జీవ ఇంధనాలతో తోటల పెంపకం, ప్రాసెసింగ్, బయో-ఇంధనాల ఉత్పత్తిపై దృష్టి సారించి పరిశోధన, అభివృద్ధి, ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తారు. రెండోతరం జీవ ఇంధనాల కోసం రాయితీలు, గ్రాంట్లతో సహా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు. అవసరమైతే జాతీయ జీవ - ఇంధన నిధి ఏర్పాటు చేస్తారు. ఇందుకు మార్గదర్శకత్వం, సమన్వయం కోసం ప్రధానమంత్రి నేతృత్వంలో జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. పాలసీ అమలును పర్యవేక్షించేందుకు కేబినెట్‌ సెక్రటరీ అధ్యక్షతన బయోడీజిల్‌ స్టీరింగ్‌ కమిటీని నియమిస్తారు. 2030 నాటికి శిలాజ ఆధారిత ఇంధనాల్లో 20% జీవ ఇంధనాలను కలపాలన్నది ఈ విధానం లక్ష్యం. దాని ప్రకారం జీవ ఇంధనాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

ప్రాథమిక జీవ ఇంధనాలు: ఇవి మొదటి తరాని 1G కి చెందినవి. 

ఉదా: బయో ఇథనాల్, బయోడీజిల్‌ 

అధునాతన జీవ ఇంధనాలు: రెండో తరాని 2G కి చెందినవి. 

ఉదా: ఇథనాల్, మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్, డ్రాప్‌ ఇన్‌ ఇంధనాలు.

మూడో తరం జీవ ఇంధనాలు: ఉదా: బయో - సీఎన్‌జీ

* ఇథనాల్‌ ఉత్పత్తి కోసం చెరకు రసం, ముల్లంగి, వేప, జొన్నతోపాటు మొక్కజొన్న, దుంపలు సహా పాడైపోయిన గోధుమ, మద్యం, బియ్యం, చెడిపోయిన బంగాళాదుంప లాంటి వాటి నుంచి తయారైన పిండి తదితర మానవ వినియోగానికి పనికిరాని వాటిని ముడి పదార్థాలుగా వినియోగించే విధంగా ఈ విధానం వీలు కల్పిస్తుంది.

 * దేశంలో ఆహారధాన్యాల మిగులు సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర సమస్య తలెత్తుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీ అనుమతితో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ ఉత్పత్తి చేసేందుకు మిగులు ఆహార ధాన్యాలను వినియోగించుకోవడానికి ఈ జాతీయ విధానం దోహదం చేస్తుంది.

* ఆధునిక జీవ ఇంధనాలకు ప్రాధాన్యమిస్తూ రాబోయే ఆరేళ్లలో రెండోతరం ఇథనాల్‌ జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలకు స్వయంసామర్థ్య సిద్ధి నిధి పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయించాలని ఈ విధానం ప్రతిపాదిస్తోంది.

* బయోడీజిల్‌ ఉత్పాదన కోసం చమురు గింజలు, వాడేసిన వంట నూనె, స్వల్ప వ్యవధిలో ఫలసాయమిచ్చే పంటల ముడిపదార్థాల సరఫరా గొలుసు ఏర్పాటును ఈ విధానం ప్రోత్సహిస్తుంది.

* జీవఇంధనాలకు సంబంధించి సమష్టి కృషి దిశగా అన్ని మంత్రిత్వశాఖ/విభాగాల పాత్ర, బాధ్యతలను ఈ విధాన పత్రంలో పొందుపరిచారు.

ఆశిస్తున్న ఫలితాలు:

దిగుమతుల తగ్గుదల: ప్రస్తుత ధరల ప్రకారం కోటి లీటర్ల ని10 ఇంధనంతో రూ.28 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈ మేరకు 2017-18 ఇథనాల్‌ సరఫరా సంవత్సరంలో 150 కోట్ల లీటర్ల మేర సరఫరా ఉంటుందని, తద్వారా రూ.150 కోట్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా.

పర్యావరణ రక్షణ: కోటి లీటర్ల ని10 (10% ఇథనాల్‌ + 90% పెట్రోల్‌) ఇంధనం ఉత్పత్తి ద్వారా సుమారు 20 వేల టన్నుల కర్బన  ఉద్గారాలు తగ్గుతాయి. ఈ మేరకు 2017-18 ఇథనాల్‌ సరఫరా వల్ల ఏడాదిలో సుమారు  30 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. 

ఆరోగ్య ప్రయోజనాలు: వాడిన వంటనూనెను ఆహార తయారీ కోసం మళ్లీ మళ్లీ వాడటం ఆరోగ్యపరంగా ముప్పుతోపాటు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. వాడేసిన వంటనూనె బయోడీజిల్‌ తయారీలో అత్యంత అనువైంది. దీనివల్ల ఆహార పరిశ్రమలో వంటనూనె పునర్వినియోగం తగ్గిపోతుంది.
పురపాలక వ్యర్థాల నిర్వహణ: దేశవ్యాప్తంగా పురపాలక సంస్థల్లో ఏటా 62 మిలియన్‌ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ వ్యర్థాలతో మిశ్రమ ఇంధనాలు తయారు   చేయడం వల్ల హరిత గృహవాయువు      ఉద్గారాలను మరింతగా తగ్గించవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక పెట్టుబడులు: ప్రస్తుతం దేశ చమురు కంపెనీలు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 12 రెండోతరం 2G జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలు నెలకొల్పే పనిలో ఉన్నాయి. క్రమంగా ఈ రెండోతరం జీవఇంధనం పెరిగే అవకాశాలున్నాయి.

ఉపాధి అవకాశాల సృష్టి: రోజుకు 100 కిలో లీటర్ల రెండోతరం జీవ ఇంధనం శుద్ధి కర్మాగార కార్యకలాపాలు, గ్రామస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సరఫరా గొలుసుల నిర్వహణ తదితర రూపాల్లో ఒక్కో శుద్ధి కర్మాగారంతో 1200 ఉద్యోగాలు లభిస్తాయి.

రైతులకు అదనపు ఆదాయం: రెండో తరం సాంకేతికతలను అనుసరిస్తే పంట అవశేషాలు/వ్యర్థాలతో జీవఇంధనాల తయారీ రూపంలో రైతులకు అదనపు ఆదాయం    లభిస్తుంది. ఏటా వాటిని కాల్చివేసే బాధా తప్పుతుంది. అంతేకాకుండా ఆహారధాన్యాల మిగులు ఉత్పత్తి ఉన్నప్పుడు గిట్టుబాటు ధర లభించని దుస్థితి నుంచి బయటపడొచ్చు.

జీవ ఇంధనాలపై జాతీయ విధానం (2022 సవరణ): ఈ సవరణ ద్వారా జీవ ఇంధనాల తయారీకి ప్రభుత్వం మరిన్ని ఆహార నిల్వలను అనుమతించనుంది.

* 2030 బదులుగా 2025-26 నాటికే పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ కలపడం లక్ష్యంగా (E20 Blend) ముందుకు సాగాలని కేంద్రం యోచిస్తోంది.

* మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZ), ఎగుమతి ఆధారిత యూనిట్లలో ఉన్న పరిశ్రమల ద్వారా జీవఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఎన్‌బీసీసీలో 14 ఇతర మంత్రిత్వ శాఖల సభ్యులు ఉన్నారు.

* ఈ సవరణ ప్రకారం నిర్దిష్ట సందర్భాల్లో జీవ ఇంధనాల ఎగుమతి కోసం అనుమతి మంజూరు చేస్తారు.

 

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 


 

Posted Date : 10-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌