• facebook
  • whatsapp
  • telegram

భారతీయ సమాజం


భిన్నత్వంలో ఏకత్వం - భారతీయ సమాజ విశిష్ట లక్షణాల్లో ఒకటి. వివిధ దేశాల నుంచి భిన్నమతాలు, కులాలు, జాతులు, భాషలకు చెందిన ప్రజలు ఇక్కడికొచ్చి మన సంస్కృతితో మమేకమయ్యారు. అందుకే భారతీయ సమాజం సాంస్కృతిక భిన్నత్వానికి అద్దం పడుతుంది. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు భిన్నత్వాన్ని.. ఏకత్వానికి దోహదం చేస్తున్న అంశాలను తెలుసుకోవాలి. వీటిపై సమగ్ర అవగాహన కల్పించే అధ్యయన సమాచారం..
భిన్నత్వం అంటే - ఒక అంశంతో మరొక అంశం విభేదించడం, పోలిక లేకపోవడం. సమాజంలో ఉండే వివిధ విభాగాలు లేదా అంశాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభేదీకరణ కలిగి ఉండటం లేదా విడివిడిగా ఉండటాన్ని భిన్నత్వం అంటారు. అంటే సామాజిక సంస్థలు(సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్) ఒకటే అయినప్పటికీ వాటి విధానాలు, ఆచారాలు, సంస్కారాలు, పద్ధతులు, సంప్రదాయాలు ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఉదాహరణకు వివిధ మతాల్లో ఉండే వివాహ నియమాలు, ఆచారాలను భిన్నత్వంగా చెప్పుకోవచ్చు.

 

ఐక్యత అంటే..?

ఐక్యత అంటే కలిసి ఉండటం. ఇది ఒక సామాజిక మానసిక స్థితి. సమాజంలో ఉండే వివిధ రకాల వ్యక్తులు తామంతా ఒక్కటే అనే సామాజిక, మానసిక స్థితి (సోషియో సైకలాజికల్ కండిషన్) భావనను ఐక్యత అంటారు.
 

భిన్నత్వంలో ఏకత్వం

వివిధ మతాలు, కులాలు, భాషలు, జాతులు, భౌగోళిక ప్రాంతాలు, సంస్కృతులకు చెందినప్పటికీ మనమంతా ఒక్కటే అనే సామాజిక, మానసిక భావనను భిన్నత్వంలో ఏకత్వం అంటారు.
 

సాంస్కృతిక భిన్నత్వం

ఒక సమాజంలో ఉండే మతం, భాష, ఆహారపు అలవాట్లు, వేషధారణ, ఆచారాలు, సంప్రదాయాలు.. ఇవన్నీ సంస్కృతిలో భాగం. భారతదేశంలో వివిధ మతాలు, కులాలు, భాషలు, జాతులకు చెందిన ప్రజలు నివసించడం వల్ల సాంస్కృతిక భిన్నత్వం కనిపిస్తుంది. ఈ సాంస్కృతిక భిన్నత్వాన్ని భారతీయ సమాజ భిన్నత్వ లక్షణంగా చెప్పుకుంటాం.
 

భౌగోళిక భిన్నత్వం

కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వివిధ భౌగోళిక పరిస్థితులున్నాయి. నిమ్నోన్నతి, ఉష్ణోగ్రత, వర్షపాతం, అటవీ సంపద, నదులు, సముద్రతీరాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు కనిపిస్తాయి. ఇవి ఆ ప్రాంతపు ప్రజల వృత్తులు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు, సంప్రదాయాలు, ఆచారాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల భౌగోళిక భిన్నత్వం ఇతర భిన్నత్వాలపై ప్రభావం చూపుతుంది.
 

భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతున్న వివిధ అంశాలివి..
1. భౌగోళిక రాజకీయ ఐక్యత: భారతీయ సమాజంలో విభిన్నత ప్రదర్శితమవుతున్నప్పటికీ దేశమంతా భౌగోళికంగా, రాజకీయంగా ఐక్యతను ప్రదర్శిస్తుంది. దీన్ని భౌగోళిక రాజకీయ ఐక్యత అంటారు.
2. పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పిలిగ్రిమేజ్): కుల మతాలతో సంబంధం లేకుండా ఇతర మతాల వారు వేరే మతాల వారి పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఐక్యతకు నిదర్శనం.
* హిందువులు దర్శించే ముస్లిం పవిత్ర స్థలం - అజ్మరీ షరీఫ్
* వినాయక చవితి ఉత్సవాల్లో ముస్లిం తారలు తదితరులు పాల్గొనడం.
* ఇతర మతాలవారు దర్గాలు, చర్చిలను సందర్శించడం ఇందుకు నిదర్శనాలు.
3. ఆదరణ స్వభావం - సంస్కృతీకరణ: భారతీయ సమాజం అన్ని మతాలను, కులాలను, జాతులను ఆదరించింది. అంతేకాకుండా ఉన్నత కులాల, ఇతర మతాల సంస్కృతిని మిగిలిన కులాలు వారు, వేరే మతాల వారు స్వీకరించి ఆదరించారు.
* పరదా పద్ధతి
* నల్లపూసలు (ముస్లిం సంస్కృతి) ధరించడాన్ని హిందూ స్త్రీలు స్వీకరించడం.
* ఉర్దూ, ఇతర భాషలు స్వీకరించడం, అనుసరించడం
* ఉపవాస, ఆహార నియమాలు పాటించడం
* పేర్ల పక్కన, కులం పక్కన 'బ్రాహ్మణ' పదం చేర్చడం.
ఉదా: నాయిబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు
ఇవన్నీ ఐక్యతకు దోహదపడే అంశాలే.
4. సంప్రదాయ పరస్పరాధారిత సమాజం - జాజ్‌మానీ వ్యవస్థ: సంప్రదాయ భారతీయ సమాజంలో ఒక కులం వారు మరొక కులంపై ఆధారపడ్డారు. పరస్పరం సహకారం అందించుకున్నారు. కులవృత్తుల వారు యజమానికి సేవలు అందించి వస్తురూపంలో ప్రతిఫలం స్వీకరించారు. ఇది ఐక్యతకు దోహదపడిన అంశం.
5. జాతీయ భావన: వివిధ కులాలు, మతాలు, జాతులు, భాషలకు చెందిన విభజన జరిగినప్పటికీ మనమంతా భారతీయులం అనే భావన ఐక్యతకు దారితీసింది. ఈ జాతీయ భావన కింది అంశాల్లో కనిపిస్తుంది.
* జాతీయ జెండా
* జాతీయ గీతం
* జాతీయ చిహ్నాలు - పుష్పం, జంతువు, చెట్టు, ఫలం
* భారత రాజ్యాంగం - లౌకిక భావన
6. కామన్ సివిల్ కోడ్, జాతీయ చట్టాలు: భారతీయ సమాజంలో వ్యక్తులందరికీ వర్తించేలా ఉండే కామన్ సివిల్ కోడ్, జాతీయ చట్టాలు.. ఐక్యతకు దోహదపడుతున్నాయి. అన్ని మతాల ఔన్నత్యాన్ని కాపాడుకునేలా ప్రజలందరికీ వర్తించేలా ఉమ్మడి న్యాయ చట్టాలు రూపొందాయి.
7. అంతర్జాల వ్యవస్థ - ఆధునిక పరిజ్ఞానం: భారతీయులంతా కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా అంతర్జాల సమూహాల(ఇంటర్‌నెట్ గ్రూప్స్)ను ఏర్పాటు చేసి ఐక్యతకు తోడ్పడుతున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
8. వసుదైక కుటుంబ భావన: భారతదేశంలో జరిగిన పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ కులాల మధ్య అంతరాన్ని తగ్గించింది. మతాలు, జాతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా సమాజంలో వ్యక్తులంతా ఏకమై సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, అభివృద్ధీకరణ భావనలు భిన్నత్వాలను దూరం చేసి సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ ఐకమత్యంగా ఉండేలా చేస్తున్నాయి.

 

ఏకత్వ అంశాలు

భారతీయ సమాజంలో అనేక రకాల భిన్నత్వాలు కనిపిస్తున్నప్పటికీ కింది అంశాలు ఏకత్వానికి దోహదం చేస్తున్నాయి. అవి..
* భౌగోళిక రాజకీయ ఐక్యత
* పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ
* ఆదరణ స్వభావం - సంస్కృతీకరణ
* సంప్రదాయ పరస్పరాధారిత సమాజం - జాజ్‌మానీ వ్యవస్థ
* జాతీయ భావన
* కామన్ సివిల్ కోడ్ - జాతీయ చట్టాలు
* అంతర్జాల వ్యవస్థ - ఆధునిక పరిజ్ఞానం
* పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ


గ్రూప్-Iలో రాదగిన ప్రశ్నలు

1. భారతీయ సమాజంలోని భిన్నత్వాలను వివరించి, ఏకత్వానికి దోహదపడుతున్న అంశాలను చర్చించండి.
2. భారతీయ సమాజంలో భిన్నత్వం ప్రదర్శితం అవుతున్నప్పటికీ ఆధునికీకరణ, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ భావనలు ఏ విధంగా ప్రభావం చూపాయో వివరించండి.
3. జాజ్‌మానీ వ్యవస్థ, సంస్కృతీకరణ భావనలు భారతీయ సమాజంలో ఏవిధంగా ఏకత్వానికి దోహదపడుతున్నాయి?

 

మాదిరి ప్రశ్నలు

1. కేరళలో కదర్, ఇరుల తెగలు, తమిళనాడులో పునియన్‌లు ఏ జాతిని పోలి ఉంటారు?
ఎ) నీగ్రిటో బి) మంగోలాయిడ్ సి) నార్డిక్ డి) పశ్చిమ బ్రాకీ సెఫాల్స్
జ: (ఎ)

 

2. సింధు నాగరకత ప్రజలు ఏ జాతిని పోలి ఉంటారు?
ఎ) నీగ్రిటో బి) మెడిటేరియన్‌లు సి) నార్డిక్ డి) మంగోలాయిడ్
జ: (బి)

 

3. సంతాలీ, హో, గదబ, సవర భాషలు కింది ఏ భాషా కుటుంబానికి చెందినవి?
ఎ) ఆర్యన్ బి) నీగ్రిటో సి) ఆస్ట్రిక్ డి) సినో టిబెటిన్
జ: (సి)

 

4. 'బోడో' ఏ భాషా కుటుంబానికి చెందింది?
ఎ) నీగ్రిటో బి) ఆస్ట్రిక్ సి) ద్రవిడ డి) సినో టిబెటిన్
జ: (డి)

 

5. ఏకత్వం అనేది ఏ భావన?
ఎ) సామాజిక భావన బి) లౌకిక భావన సి) మానసిక భావన డి) సామాజిక - మానసిక భావన / స్థితి
జ: (డి)

 

6. నల్లపూసలను మొదట ఎవరు ధరించేవారు?
ఎ) ముస్లిం స్త్రీలు బి) హిందూ స్త్రీలు సి) సిక్కు స్త్రీలు డి) కైస్త్రవ స్త్రీలు
జ: (ఎ)

Posted Date : 17-09-2020
  • Tags :

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సాంఘిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌