• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌

ఆపదలను పసిగట్టే నిఘా నేత్రం!

ఒక వస్తువును లేదా ప్రాంతాన్ని సుదూరం నుంచి చూసి, దాని స్వభావాన్ని పరిశీలించగలిగే ఆధునిక సాంకేతికతే రిమోట్‌ సెన్సింగ్‌. భూగర్భంలోని  వనరుల గుర్తింపు నుంచి దేశ రక్షణ, అంతరిక్ష శోధన వరకు ఎన్నో రకాలుగా కీలకంగా మారిన ఈ ఆధునిక పరిజ్ఞానం విపత్తు నిర్వహణలోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది. కెమెరాలు, సెన్సర్లతో ముడిపడిన ఆ టెక్నాలజీ పనితీరుపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రిమోట్‌ సెన్సింగ్‌లో రకాలు, దేశంలో వాటిని  వినియోగిస్తున్న విధానం,  ఉపగ్రహాల్లో వాడుతున్న అత్యాధునిక సెన్సర్లు, వాటి ఉపయోగాలు, విపత్తుల నిర్వహణలో అవి అందిస్తున్న విస్తృత ప్రయోజనాలను తెలుసుకోవాలి.

వివిధ రకాల వస్తువులు, విభిన్న తరహా ఉద్గారాలను వెలువరిస్తాయనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని, వస్తువులను సుదూర ప్రాంతాల నుంచి సున్నితంగా పరిశీలించి, ఛాయాచిత్రాల రూపంలో ఫలితాన్ని అందించే సాంకేతికతనే ‘రిమోట్‌ సెన్సింగ్‌’ అంటారు. భారతదేశంలో రిమోట్‌ సెన్సింగ్‌ కార్యకలాపాలు 1988 నుంచి ప్రారంభమయ్యాయి.

రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా చేపట్టే కార్యక్రమాలు:

విపత్తుల నిర్వహణ 

సహజ  వనరుల అన్వేషణ, నిర్వహణ, అంచనా, పర్యవేక్షణ              

నేరస్థుల కదలికలు

మెరుగైన రవాణా వ్యవస్థ, అభివృద్ధి

ఉపరితల దృశ్యాల చిత్రీకరణ

దేశ  సరిహద్దు ప్రాంతాల్లో శత్రుదేశాల సైనికుల కదలికలు            

దేశ భద్రతా వ్యవస్థపై నిఘా.

విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లోని దృశ్య, పరారుణ, మైక్రోవేవ్‌ తరంగాలను విమానాలు, కృత్రిమ ఉపగ్రహాల్లో అమర్చిన సెన్సర్‌లు గ్రహించి, భూఉపరితల దృశ్యాలను చిత్రాలు, పటాల రూపంలో అందిస్తూ రిమోట్‌ సెన్సింగ్‌ విధులు నిర్వహిస్తాయి.

ప్రపంచంలో ప్రతి వస్తువు మనిషి కంటికి కనిపించడానికి కారణం, అది కాంతిని పరావర్తనం చెందించడమే. ఆ విధంగా ప్రతి వస్తువు కాంతి తరంగాల్లోని కొంత నిర్ణీత తరంగదైర్ఘ్యం ఉన్న కాంతులను పరావర్తనం చెందిస్తుంది. ఆ తరంగదైర్ఘ్యాన్నే ‘స్పెక్ట్రో సిగ్నేచర్‌’ అంటారు. అయితే ప్రతి వస్తువు తరంగ   దైర్ఘ్యాన్ని ఆకాశంలోకి పరావర్తనం చెందించడం వల్ల ఉపగ్రహాల్లో అమర్చిన కెమెరాలు అన్ని వస్తువుల తరంగదైర్ఘ్యాన్ని నమోదు చేసుకోలేవు. ఎందుకంటే కొంత భాగం తరంగదైర్ఘ్యం మేఘాలు, నీటిఆవిరి, దుమ్ము ధూళికణాల వల్ల నాశనం అవుతుంది. ఈ కారణాల వల్ల నాశనం కాకుండా ఉపగ్రహంలోని కెమెరాలు నమోదు చేయగలిగే తరంగదైర్ఘ్యాలను ‘రేడియేషన్‌ విండోస్‌’ అంటారు. ఇందులో ప్రతి నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలను నమోదుచేసే పరికరాన్ని ‘సెన్సర్‌’ అంటారు.

1988లో IRS-1A ఉపగ్రహ ప్రయోగంతో  ఇండియన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.

రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల పనితీరు సామర్థ్యం అందులో ఉపయోగించే సెన్సర్ల రిజల్యూషన్‌ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ‘రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచి స్పష్టంగా చూడగలిగే శక్తి’నే రిజల్యూషన్‌ సామర్థ్యం అంటారు.

హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో రిమోట్‌ సెన్సింగ్‌ ఉప   గ్రహాలు ఫొటోల రూపంలో అందించే సమాచారాన్ని  సేకరించి విశ్లేషిస్తారు. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు, వినియోగదారులకు చేర్చేందుకు దేశ  వ్యాప్తంగా 5 ప్రాంతీయ కేంద్రాలున్నాయి. అవి..                    

1) బెంగళూరు

2) దెహ్రాదూన్‌

3) జోథ్‌పుర్‌                  

4) కోల్‌కతా

5) నాగ్‌పుర్‌. ఈ ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఎన్‌ఆర్‌ఎస్‌సీ రిమోట్‌ సెన్సింగ్‌ సమాచారాన్ని దేశమంతటా ప్రసారం చేస్తుంది.

జాతీయ స్థాయిలో ‘నేషనల్‌ నేచర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎన్‌ఆర్‌ఎంఎస్‌)’ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నిర్వహిస్తుంది.

రిమోట్‌ సెన్సింగ్‌లో రెండు రకాలున్నాయి. అవి..

1) ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌లు

2) శాటిలైట్‌ ఇమేజెస్‌

ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌లు: ఈ ఏరియల్‌ ఫొటోగ్రాఫ్‌ విధానంలో విమానాల్లో సెన్సర్లు అమర్చి ఛాయాచిత్రాలు తీయాలనుకున్న ప్రాంతం మీది నుంచి వాటిని పంపితే ఆ ప్రాంతం చిత్రాలను సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ విధానంలో రెండు విధాలుగా భూఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తారు. అవి: ఎ) లంబంగా, నిశ్చలంగా ఉండే కెమెరాల ఆధారంగా ఫొటోలు తీసే విధానం. ఇందులో కెమెరా స్థిరంగా ఉండి, భూఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వీటినే ఊర్ధ్వ ఫొటోగ్రాఫ్‌లు అంటారు. బి) అటూ ఇటూ కదిలే కెమెరాల ద్వారా ఫొటోలు తీసే విధానం. కెమెరాలు పెండ్యూలం మీద తిరుగుతూ చుట్టూ ఉన్న ప్రదేశాలను చిత్రీకరి  స్తాయి. అందుకే మొదటి విధానం కంటే రెండో విధానాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ విధంగా తీసే ఫొటోలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని నిలువుగా, పక్కల నుంచి తీయడం వల్ల ఆయా ప్రాంతాల్లోని భవనాలు, కార్యాలయాలు, ఆయుధాల తయారీ కేంద్రాలు, న్యూక్లియర్‌ ప్లాంట్లను చూసే వీలుంటుంది.
అటూ ఇటూ తిరిగే కెమెరా తీసే ఫొటోల్లో ఒక ప్రాంతం చాలాసార్లు ఫొటోల్లో పడటం వల్ల అతివ్యాప్తి చెందుతాయి. అలాంటి ఫొటోలను ‘స్టీరియోస్కోపు’ పరికరం ద్వారా చూడటం వల్ల ఈ ప్రాంతం ‘త్రిమితీయం’గా కనిపిస్తుంది. ఈ ఏరియల్‌ ఫొటోగ్రాఫుల్లో స్కేలును ఒక సూత్రం ఆధారంగా కనుక్కుంటారు.

f = కెమెరాలోని లెన్స్‌ ముందు భాగానికి, ఫిల్మ్‌కు మధ్య దూరాన్ని సూచిస్తుంది.

h = భూ ఉపరితలం నుంచి కెమెరా ఉన్న ప్రాంతానికి గల ఎత్తు.

ఉపగ్రహ ఛాయాచిత్రాలు (శాటిలైట్‌ ఇమేజెస్‌): వివిధ దేశాలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తుంటాయి. వాటిలో పలు సెన్సర్లు, కెమెరాలు అమర్చి వాటి నుంచి ఛాయాచిత్రాలను తీసుకుని విశ్లేషిస్తుంటాయి. ఉపగ్రహాల్లో వినియోగించే సెన్సర్లు కేవలం పగటివేళలోనే చిత్రాలు తీస్తాయి. ఎందుకంటే రాత్రివేళ వాటి నుంచి ఎలాంటి కాంతి తరంగదైర్ఘ్యం పరావర్తనం చెందదు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ‘థర్మల్‌ సెన్సర్‌’లు ఉపయోగిస్తారు.

థర్మల్‌ సెన్సర్లు కాంతి తరంగదైర్ఘ్యాలను నమోదు  చేయకుండా కేవలం ఆయా వస్తువుల నుంచి వచ్చే ఉష్ణాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. ఇలాంటి సెన్సర్లను పగటి, రాత్రి వేళల్లో ఉపయోగించుకోవచ్చు.

ఇటీవల ఉపగ్రహాల్లో మల్టీ స్పెక్టరల్‌ స్కానర్‌ (ఎంఎస్‌ఎస్‌) లను ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు ఒక్కో స్కానర్‌ కేవలం నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని మాత్రమే నమోదు చేసేది. ఎంఎస్‌ఎస్‌ మాత్రం వివిధ తరంగదైర్ఘ్యాలను నమోదు చేస్తుంది. అంటే ఈ స్కానర్‌లు అతినీలలోహిత, పరారుణ, థర్మల్‌ ఇన్‌ఫ్రా బ్యాండ్స్‌ శక్తి తరంగాలన్నింటినీ నమోదు చేస్తాయి.

విపత్తుల నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌ వల్ల కలిగే  ప్రయోజనాలు:  

విపత్తు దుర్భలత్వ ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాలవ్యవధిలో చిత్రీకరిస్తుంది.                      

విపత్తుల దుర్భలత్వ ప్రాంతాలను గుర్తించి, మ్యాపులతో కూడిన అట్లాస్‌లను రూపొందిస్తుంది.

భూకంప ప్రదేశాల పటాలను రూపొందిస్తుంది. వరద ప్రభావిత ప్రాంత పటాలను అందిస్తుంది.

దీని సాయంతో ప్రకృతి విపత్తులైన తుపానులు, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఏర్పడే నష్ట తీవ్రతలను అంచనా వేయొచ్చు.

 

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 
 

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు