• facebook
  • whatsapp
  • telegram

గిరిజన సమూహాల ఇబ్బందులు


భారతీయ సమాజంలో భిన్న ప్రాంతాల్లో భిన్న తెగలుగా జీవనం సాగిస్తున్న గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జన జీవన స్రవంతిలో భాగంగా ఉన్నవారు.. దూరంగా ఉన్నవారూ ఇబ్బందులు పడుతున్నారు. భౌగోళికాంశాల ప్రభావం, నిరక్షరాస్యత, కొందరి దోపిడీ స్వభావం.. తదితర కారణాలతో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సమాజంతో వారి బంధం.. ఆ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాస్త్ర శాఖాధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ఆచార్య గణేశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.
దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న భిన్న తెగలకు చెందిన గిరిజనులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే..

 

1. జాగ్రఫికల్ సెపరేషన్

గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది భౌగోళికంగా వేరుపడి ఉండటం (జాగ్రఫికల్ సెపరేషన్). చాలా తెగలు భౌగోళికంగా దట్టమైన అటవీ, పర్వత ప్రాంతాల్లో నివసించడం వల్ల జన జీవన స్రవంతికి దూరంగానే ఉంటున్నాయి. ఇప్పటికీ చాలా తెగలు ఒంటరిగానే జీవిస్తున్నాయి. అటవీ సంపదపై ఆధారపడి జీవించే పరిస్థితి ఇంకా ఉంది. గిరిజనేతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకపోవడం వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనం కొనసాగుతోంది. చాలా గిరిజన సమూహాలకు ఏరకమైన అవస్థాపనా సౌకర్యాలు కూడా లేవు. ఉదాహరణకు రహదారులు, రవాణా, విద్య, ఆరోగ్యపరమైన వసతుల్లేవు.
 

2. ఆర్థిక సమస్యలు

పేదరికం, నిరుద్యోగం, రుణగ్రస్తత, ఆర్థిక వెనుకబాటుతనం.. చాలా గిరిజన సమాజాల్లో కనిపిస్తాయి. వీటికి కారణం - చాలా గిరిజన సముదాయాలు అటవీ సంపదపై ఆధారపడి జీవించడం. కొన్ని తెగలు ఇప్పటికీ పోడు వ్యవసాయం చేస్తున్నాయి. మరికొన్ని గిరిజన తెగలు స్థిర వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా గిరిజన సమూహాలకున్న భూమి తక్కువ. వీరిలో చాలామంది చిన్న రైతులు, లేదంటే ఉపాంత రైతులు. చాలామందికి ఒకట్రెండు ఎకరాలే ఉంటాయి. పెద్ద ఎత్తున భూమి ఉండేది చాలా తక్కువ. స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ కాబట్టి.. తమకు చేతనైనంత వరకే భూమిని తమ దగ్గర ఉంచుకుంటారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే అనుసరించడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి.
 

3. 'దోపిడీ' వలయంలో..

ఎక్కడైతే గిరిజనేతరులతో సామాజిక బంధం ఏర్పడిందో అక్కడ సమస్యలూ ఏర్పడ్డాయి. చాలామంది భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, అటవీ గుత్తేదార్లు గిరిజనులను ఆర్థికంగా దోపిడీ చేశారు. వీటికితోడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని అటవీ చట్టాల కారణంగా అనేకచోట్ల గిరిజనులు అనాదిగా తమకున్న జీవనోపాధి వసతులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమైంది. నిజానికి గిరిజనులు తమకు అడవిపైనా, అటవీ ఉత్పత్తులపైనా సహజమైన హక్కుందని భావిస్తారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ చట్టాల వల్ల, ఆ సహజహక్కును కోల్పోవాల్సి వస్తోంది. ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా గిరిజనేతరుల నుంచి అప్పులు తీసుకోవడం మొదలైంది. క్రమంగా గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదలాయింపు చేయడం.. భూమి అన్యాక్రాంతం కావడం మొదలైంది. బ్రిటిష్ పరిపాలన కాలంతోపాటు స్వాతంత్య్రానంతర కాలంలో కూడా ఇది జరిగింది. గిరిజనుల భూములను రక్షించే చట్టాలు వచ్చేదాకా ఈ దోపిడీ కొనసాగి, భూములు గిరిజనేతరుల పరమయ్యాయి. ఈ విధంగా భూమిని కోల్పోవడం, ఉపాధి వసతులను కోల్పోవడం, సహజసంపదపై తమకున్న హక్కులను కోల్పోవడం వల్ల ఆర్థిక సమస్యలు మరింత జఠిలమయ్యాయి. అందుకే గిరిజనుల తిరుగుబాట్లు, గిరిజన ఉద్యమాలు తలెత్తాయి. గిరిజన ఉద్యమాల్లో ప్రధానాంశం అటవీసంపదపై హక్కులు. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు (పరపతి సౌకర్యాలు) లేకపోవడం వల్ల కూడా అనివార్యంగా వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. వారి దోపిడీ కారణంగా కూడా గిరిజనులకు ఆర్థికంగా ఎదిగే అవకాశం రాలేదు. అందుకే గిరిజనులు వ్యవసాయ రుణాల నుంచి విముక్తి చేసే చట్టం కావాలని కోరుకుంటున్నారు. ఈ అప్పులను మాఫీ చేసి, తమ నుంచి తీసుకున్న భూములను తమకిస్తే తమ జీవితాలు తాము గడుపుతామనేది వారి కోరిక. ఉద్యమ కాంక్ష.
 

పరిమిత ఆర్థిక జీవనం

పర్వత ప్రాంతాల్లోని గిరిజనుల ఆర్థిక వ్యవస్థ పశుపోషక ఆర్థిక వ్యవస్థ. పశువులను పెంచడం, తద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం.. ఇదేమీ లాభసాటిగా లేకపోవడంతోపాటు జీవనోపాధికి అవసరమైన ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజనుల్లో తక్కువ మంది మాత్రమే వ్యవసాయేతర రంగాల్లో ఉన్నారు. చాలా తక్కువ మంది పారిశ్రామిక రంగంలో ఉన్నట్లు అంచనా. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3 శాతం గిరిజనులు మాత్రమే పరిశ్రమల రంగాల్లో పనిచేస్తున్నారు. 5 శాతం వరకు సేవారంగంలో పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా వ్యవసాయం లేదా వారి సాంప్రదాయిక వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనివల్ల వారెంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
 

సామాజిక సమస్యలెన్నో..

ఆర్థిక సమస్యల తర్వాత గిరిజనులను వేధించే సమస్యలు సామాజికమైనవి. ప్రధానమైంది నిరక్షరాస్యత. గిరిజనుల్లో అక్షరాస్యత రేటు చాలా తక్కువ. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల్లో, మహిళల్లో నిరక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉంది. అనేక నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్య లేకపోవడం వల్ల వారు వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరమైన అవగాహన ఉండటం లేదు. ఆర్థికంగా అభివృద్ధి చెందడం తెలియదు. జన జీవన స్రవంతిలో కలవడం లేదు. నిరక్షరాస్యతతో పాటు ఉన్న మరో సమస్య బాల్య వివాహాలు. చాలా గిరిజన సమూహాల్లో ఇప్పటికీ ఈ సమస్య కనిపిస్తుంది. మతపరమైన మూఢ విశ్వాసాలు వాటికి తోడవుతున్నాయి. మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, జంతుబలులు.. ఇలాంటి వాటిని విశ్వసించడం తదితర సమస్యలకు దారి తీస్తున్నాయి.
 

సాంస్కృతిక సమస్యలు

జన జీవన స్రవంతికి దూరంగా ఉన్నవారికి ఒకరకమైన సమస్యలుంటే జన జీవన స్రవంతిలో ఉన్నవారిలోనూ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడైతే గిరిజనులు గిరిజనేతరులతో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారో అక్కడ గిరిజనులపైన గిరిజనేతరులు తమ సాంస్కృతిక ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఈశాన్య భారతంలోని తెగలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సర్వాత్మవాదం, జీవాత్మవాదం, ప్రకృతి ఆరాధనావాదం, టోటెమిజం లాంటి మతరూపాలు గిరిజనుల్లో కనిపిస్తాయి. వీరు హిందూ, ఇస్లాం, క్రైస్తవం లాంటి మత విధానాల్లోకి రాలేదు. గిరిజనుల మత విశ్వాసాలన్నీ విభిన్నమైనవి. కానీ ఎక్కడైతే గిరిజనేతరులకు దగ్గరగా జీవిస్తున్నారో అక్కడ హిందూ, క్రైస్తవ మతాల్లోకి మార్చే ప్రక్రియ మొదలైంది. అంటే గిరిజన సమూహాలను తమ మత సంస్కృతిలో భాగం చేసే ప్రయత్నం. దీన్నే హైందవీకరణ, క్రైస్తవీకరణ అంటారు. మధ్య భారతంలో హైందవీకరణ.. ఈశాన్య భారతంలో క్రైస్తవీకరణ జరిగింది. ఉదాహరణకు నాగాలాండ్‌లో నాగాలను తీసుకుంటే.. నాగాలంతా తాము క్రైస్తవులమని భావిస్తున్నారు.
మరో సమస్య భాషాపరమైంది. సాంస్కృతిక బంధం కారణంగా గిరిజనేతర సమాజాల భాషను, వారి సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇలా తమ మతం, సంస్కృతి, భాషలపై దాడి జరిగిందనే భావన గిరిజన సమూహాల్లో ఏర్పడింది. తాము ఆర్థికంగానే కాకుండా సాంస్కృతిక పరమైన దోపిడీకి గురవుతున్నామని గిరిజన సమూహాలు భావించాయి. ఇదే కొనసాగితే తాము అస్తిత్వాన్ని కోల్పోతామనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

 

విద్య, ఆరోగ్యం!?

చాలామేర గిరిజనులు నిరక్షరాస్యులే కాగా.. మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినా విద్య ఆవశ్యకతను తెలియజెప్పడంలోనూ, నాణ్యమైన విద్యను అందజేయాలనే ఆలోచనలోనూ వైఫల్యాలు సుస్పష్టం. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసినా వసతులు, ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్నా బోధన సరిగ్గా లేకపోవడం వల్ల విద్యాపరంగా వెనకబాటుతనం కొనసాగుతోంది. వీటికితోడు ఆరోగ్య సమస్యలూ వారిని చుట్టుముట్టే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం; వసతుల లేమి; ఉన్న వాటిని వినియోగించుకో లేకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువ. జీవనకాలం తక్కువ. మాతామరణాలు, శిశుమరణాల రేటు కూడా ఎక్కువ. జాతీయ సగటు కంటే ఇది ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది.
 

అభివృద్ధికి బలి...

అభివృద్ధికి గీటురాళ్లుగా మారిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు, గనుల విషయంలో భూ నిర్వాసితులవుతున్న వారిలో అత్యధికులు గిరిజనులు, ఆదివాసీలే. వారికి సరైన నష్టపరిహారాన్ని చెల్లించి, పునరావాసం కల్పించాలనేది డిమాండ్.
 

గిరిజన ఉద్యమాలు

స్వాతంత్య్రానికి ముందు నుంచే గిరిజన ఉద్యమాలు వచ్చాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఝార్ఖండ్‌లో వచ్చిన బిర్సాముండా ఉద్యమం, సంతాల్ తిరుగుబాటు, గోండు ఉద్యమాలతో పాటు ఝార్ఖండ్, బోడోలాండ్ ఉద్యమాలన్నీ గిరిజనుల సమస్యల నేపథ్యంలో వచ్చినవే. వీటిలో కొన్ని రాజకీయ స్వయంప్రతిపత్తి కోసం వచ్చినవైతే మరికొన్ని వ్యవసాయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, అటవీ హక్కుల కోసం, మతపరమైన అంశాలపై వచ్చినవి. తానా భగత్ ఉద్యమం - సాంఘిక మత ఉద్యమం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బిల్లులు ఈ ఉద్యమం తెచ్చారు. నైజాం ప్రభుత్వ కాలంలోనే గోండు తిరుగుబాటు చోటుచేసుకుంది. దీంతో నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్ అనే బ్రిటిష్ సామాజిక మానవ శాస్త్రవేత్తను పిలిపించి వారి సమస్యలపై అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆయన ఆదిలాబాద్‌లోని గోండులతో కలసి జీవించి, వారి భాష నేర్చుకుని వారి సమస్యలపై ఓ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే అప్పుడున్న నిజాం ప్రభుత్వం గిరిజనుల విద్య, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. భారత్‌లో గిరిజనుల గురించి జరిగిన తొలి అధ్యయనం అదే అని చెప్పొచ్చు.
 

మూడు దృక్పథాలు

బ్రిటిష్ పాలన కాలం నుంచి ఇప్పటిదాకా గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో భారత్‌లో 3 రకాలైన దృక్పథాలు కనిపిస్తాయి.
1. ఏకీకరణ వాదం (పాలసీ ఆఫ్ ఐసోలేషన్)
2. విలీనీకరణ వాదం (పాలసీ ఆఫ్ అసిమిలేషన్)
3. ఏకీకృత విధానం (పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్)
జేహెచ్ హట్టన్ (1931లో సెన్సెస్ కమిషనర్), వెరియర్ ఎల్విన్ (లాస్ ఆఫ్ నర్వ్ అనే పుస్తకంలో ఈ ఏకీకరణ వాదం గురించి చెప్పారు) అనే సామాజిక శాస్త్రవేత్తలు ఏకీకరణ వాదాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఎక్కడైతే గిరిజనులకు గిరిజనేతరులతో సామాజిక బంధం ఏర్పడిందో అక్కడ చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. గిరిజనులు తమ సంస్కృతి, భాష, మతపరమైన అస్తిత్వాన్ని కాపాడుకోవాలను కుంటున్నారు కాబట్టి, వాటికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదు. వారు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం గిరిజనుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. గిరిజనులు నివసించే ప్రాంతాలను రిజర్వ్‌డ్ ప్రాంతాలుగా ప్రకటించి, వాటిలోకి గిరిజనేతరులకు ప్రవేశం కూడా కల్పించకూడదు. గిరిజనుల ప్రాంతాలను జాతీయ పార్కులుగా ప్రకటించాలని ఎల్విన్ చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు ఈ పద్ధతినే పాటించింది. కానీ దీనివల్ల గిరిజనులు శాశ్వతంగా జనజీవన స్రవంతికి దూరమై, ఆర్థికంగా వెనకబడిపోతారని విమర్శలు వచ్చాయి. కాబట్టి దీంతో విభేదిస్తూ... రెండో వాదం విలీనీకరణ వచ్చింది.

 

విలీనీకరణ వాదం

జీఎస్ ఘుర్యే అనే సమాజ శాస్త్రవేత్త ఈ వాదాన్ని ముందుకు తెచ్చారు. భారత్‌లో హిందువులు, గిరిజనులు వేరు కాదని ఆయన వాదించారు. భారత్‌లోని గిరిజనులు హిందువుల్లోని వెనకబడిన హిందూ కులాలని ఘుర్యే చెప్పారు. హిందూ మతంలో గిరిజనులు సంపూర్ణంగా ఏకీకృతం, విలీనం జరగని కారణంగానే ఈ వెనకబాటుతనం వచ్చిందన్నది ఘుర్యే వాదన. ఆయన వాదన ప్రకారం.. హిందూ సమాజంలో వారంతా సమ్మిళితమైతే ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే వివిధ కులవృత్తులను స్వీకరించవచ్చు. ఆధునిక జీవన విధానాల్లో భాగం కావొచ్చు.
విలీనీకరణ ప్రక్రియ కొంతమేర స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తర్వాత కొనసాగింది. కొన్ని హిందూ సంస్థలు, క్రైస్తవ సంస్థలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాయి. ఎక్కడైతే ఈ హైందవీకరణ, క్రైస్తవీకరణలు చోటు చేసుకున్నాయో అక్కడ సాంస్కృతికపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు బిర్సాముండా ఉద్యమాన్ని తీసుకుంటే (బిర్సా నాయకుడు) అందులో క్రైస్తవంలోకి మారిన బిర్సాముండాలకు, క్రైస్తవంలోకి మారని బిర్సాముండాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ విధంగా చాలా తెగల్లో మతమార్పిడైన తెగకు, చెందని వారికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. అందువల్ల విలీనీకరణను కూడా చాలామంది వ్యతిరేకించారు. ఈ రెంటికీ మధ్యస్థంగా ఉండే విధానాన్ని కనుక్కునే క్రమంలో స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పంచ సూత్రాలను ప్రతిపాదించారు. ఇవి ఏకీకరణను, విలీనీకరణను సమర్థించకుండా తటస్థంగా ఉంటాయి.

 

సంక్షేమానికి చర్యలు

గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం మన దేశంలో మూడు రకాల చర్యలు తీసుకున్నారు. అవి..
1. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించడం
2. హక్కులను పరిరక్షించేలా చట్టాల రూపకల్పన
3. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు రూపొందించి అమలు చేయడం

 

రాజ్యాంగ పరమైన రక్షణలు

* ఆర్టికల్ 15 ప్రకారం ప్రభుత్వం అందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి.
* ఆర్టికల్ 16 (4) 320 (4), 335ల ప్రకారం ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ వసతి కల్పించాలి.
* ఆర్టికల్ 330, 332, 334ల ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో గిరిజనులకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సీట్లను రిజర్వ్ చేయాలి.
* ఆర్టికల్ 275 ప్రకారం భారత సమీకృత నిధి నుంచి గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దమొత్తంలో ధనాన్ని ఖర్చు చేయవచ్చు.
* ఆర్టికల్ 275 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే గిరిజన సంక్షేమ పథకాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి.
* ఆర్టికల్ 164 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, సమీక్ష కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్ 46 ప్రకారం ఆర్థిక, విద్యాపరమైన అవకాశాలను సంరక్షించాలి.
ఆర్టికల్ 338 ప్రకారం భారత రాష్ట్రపతి గిరిజన సంక్షేమ కార్యకలాపాలను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఓ కమిషనర్‌ను నియమించవచ్చు.
* ఆర్టికల్ 339(2) ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో నిర్దేశకత్వం ఇవ్వొచ్చు.
* ఆర్టికల్ 224 ప్రకారం గిరిజన ప్రాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

 

చట్టపరమైన రక్షణలు

గిరిజనులపై ఏ రకమైన అత్యాచారాలు జరగకుండా ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం-1989. దీంతోపాటు వెట్టి రద్దు (బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్-1976); బాలకార్మిక నిరోధ, నియంత్రణ చట్టం-1986; అటవీ హక్కుల చట్టం - 1980; జాతీయ గిరిజన ప్రణాళికలో భాగంగా వచ్చిన పంచాయత్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం-1996 వల్ల గిరిజనులకు రక్షణలు కలిగాయి.
 

నెహ్రూ పంచ సూత్రాలు

1. మెజార్టీ ప్రజల (గిరిజనేతరుల) సంస్కృతిని గిరిజనులపై రుద్దే ప్రయత్నం చేయకూడదు. గిరిజనులను అభివృద్ధి చేస్తూనే వారిపై గిరిజనేతరుల పెత్తనం లేకుండా చూడాలి.
2. అటవీ సంపదపై, అటవీ భూములపై గిరిజనుల హక్కులను గౌరవించాలి.
3. గిరిజన సమూహాలకు చెందిన నాయకులను గుర్తించి, వారికి పరిపాలన పరమైన, అభివృద్ధి కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలి. క్రమంగా గిరిజనుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడంలో ఇదొక భాగం.
4. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో విపరీతమైన పాలనా వ్యవస్థను రుద్దకూడదు.
5. గిరిజనులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూనే, వారి అభివృద్ధికి అవసరమైన అవకాశాలను, చర్యలను తీసుకోవాలి. ఈ ప్రక్రియలో డబ్బు ఎంత ఖర్చయిందని కాకుండా, వారిలో ఎంత పరిణితి, పరివర్తన తీసుకొచ్చామనేది ఆలోచించాలి.
ఈ అంశాల ప్రాతిపదికగా ఏకీకృత విధానాన్ని అవలంబించడంతో పాటు, 1960 తర్వాత నుంచి ఇదే దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు.

 

సంక్షేమ, అభివృద్ధి పథకాలు

* 1960లో షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ (యుఎన్ దేభార్ సారథ్యంలో) సూచనల మేరకు 1980 నుంచి గిరిజన ఉపప్రణాళిక (ట్రైబల్ సబ్‌ప్లాన్) ప్రారంభించారు. దీనిలో భాగంగా షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక అభివృద్ధి; గిరిజనులు దోపిడీకి గురికాకుండా రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశాలు. ప్రభుత్వ శాఖలన్నింటి బడ్జెట్‌లోనూ గిరిజన జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు జరిపి, ఆ బడ్జెట్‌ను అందుకే ఉపయోగిస్తే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని భావించారు. ఈ ఉపప్రణాళికలో ప్రధానంగా కొన్నింటిపై దృష్టి సారించారు.
* ఉపాధి, విద్య, ఆరోగ్యం, గృహవసతి.. (ఉపాధిలో కుటుంబ ఆధారిత ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెట్టాలి. వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగం, గిరిజన వృత్తులు, నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలి) తర్వాతి కాలంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు చేపట్టారు.
* పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా, అన్నింటిలోనూ కేంద్రం నుంచి ఆర్థిక పరమైన సహకారం రాష్ట్రాలకు అందించే ప్రయత్నం చేశారు. సమీకృత గిరిజనాభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు)ను అయిదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా (1974-79) ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేకమైన ఐటీడీఏను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ కింద గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.
* గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన పనిముట్లు, విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను - ల్యాంప్స్ (లార్జ్‌సైజ్డ్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీలు) సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు.
* గిరిజనుల ఉత్పత్తులను విక్రయించడానికి, మార్కెటింగ్ సౌకర్యం కోసం ట్రైఫెడ్ (ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేశారు. గిరిజనులు మోసపోకుండా, వాళ్ల ఉత్పత్తులకు మార్కెట్ ధర లభించేందుకు దీని ద్వారా సహాయ సహకారాలు అందించారు.
* ఉపాధి రంగాలకు కావాల్సిన వృత్తి నైపుణ్యం అందించేందుకు వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* గిరిజన విద్యార్థినులకు విద్యావసతి కల్పించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) ఏర్పాటు చేశారు.
* పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్‌హెచ్ఎం)లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం.
* గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలను, చిన్నారులను దృష్టిలో ఉంచుకుని జననీ సురక్ష యోజన (జేఎస్‌వై), జననీ శిశు సంరక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలో ప్రసవాలు జరిగి మాతాశిశుమరణాలను తగ్గించడం వీటి ఉద్దేశం.
* వ్యాధులకు చికిత్సలందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపుతున్నారు.
* భారతదేశంలో గిరిజన సమూహాల సమస్యలను అధ్యయనం చేయడానికి గిరిజన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వంతోపాటు చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయి.

Posted Date : 17-09-2020
  • Tags :

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సాంఘిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌