• facebook
  • whatsapp
  • telegram

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

» భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
» కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
» గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
» వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
» వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
» శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
» విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
» అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
» పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
» కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
» బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
» రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
» దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
» పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
» గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
» వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
» నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.

 

శాస్త్ర విజ్ఞానం

» గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
» గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
» ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
» వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
» వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
» భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
» వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
» గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
»  ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
» వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
» గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు

 

గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు

నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
» ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
» గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
» సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
» నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
» వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
» గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
» గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
» నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
» సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
» అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
» అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
» గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
» 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
» ''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

 

హర్షవర్ధనుడు

» గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
» హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
» హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
» పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
» మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
» బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
» యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
» రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
» గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
» హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
» మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
» హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
» కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.

 

హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647

» హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
» హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
» హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
» హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
» హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
» రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
» హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
» ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
» హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
» హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
» హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
» వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
» యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
» హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.

» యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
» గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
» హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
» భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.
» నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
» హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
» హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
» నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.
» నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
» హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
» గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
» వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
» భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
» హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.
» హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
» హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
» హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
» సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
» హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
» గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
» నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
» ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
» స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.

 

వాస్తు, కళారంగాలు

» గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
» గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
» మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
» గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
» మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 13-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌